Dr.vishesh
-
ప్రేమా? స్నేహమా?
‘‘మీకు సునీత అనే అమ్మాయి తెలుసా?’’.. కిరణ్ ఆఫీసునుంచి రాగానే అడిగింది ఉష. ‘‘హా.. తెలుసు. ఏం?’’ సమాధానం చెప్తూ అడిగాడు కిరణ్. ‘‘ఎవరావిడ?’’ ‘‘ఫ్రెండ్.’’ ‘‘ఫ్రెండా? గాళ్ ఫ్రెండా?’’ ‘‘మ్మ్మ్... ఫ్రెండ్, హూ ఈజ్ ఎ గాళ్. అడగాలనుకున్నదేదో సూటిగా అడుగు. డొంక తిరుగుడొద్దు.’’ ‘‘సూటిగానే అడుగుతున్నా.. ఆవిడ మీకెంత క్లోజ్? ‘‘అన్ని విషయాలూ మాట్లాడుకునేంత క్లోజ్. చాలా?’’ ‘‘మాటలేనా... లేక?’’ ‘‘వాట్ డూ యూ మీన్?’’ ‘‘అంటే.. మాటలతోనే ఆగారా... లేక ఇంకా ముందుకు పోయారా? అని.’’ ‘‘సీ ఉషా! నాకు కుమార్ ఎలాగో సునీత కూడా అంతే. కుమార్‌తో డిస్కస్ చేసినట్లే తనతోనూ డిస్కస్ చేస్తుంటా.’’ ‘‘కుమార్ అన్న విషయం వేరు. ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?’’ ‘‘ఒకచోట పనిచేస్తున్నప్పుడు మాట్లాడుకోక తప్పదు.’’ ‘‘అంటే.. మీరు మీ ఆఫీసులో ఆడాళ్లందరితో అలాగే క్లోజుగా మాట్లాడతారా?’’ ‘‘అందరితో కాదు.. సునీతతో మాత్రమే.’’ ‘‘ఆవిడతోనే ఎందుకు అంత క్లోజుగా మాట్లాడటం?’’ ‘‘నాకు యండమూరి నవలలంటే ఇష్టం, ఇళయరాజా సంగీతమంటే పిచ్చి. తనకు కూడా అంతే. అలా కామన్ ఇంట్రస్ట్‌ల గురించి మాట్లాడుకుంటాం.’’ ‘‘ఓహో.. అన్ని అభిరుచులూ అంతగా కలిశాయన్నమాట.’’ ‘‘అలాగనేం లేదు. నాకు రామ్‌గోపాల్ వర్మ సినిమాలంటే పిచ్చి, ఆవిడకు ఆర్జీవీ పేరెత్తితేనే మంట. సో, వాటి గురించి మాట్లాడుకోం. నువ్వు ఏదేదో ఊహించుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. షి ఈజ్ మై ఫ్రెండ్... అంతే!’’ ‘‘ఆహా.. ఫ్రెండ్‌ని కన్నా, బుజ్జీ అని కూడా పిలుస్తారా?’’ ‘‘ఓహ్.. అదా నీ ప్రాబ్లమ్. తన ముద్దుపేరు బుజ్జి, అందుకే అప్పుడప్పుడూ అలా పిలుస్తాను. అంతే!’’ అలాఅలా ఆ సంభాషణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఉష, కిరణ్ ఇద్దరూ హద్దులు దాటి మాటలు అనేసుకున్నారు. దాంతో ఉష కోపంగా ఇల్లు విడిచి వెళ్లిపోయింది. కిరణ్ ఆపే ప్రయత్నం చేయలేదు. ‘‘ఏమైందిరా?’’ చెల్లిల్ని అనునయంగా అడిగింది రేఖ. ‘‘కిరణ్ సునీత అనే ఆవిడతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తున్నాడు.’’ ‘‘నువ్వు చూశావా?’’ ‘‘హా.. మొన్న తను మొబైల్ మర్చిపోయి ఆఫీసుకు వెళ్లినప్పుడు చెక్ చేశా. ఇద్దరూ గంటలకు గంటలు చాట్ చేసుకుంటున్నారు.’’ ‘‘అవునా... దేని గురించి మాట్లాడుకుంటున్నారు?’’ ‘‘ఏవో.. ఆఫీసు విషయాలు. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ గురించి.’’ ‘‘ఇంకా?’’ ‘‘సినిమాలు, మ్యూజిక్, లిటరేచర్ గురించి.’’ ‘‘ఇంకా?’’ ‘‘ఫ్యామిలీస్ గురించి.’’ ‘‘అంతేగా... అంత మాత్రానికే బాధపడతావేం?’’ ‘‘నువ్వు అలాగే అంటావ్. బావగారు వేరే ఎవరితోనైనా మాట్లాడితే తెలుస్తుంది ఆ బాధేంటో. ఆవిడతో కిరణ్‌కు రిలేషన్ షిప్ ఉందేమోనని డౌట్‌గా ఉందక్కా. ఆవిడను బుజ్జీ, గజ్జీ అని పిలుస్తున్నాడు.’’ ‘‘వాళ్ల చాటింగ్‌లో రొమాంటిక్ విషయాలున్నాయా?’’ ‘‘వూహూ... అలాంటివేం లేవు.’’ ఉష సమస్యేమిటో రేఖకు అర్థమైంది. ‘‘సరేరా.. నీ ఫీలింగ్ నాకు అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని మనం సైంటిఫిక్‌గా విశ్లేషించుకుంటే మంచిది. రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ అనే సైకాలజిస్ట్ ప్రేమ గురించి ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని గురించి మాట్లాడుకుందాం.’’ ‘‘సరే.. చెప్పు’’ అయిష్టంగానే అంది ఉష. ‘‘స్టెర్న్‌బర్గ్ సిద్ధాంతం ప్రకారం ప్రేమలో అభిరుచి (ప్యాషన్), సాన్నిహిత్యం (ఇంటిమసీ), నిబద్ధత (కమిట్మెంట్) ఈ మూడూ ఉంటేనే అది పరిపూర్ణమైన ప్రేమ. ఇద్దరు వ్యక్తుల మధ్య కేవలం సాన్నిహిత్యం మాత్రమే ఉంటే అది నిజమైన స్నేహం. నిబద్ధత మాత్రమే ఉంటే శూన్యమైన ప్రేమ, కేవలం ప్యాషన్ మాత్రమే ఉంటే అది ఆకర్షణ. ప్యాషన్, ఇంటిమసీ రెండూ ఉంటే అది రొమాంటిక్ లవ్. సాన్నిహిత్యంతో పాటు నిబద్ధత ఉంటే అది సహచర ప్రేమ. ప్యాషన్, కమిట్మెంట్ మాత్రమే ఉంటే అది ఫాచువస్ లవ్. ఇలా ప్రేమలో ఆరు రకాలుంటాయి. ఇప్పుడు చెప్పు... సునీతకూ, కిరణ్‌కు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో?’’ ‘‘వాళ్లిద్దరి అభిరుచులు కలిశాయనే చెప్పాడు కిరణ్.’’ ‘‘కదా.. మరి నువ్వెందుకు వేరేలా అనుకున్నావ్?’’ ‘‘అంటే అక్కా... ఆవిడ్ని బుజ్జీ అని పిలిచేసరికి...’’ ‘‘అది ఆవిడ పెట్‌నేమ్ కూడా అయ్యుండొచ్చుగా?!’’ ‘‘అవును... ఆవిడ్ని ఇంట్లో అలానే పిలుస్తారని చెప్పాడు కిరణ్.’’ ‘‘కదా? అందుకే అతనూ అలా పిలిచి ఉంటాడు. అయినా ఓసారి అతనితో మాట్లాడుతాలే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు.’’ అని చెప్పింది రేఖ. ‘‘సరే అక్కా’’ అంటూ నవ్వింది అనుమానాలు వీడిన ఉష. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
ఆనందాల ప్లే స్టేషన్!
ఆత్మబంధువు ‘‘మమ్మీ... నాకు ప్లేస్టేషన్ కావాలి’’ ’’ స్కూల్నుంచి వస్తూనే అన్నాడు మిత్ర. ‘‘కొందాంలే.’’ ‘‘కొందాంలే కాదు, వెంటనే కావాలి’’ డిమాండింగ్‌గా అడిగాడు. స్కూల్లో ఏదో జరిగిందని రేఖకు అర్థమైంది. అప్పటికి సరేనని కాసేపయ్యాక మెల్లగా మాటల్లోకి దించింది... విషయం రాబట్టడానికి. ‘‘ఇవ్వాళ స్కూల్ ఎలా ఉంది కన్నా?’’ ‘‘బాగానే ఉంది.’’ ‘‘నీ ఫ్రెండ్స్?’’ ‘‘వాళ్లూ బాగానే ఉన్నారు.’’ ‘‘మరి నువ్వు?’’ మిత్ర మౌనంగా ఉండిపోయాడు. ‘‘ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది నాన్నా. నువ్వు చెప్తేనే కదా నేనేమైనా చేయగలిగేది’’ అంది రేఖ. ‘‘ఆర్యన్గాడు నన్ను ‘పూర్ ఫెలో’ అని తిట్టాడు మమ్మీ’’ అంటూ ఏడ్చేశాడు మిత్ర. ‘‘సరదాగా అనుంటాడులే. దానికే ఏడిస్తే ఎలా?’’ అంటూ ఊరడించింది. ‘‘సరదాకు కాదు, నిజంగానే. ‘మీ ఇంట్లో స్మార్ట్ టీవీ లేదు, నీ మొహానికి ప్లే స్టేషన్ లేదంటూ ఎగతాళి చేశాడు.’’ ‘‘ఔనా... సర్లే బాధపడకు, కొని పెడతాలే’’ అని కొడుకుని ఓదార్చి ఆలోచనలో పడింది రేఖ. పిల్లలకు చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు బాధపడింది. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘‘కన్నా, బుజ్జీ... నెక్స్ట్ సెకండ్ సాటర్డే, సండే మనం అమ్మమ్మ వాళ్లు ఊరు వెళ్తున్నాం’’ అని పిల్లలు స్కూల్ నుంచి రాగానే చెప్పింది రేఖ. వాళ్లు ఎగిరి గంతేశారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. ఆనంద్‌కు ఆఫీసు పని వల్ల రాలేనన్నాడు. దాంతో పిల్లలను తీసుకుని రేఖ వెళ్లింది. ఆ రెండు రోజులూ మిత్ర, మైత్రి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి, పొలాలు, తోటలన్నీ తిరిగారు. కబుర్లు చెప్పారు. బంధువుల పిల్లలతో ఆడుకున్నారు. సంతోషంగా ఇంటికి బయలుదేరారు. ‘‘నాన్నా.. బాగా ఎంజాయ్ చేశావా?’’ కారులో అడిగింది రేఖ. ‘‘ఓ... యా.. ఫుల్లుగా మమ్మీ’’ చెప్పాడు మిత్ర. ‘‘సరే.. అక్కడ చాలామందితో ఆడు కున్నావు. వాళ్లలో పేదవాళ్లూ ఉన్నారు కదా. వాళ్లనుంచి ఏం తెలుసుకున్నావ్?’’ ‘‘మమ్మీ... మనకు ఒక కుక్కే ఉంది. కానీ వాళ్లకు ఒక్కో ఇంటికి రెండు, కొందరికి నాలుగు కుక్కలు కూడా ఉన్నాయి. మనం ఈత కొట్టాలంటే స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాలి, కానీ వాళ్లకి పేద్ద చెరువుంది. మనం బెడ్‌లైట్ వేసుకుని పడుకుంటాం, వాళ్లు ఆకాశంలో చంద్రుడ్ని, చుక్కల్ని చూస్తూ పడు కుంటారు. మనం కుండీల్లో నాలుగు మొక్కలు పెంచుకుని ఆనందిస్తాం, వాళ్లు కావాల్సినన్ని మొక్కలు పెంచుకుంటారు. మన పని వాళ్లు సరిగా చేస్తే మనం ఆనందిస్తాం, వాళ్లు పని చేయడాన్ని ఆనందిస్తారు. మనం బియ్యం, కూరగాయలు కొను క్కుంటాం... వాళ్లు పండించి అందరికీ అందిస్తారు. మనల్ని కాపాడుకోవడానికి ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టుకున్నాం... వాళ్లకు ఏదైనా కష్టమొస్తే కాపాడటానికి కావాల్సినంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని చెప్పింది మైత్రి. ‘‘వాళ్లకు స్మార్ట్ టీవీలు, ఐపాడ్లు లేవు... అయినా చాలా హ్యాపీగా ఉన్నారు’’ అని చెప్పాడు మిత్ర. ‘‘గుడ్, గుడ్... గుడ్ అబ్జర్వేషన్. ఇంకా?’’ ‘‘ఈ రెండ్రోజులూ మాకసలు టీవీ చూద్దామనిపించలేదు. ఫుల్లుగా ఆడు కుంటూనే ఉన్నాం. అక్కడ ఆడుకునే ఆటలకు పెద్దగా వస్తువులు కూడా అవసరంలేదు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్’’ అని చెప్పింది మైత్రి. ‘‘నాక్కూడా... అసలేం గుర్తుకురాలేదు’’ చెప్పాడు మిత్ర. ‘‘ఇంకా...?’’ అడిగింది రేఖ. ‘‘ఇంకా అంటే... హ్యాపీగా ఉండటానికి ప్లే స్టేషన్ అవసరం లేదని అర్థమైంది’’ తమ్ముడి వంక టీజింగ్‌గా చూస్తూ చెప్పింది మైత్రి. ‘‘చూడు మమ్మీ.. అక్క ఎలా టీజ్ చేస్తుందో. నేను అడిగింది ఒక్కసారే’’ అన్నాడు మిత్ర. ‘‘ఒక్కసారైనా.. దానికోసం ఏడ్చావుగా!’’ మరింత టీజింగ్‌గా చెప్పింది మైత్రి. ‘‘నేను ఏడ్చింది ప్లే స్టేషన్ కోసం కాదు.’’ ‘‘మరి దేనికోసమో?’’ ‘‘ఆర్యన్గాడు అలా అన్నాడని.’’ ‘‘వాడు మళ్లీ అంటే?’’ ‘‘పో పోరా. హ్యాపీగా ఉండాలంటే ప్లే స్టేషన్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేస్తా.’’ ‘‘ఆర్ యూ ష్యూర్?’’ ‘‘ఎస్... ఐ యామ్!’’ ధృఢంగా చెప్పాడు మిత్ర. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
అన్నీ ఇస్తాయి స్ఫూర్తి!
ఆత్మబంధువు ‘‘అమ్మా... అమ్మా...’’ స్కూల్నుంచి వస్తూనే పిలిచాడు మిత్ర. ‘‘ఏంటి నాన్నా...?’’... దగ్గరకు తీసుకుని అడిగింది రేఖ. ‘‘నాకు కొన్ని ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ బుక్స్ కావాలి.’’ ‘‘ఎందుకు?’’ ‘‘కొన్ని బుక్స్ చదివి అందులో ఇన్స్పైర్ చేసిన దానిపై వ్యాసం రాయమని చెప్పారు.’’ ‘‘ఓహ్ అలాగా... బుక్స్ చదివే రాయాలా? లేదంటే స్ఫూర్తినిచ్చిన ఏ అంశం గురించైనా రాయొచ్చా?’’ ‘‘రాయొచ్చు. కానీ ఇన్‌స్పయిర్ చేసిన దాని గురించే రాయాలి.’’ ‘‘అలా అయితే... మన చుట్టూ ఉన్నవన్నీ స్ఫూర్తినిచ్చేవే నాన్నా!’’ ‘‘అవునా... మన చుట్టూ అలాంటివి ఏమున్నాయమ్మా?’’ అసక్తిగా అడిగాడు మిత్ర. ‘‘చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్... మనం భూమి మీద ఉన్నాం కదా. భూమి మనకు ఏం చెప్తుంది?’’ ‘‘ఏం చెప్తుంది?’’ ‘‘నేను నీ తల్లిని. నీకు జీవితాన్ని ఇచ్చాను. మీ అందరినీ భరిస్తున్నది నేనే. మీరు నన్నెంత కష్టపెట్టినా మీ మీద ప్రేమ తగ్గదు, ఎందుకంటే మీరంతా నా బిడ్డలు. నువ్వు కూడా నాలానే బిడ్డలను ప్రేమించు, మంచివారిగా పెంచు. నీ చుట్టూ ఉన్నవాటిలో అందాన్ని ఆస్వాదించు. నీతోపాటు నీ చుట్టూ ఉన్న వారిని గౌరవించు. ఎందుకంటే మనం దరం ఒక్కటే. మిగతా ప్రాణులకంటే నువ్వేదో గొప్పవాడివి అనుకోకు. నామీద జీవించే ప్రాణులన్నీ ఒక్కటే నాకు. నా దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు అందరినీ ఒకలాగే ఆహ్వానిస్తాను... అని చెప్తుంది.’’ ‘‘ఓహ్.. ఇంకా...?’’ ‘‘ఎవరినుంచీ ఏమీ ఆశించకుండా వెచ్చని ప్రేమను పంచు. నీకోసం నువ్వే కాకుండా పదిమందికీ ఉపయోగపడేలా జీవించు... అని సూర్యుడు చెప్తాడు.’’ ‘‘నిజమే కదా అమ్మా. సూర్యుడి వల్లనే కదా మనమంతా బ్రతికున్నాం. ఇంకా చెప్పమ్మా!’’ ‘‘నేనే నీ ప్రాణం. అందుకే నన్ను గుండెల్లో నింపుకో. నీ శరీరాన్ని ఆరో గ్యంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతా. రోజుకో ఐదు నిమిషాలైనా ధ్యానించి మౌనంగా హృదయం చెప్పేది విను. నన్నెంత కలుషితం చేస్తున్నా మిమ్మల్ని క్షమిస్తున్నట్లే నువ్వు కూడా ఇతరులను క్షమించు అని గాలి చెప్తుంది.’’ ‘‘మన చుట్టూ ఇన్ని ఇన్స్పిరేషనల్ విషయాలున్నాయంటే చాలా బాగుంది మమ్మీ. ఇంకా చెప్పవా ప్లీజ్!’’ అన్నాడు మిత్ర ఉత్సాహంగా. ‘‘ప్రకృతిలోని అన్ని అంశాలూ మనకు స్ఫూర్తినిచ్చేవేరా. మనం కళ్లు తెరచి చూడాలి, చెవులతో వినాలి, మనసుతో తెలుసుకోవాలి అంతే. ఉదాహరణకు చెట్టును తీసుకో. నిలబడు... నిటారుగా. ఒంటరిగా, జంటగా, గుంపుగా.. ఎలాగైనా సరే. ఎవరేం చేసినా ఫలాలివ్వడం మర వకు. పెనుగాలి వచ్చినపుడు తలవంచడం మరవకు. ఓపికగా ఉండు. కాలంతో పాటు నువ్వూ ఎదుగుతావు అని చెప్తుంది. నీకు నువ్వు సృష్టించుకున్న హద్దుల్ని దాటి విస్తరించు, నిన్ను నువ్వు వ్యక్తపరచుకో, మార్పును గమనించు, అనంతమైన అవకాశాలను గుర్తించు అని అనంతాకాశం చెప్తుంది. అన్ని భయాలూ మరచి స్వేచ్ఛగా జీవించమని, మనసారా పాడమని పక్షులు చెప్తాయి. మనసును తేలిగ్గా ఉంచుకోమని, నిరంతరం సృజనాత్మకంగా ఆలోచించ మని, ఆ ఆలోచనలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచమని మేఘాలు చెప్తాయి. దయతో చల్లగా చూడమనీ, అందరినీ ప్రేమించమని, ప్రేమను పంచమనీ, ప్రేమను స్వీకరించమనీ చంద్రుడు, చుక్కలా మెరవమని నక్షత్రాలూ చెప్తాయి’’... చెప్పింది రేఖ. ‘‘అన్నీ పెద్దపెద్దవేనా? చిన్నవి ఏమీ చెప్పవామ్మా?’’ ప్రశ్నించాడు మిత్ర. ‘‘ఎందుకు చెప్పవు... చెప్తాయి. పర్ఫెక్షనిజం కోసం చూడకుండా నిన్ను నిన్నుగా ప్రేమించమని, గౌరవించమనీ... చిన్న చిన్న అంశాల్లోని అందాన్ని ఆస్వా దించమనీ మొక్కలూ పుష్పాలూ చెప్తాయి. అంతెందుకు... కష్టించి పనిచేయమనీ, భవిష్యత్తుకు కూడబెట్టుకోమనీ, కలిసి కట్టుగా జీవించమనీ, ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమనీ చీమలు చెప్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతి, అందు లోని జీవులూ ఇలా అనేక విధాలుగా స్ఫూర్తినిస్తాయి’’... వివరించింది రేఖ. ‘‘థాం్యక్యూ సోమచ్ మమ్మీ...’’ అంటూ అమ్మకు ముద్దు పెట్టాడు మిత్ర. ‘‘ముద్దులు పెట్టుకుంటే సరిపోదు నాన్నా. నేను చెప్పినవి కాకుండా, నీ చుట్టూ ఉన్నవాటిని పరిశీలించి అవి నీకేం పాఠాలు చెప్తున్నాయో, ఎలా స్ఫూర్తినిస్తు న్నాయో రాసి చూపించు’’ అంది రేఖ. ‘‘ఓ... నీకు చూపించాకే స్కూల్లో ఇస్తాను’’ అంటూ లేచాడు మిత్ర. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
అంతా మన మంచికే!
ఆత్మబంధువు ఎప్పుడూ గలగలా మాట్లాడే రత్నమాంబ చాలా దిగులుగా ఉంది. ఆమెనలా చూడటం రేఖకు కొత్తగా ఉంది. ‘‘ఏంటత్తమ్మా అలా ఉన్నారు?’’ అని అడిగింది. ‘‘ఏం లేదులే’’ అని తనదైన తీరులో సమాధానం చెప్పింది రత్నమాంబ. కానీ ఆమె దేనిగురించో బాధపడుతోందని అర్థమైంది రేఖకు. అయితే అడిగినా చెప్పేరకం కాదు కాబట్టి వంటపనిలో మునిగిపోయింది. కాస్సేపటి తర్వాత ‘‘రేఖా’’ అని పిలిచింది రత్నమాంబ. ‘‘హా... చెప్పండత్తమ్మా’’ అంటూ వచ్చింది రేఖ. ‘‘నా మనసేం బాలేదు. నాల్రోజులు అమ్మాయి వాళ్లింట్లో ఉండొస్తా.’’ ‘‘మీ ఇష్టం అత్తమ్మా. కానీ మీ అబ్బాయి వచ్చాక చెప్పి వెళ్తే బావుం టుందేమో...’’ అంటూ ఆగింది రేఖ. ‘‘వాడికి చెప్తే వెళ్లనివ్వడులే. నేను వెళ్తున్నాను. వాడికి నువ్వే చెప్పు’’ అని బ్యాగ్ సర్దుకుని కూతురింటికి వెళ్లిపోయింది రత్నమాంబ. ఆవిడంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిందో రేఖకు అర్థం కాలేదు. భర్త వచ్చాక విషయం చెప్పింది. ‘‘ఎందుకెళ్లింది?’’ అని అడిగాడు ఆనంద్. ‘‘ఏమో.. నాకేం తెలుసు! అడిగినా చెప్పలేదు’’ అంది. ‘‘మీరేమైనా గొడవపడ్డారా?’’ అని ఆరా తీశాడు. ‘‘అలాంటిదేం లేదండీ.’’ ‘‘మరెందుకు వెళ్లి ఉంటుంది? సర్లే.. నేనే ఫోన్ చేసి మాట్లాడతా’’ అన్నాడు. మర్నాడు ఉదయం రత్నమాంబ రూమ్ సర్దుతుంటే ఓ కాగితం కనిపించింది రేఖకు. అందులో ఇలా రాసి ఉంది. ‘‘ఇప్పుడు నా టైమ్ బాగాలేదు. నాకు శని పట్టినట్టుంది. ఇంట్లో ఒంట్లో అన్నీ సమస్యలే. నాకు 60 ఏళ్లు వచ్చాయి. ఈ ఏడాదే నన్నెంతో ప్రేమగా చూసుకునే మా నాన్న కూడా చని పోయారు. ఒంటరిదాన్ని అయిపోయాను. నిన్నటివరకూ మహారాణిలా ఉన్నదాన్ని ఇప్పుడు కృష్ణా రామా అంటూ నా రూమ్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోడలేమో వంట గదిలోకి రానివ్వట్లేదు. నా గాల్ బ్లాడర్ తీసేశారు. ఆపరేషన్ చేయించు కోవడం వల్ల చాలా కాలం బెడ్ మీదనే ఉండాల్సి వచ్చింది. చిన్న కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది. కారు తుక్కుతుక్కు అయి పోయింది. వాడు కూడా చాలా కాలం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఇది నిజంగానే శని పట్టిన కాలం. జ్యోతిష్యుడికి చూపించి శాంతి చేయించాలి.’ ఆ పేపర్ చదివాక అత్తగారి బాధేంటో రేఖకు అర్థమైంది. తనకు వరుసగా ఎదురైన దుర్ఘటనలతో మానసికంగా బాగా డీలా పడిందనీ, డిప్రెషన్లోకి వెళ్తోందనీ తెలిసింది. ఆ సమయంలో ఆవిడకు మానసిక బలం కల్పించాలని నిశ్చయించుకుంది. నాల్రోజుల తర్వాత భర్తకు చెప్పి అత్తగారిని ఇంటికి పిలిపించుకుంది. ఇంటికి వచ్చినా దిగులుగానే ఉంది రత్నమాంబ. రేఖ ఇచ్చిన కాఫీ తాగాక తన రూమ్‌లోకి వెళ్లిపోయింది. తను రోజూ చదువుకునే భాగవతం తీస్తుంటే అందులోంచి ఓ కాగితం జారి పడింది. ఏమిటా అని తీసుకుని చదివింది. అందులో ఇలా ఉంది. ‘ఈ ఏడాది చాలా మంచిది. నాకు అంతా మంచే జరిగింది. ఎన్నో ఏళ్లుగా బాధపెడుతున్న గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ చేసి తీసేశారు. ఇప్పుడు ఎలాంటి బాధా లేదు. 90 సంవత్సరాలు బతికిన మా నాన్న ఎవ్వరిమీదా ఆధార పడలేదు. చనిపోయేంతవరకూ తన పనులు తానే చేసుకున్నారు. ఇంత మంచి మరణం ఎవ్వరికుంటుంది! నాకు ఇరవయ్యేళ్లకే పెళ్లయింది. నలభై ఏళ్లపాటు వంటింట్లోనే ఉన్నాను. ఇప్పుడు వంట చేయాల్సిన పని లేదు. హాయిగా నా రూమ్‌లో కూర్చుని నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవచ్చు. నాకు కావాల్సినవి ఆర్డర్ వేసి కోడళ్లతో చేయించుకోవచ్చు. దేవుడు చల్లగా చూడబట్టి నా చిన్న కొడుకు పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు. కారు పోతే పోయింది, ఇంకోటి కొనుక్కో వచ్చు. నా కొడుకును నాకు ఇచ్చినందుకు తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరుడికి మొక్కి రావాలి. నా వేంకటేశ్వరుడు నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. గోవిందా... గోవిందా!’ రత్నమాంబ కళ్లలో నీళ్లు తిరిగాయి. అలా రాసి పెట్టింది ఎవరో అర్థమైంది. రేఖను పిలిచి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మరుసటి వారం కుటుంబంతో సహా వెళ్లి గోవిందుని దర్శనం చేసుకుని వచ్చింది. అత్తగారి కోసం రేఖ యూ ట్యూబ్‌లో ‘ఆంటీస్ కిచెన్’ చానల్ ఓపెన్ చేసింది. ఇప్పుడు రత్నమాంబకు చేతి నిండా పని, లక్షలాదిమంది ఫాలోవర్స్. తనో చిన్న సెలెబ్రిటీ! - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మానసిక ఒత్తిడి మాయే!
ఆత్మబంధువు ఆనంద్ ఆఫీసునుంచి వచ్చాడు. కానీ రేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. కాఫీ ఇస్తే ఏదో అలా తాగేశాడు. పిల్లలు దగ్గరకు వచ్చినా పట్టించుకోలేదు. అతను ఏదో ఒత్తిడిలో ఉన్నాడని రేఖకు అర్థమైంది. అదే విషయం అడిగింది. ‘‘అలాంటిదేం లేదోయ్’’ అన్నాడు. ‘‘మరి అలా ఎందుకున్నారు?’’ ‘‘ఎలా ఉన్నాను? బానే ఉన్నాగా?’’ ‘‘మీరు మామూలుగా లేరు. ఆఫీసులో ఏదైనా ఒత్తిడా?’’ ‘‘అలాంటిదేం లేదు. నేను బాగానే ఉన్నా. ఆఫీసులో కూడా బాగానే ఉంది. ఏదో చిన్న ఒత్తిడి. అంతే. ఉద్యోగం అన్న తర్వాత అవన్నీ తప్పవుగా.’’ ‘‘చిన్న ఒత్తిడి అని వదిలేస్తే పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది ఆనంద్.’’ ‘‘అలాంటిదేం లేదులే. అది చాలా చిన్న సమస్య. ఐ కెన్ మేనేజ్.’’ ఆనంద్ అలా చెప్తున్నా... ఆ సమస్యను మేనేజ్ చేయలేకనే ఒత్తిడి ఫీల్ అవుతున్నాడని రేఖకు అర్థమైంది. ఆ విషయం అతనికి ప్రాక్టికల్‌గా చెప్పాలనుకుంది. ‘‘ఆనంద్... ఓ చిన్న పని చేయ గలవా?’’ మర్నాడు అడిగింది రేఖ. ‘‘హా.. చెప్పు’’ అన్నాడు ఆనంద్. ‘‘కొంచెం ఈ కప్పు పట్టుకోవా?’’ అని చిన్న కప్పు చేతికిచ్చింది. ‘‘ఆ మాత్రం దానికేనా?’’ అంటూ కప్పు అందుకున్నాడు. ‘‘నేను చెప్పేంతవరకూ ఆ కప్పు కింద పెట్టకూడదు’’ అంది రేఖ. ‘‘ఒహ్హో... ఈ చిన్న కప్పును పట్టుకోలేనా?’’ ‘‘పట్టుకోండి సార్ చూద్దాం.’’ ఆనంద్ ఆ కప్పును అలా పట్టుకుని నిల్చున్నాడు. రేఖ వంట చేసుకుంటోంది. పది నిమిషాలకు కప్పు బరువుగా అనిపించింది ఆనంద్కి. పావు గంటకు చెయ్యి గుంజడం మొదలెట్టింది. అరగంట తర్వాత ఇక భరించలేననుకున్నాడు. కప్పును చేయి మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ‘‘హలో మిస్టర్ ఆనంద్... మీరు అదే చేత్తో పట్టుకోవాలి. చేయి మార్చుకోవడం కుదరదు’’ అంది రేఖ. ‘‘అరగంట పట్టుకునేసరికి చేయి గుంజుతుందోయ్’’ చెప్పాడు ఆనంద్. ‘‘కదా... అలాగే చిన్న ఒత్తిడిని ఎక్కువకాలం భరించినా ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది సర్’’ అంది నవ్వుతూ. ‘‘ఓహ్... నిన్న నేనన్న మాటలకు రిటార్డా?’’ అంటూ కప్పు కింద పెట్టాడు. ‘‘రిటార్డేం కాదు. చిన్న ఒత్తిడని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పాలనీ...’’ ‘‘చెప్పాలనుకుంటే డెరైక్ట్‌గా చెప్పొచ్చుగా... ఇలా ఎందుకు?’’ ‘‘డెరైక్ట్‌గా చెప్తే తమరికి నచ్చదుగా. అందుకే ప్రాక్టికల్‌గా చూపిద్దామనీ...’’ ‘‘అబ్బో... స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ కూడా చెప్తావా ఏంటీ?’’ ‘‘ఏం... చెప్పకూడదా ఏంటీ?’’ ‘‘నాకు తెలియని టిప్స్ నువ్వేం చెప్తావోయ్?’’ ‘‘మీకు తెలిసిన టిప్స్ ఏంటో చెప్పండి ముందు.’’ ‘‘రోజూ పొద్దుటే వాకింగ్, యోగా, మెడిటేషన్ చేసాను కదా! అలాగే మా ఆఫీసులో స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎక్స్‌పర్ట్స్‌తో క్లాసులు కూడా చెప్పిస్తుంటారు. వాళ్లు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు.’’ ‘‘మరి చేస్తున్నారా?’’ ‘‘అప్పుడప్పుడూ. అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చేస్తున్నా.’’ ‘‘మరి తగ్గుతుందా?’’ ‘‘తగ్గుతుంది... మళ్లీ వస్తుంది.’’ ‘‘కదా... మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... అసలది లేదనే విషయం తెలుసుకోవాలి.’’ ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. ‘‘ఏంటీ... మానసిక ఒత్తిడనేది లేదా? ఎవరైనా వింటే జనాలు నవ్వుతారు. ఒత్తిడి తట్టుకోలేక లక్షలాదిమంది బాధపడు తుంటే నువ్వు ఒత్తిడనేదే లేదంటావేం?’’ ‘‘సరే ఉంది. కానీ ఆ ఒత్తిడి సృష్టిస్తున్నది ఎవరు?’’ ‘‘ఎవరంటే... దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలా చెప్పడం?’’ ‘‘మీరెన్ని కారణాలు చెప్పినా అవి సెకెండరీ. మీరెన్ని టిప్స్ పాటించినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు. ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... దాని మూలం తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ కొన్ని సామర్థ్యాలూ, అంచనాలూ ఉంటాయి. అంచనాలకు, ఆశయాలకూ తగ్గ సామర్థ్యా లున్నప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. అంచనాలకూ సామర్థ్యాలకూ మధ్య దూరం పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ‘‘అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలంటే అంచనాలు తగ్గించుకోవాలి, లేదంటే అంచనాలకు అందుకోగల సామర్థ్యాలను పెంచుకోవాలి. అంతే తప్ప మరేం చేసినా అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే.’’ ‘‘నువ్వు చెప్పింది నిజమేనోయ్. థ్యాంక్స్.’’ అంటూ ముద్దిచ్చాడు ఆనంద్. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
ఆడండి... నాలుగు స్తంభాలాట!
ఆత్మబంధువు రేఖ షాపింగ్‌కి వెళ్లి తిరిగి వస్తుంటే కనపడింది సుమ. తమ కాలనీలోనే ఉంటుంది. మంచమ్మాయి. కానీ ఈ రోజెందుకో డల్‌గా కనిపించింది. ఆ మాటే అడిగింది. ‘‘అదేం లేదు రేఖా. బానే ఉన్నాను’’ అని సుమ సమాధానమిచ్చినా ఏదో దాస్తోందని అర్థమైంది. దాంతో ఆ సాయంత్రం ఇంటికెళ్లి విషయం అడిగింది. సుమ అంతా చెప్పింది. సుమ, రాజీవ్ పెళ్లి చూపుల్లోనే ప్రేమలో పడ్డారు. పెళ్లయ్యాక మరింత లోతుగా మునిగిపోయారు. సంవత్సరం తర్వాత పాప పుట్టింది. పాప బోసి నవ్వు లతో వారి జీవితం ఆనందమయమైంది. మరో ఏడాది గడిచింది. ఆ తర్వాతే చిరాకులు, పరాకులు మొదలయ్యాయి. మాటలతో మొదలై... తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దాంతో సుఖం, శాంతి కరువయ్యాయని చెప్పి ఏడ్చింది సుమ. ఆమె మాటలు విన్నాక... సుమ, రాజీవ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమనీ, అయినా ఆ విషయం వారిద్దరికీ అర్థం కావడం లేదనీ రేఖకు అర్థమైంది. అందుకే వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడింది. ‘‘ఇంతకు ముందు ఎప్పుడూ నా చుట్టూనే తిరిగేవాడు. ఎంతో ప్రేమ చూపించేవాడు. కానీ ఇప్పుడు నన్నసలు పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ ఆఫీసే’’ చెప్పింది సుమ. ‘‘సిటీలో రోజుకు రెండు గంటలు ప్రయాణం చేసి వస్తే నా కష్టమేమిటో తెలుస్తుంది’’ అన్నాడు రాజీవ్. ‘‘పొద్దుటనగా నువ్వు ఆఫీసుకు వెళ్లిపోతే సాయంత్రం వరకూ ఒంటరిగా పాపతో ఉంటే తెలుస్తుంది నా బాధేంటో’’ అంది సుమ. ‘‘నువ్వలా బాధపడుతున్నా వనేగా... రాగానే పాపను నేను తీసు కుంటున్నాను’’ అన్నాడు రాజీవ్. ‘‘పాపను తీసుకుని, ఆ వంకతో నన్ను దూరంగా ఉంచుతున్నావ్’’ నిష్టూర మాడింది. ‘‘నిన్ను దూరంగా ఉంచడ మేమిటి? నేను చేసేదంతా మన సంతోషం కోసమేగా!’’ ఇలా సాగిపోయింది గొడవ. రేఖ ఆపింది. ‘‘మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇద్దరూ కరెక్టే. దాన్ని ఫస్ట్ పొజి షన్ అంటారు. అంటే మన దృక్కోణంలో ప్రపంచాన్ని, మనుషుల్ని అర్థం చేసుకో వడం. ఆ పొజిషన్లోనే ఆగిపోతే మనం స్వార్థపరులం అవుతాం. మన సుఖం, సంతోషం తప్ప అవతలివారి గురించి పట్టించుకోం. అందుకే ఎప్పటికప్పుడు అవతలివారి పొజిషన్ నుంచి కూడా ఆలోచించాలి. దాన్నే సెకెండ్ పొజిషన్ అంటారు’’ అని చెప్పి సుమను దగ్గరకు పిలిచింది రేఖ. ‘‘ఇప్పటి వరకూ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్యేమిటో చెప్పావ్. ఇప్పుడు కాసేపు కళ్లు మూసుకుని నిన్ను నువ్వు రాజీవ్‌లా ఊహించుకో. రోజుకు రెండు మూడు గంటలు సిటీ బస్సుల్లో ప్రయాణించి ఇంటికొచ్చేసరికి ఏం కోరుకుంటావ్?’’ ‘‘నా భార్య ఓ కప్పు కాఫీ ఇవ్వాలని, చిరాకులు పరాకులు లేకుండా స్వీట్‌గా మాట్లాడాలని కోరుకుంటా.’’ ‘‘గుడ్. ఇప్పుడు నా పొజిషన్లోకి రా. అంటే మీ ఇద్దరికీ సంబంధంలేని మూడో వ్యక్తి పొజిషన్. దీన్నే థర్డ్ పొజిషన్ లేదా జడ్జ్ పొజిషన్ అంటారు. సుమగా, రాజీవ్‌గా ఇద్దరి వాదనలూ తెలుసు కున్నావ్. ఇప్పుడు వాళ్లిద్దరికీ సంబంధం లేని మూడో వ్యక్తిగా వారి వాదనలు వింటే ఏమనిపిస్తోంది?’’ ‘‘అనవసరంగా గొడవ పడుతున్నా రనిపిస్తోంది.’’ ‘‘ఎందుకలా గొడవ పడుతున్నారు?’’ ‘‘ఎవరికి వారు వారి వాదనకే కట్టుబడి ఉండటం వల్ల.’’ ‘‘ఇప్పుడు మళ్లీ సుమ స్థానంలోకి వచ్చి, నీ సమస్యని చూడు.’’ సుమ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ‘‘ఇంత సిల్లీగా గొడవ పడు తున్నామేమిటా అని నవ్వొస్తోంది’’ అంది. ‘‘ఇప్పటికైనా రాజీవ్ వాదనేమిటో, అసలేం చేయాలో అర్థమైందా?’’ అడిగింది రేఖ నవ్వుతూ. ‘‘పూర్తిగా అర్థమైంది.’’ ఆ తర్వాత రాజీవ్‌తోనూ అదే ప్రాసెస్ చేయించింది రేఖ. అతనూ సుమ వాదనే మిటో, తనేం చేయాలో అర్థం చేసుకు న్నాడు. సుమకు సారీ చెప్పాడు. తను కూడా సారీ చెప్పింది. ‘‘మూడు పొజిషన్లూ మీకు అర్థమ య్యాయిగా. ఇంకోటుంది... ఫ్యామిలీ పొజిషన్. అంటే వ్యక్తులుగా కాకుండా ఉమ్మడిగా కలిసి కుటుంబం కోసం ఏం చేయాలో ఆలోచించడం, ఆచరించడం. కొన్ని రోజులపాటు ఈ నాలుగు స్తంభా లాట ఆడండి. ఏ పొరపొచ్చాలూ ఉండవు’’... చెప్పింది రేఖ. ఇద్దరూ రేఖకు థ్యాంక్స్ చెప్పి నవ్వుతూ ఇంటికెళ్లారు. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
వారి భాష మీకు తెలుసా?
ఆత్మబంధువు ‘‘హలో రేఖా. ఎలా ఉన్నావ్?’’ ఫోన్లో పలకరించింది మనీషా. ‘‘హాయ్ మనీ... వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటే ఇవ్వాళ నా మీద దయ కలిగింది.’’ ‘‘అదేం లేదు. ఆ మధ్య మీ ఇంటికి వచ్చాం కదా. అప్పటినుంచి నీతో మాట్లాడాలనే అనుకుంటున్నా. కానీ నువ్వు ఏమనుకుంటావోననీ...’’ ‘‘ఏమిటే... ఏదైనా సమస్యా?’’ ‘‘హా... సమస్యే. కలిసి చెప్తాలే. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు.’’ ‘‘నీకోసం ఎప్పుడైనా ఫ్రీ నే. వచ్చేసెయ్’’ అంది రేఖ. సరే అని ఫోన్ పెట్టేసిన రెండు గంటల్లో రేఖ ఇంటిలో ప్రత్యక్షమైంది మనీషా. అంత త్వరగా వచ్చిందంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుందని అర్థమైంది రేఖకు. కాస్త కాఫీ తాగాక కబుర్లు మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడు చెప్పరా. ఏంటి నీ సమస్య?’’ అడిగింది. ‘‘శంకర్’’ తటపటాయిస్తూ చెప్పింది మనీషా. ‘‘శంకర్‌తో నీకు సమస్యేంటే?’’ ‘‘మనం కాలేజీలో ఉన్నప్పుడు వాడు నాకోసం ఎంత తిరిగాడో, ఎలా తపస్సు చేశాడో నీకు తెలుసుగా. అంతగా ప్రేమిస్తున్నాడనే ఇంట్లో వాళ్లను ఒప్పించి వాడ్ని పెళ్లి చేసుకున్నా.’’ ‘‘అవును. ఇప్పుడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా?’’ ‘‘అలాంటిదేం లేదు. కానీ ఓ మంచి చీర కట్టుకున్నా, మంచి వంట చేసినా... అసలేమీ మాట్లాడడు.‘ఐ లవ్యూ’ చెప్పిన సందర్భాలైతే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.’’ ‘‘మరి నువ్వు?’’ ‘‘నేను రోజుకోసారైనా చెప్తా.’’ ‘‘శంకర్ ఐలవ్యూ చెప్పడం లేదంటే... నువ్వంటే ఇష్టం లేదా?’’ ‘‘కాదు, ఇష్టమే. ఎక్కడ టూర్‌కు వెళ్లినా తీసుకెళ్తాడు. తీసుకెళ్లలేకపోతే నాకోసం గిఫ్ట్ తీసుకొస్తాడు. నా ఫొటోలు తీసి ఇల్లంతా అలంకరిస్తాడు. నేను మంచి చీర కట్టుకుంటే తినేసేలా చూస్తాడు.’’ ‘‘మరింకేం.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావ్‌గా’’ కన్నుగీటింది రేఖ. ‘‘అవుననుకో. కానీ ఓ మాటామంతీ ఉండదే.’’ అర్థమైనట్లుగా తలూపింది రేఖ. ‘‘నీ సమస్య శంకరా? లేక అతను మాట్లాడక పోవడమా?’’ అంది కూల్‌గా. ‘‘అంటే... వాడి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం, నేను చెప్పినా స్పందించక పోవడం నాకు నచ్చట్లేదు.’’ ‘‘కనీసం తన ప్రేమ అర్థమైందా?’’ ‘‘అర్థమైంది కానీ...’’ అంటూ ఆగిపోయింది మనీషా. ‘‘సమస్యేమిటో నీకు అర్థం కాలేదని నాకర్థమైందిలే.’’ ‘‘నువ్వు అర్థం చేసుకుని ఏదైనా సలహా చెప్తావనేగా నీ దగ్గరకు వచ్చింది.’’ ‘‘సరే సరే... ఇచ్ లీబే డిచ్.’’ ‘‘ఏంటీ?’’ అర్థం కాక అడిగింది మనీషా. ‘‘జే తైమే.’’ ‘‘ఏంటే... ఏమంటున్నావ్?’’ ‘‘తే అమో.’’ ‘‘ఏమైందే... ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావ్?’’ ‘‘ఐ లవ్యూ అని జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో చెప్పా. అర్థమైందా?’’ అంది రేఖ నవ్వుతూ. ‘‘ఊహూ’’ అంటూ తల అడ్డంగా ఊపింది మనీషా. ‘‘కదా... అలాగే శంకర్ మాట్లాడే భాష కూడా నీకు అర్థం కావడం లేదు.’’ ‘‘మేం మాట్లాడుకునేది తెలుగులోనే కదా. అర్థం కాకపోవడమేంటి?’’ అంది మనీషా అయోమయంగా. ‘‘చెప్తా చెప్తా. మనుషులు మౌలికంగా మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. దృష్టి ప్రధానం, శ్రవణ ప్రధానం, అనుభూతి ప్రధానం. మీరు మాట్లాడుకునేది తెలుగు లేదా ఇంగ్లిష్‌లోనే అయినా మీరెంచుకునే పదాలు ఆయా వ్యక్తిత్వాలపైన ఆధారపడి ఉంటాయి. శంకర్‌ది దృష్టి, అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని నీ మాటలను బట్టి అర్థమైంది. అంటే అతను అందమైన ప్రపంచాన్ని చూడ్డానికి ఇష్టపడతాడు. తన ప్రేమను అందమైన కానుకల రూపంలో లేదంటే స్పర్శ ద్వారా వ్యక్తీకరిస్తాడు. నీది శ్రవణ ప్రధానమైన వ్యక్తిత్వం. నీకు ఏదైనా మాటల్లో చెప్పాలి. చేతల్లో చూపిస్తే అర్థం కాదు. అంటే ఓ లక్ష రూపాయల నెక్లెస్ కొనిచ్చినదానికన్నా.. ‘ఐ లవ్యూ’ అని చెప్తే ఎక్కువ ఆనందిస్తావ్. అలా చెప్పడం శంకర్‌కి రాదు. అంటే మీ ఇద్దరి భావ వ్యక్తీకరణ తీరు వేర్వేరు. అందుకే అతని ప్రేమ నీకు అర్థం కావట్లేదు.’’ ‘‘ఆ నిజమే. వాడు నాకు ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేస్తే వాడి కళ్లు మెరిసి పోతాయి. వెంటనే హగ్ చేసుకుంటాడు.’’ ‘‘అదీ అతని భావ వ్యక్తీకరణ తీరు. అదీ అతను ఐ లవ్యూ చెప్పే విధానం. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అతని ప్రేమ నీకు అర్థమవుతుంది.’’ ‘‘ఆ, అర్థమైంది వాడికి నేనంటే ఎంత ప్రేమో. థాంక్స్ రేఖా..’’ అంటూ ఆనందంగా వెళ్లిపోయింది మనీషా. - డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
నచ్చని సినిమా చూడొద్దు!
ఆత్మబంధువు ‘‘ఏంటక్కా అలా ఉన్నావ్?’’ అడిగింది రేఖ ఇంట్లోకి అడుగు పెడుతూనే. ‘‘ఏం లేదురా..’’ అంది భవాని. రేఖ నమ్మలేదు. ‘‘ఏమీ లేకుంటే ఎందుకంత డల్‌గా కనిపిస్తున్నావేం?’’ అంటూ మళ్లీ ప్రశ్నించింది. ‘‘ఏదో గుర్తొచ్చిందిలే’’ అంది భవాని. ‘‘నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో చెప్పక్కా’’ అంటూ ఒత్తిడి చేసింది రేఖ. భవాని చెప్పడం మొదలు పెట్టింది. ‘‘నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక సంఘటన జరిగిందిరా. అది ఎప్పుడు గుర్తొచ్చినా బాధగా ఉంటుంది. నేను మా ఊర్నుంచి కాలేజీకి బస్సులో వెళ్లి వచ్చేదాన్ని. అప్పుడొకడు రోజూ నా వెంట పడేవాడు. వద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. విసుగొచ్చి ఓ రోజు మన ఇంట్లో చెప్పేశా. వాడు అది మనసులో పెట్టుకుని నాపై దాడి చేశాడు. ఎలాగో తప్పించుకున్నాను కానీ, ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా మనసు కలుక్కుమంటుంది.’’ నిట్టూర్చింది రేఖ. ‘‘కొందరు అంతే అక్కా. అవునూ... నాకెప్పుడూ ఈ విషయం చెప్పలేదేం?’’ ‘‘చెప్పుకోవడానికి అదేం గొప్ప విషయమో, మంచి విషయమో కాదుగా రేఖా!’’ ‘‘అవుననుకో. కానీ అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?’’ అంది రేఖ అక్క ముఖంలో దిగులును గమనిస్తూ. ‘‘ఇప్పుడనే కాదురా. పేపర్లో, టీవీలో అలాంటి వార్త చూసినా, చదివినా గుర్తొస్తుంది. ఇక ఆ రోజంతా నా మనసు మనసులో ఉండదు. అప్పుడు బాగా బాధ పడ్డానేమో, ఎంత కాలమైనా మర్చిపోలేక పోతున్నాను.’’ ‘‘అవునా. సరేలే. ఓ విషయం చెప్పు. నీకు నచ్చిన సినిమా ఏంటి?’’ తాను తన బాధ గురించి మాట్లాడు తుంటే, రేఖ సినిమా గురించి అడుగుతుందేమిటా అని అయోమయంగా చూసింది భవాని. భవానీ డౌట్ రేఖకు అర్థమైంది. ‘‘ముందు జవాబివ్వు, ఎందుకో తర్వాత చెప్తాను’’ అంది. ‘‘ఏం మాయ చేసావె.’’ ‘‘ఎన్నిసార్లు చూశావేం?’’ అడిగింది. ‘‘ఓ పాతిక ముప్ఫైసార్లు’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘మరి నీకు నచ్చని సినిమా ఏంటి?’’ ‘‘బోలెడున్నాయి.’’ ‘‘నీకు నచ్చని ఆ బోలెడు సినిమాల్లో ఒక సినిమాని పదిసార్లు చూడమంటే ఏం చేస్తావ్?’’ ‘‘లక్ష రూపాయలిచ్చినా చూడను.’’ ‘‘ఎందుకలా?’’ ‘‘చెత్త సినిమా కాబట్టి. నాకు నచ్చలేదు కాబట్టి.’’ ‘‘మరయితే నీకు నచ్చని నీ డిగ్రీ సినిమాను పదేపదే ఎందుకు చూస్తున్నావ్ అక్కా?’’ అర్థం కానట్టుగా చూసింది భవాని. ‘‘డిగ్రీ సినిమా చూడటమేంటి? నాకేం అర్థం కాలేదు.’’ ‘‘ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్తా. డిగ్రీలో జరిగిన విషయం నీకెలా గుర్తొస్తోంది?’’ ‘‘నేను కావాలని గుర్తుచేసుకోన్రా. అలాంటి వార్తలు చదివినప్పుడు లేదా చూసినప్పుడు గుర్తొస్తుంది.’’ ‘‘గుర్తొచ్చింది సరే. కానీ ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడటం ఎందుకు?’’ ‘‘అది నాకు తెలీదురా. బాధ కలుగుతుందంతే.’’ ‘‘కదా... దీన్నే అసోసియేషన్ అంటారక్కా. అంటే ఆ విషయం జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో, అది గుర్తొచ్చినప్పుడు కూడా దాదాపు అంతే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకానికి ఆ బాధ అలా లింక్ అయి ఉంటుందన్నమాట.’’ ‘‘అలాగా... దాన్ని తప్పించుకునే మార్గం లేదా?’’ ‘‘ఎందుకు లేదూ! ఎంచక్కా ఉంది. దాన్ని డిసోసియేట్ చేస్తే సరి.’’ ‘‘అంటే?’’ మళ్లీ అయోమయంగా ముఖం పెట్టింది భవాని. ‘‘అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకోక పోవడం. దాన్ని నీ మనసు నుంచి దూరం చేయడం.’’ ‘‘అదెలా?’’ ‘‘ఎలా అంటే... ఆ సంఘటనను నీ మనసులో గుర్తు చేసుకుంటున్నప్పుడు అందులో నువ్వూ కనిపిస్తావ్ కదా?’’ ‘‘నేను లేకపోతే ఆ సంఘటనే లేదుగా’’ అంది భవాని. ‘‘అవును. అందుకే ఇప్పుడో పని చెయ్. నువ్వు హాల్లో సోఫాలో కూర్చొని, టీవీలో సినిమా ఎలా చూస్తావో, నీ మనసునే టీవీ అనుకుని ఆ సంఘటనను టీవీలో చూస్తున్నట్లు మనసులో చూడు. అది చూడటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి టీవీని చిన్నది చేసుకో. నీకూ టీవీకి మధ్య దూరం పెంచుకో. టీవీని బ్లాక్ అండ్ వైట్‌గా మార్చుకో. మ్యూట్‌లో పెట్టుకో. డల్ చేసుకో. బ్లర్ చేసుకో. డూ వాటెవర్ యూ వాంట్. తర్వాతెలా ఉందో చెప్పు.’’ ‘‘ఊ... టీవీని చిన్నది చేశా, దూరం పెంచా. బ్లాక్ అండ్ వైట్‌గా మార్చేశా. మ్యూట్‌లో పెట్టేశా. నౌ ఫీలింగ్ గుడ్.’’ ‘‘కదా. దీన్నే డిసోసియేట్ అంటారు. అంటే మనసుకు బాధ కలిగించే సంఘటనల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవడం అన్నమాట. అప్పుడా ఇన్సిడెంట్ గుర్తొచ్చినా బాధ ఉండదు.’’ భవాని ముఖం వెలిగింది.‘‘ఇన్నేళ్ల బాధను దూరం చేశావ్. థాంక్స్ రా’’ అంది తృప్తిగా. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్