మా మిక్కీ మౌస్ అత్తగారు... | Our Mickey Mouse mother-in-law ... | Sakshi
Sakshi News home page

మా మిక్కీ మౌస్ అత్తగారు...

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

మా మిక్కీ మౌస్ అత్తగారు...

మా మిక్కీ మౌస్ అత్తగారు...

ఆత్మబంధువు
‘‘భవానీ... భవానీ... కాఫీ కావాలని చెప్పి ఎంతసేపైంది?’’ అరిచింది రత్నమాంబ.
‘‘తెస్తున్నా అత్తమ్మా.’’
‘‘తెస్తున్నా, తెస్తున్నా... అని అరగంట నుంచి చెప్తున్నావ్... తెచ్చిస్తే కదా!’’
‘‘ఇదిగోండి అత్తమ్మా కాఫీ. ఐదు నిమిషాల్లో తెచ్చేశా.’’
‘‘అంటే... అరగంటని నేను అబద్ధం చెప్తున్నానా?’’
‘‘అయ్యో... నేనలా అన్లేదు అత్తమ్మా’’ నవ్వుతూ చెప్పింది భవాని.

‘‘ఏంటే నవ్వుతున్నావ్. అంత ఎగ తాళిగా ఉందా?’’ అరిచింది రత్నమాంబ.
‘‘అదేంటత్తమ్మా... మిమ్మల్ని అలా ఎందుకనుకుంటాను!’’
‘‘మరెందుకే నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నావ్?’’
‘‘అలాంటిదేంలేదత్తమ్మా’’ అని ముసిముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లింది భవాని.
    
‘‘భవానీ... ఏంటిది ఇల్లు ఇలా ఉంది? నీపాటికి నువ్వు నీటుగా రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్తే సరిపోతుందా? ఇల్లెలా ఉందో చూసుకునే పన్లేదా?’’... అరిచింది రత్నమాంబ.
 ‘‘పొద్దున్నే ఇల్లు సర్దాకే మిగతా పనులు చేశానత్తమ్మా.’’
 ‘‘అంటే... నువ్వు ఇల్లు సర్దినా సర్దలేదని నేనంటున్నానా?’’ అని రాగం తీసింది రత్నమాంబ.
 ఇక ఆవిడతో మాట్లాడటం అనవసరమని ఆఫీసుకు వెళ్లిపోయింది భవాని.
    
ఇవి మచ్చుకు రెండు సంఘటనలు మాత్రమే. కానీ ఈ ఆర్నెల్లలో ఇలాంటివి ఎన్నో. రత్నమాంబకు ఇద్దరు కుమారులు... రమేష్, సురేష్. రమేష్‌కు ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి చేసింది. సురేష్ తన కొలీగ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారిది కులాంతర వివాహం. రత్న మాంబకు బొత్తిగా ఇష్టం లేని పని అది. కానీ కొడుకు పట్టుపట్టడంతో చేసేదేంలేక అంగీకరించింది. కొత్తకోడలు భవాని ఇంటిలో అడుగు పెట్టినప్పటినుంచీ ఇలా సూటిపోటి మాటలతో హింసిస్తోంది.

కానీ భవాని నవ్వుతూ తన పని తాను చేసుకు పోతుంది. అత్తగారలా చీటికీ మాటికీ సూటిపోటి మాటలంటున్నా భవాని నవ్వుతూ ఎలా ఉండగలుగుతుందో పెద్దకోడలు మాధవికి అర్థం కాలేదు. వింటున్న తనకే కోపమొస్తుంది, ఈ అమ్మాయెలా నవ్వ గలుగుతుందని ఆశ్చర్యం. ఒకసారి కాక పోతే మరోసారైనా అత్తగారికి భవాని ఎదురు మాట్లాడుతుందని  ఎదురు చూసింది. కానీ భవాని ముసిముసి నవ్వులతోనే సరిపెడుతోంది. ఇక ఉండబట్టలేక ఓ రోజు అడిగేసింది.
 ‘‘భవానీ... అత్తగారు రోజూ నిన్ను అన్ని మాటలంటున్నా నువ్వు మాట్లాడవేం?’’
 నవ్వింది భవాని.
 
‘‘ఇదిగో ఇలాగే ముసిముసిగా నవ్వుకుంటావ్.  నీకు కోపం రాదా?’’ అడిగింది మాధవి.
 ‘‘మిక్కీ మౌస్ మాట్లాడుతుంటే ఎవరికైనా కోపమొస్తుందా అక్కా?’’
 ‘‘మిక్కీ మౌసా? నేను మాట్లాడు తోంది కార్టూన్ చానల్ గురించి కాదు భవానీ, మన అత్తగారి గురించి.’’
 ‘‘అక్కా... అత్తగారు మాట్లాడుతుంటే నీకెందుకు కోపమొస్తుందో చెప్పు?’’ అడిగింది భవాని.
 ‘‘ఆవిడలా లేనిపోని దానికి వంకలు పెడుతుంటే కోపం రాదా మరి.’’
 ‘‘వస్తుందనుకో. మరి అదే పని మిక్కీమౌస్ చేస్తే?’’

 ‘‘మధ్యలో ఈ మిక్కీమౌస్ ఏంటి భవానీ? నాకు అర్థం కావడంలేదు.’’
 ‘‘అక్కా... అత్తగారు అలా తప్పులు పడతారనీ, గట్టిగా అరుస్తారనే కదా నీకు కోపం. అదే పని మిక్కీమౌస్ చేసిం దనుకో... నువ్వు కోప్పడతావా? నవ్వు కుంటావా? మిక్కీమౌస్ ఏం చేసినా నవ్వే వస్తుంది కదా. నేను రోజూ నవ్వుతున్నది అందుకే. అంటే... నేను అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నా నన్నమాట’’...
 ‘‘అత్తగారిని మిక్కీమౌస్‌లా చూడ్డ మేంటి భవానీ? అర్థమయ్యేలా చెప్పవా?’’
 ‘‘చెప్పినా నీకు అర్థం కాదక్కా. ఓ సారి చేసి చూస్తావా?’’
 ‘‘ఓకే.’’
 
‘‘సరే.. కళ్లు మూసుకుని ఓసారి మన అత్తగారిని ఊహించుకో. ఆవిడెలా కనిపిస్తుందో, వినిపిస్తుందో, నీకేం అనిపిస్తుందో చెప్పు.’’
 కళ్లు మూసుకుని అంది మాధవి. ‘‘రాక్షసిలా కనిపిస్తుంది భవానీ, గట్టిగా అరుస్తోంది. నాకైతే పీక నొక్కేయాలని పిస్తోంది తెలుసా!’’
 ‘‘కదా... ఇప్పుడు ఆ రాక్షసిని మిక్కీ మౌస్‌లా మార్చెయ్.’’
 ‘‘ఓకే... యా... నౌ షి ఈజ్ లైక్ ఎ మిక్కీమౌస్. హహహ... భలే ఫన్నీగా ఉంది భవానీ. ఆమె అరుపుల్ని ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.’’
 
‘‘కదా... ఓ నాలుగు రోజులు ఇలా ప్రాక్టీస్ చెయ్. ఐదో రోజు నుంచి ఆవిడెలా అరిచినా నీకు మిక్కీమౌస్ అరిచినట్లే వినిపిస్తుంది. నేను రోజూ చేస్తుంది అదే’’ అని పకపకా నవ్వింది భవాని.
 ‘‘అంటే.. రోజూ నువ్వు అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ టెక్నిక్?’’
 ‘‘ఎక్కడ నేర్చుకుంటేనేం.. బావుంది కదా. ఆవిడ అరుస్తున్నకొద్దీ మనకు ఎంటర్‌టైన్‌మెంట్.’’
 ‘‘హహహ... నిజమే. ఇవ్వాల్టి నుంచి నేను కూడా నీ టెక్నిక్‌నే ఫాలో అవుతా’’... అని నవ్వుతూ చెప్పింది మాధవి.
 - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement