నచ్చని సినిమా చూడొద్దు!
ఆత్మబంధువు
‘‘ఏంటక్కా అలా ఉన్నావ్?’’ అడిగింది రేఖ ఇంట్లోకి అడుగు పెడుతూనే.
‘‘ఏం లేదురా..’’ అంది భవాని.
రేఖ నమ్మలేదు. ‘‘ఏమీ లేకుంటే ఎందుకంత డల్‌గా కనిపిస్తున్నావేం?’’ అంటూ మళ్లీ ప్రశ్నించింది.
‘‘ఏదో గుర్తొచ్చిందిలే’’ అంది భవాని.
‘‘నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో చెప్పక్కా’’ అంటూ ఒత్తిడి చేసింది రేఖ.
భవాని చెప్పడం మొదలు పెట్టింది.
‘‘నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక సంఘటన జరిగిందిరా. అది ఎప్పుడు గుర్తొచ్చినా బాధగా ఉంటుంది. నేను మా ఊర్నుంచి కాలేజీకి బస్సులో వెళ్లి వచ్చేదాన్ని. అప్పుడొకడు రోజూ నా వెంట పడేవాడు. వద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. విసుగొచ్చి ఓ రోజు మన ఇంట్లో చెప్పేశా. వాడు అది మనసులో పెట్టుకుని నాపై దాడి చేశాడు. ఎలాగో తప్పించుకున్నాను కానీ, ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా మనసు కలుక్కుమంటుంది.’’
నిట్టూర్చింది రేఖ. ‘‘కొందరు అంతే అక్కా. అవునూ... నాకెప్పుడూ ఈ విషయం చెప్పలేదేం?’’
‘‘చెప్పుకోవడానికి అదేం గొప్ప విషయమో, మంచి విషయమో కాదుగా రేఖా!’’
‘‘అవుననుకో. కానీ అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?’’ అంది రేఖ అక్క ముఖంలో దిగులును గమనిస్తూ.
‘‘ఇప్పుడనే కాదురా. పేపర్లో, టీవీలో అలాంటి వార్త చూసినా, చదివినా గుర్తొస్తుంది. ఇక ఆ రోజంతా నా మనసు మనసులో ఉండదు. అప్పుడు బాగా బాధ పడ్డానేమో, ఎంత కాలమైనా మర్చిపోలేక పోతున్నాను.’’
‘‘అవునా. సరేలే. ఓ విషయం చెప్పు. నీకు నచ్చిన సినిమా ఏంటి?’’
తాను తన బాధ గురించి మాట్లాడు తుంటే, రేఖ సినిమా గురించి అడుగుతుందేమిటా అని అయోమయంగా చూసింది భవాని.
భవానీ డౌట్ రేఖకు అర్థమైంది. ‘‘ముందు జవాబివ్వు, ఎందుకో తర్వాత చెప్తాను’’ అంది.
‘‘ఏం మాయ చేసావె.’’
‘‘ఎన్నిసార్లు చూశావేం?’’ అడిగింది.
‘‘ఓ పాతిక ముప్ఫైసార్లు’’ నవ్వుతూ చెప్పింది భవాని.
‘‘మరి నీకు నచ్చని సినిమా ఏంటి?’’
‘‘బోలెడున్నాయి.’’
‘‘నీకు నచ్చని ఆ బోలెడు సినిమాల్లో ఒక సినిమాని పదిసార్లు చూడమంటే ఏం చేస్తావ్?’’
‘‘లక్ష రూపాయలిచ్చినా చూడను.’’
‘‘ఎందుకలా?’’
‘‘చెత్త సినిమా కాబట్టి. నాకు నచ్చలేదు కాబట్టి.’’
‘‘మరయితే నీకు నచ్చని నీ డిగ్రీ సినిమాను పదేపదే ఎందుకు చూస్తున్నావ్ అక్కా?’’
అర్థం కానట్టుగా చూసింది భవాని. ‘‘డిగ్రీ సినిమా చూడటమేంటి? నాకేం అర్థం కాలేదు.’’
‘‘ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్తా. డిగ్రీలో జరిగిన విషయం నీకెలా గుర్తొస్తోంది?’’
‘‘నేను కావాలని గుర్తుచేసుకోన్రా. అలాంటి వార్తలు చదివినప్పుడు లేదా చూసినప్పుడు గుర్తొస్తుంది.’’
‘‘గుర్తొచ్చింది సరే. కానీ ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడటం ఎందుకు?’’
‘‘అది నాకు తెలీదురా. బాధ కలుగుతుందంతే.’’
‘‘కదా... దీన్నే అసోసియేషన్ అంటారక్కా. అంటే ఆ విషయం జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో, అది గుర్తొచ్చినప్పుడు కూడా దాదాపు అంతే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకానికి ఆ బాధ అలా లింక్ అయి ఉంటుందన్నమాట.’’
‘‘అలాగా... దాన్ని తప్పించుకునే మార్గం లేదా?’’
‘‘ఎందుకు లేదూ! ఎంచక్కా ఉంది. దాన్ని డిసోసియేట్ చేస్తే సరి.’’
‘‘అంటే?’’ మళ్లీ అయోమయంగా ముఖం పెట్టింది భవాని.
‘‘అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకోక పోవడం. దాన్ని నీ మనసు నుంచి దూరం చేయడం.’’
‘‘అదెలా?’’
‘‘ఎలా అంటే... ఆ సంఘటనను నీ మనసులో గుర్తు చేసుకుంటున్నప్పుడు అందులో నువ్వూ కనిపిస్తావ్ కదా?’’
‘‘నేను లేకపోతే ఆ సంఘటనే లేదుగా’’ అంది భవాని.
‘‘అవును. అందుకే ఇప్పుడో పని చెయ్. నువ్వు హాల్లో సోఫాలో కూర్చొని, టీవీలో సినిమా ఎలా చూస్తావో, నీ మనసునే టీవీ అనుకుని ఆ సంఘటనను టీవీలో చూస్తున్నట్లు మనసులో చూడు. అది చూడటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి టీవీని చిన్నది చేసుకో. నీకూ టీవీకి మధ్య దూరం పెంచుకో. టీవీని బ్లాక్ అండ్ వైట్‌గా మార్చుకో. మ్యూట్‌లో పెట్టుకో. డల్ చేసుకో. బ్లర్ చేసుకో. డూ వాటెవర్ యూ వాంట్. తర్వాతెలా ఉందో చెప్పు.’’
‘‘ఊ... టీవీని చిన్నది చేశా, దూరం పెంచా. బ్లాక్ అండ్ వైట్‌గా మార్చేశా. మ్యూట్‌లో పెట్టేశా. నౌ ఫీలింగ్ గుడ్.’’
‘‘కదా. దీన్నే డిసోసియేట్ అంటారు. అంటే మనసుకు బాధ కలిగించే సంఘటనల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవడం అన్నమాట. అప్పుడా ఇన్సిడెంట్ గుర్తొచ్చినా బాధ ఉండదు.’’
భవాని ముఖం వెలిగింది.‘‘ఇన్నేళ్ల బాధను దూరం చేశావ్. థాంక్స్ రా’’ అంది తృప్తిగా.
- డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్