ప్రేమా? స్నేహమా? | Love? Friendship? | Sakshi
Sakshi News home page

ప్రేమా? స్నేహమా?

Published Sun, Feb 28 2016 7:09 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

ప్రేమా? స్నేహమా? - Sakshi

ప్రేమా? స్నేహమా?

 ‘‘మీకు సునీత అనే అమ్మాయి తెలుసా?’’.. కిరణ్ ఆఫీసునుంచి రాగానే అడిగింది ఉష. ‘‘హా.. తెలుసు. ఏం?’’ సమాధానం చెప్తూ అడిగాడు కిరణ్.
 ‘‘ఎవరావిడ?’’
 ‘‘ఫ్రెండ్.’’
 ‘‘ఫ్రెండా? గాళ్ ఫ్రెండా?’’
 ‘‘మ్‌మ్‌మ్... ఫ్రెండ్, హూ ఈజ్ ఎ గాళ్. అడగాలనుకున్నదేదో సూటిగా అడుగు. డొంక తిరుగుడొద్దు.’’
 ‘‘సూటిగానే అడుగుతున్నా.. ఆవిడ మీకెంత క్లోజ్?
 ‘‘అన్ని విషయాలూ మాట్లాడుకునేంత క్లోజ్. చాలా?’’
 ‘‘మాటలేనా... లేక?’’
 ‘‘వాట్ డూ యూ మీన్?’’

 ‘‘అంటే.. మాటలతోనే ఆగారా... లేక ఇంకా ముందుకు పోయారా? అని.’’
 ‘‘సీ ఉషా! నాకు కుమార్ ఎలాగో సునీత కూడా అంతే. కుమార్‌తో డిస్కస్ చేసినట్లే తనతోనూ డిస్కస్ చేస్తుంటా.’’
 ‘‘కుమార్ అన్న విషయం వేరు. ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?’’
 ‘‘ఒకచోట పనిచేస్తున్నప్పుడు మాట్లాడుకోక తప్పదు.’’
 ‘‘అంటే.. మీరు మీ ఆఫీసులో ఆడాళ్లందరితో అలాగే క్లోజుగా మాట్లాడతారా?’’
 ‘‘అందరితో కాదు.. సునీతతో మాత్రమే.’’
 ‘‘ఆవిడతోనే ఎందుకు అంత క్లోజుగా మాట్లాడటం?’’

 ‘‘నాకు యండమూరి నవలలంటే ఇష్టం, ఇళయరాజా సంగీతమంటే పిచ్చి. తనకు కూడా అంతే. అలా కామన్ ఇంట్రస్ట్‌ల గురించి మాట్లాడుకుంటాం.’’
 ‘‘ఓహో.. అన్ని అభిరుచులూ అంతగా కలిశాయన్నమాట.’’
 ‘‘అలాగనేం లేదు. నాకు రామ్‌గోపాల్ వర్మ సినిమాలంటే పిచ్చి, ఆవిడకు ఆర్జీవీ పేరెత్తితేనే మంట. సో, వాటి గురించి మాట్లాడుకోం. నువ్వు ఏదేదో ఊహించుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. షి ఈజ్ మై ఫ్రెండ్... అంతే!’’
 ‘‘ఆహా.. ఫ్రెండ్‌ని కన్నా, బుజ్జీ అని కూడా పిలుస్తారా?’’
 ‘‘ఓహ్.. అదా నీ ప్రాబ్లమ్. తన ముద్దుపేరు బుజ్జి, అందుకే అప్పుడప్పుడూ అలా పిలుస్తాను. అంతే!’’
     అలాఅలా ఆ సంభాషణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఉష, కిరణ్ ఇద్దరూ హద్దులు దాటి మాటలు అనేసుకున్నారు. దాంతో ఉష కోపంగా ఇల్లు విడిచి వెళ్లిపోయింది. కిరణ్ ఆపే ప్రయత్నం చేయలేదు.
   
 ‘‘ఏమైందిరా?’’ చెల్లిల్ని అనునయంగా అడిగింది రేఖ.
 ‘‘కిరణ్ సునీత అనే ఆవిడతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తున్నాడు.’’
 ‘‘నువ్వు చూశావా?’’
 ‘‘హా.. మొన్న తను మొబైల్ మర్చిపోయి ఆఫీసుకు వెళ్లినప్పుడు చెక్ చేశా. ఇద్దరూ గంటలకు గంటలు చాట్ చేసుకుంటున్నారు.’’
 ‘‘అవునా... దేని గురించి మాట్లాడుకుంటున్నారు?’’
 ‘‘ఏవో.. ఆఫీసు విషయాలు. మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్ గురించి.’’
 ‘‘ఇంకా?’’
 ‘‘సినిమాలు, మ్యూజిక్, లిటరేచర్ గురించి.’’
 ‘‘ఇంకా?’’
 ‘‘ఫ్యామిలీస్ గురించి.’’
 ‘‘అంతేగా... అంత మాత్రానికే బాధపడతావేం?’’
 ‘‘నువ్వు అలాగే అంటావ్. బావగారు వేరే ఎవరితోనైనా మాట్లాడితే తెలుస్తుంది ఆ బాధేంటో. ఆవిడతో కిరణ్‌కు రిలేషన్ షిప్ ఉందేమోనని డౌట్‌గా ఉందక్కా. ఆవిడను బుజ్జీ, గజ్జీ అని పిలుస్తున్నాడు.’’
 ‘‘వాళ్ల చాటింగ్‌లో రొమాంటిక్ విషయాలున్నాయా?’’
 ‘‘వూహూ... అలాంటివేం లేవు.’’
 ఉష సమస్యేమిటో రేఖకు అర్థమైంది.

 ‘‘సరేరా.. నీ ఫీలింగ్ నాకు అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని మనం సైంటిఫిక్‌గా విశ్లేషించుకుంటే మంచిది. రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ అనే సైకాలజిస్ట్ ప్రేమ గురించి ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని గురించి మాట్లాడుకుందాం.’’
 ‘‘సరే.. చెప్పు’’ అయిష్టంగానే అంది ఉష. ‘‘స్టెర్న్‌బర్గ్ సిద్ధాంతం ప్రకారం ప్రేమలో అభిరుచి (ప్యాషన్), సాన్నిహిత్యం (ఇంటిమసీ), నిబద్ధత (కమిట్‌మెంట్) ఈ మూడూ ఉంటేనే అది పరిపూర్ణమైన ప్రేమ. ఇద్దరు వ్యక్తుల మధ్య కేవలం సాన్నిహిత్యం మాత్రమే ఉంటే అది నిజమైన స్నేహం. నిబద్ధత మాత్రమే ఉంటే శూన్యమైన ప్రేమ, కేవలం ప్యాషన్ మాత్రమే ఉంటే అది ఆకర్షణ. ప్యాషన్, ఇంటిమసీ రెండూ ఉంటే అది రొమాంటిక్ లవ్. సాన్నిహిత్యంతో పాటు నిబద్ధత ఉంటే అది సహచర ప్రేమ. ప్యాషన్, కమిట్‌మెంట్ మాత్రమే ఉంటే అది ఫాచువస్ లవ్. ఇలా ప్రేమలో ఆరు రకాలుంటాయి. ఇప్పుడు చెప్పు... సునీతకూ, కిరణ్‌కు మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఏంటో?’’
 ‘‘వాళ్లిద్దరి అభిరుచులు కలిశాయనే చెప్పాడు కిరణ్.’’
 ‘‘కదా.. మరి నువ్వెందుకు వేరేలా అనుకున్నావ్?’’
 ‘‘అంటే అక్కా... ఆవిడ్ని బుజ్జీ అని పిలిచేసరికి...’’

 ‘‘అది ఆవిడ పెట్‌నేమ్ కూడా అయ్యుండొచ్చుగా?!’’
 ‘‘అవును... ఆవిడ్ని ఇంట్లో అలానే పిలుస్తారని చెప్పాడు కిరణ్.’’
 ‘‘కదా? అందుకే అతనూ అలా పిలిచి ఉంటాడు. అయినా ఓసారి అతనితో మాట్లాడుతాలే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు.’’ అని చెప్పింది రేఖ.
 ‘‘సరే అక్కా’’ అంటూ నవ్వింది అనుమానాలు వీడిన ఉష.
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement