వారి భాష మీకు తెలుసా? | Did you know their Language? | Sakshi
Sakshi News home page

వారి భాష మీకు తెలుసా?

Published Sun, Oct 25 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

వారి భాష మీకు తెలుసా?

వారి భాష మీకు తెలుసా?

ఆత్మబంధువు
‘‘హలో రేఖా. ఎలా ఉన్నావ్?’’ ఫోన్‌లో పలకరించింది మనీషా.
 ‘‘హాయ్ మనీ... వాట్ ఎ సర్‌ప్రైజ్! ఏంటే ఇవ్వాళ నా మీద దయ కలిగింది.’’
 ‘‘అదేం లేదు. ఆ మధ్య మీ ఇంటికి వచ్చాం కదా. అప్పటినుంచి నీతో మాట్లాడాలనే అనుకుంటున్నా. కానీ నువ్వు ఏమనుకుంటావోననీ...’’
 ‘‘ఏమిటే... ఏదైనా సమస్యా?’’
 ‘‘హా... సమస్యే. కలిసి చెప్తాలే. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు.’’


 ‘‘నీకోసం ఎప్పుడైనా ఫ్రీ నే. వచ్చేసెయ్’’ అంది రేఖ. సరే అని ఫోన్ పెట్టేసిన రెండు గంటల్లో రేఖ ఇంటిలో ప్రత్యక్షమైంది మనీషా. అంత త్వరగా వచ్చిందంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుందని అర్థమైంది రేఖకు. కాస్త కాఫీ తాగాక కబుర్లు మొదలుపెట్టింది.   
 ‘‘ఇప్పుడు చెప్పరా. ఏంటి నీ సమస్య?’’ అడిగింది.
 ‘‘శంకర్’’ తటపటాయిస్తూ చెప్పింది మనీషా.
 ‘‘శంకర్‌తో నీకు సమస్యేంటే?’’

 ‘‘మనం కాలేజీలో ఉన్నప్పుడు వాడు నాకోసం ఎంత తిరిగాడో, ఎలా తపస్సు చేశాడో నీకు తెలుసుగా. అంతగా ప్రేమిస్తున్నాడనే ఇంట్లో వాళ్లను ఒప్పించి వాడ్ని పెళ్లి చేసుకున్నా.’’
 ‘‘అవును. ఇప్పుడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా?’’
 ‘‘అలాంటిదేం లేదు. కానీ ఓ మంచి చీర కట్టుకున్నా, మంచి వంట చేసినా... అసలేమీ మాట్లాడడు.‘ఐ లవ్యూ’ చెప్పిన సందర్భాలైతే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.’’
 ‘‘మరి నువ్వు?’’

 ‘‘నేను రోజుకోసారైనా చెప్తా.’’
 ‘‘శంకర్ ఐలవ్యూ చెప్పడం లేదంటే... నువ్వంటే ఇష్టం లేదా?’’
 ‘‘కాదు, ఇష్టమే. ఎక్కడ టూర్‌కు వెళ్లినా తీసుకెళ్తాడు. తీసుకెళ్లలేకపోతే నాకోసం గిఫ్ట్ తీసుకొస్తాడు. నా ఫొటోలు తీసి ఇల్లంతా అలంకరిస్తాడు. నేను మంచి చీర కట్టుకుంటే తినేసేలా చూస్తాడు.’’
 ‘‘మరింకేం.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావ్‌గా’’ కన్నుగీటింది రేఖ.
 ‘‘అవుననుకో. కానీ ఓ మాటామంతీ ఉండదే.’’

 అర్థమైనట్లుగా తలూపింది రేఖ. ‘‘నీ సమస్య శంకరా? లేక అతను మాట్లాడక పోవడమా?’’ అంది కూల్‌గా.
 ‘‘అంటే... వాడి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం, నేను చెప్పినా స్పందించక పోవడం నాకు నచ్చట్లేదు.’’
 ‘‘కనీసం తన ప్రేమ అర్థమైందా?’’
 ‘‘అర్థమైంది కానీ...’’ అంటూ ఆగిపోయింది మనీషా.
 ‘‘సమస్యేమిటో నీకు అర్థం కాలేదని నాకర్థమైందిలే.’’

 ‘‘నువ్వు అర్థం చేసుకుని ఏదైనా సలహా చెప్తావనేగా నీ దగ్గరకు వచ్చింది.’’
 ‘‘సరే సరే... ఇచ్ లీబే డిచ్.’’
 ‘‘ఏంటీ?’’ అర్థం కాక అడిగింది మనీషా.
 ‘‘జే తైమే.’’
 ‘‘ఏంటే... ఏమంటున్నావ్?’’
 ‘‘తే అమో.’’
 ‘‘ఏమైందే... ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావ్?’’

 ‘‘ఐ లవ్యూ అని జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో చెప్పా. అర్థమైందా?’’ అంది రేఖ నవ్వుతూ.
 ‘‘ఊహూ’’ అంటూ తల అడ్డంగా ఊపింది మనీషా.
 ‘‘కదా... అలాగే శంకర్ మాట్లాడే భాష కూడా నీకు అర్థం కావడం లేదు.’’

 ‘‘మేం మాట్లాడుకునేది తెలుగులోనే కదా. అర్థం కాకపోవడమేంటి?’’ అంది మనీషా అయోమయంగా.
 ‘‘చెప్తా చెప్తా. మనుషులు మౌలికంగా మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. దృష్టి ప్రధానం, శ్రవణ ప్రధానం, అనుభూతి ప్రధానం. మీరు మాట్లాడుకునేది తెలుగు లేదా ఇంగ్లిష్‌లోనే అయినా మీరెంచుకునే పదాలు ఆయా వ్యక్తిత్వాలపైన ఆధారపడి ఉంటాయి. శంకర్‌ది దృష్టి, అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని నీ మాటలను బట్టి అర్థమైంది.

అంటే అతను అందమైన ప్రపంచాన్ని చూడ్డానికి ఇష్టపడతాడు. తన ప్రేమను అందమైన కానుకల రూపంలో లేదంటే స్పర్శ ద్వారా వ్యక్తీకరిస్తాడు.  నీది శ్రవణ ప్రధానమైన వ్యక్తిత్వం. నీకు ఏదైనా మాటల్లో చెప్పాలి. చేతల్లో చూపిస్తే అర్థం కాదు. అంటే ఓ లక్ష రూపాయల నెక్లెస్ కొనిచ్చినదానికన్నా.. ‘ఐ లవ్యూ’ అని చెప్తే ఎక్కువ ఆనందిస్తావ్. అలా చెప్పడం శంకర్‌కి రాదు. అంటే మీ ఇద్దరి భావ వ్యక్తీకరణ తీరు వేర్వేరు. అందుకే అతని ప్రేమ నీకు అర్థం కావట్లేదు.’’

‘‘ఆ నిజమే. వాడు నాకు ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేస్తే వాడి కళ్లు మెరిసి పోతాయి. వెంటనే హగ్ చేసుకుంటాడు.’’
 ‘‘అదీ అతని భావ వ్యక్తీకరణ తీరు. అదీ అతను ఐ లవ్యూ చెప్పే విధానం. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అతని ప్రేమ నీకు అర్థమవుతుంది.’’
 ‘‘ఆ, అర్థమైంది వాడికి నేనంటే ఎంత ప్రేమో. థాంక్స్ రేఖా..’’ అంటూ ఆనందంగా వెళ్లిపోయింది మనీషా.
 - డాక్టర్ విశేష్
కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement