Atmabandhuvu
-
మనిషికో స్నేహం... మనసుకో దాహం ఆత్మబంధువు
తల్లిదండ్రులు ఉంటారు. వేరు. తోబుట్టువులు ఉంటారు. వేరు. జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. వేరు. పెళ్లవుతుంది. భార్య వస్తుంది. పిల్లలు పుడతారు. వేరు. వీరంతా బంధువులు.. బంధాలు కలిగినవారు. వీళ్లలో ఎవరో ఒకరే ఆత్మబంధువులు. సోల్‌మేట్. అదృష్టం బాగున్నవారికి కుటుంబంలోనో స్నేహితులలోనో ఆత్మబంధువు దొరుకుతారు. ఇంకా అదృష్టం బాగుంటే భార్యే ఆత్మబంధువు అవుతుంది. కాని ఆ అదృష్టం లేకపోతే? అసలు ఆత్మబంధువు అంటే ఎవరు? హోరున వాన కురిస్తే తల మీద చేతులు కప్పుకుని నీడన పరిగెడితే అదాటున వచ్చి మన పక్కన ఒక మనిషి నిలబడతాడు. మనం ఊసుపోక విసుగు పుట్టే ఈ బతుకులోని బేజారు పడక ఉల్లాసం కోసం ఒక పల్లవి అందుకుంటే అప్పటి దాకా అలికిడి లేని ఆ ప్రాంతంలో మరొక మనిషి ఊడిపడి చరణం అందుకుంటాడు. మనం పిల్లనగ్రోవి ఊదితే ఒక మనిషి గోవులా కదలి దరికి చేరుతాడు. మనం ఒడ్డున చేపలు పడితే ఒక మనిషి బుట్ట అందుకుని ఆ సంగతి ముందే తెలుసు అన్నట్టు నిలుచుని ఉంటాడు. మనకు నిద్ర వస్తుంటే అతడు రెప్ప మూస్తాడు. మనకు దుఃఖం ఊరితే అతడు బావురుమంటాడు. మనకు అనిపించేది అనిపించడానికి ముందే అతడికి తెలుస్తుంది. మనం చెప్పాలనుకున్నది గొంతు విప్పకముందే అతడికి వినిపిస్తుంది. ఎదురూ బొదురు మౌనంగా ఎంత సేపు కూర్చున్నా మనసులు అనంత సంభాషణలు చేస్తాయి. అనంత సంభాషణల్లో కూడా ఇరువురిలో ఒక ప్రశాంతమైన మౌనం ఉంటుంది. అలాంటి మనిషే ఆత్మబంధువు. ఇది మగకు మగ అయితే సమస్య లేదు. ఆడకు ఆడ అయితే సమస్య లేదు. ఆడకు మగ, మగకు ఆడ అయితేనే సమస్య. ఈ కథంతా ఆ సమస్య. ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఒక భావుకుడు. చిన్న పిచ్చిక వడ్ల చేను మీద వాలితే అతడి మనసు పులకరిస్తుంది. చేలో కలుపు తీస్తున్న వనిత గట్టున చెట్టుకు వేళ్లాడగట్టిన ఊయాలలోని పాపాయి కోసం పాట పాడితే అతడి గొంతు పురి విప్పుతుంది. ఆ నింగి అతడికి ఊరట. ఆ ప్రకృతి అతడికి తెప్పరింత. కాని ఇంట్లో భార్య అలా ఉండదు. మురికిగా, గార పళ్లతో, ఎప్పుడూ ఇంత పెద్ద గొంతు వేసుకుని కయ్కయ్మంటూ... ఆకారం ముఖ్యం కాదు... కాని ప్రవర్తనలో కొంచెం కూడా సౌందర్యం లేదే... సంస్కారం లేదే... శుభ్రంగా చేతులు కడుక్కుని బుగ్గలకు ఆనించుకుని చూసే చిన్నపాటి ముచ్చట కూడా లేదే. ఒక చేత్తో ముక్కు చీదుతూ మరో చేత్తో కంచం పెట్టే ఆ మనిషితో అతడికి ఎప్పుడూ ఏ బంధం లేదు. అతడు ఆ ఇంట్లో ఒక బంధువు వలే ఉన్నాడు. బంధంతో లేడు. కాని పక్కూరి నుంచి పొట్ట చేత్తో పట్టుకుని వలస వచ్చి, ఏటి వొడ్డున గుడిసె వేసుకుని చేపలు పట్టి అమ్ముకుని బతుకుతున్న రాధతో పరిచయం అయిననాటి నుంచి అతడిని ఏదో లాగుతూ ఉంటుంది. మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతూ బూడిదతో తోమిన వంటపాత్రలా ఏ మరకా లేకుండా ఉండే ఆ అమ్మాయి సమక్షం అతడికి హాయిగా ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయితో కలిసి చేపలు పడతాడు. రెండుసార్లు ఒక్క చేప కూడా పడదు. మూడోసారి దోసెడు చేపలు తుండుగుడ్డలో ఎగిరెగిరి పడతాయి. అది చూసి సంతోషంతో పసిపిల్లాడిలా పెద్దపెద్దగా నవ్వుతాడు. నవ్వి నవ్వి ‘ఈ రోజు నేను చాలా నవ్వాను కదూ’ అని తనకు తానే వేదనగా మననం చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంత చింత వేసి నాలుగు పచ్చి మిరపకాయలు వేసి చేపల పులుసు చేస్తే మొదట బెట్టుగా ఆ తర్వాత ఆబగా తిని ‘ఇరవై ఏళ్లయ్యింది ఈ పాటి భోజనం చేసి’ అని కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. గాయాలతో నిండిపోయిన అతడి మనసుకు ఆ అమ్మాయి స్నేహం నెమలీకతో రాసిన వెన్న అవుతుంది. కాని ఊరు ఊరుకోదు. నింద వేస్తుంది. అతడికి పౌరుషం వచ్చి ‘అవును. దానిని ఉంచుకున్నాను’ అంటాడు. ఆ మాట రాధ విని ‘అది నిజం కాదా... నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా’ అని అడుగుతుంది. మనసులో ఉన్నది చెప్పడం, అసలు మనసులో ఏదైనా ఆశించడం కూడా మానుకున్న నిస్సహాయ ఉన్నతుడు అతడు. ఏం చెప్తాడు? అలాగని ఆమెతో కులికే వయసా అతనిది? అలాగని ఆమెను కాదనుకునే మనసా అతనిది? ఆమె ఉండాలి. తనకు కనపడుతూ ఉండాలి. తన మీద నాలుగు నవ్వు మాటలు చెప్పి హాయిగా నవ్విస్తూ ఉండాలి. తనున్నానన్న ఒక ఆలంబనను అందిస్తూ ఉండాలి.కాని భార్య, బంధువులు కలిసి ఆ బంధాన్ని తెగ్గొడ్తారు. రాధ కావాలని నేరం చేసి జైలుకు వెళ్లిపోతుంది. అతడి హృదయం ఖాళీ. అతడి గొంతు ఖాళీ. మాటా ఖాళీ. మనిషి శూన్యం. అతడు ఊరిని త్యజిస్తాడు. ఇంటిని త్యజిస్తాడు. ఏ ఏటి ఒడ్డు ఇంట్లో అయితే రాధ ఉండేదో ఆ ఇంట్లో ఆమె కోసం ఎదురు చూస్తూ ఒక్కడే ఉండిపోతాడు. కొనఊపిరితో ఉండగా రాధ జైలు నుంచి విడుదలై వస్తుంది. అంత వరకూ అంగిట్లో ప్రాణం నిలుపుకుని ఉన్న అతడు ఆమెను చూసి మెల్లగా నవ్వుతాడు. చేతిలో చేయి వేస్తాడు. ఏనాడో ఆమె జ్ఞాపకంగా దాచుకున్న పూసల దండ చేతిలో పెట్టి ప్రాణం వదిలేస్తాడు. ఆమెకు మాత్రం తన ఒంట్లోని ఈ ప్రాణం ఎందుకు? ఆమె కూడా మరణిస్తుంది. మనిషి ఏ పాపం అయినా చేయవచ్చు. కాని ఇద్దరు ఆత్మబంధువులను విడదీసే పాపం మాత్రం చేయకూడదు. మనిషికో స్నేహం. మనసుకో దాహం. జీవితంలో ఒక్కసారైనా ఆ దాహం తీర్చే స్నేహాన్ని పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం. ముదల్ మరియాదై 1985లో వచ్చిన ‘ముదల్ మరియాదై’ ఇక శివాజీ గణేశన్ పని అయిపోయినట్టే అనుకున్నవారికి ఊహించని ఎదురుదెబ్బ కొట్టి పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు భారతీరాజా తన ఆయువుపట్టయిన పల్లెటూరి నేపథ్యాన్ని అథెంటిక్‌గా తీస్తూ పల్లెల్లో ఎన్నటికీ నెరవేరని స్త్రీ, పురుష మూగ బంధాలను ఎంతో కళాత్మకంగా చూపించడం వల్లే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. సినిమా అంతా కర్నాటకలోని ఒక పల్లెటూళ్లో తీశారు. ఇళయరాజా నేపధ్య సంగీతం, ‘పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ల నేనే’ వంటి పాటలు ఇవ్వడం మధురం. జగ్గయ్య గారు శివాజీ గణేశన్‌కు అద్భుతంగా పల్లెటూరి యాసలో డబ్బింగ్ చెప్పడం మురిపెం కలిగిస్తుంది. ముఖ కవళికలతో లోతైన భావాలను ఎలా పలికించాలో ఈ సినిమాలో శివాజీని వెయ్యిసార్లు చూసి ఏ కొత్త నటుడైనా ఆవగింజంత సాధించవచ్చు. కాని ఆయన ఎదుట రాధ కూడా నటనలో చిరుతలా తల పడిందని చెప్పవచ్చు. చాలా రోజుల వరకూ యూ ట్యూబ్‌లో దొరకని ఈ సినిమా ఇప్పుడు దొరుకుతోంది. – కె -
ఆనందాల ప్లే స్టేషన్!
ఆత్మబంధువు ‘‘మమ్మీ... నాకు ప్లేస్టేషన్ కావాలి’’ ’’ స్కూల్నుంచి వస్తూనే అన్నాడు మిత్ర. ‘‘కొందాంలే.’’ ‘‘కొందాంలే కాదు, వెంటనే కావాలి’’ డిమాండింగ్‌గా అడిగాడు. స్కూల్లో ఏదో జరిగిందని రేఖకు అర్థమైంది. అప్పటికి సరేనని కాసేపయ్యాక మెల్లగా మాటల్లోకి దించింది... విషయం రాబట్టడానికి. ‘‘ఇవ్వాళ స్కూల్ ఎలా ఉంది కన్నా?’’ ‘‘బాగానే ఉంది.’’ ‘‘నీ ఫ్రెండ్స్?’’ ‘‘వాళ్లూ బాగానే ఉన్నారు.’’ ‘‘మరి నువ్వు?’’ మిత్ర మౌనంగా ఉండిపోయాడు. ‘‘ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది నాన్నా. నువ్వు చెప్తేనే కదా నేనేమైనా చేయగలిగేది’’ అంది రేఖ. ‘‘ఆర్యన్గాడు నన్ను ‘పూర్ ఫెలో’ అని తిట్టాడు మమ్మీ’’ అంటూ ఏడ్చేశాడు మిత్ర. ‘‘సరదాగా అనుంటాడులే. దానికే ఏడిస్తే ఎలా?’’ అంటూ ఊరడించింది. ‘‘సరదాకు కాదు, నిజంగానే. ‘మీ ఇంట్లో స్మార్ట్ టీవీ లేదు, నీ మొహానికి ప్లే స్టేషన్ లేదంటూ ఎగతాళి చేశాడు.’’ ‘‘ఔనా... సర్లే బాధపడకు, కొని పెడతాలే’’ అని కొడుకుని ఓదార్చి ఆలోచనలో పడింది రేఖ. పిల్లలకు చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు బాధపడింది. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘‘కన్నా, బుజ్జీ... నెక్స్ట్ సెకండ్ సాటర్డే, సండే మనం అమ్మమ్మ వాళ్లు ఊరు వెళ్తున్నాం’’ అని పిల్లలు స్కూల్ నుంచి రాగానే చెప్పింది రేఖ. వాళ్లు ఎగిరి గంతేశారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. ఆనంద్‌కు ఆఫీసు పని వల్ల రాలేనన్నాడు. దాంతో పిల్లలను తీసుకుని రేఖ వెళ్లింది. ఆ రెండు రోజులూ మిత్ర, మైత్రి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి, పొలాలు, తోటలన్నీ తిరిగారు. కబుర్లు చెప్పారు. బంధువుల పిల్లలతో ఆడుకున్నారు. సంతోషంగా ఇంటికి బయలుదేరారు. ‘‘నాన్నా.. బాగా ఎంజాయ్ చేశావా?’’ కారులో అడిగింది రేఖ. ‘‘ఓ... యా.. ఫుల్లుగా మమ్మీ’’ చెప్పాడు మిత్ర. ‘‘సరే.. అక్కడ చాలామందితో ఆడు కున్నావు. వాళ్లలో పేదవాళ్లూ ఉన్నారు కదా. వాళ్లనుంచి ఏం తెలుసుకున్నావ్?’’ ‘‘మమ్మీ... మనకు ఒక కుక్కే ఉంది. కానీ వాళ్లకు ఒక్కో ఇంటికి రెండు, కొందరికి నాలుగు కుక్కలు కూడా ఉన్నాయి. మనం ఈత కొట్టాలంటే స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాలి, కానీ వాళ్లకి పేద్ద చెరువుంది. మనం బెడ్‌లైట్ వేసుకుని పడుకుంటాం, వాళ్లు ఆకాశంలో చంద్రుడ్ని, చుక్కల్ని చూస్తూ పడు కుంటారు. మనం కుండీల్లో నాలుగు మొక్కలు పెంచుకుని ఆనందిస్తాం, వాళ్లు కావాల్సినన్ని మొక్కలు పెంచుకుంటారు. మన పని వాళ్లు సరిగా చేస్తే మనం ఆనందిస్తాం, వాళ్లు పని చేయడాన్ని ఆనందిస్తారు. మనం బియ్యం, కూరగాయలు కొను క్కుంటాం... వాళ్లు పండించి అందరికీ అందిస్తారు. మనల్ని కాపాడుకోవడానికి ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టుకున్నాం... వాళ్లకు ఏదైనా కష్టమొస్తే కాపాడటానికి కావాల్సినంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని చెప్పింది మైత్రి. ‘‘వాళ్లకు స్మార్ట్ టీవీలు, ఐపాడ్లు లేవు... అయినా చాలా హ్యాపీగా ఉన్నారు’’ అని చెప్పాడు మిత్ర. ‘‘గుడ్, గుడ్... గుడ్ అబ్జర్వేషన్. ఇంకా?’’ ‘‘ఈ రెండ్రోజులూ మాకసలు టీవీ చూద్దామనిపించలేదు. ఫుల్లుగా ఆడు కుంటూనే ఉన్నాం. అక్కడ ఆడుకునే ఆటలకు పెద్దగా వస్తువులు కూడా అవసరంలేదు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్’’ అని చెప్పింది మైత్రి. ‘‘నాక్కూడా... అసలేం గుర్తుకురాలేదు’’ చెప్పాడు మిత్ర. ‘‘ఇంకా...?’’ అడిగింది రేఖ. ‘‘ఇంకా అంటే... హ్యాపీగా ఉండటానికి ప్లే స్టేషన్ అవసరం లేదని అర్థమైంది’’ తమ్ముడి వంక టీజింగ్‌గా చూస్తూ చెప్పింది మైత్రి. ‘‘చూడు మమ్మీ.. అక్క ఎలా టీజ్ చేస్తుందో. నేను అడిగింది ఒక్కసారే’’ అన్నాడు మిత్ర. ‘‘ఒక్కసారైనా.. దానికోసం ఏడ్చావుగా!’’ మరింత టీజింగ్‌గా చెప్పింది మైత్రి. ‘‘నేను ఏడ్చింది ప్లే స్టేషన్ కోసం కాదు.’’ ‘‘మరి దేనికోసమో?’’ ‘‘ఆర్యన్గాడు అలా అన్నాడని.’’ ‘‘వాడు మళ్లీ అంటే?’’ ‘‘పో పోరా. హ్యాపీగా ఉండాలంటే ప్లే స్టేషన్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేస్తా.’’ ‘‘ఆర్ యూ ష్యూర్?’’ ‘‘ఎస్... ఐ యామ్!’’ ధృఢంగా చెప్పాడు మిత్ర. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
'నా అందమే.. నన్ను బంధించింది'
ఆత్మబంధువు స్కూల్ పూర్తయి మిత్ర, మైత్రి తిరిగి వచ్చారు. ఇద్దరికీ పాలు కలిపి ఇచ్చింది రేఖ. మైత్రి ముభావంగా ఉండటం గమనించింది. మిత్ర ఆడుకోవడానికి వెళ్లాక మైత్రిని అడిగింది, ఎందుకలా ఉన్నావని. ‘‘ఏం లేదమ్మా. అయామ్ ఆల్రైట్!’’ అంది మైత్రి.‘‘నేను మీ అమ్మను. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదా! ఏమైందిరా?’’‘‘నేను నల్లగా ఉన్నానని క్లాస్మేట్స్ ఏడిపిస్తున్నారమ్మా’’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది మైత్రి.‘‘అవునా. మరి నువ్వేమన్నావ్?’’ ‘‘ఏమీ అన్లేదు. గమ్మునే ఉన్నా. తెల్లగా అవుదామని ఎన్ని క్రీములు రాసినా కావడం లేదు.’’ ‘‘చూడు నాన్నా... ఎవరో ఏదో అన్నారని నీలో నువ్వే ఏడుస్తూ కూర్చుంటే ఎలా? అయినా రంగుదేముంది?’’ అంటూ దగ్గరకు తీసుకుంది రేఖ. ‘‘నువ్వలాగే అంటావ్. కానీ స్కూల్లో అన్నిటికీ తెల్లగా ఉండే అమ్మాయిల్నే పిలుస్తారు. నల్లగా ఉండే వాళ్లను అస్సలు కన్సిడర్ కూడా చేయరు.’’క్షణం ఆలోచించింది రేఖ. తర్వాత అడిగింది... ‘‘అన్నింటికంటే నలుపైన పక్షి ఏమిట్రా?’’ ‘‘ఇంకేంటి.. కాకి’’ చెప్పింది మైత్రి. ‘‘కదా... అడవిలో ఉన్న ఓ కాకి తన రంగు, ఆకారం పట్ల చాలా సంతోషంగా ఉండేది. ప్రపంచంలోకెల్లా తానే అందగత్తెను అనుకునేది. అది ఓ రోజు హంసను చూసింది. అంతే.. అప్పటి వరకూ ఉన్న ఆనందమంతా మాయ మైంది. తన రంగు చూసి తనకే అసహ్యం వేసింది. ‘నేనింత నల్లగా ఉన్నాను. హంస తెల్లగా, అందంగా ఉంది’ అనుకుంది. అదే విషయాన్ని హంసతో చెప్పింది. ‘అలా అనుకునే మొదట నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ రామ చిలుకను చూశాక నా ఆనందమంతా దూరమైంది. నేను తెల్లగా ఒక్క రంగుతోనే ఉంటాను. కానీ చిలుక రెండు రంగులతో మెరుస్తూ ఉంటుంది’ అని చెప్పింది’ హంస. దీంతో కాకి చిలుక దగ్గరకు వెళ్లింది. దాని అందాన్ని చూసి మురిసి పోయింది. ‘నువ్వింత అందంగా ఉన్నావు. అందుకు ఆనందంగా ఉండి ఉంటావు కదా!’ అని అడిగింది. ‘ఔను నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నెమలిని చూసేంతవరకే. నాకున్నవి రెండు రంగులే. నెమలి బహు రంగులతో మెరిసిపోతుంటుంది. దాని పింఛం చూస్తే మతిపోతుంది. అందుకే నాకన్నా నెమలి సంతోషంగా ఉంటుంది’ అని చెప్పింది చిలుక. దాంతో నెమలి ఎంత ఆనందంగా ఉందో తెలుసుకునేందుకు బయలుదేరింది కాకి. కానీ ఎక్కడా నెమలి కనిపించలేదు. జూపార్కలో ఉంటుందని ఎవరో చెబితే వెళ్లింది. అక్కడ నెమలిని చూసేందుకు వందలాదిమంది బారులు తీరి ఉన్నారు. అది పురివిప్పగానే సెల్ఫీలు తీసు కుంటున్నారు. నెమలిని పలకరించేందుకు కుదరలేదు. దాంతో జూ సమయం ఐపోయేంత వరకూ వేచి చూసి, తర్వాత నెమలితో మాట కలిపింది.‘నెమలి బావా! నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూసేందుకు రోజూ వేలాదిమంది వస్తారు. అందరికన్నా నువ్వే ఆనందంగా ఉన్నావు. నన్ను చూడు ఎంత అసహ్యంగా ఉన్నానో. అందుకే నన్ను చూడగానే అందరూ అసహ్యించు కుంటారు’’ అంటూ వాపోయింది. ‘‘అవును.. ప్రపంచంలోకెల్లా నేను అందంగా ఉన్నానని అందరూ అంటూఉంటారు. కానీ నా అందమే నన్ను తెచ్చి ఈ బోనులో బంధించింది. ఇక్కడ ఇష్టమొచ్చి నట్లు ఎగరడానికి లేదు, ఇష్టమొచ్చింది తినడానికీ లేదు. పెట్టింది తిని, ఈ కంచె మధ్యే తిరుగుతుండాలి. ఇంతకంటే దుర్భరమైన జీవితం మరోటి లేదు’’ అంటూ వాపోయింది నెమలి. ‘‘అదేంటి! ఇంత అందంగా ఉన్న నువ్వే ఆనందంగా లేకపోతే ఇంకెవ రుంటారు?’’ అని ప్రశ్నించింది కాకి. ‘‘నేను జూకి వచ్చినప్పటినుంచీ అంతా పరిశీలిస్తున్నా. ఈ జూలో అన్ని జంతువులనూ, పక్షులనూ పంజరాల్లో బంధించి ఉంచారు... ఒక్క కాకిని తప్ప. అందుకే.. నేను కాకినైతే ఎంత బావుండేదో కదా అని రోజూ అనుకుంటూ ఉంటా’’ అని చెప్పింది నెమలి బావ!దాంతో కాకి విస్తుపోయింది. తన దగ్గర అందం లేదు తప్ప, తాను అందరి కంటే స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నానన్న నిజాన్ని గుర్తించలేకపోయింది. తన అదృష్టం అర్థమై సంతోషంగా ఎగిరిపోయింది. అమ్మ ఏం చెప్పాలనుకుందో మైత్రికి అర్థమైంది. దేనికి విలువివ్వాలో, దేనికి ఇవ్వకూడదో తెలిసి వచ్చింది. ఇతరులతో పోల్చుకోవడం వల్లనే తాను ఎక్కువగా బాధపడుతున్నానని అర్థమైంది. ‘థాంక్యూ మమ్మీ’’ అంటూ తల్లికి ఓ ముద్దిచ్చింది. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
అన్నీ ఇస్తాయి స్ఫూర్తి!
ఆత్మబంధువు ‘‘అమ్మా... అమ్మా...’’ స్కూల్నుంచి వస్తూనే పిలిచాడు మిత్ర. ‘‘ఏంటి నాన్నా...?’’... దగ్గరకు తీసుకుని అడిగింది రేఖ. ‘‘నాకు కొన్ని ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ బుక్స్ కావాలి.’’ ‘‘ఎందుకు?’’ ‘‘కొన్ని బుక్స్ చదివి అందులో ఇన్స్పైర్ చేసిన దానిపై వ్యాసం రాయమని చెప్పారు.’’ ‘‘ఓహ్ అలాగా... బుక్స్ చదివే రాయాలా? లేదంటే స్ఫూర్తినిచ్చిన ఏ అంశం గురించైనా రాయొచ్చా?’’ ‘‘రాయొచ్చు. కానీ ఇన్‌స్పయిర్ చేసిన దాని గురించే రాయాలి.’’ ‘‘అలా అయితే... మన చుట్టూ ఉన్నవన్నీ స్ఫూర్తినిచ్చేవే నాన్నా!’’ ‘‘అవునా... మన చుట్టూ అలాంటివి ఏమున్నాయమ్మా?’’ అసక్తిగా అడిగాడు మిత్ర. ‘‘చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్... మనం భూమి మీద ఉన్నాం కదా. భూమి మనకు ఏం చెప్తుంది?’’ ‘‘ఏం చెప్తుంది?’’ ‘‘నేను నీ తల్లిని. నీకు జీవితాన్ని ఇచ్చాను. మీ అందరినీ భరిస్తున్నది నేనే. మీరు నన్నెంత కష్టపెట్టినా మీ మీద ప్రేమ తగ్గదు, ఎందుకంటే మీరంతా నా బిడ్డలు. నువ్వు కూడా నాలానే బిడ్డలను ప్రేమించు, మంచివారిగా పెంచు. నీ చుట్టూ ఉన్నవాటిలో అందాన్ని ఆస్వాదించు. నీతోపాటు నీ చుట్టూ ఉన్న వారిని గౌరవించు. ఎందుకంటే మనం దరం ఒక్కటే. మిగతా ప్రాణులకంటే నువ్వేదో గొప్పవాడివి అనుకోకు. నామీద జీవించే ప్రాణులన్నీ ఒక్కటే నాకు. నా దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు అందరినీ ఒకలాగే ఆహ్వానిస్తాను... అని చెప్తుంది.’’ ‘‘ఓహ్.. ఇంకా...?’’ ‘‘ఎవరినుంచీ ఏమీ ఆశించకుండా వెచ్చని ప్రేమను పంచు. నీకోసం నువ్వే కాకుండా పదిమందికీ ఉపయోగపడేలా జీవించు... అని సూర్యుడు చెప్తాడు.’’ ‘‘నిజమే కదా అమ్మా. సూర్యుడి వల్లనే కదా మనమంతా బ్రతికున్నాం. ఇంకా చెప్పమ్మా!’’ ‘‘నేనే నీ ప్రాణం. అందుకే నన్ను గుండెల్లో నింపుకో. నీ శరీరాన్ని ఆరో గ్యంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతా. రోజుకో ఐదు నిమిషాలైనా ధ్యానించి మౌనంగా హృదయం చెప్పేది విను. నన్నెంత కలుషితం చేస్తున్నా మిమ్మల్ని క్షమిస్తున్నట్లే నువ్వు కూడా ఇతరులను క్షమించు అని గాలి చెప్తుంది.’’ ‘‘మన చుట్టూ ఇన్ని ఇన్స్పిరేషనల్ విషయాలున్నాయంటే చాలా బాగుంది మమ్మీ. ఇంకా చెప్పవా ప్లీజ్!’’ అన్నాడు మిత్ర ఉత్సాహంగా. ‘‘ప్రకృతిలోని అన్ని అంశాలూ మనకు స్ఫూర్తినిచ్చేవేరా. మనం కళ్లు తెరచి చూడాలి, చెవులతో వినాలి, మనసుతో తెలుసుకోవాలి అంతే. ఉదాహరణకు చెట్టును తీసుకో. నిలబడు... నిటారుగా. ఒంటరిగా, జంటగా, గుంపుగా.. ఎలాగైనా సరే. ఎవరేం చేసినా ఫలాలివ్వడం మర వకు. పెనుగాలి వచ్చినపుడు తలవంచడం మరవకు. ఓపికగా ఉండు. కాలంతో పాటు నువ్వూ ఎదుగుతావు అని చెప్తుంది. నీకు నువ్వు సృష్టించుకున్న హద్దుల్ని దాటి విస్తరించు, నిన్ను నువ్వు వ్యక్తపరచుకో, మార్పును గమనించు, అనంతమైన అవకాశాలను గుర్తించు అని అనంతాకాశం చెప్తుంది. అన్ని భయాలూ మరచి స్వేచ్ఛగా జీవించమని, మనసారా పాడమని పక్షులు చెప్తాయి. మనసును తేలిగ్గా ఉంచుకోమని, నిరంతరం సృజనాత్మకంగా ఆలోచించ మని, ఆ ఆలోచనలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచమని మేఘాలు చెప్తాయి. దయతో చల్లగా చూడమనీ, అందరినీ ప్రేమించమని, ప్రేమను పంచమనీ, ప్రేమను స్వీకరించమనీ చంద్రుడు, చుక్కలా మెరవమని నక్షత్రాలూ చెప్తాయి’’... చెప్పింది రేఖ. ‘‘అన్నీ పెద్దపెద్దవేనా? చిన్నవి ఏమీ చెప్పవామ్మా?’’ ప్రశ్నించాడు మిత్ర. ‘‘ఎందుకు చెప్పవు... చెప్తాయి. పర్ఫెక్షనిజం కోసం చూడకుండా నిన్ను నిన్నుగా ప్రేమించమని, గౌరవించమనీ... చిన్న చిన్న అంశాల్లోని అందాన్ని ఆస్వా దించమనీ మొక్కలూ పుష్పాలూ చెప్తాయి. అంతెందుకు... కష్టించి పనిచేయమనీ, భవిష్యత్తుకు కూడబెట్టుకోమనీ, కలిసి కట్టుగా జీవించమనీ, ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమనీ చీమలు చెప్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతి, అందు లోని జీవులూ ఇలా అనేక విధాలుగా స్ఫూర్తినిస్తాయి’’... వివరించింది రేఖ. ‘‘థాం్యక్యూ సోమచ్ మమ్మీ...’’ అంటూ అమ్మకు ముద్దు పెట్టాడు మిత్ర. ‘‘ముద్దులు పెట్టుకుంటే సరిపోదు నాన్నా. నేను చెప్పినవి కాకుండా, నీ చుట్టూ ఉన్నవాటిని పరిశీలించి అవి నీకేం పాఠాలు చెప్తున్నాయో, ఎలా స్ఫూర్తినిస్తు న్నాయో రాసి చూపించు’’ అంది రేఖ. ‘‘ఓ... నీకు చూపించాకే స్కూల్లో ఇస్తాను’’ అంటూ లేచాడు మిత్ర. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
పరుగులాపి ప్రేమించండి!
ఆత్మబంధువు ‘‘ఏంట్రా, నీకు హార్ట్ అటాక్ రావడం ఏమిటీ? నువ్వు హాస్పిటల్లో చేరడం ఏమిటీ?’’... శంకర్‌ను పలకరించింది రేఖ. ‘‘అదే అర్థం కావడం లేదు రేఖా. అయనకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. కానీ నిన్న సడన్‌గా ఇలా జరిగింది. దేవుడి దయవల్ల ఈ గండం గట్టెక్కాం’’ అంటూ ఏడుస్తోంది మనీషా. రేఖ ఆమెని ఓదారుస్తూ దగ్గరకు తీసుకుంది. శంకర్, మనీషా ఇద్దరూ రేఖ క్లాస్మేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. బాగానే సంపాదిస్తూ ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. వయసు ఇంకా 40 లోపే. మూడురోజుల కిందట శంకర్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఓ రెండు స్టెంట్లు వేసి శంకర్‌ను కాపాడారు. ఈ విషయం తెలిసి పలుకరిద్దామని రేఖ వచ్చింది. శంకర్‌ను పరామర్శించి, మనీషాకు ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేసింది. కానీ ఆ సంఘటన ఆమె మనసులోంచి పోవడం లేదు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం ఏమిటో అర్థం కాలేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉంది. ఓ రెండు వారాల తర్వాత శంకర్, మనీషాల ఇంటికి వెళ్లింది, మరోసారి పలకరించేందుకు. రేఖను ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించింది మనీషా. ‘‘ఇప్పుడెలా ఉంది?’’ అంటూ శంకర్‌ను పలకరించింది రేఖ. ‘‘ఫైన్. డాక్టర్ కొన్ని ఎక్సర్సైజులు చెప్పారు, చేస్తున్నా’’అన్నాడు శంకర్. ‘‘గుడ్, గుడ్. ఇంకేంటి విషయాలు?’’ ‘‘ఏముంది! వారం నుంచి ఇంటి నుంచే పని చేస్తున్నా.’’ ‘‘ఏంటీ? వర్క్ చేస్తున్నావా? నీకు వచ్చింది కడుపునొప్పి కాదు, గుండెనొప్పి!’’ ‘‘అవుననుకో. ఇప్పుడంతా బానే ఉందిగా. ఆపరేషన్ జరిగిందని పని మానుకుంటే ఎలా? ఇది పోటీ ప్రపంచం.. పరుగెత్తాల్సిందే.’’ ‘‘ఇంతగా పరుగెత్తితే ఏమొస్తుంది?’’ ‘‘ప్రమోషన్స, గుడ్ శాలరీ, గుడ్ లైఫ్.’’ ‘‘మరి ఆరోగ్యం?’’ ‘‘ఏదైనా జరిగితే హాస్పిటల్స్ ఉన్నాయిగా’’అన్నాడు శంకర్ నవ్వుతూ. శంకర్ అనారోగ్యానికి కారణమేమిటో కొంత ఆర్థమైంది రేఖకు. ఆ విషయం చెప్పినా అతనికి అర్థం కాదని కూడా అర్థమైంది. ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచిస్తుంటే అప్పుడెప్పుడో చదివిన కథ గుర్తొచ్చింది. ‘‘శంకర్ నేనో ప్రశ్న అడుగు తాను సమాధానం చెప్తావా?’’ అంది. ‘‘ఓ... అడుగు!’’ అన్నాడు శంకర్. ‘‘ఒక రాజు ఉన్నాడు. ఓ యుద్ధంలో ఆ రాజు ప్రాణాలను ఓ సైనికుడు కాపా డాడు. దాంతో ఆ సైనికుడంటే రాజుకు ఇష్టం ఏర్పడింది. అది రోజురోజుకూ పెరిగింది. ఓ రోజు ఆ సైనికుడిని పిలిచి... ‘నా ప్రాణాలను కాపాడిన నువ్వంటే నాకిష్టం. అందుకే నీకో బహుమతి ఇవ్వా లనుకుంటున్నాను. ఈ గుర్రం ఎక్కి సూర్యాస్తమయంలోపు ఎంత భూమి చుట్టి రాగలవో అంత భూమిని నీకు ఇచ్చేస్తాను’ అని చెప్పాడు. ఆ సైనికుడు నువ్వే అయితే ఏం చేస్తావ్?’’ అని అడిగింది రేఖ. ‘‘మ్యాగ్జిమమ్ భూమిని కవర్ చేస్తాను’’ ఠక్కున చెప్పాడు శంకర్. ‘‘ఆ... ఆ సైనికుడు కూడా అదే పని చేశాడు. ఆకలి దప్పులు పట్టించుకోకుండా రోజంతా గుర్రాన్ని పరుగులు పెట్టించాడు. చివరకు అలిసిపోయి ప్రాణాలు కోల్పోయే దశలో అనుకున్నాడు... ఇంత దూరం పరుగులు తీశాను, కానీ ఇప్పుడు నన్ను కప్పెట్టడానికి ఆరడుగులు చాలు అని.’’ ‘‘వాట్ డూ యూ మీన్?’’ ‘‘ఆ సైనికుడికి చావు దగ్గరకు వచ్చి నప్పుడైనా కనువిప్పయింది. నీకు మాత్రం ఇంకా కాలేదు. అదే బాధగా ఉంది శంకర్. ఈ కథ మన జీవితం లాంటిదే. డబ్బు, పదోన్నతులు, గుర్తింపు కోసం రోజంతా, జీవితమంతా పరుగులు పెడుతూనే ఉంటాం. అందులో మునిగిపోయి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అందుకే 30, 35 ఏళ్లకే బీపీ, షుగర్, గుండెపోటు వచ్చేస్తోంది. జీవించడానికి డబ్బు, హోదా, గుర్తింపు అవసరమే. కానీ అవే జీవితం కాదు. జీవితమంటే ఆనందించడం. కాస్త ఆ పరుగులాపి జీవితాన్ని జీవించు, జీవితాన్ని ప్రేమించు, జీవితాన్ని ఆనందించు.’’ అర్థమైంది అన్నట్టుగా తలూపాడు శంకర్. మనీషా ముఖంలో సంతోషం! - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
పనికిరాని మొక్క!
ఆత్మబంధువు ఆనంద్ ఆఫీసుకు, పిల్లలు స్కూల్‌కు వెళ్లిపోయాక రేఖ వంటపనిలో మునిగి పోయింది. ఇంతలో డోర్‌బెల్ మోగింది. ఈ టైమ్‌లో ఎవరా అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. పక్కింటి మాధవి. ‘‘రండి ఆంటీ’’ అంటూ లోపలికి ఆహ్వానించింది రేఖ. ఈ టైమ్‌లో వచ్చా రేమిటా అనుకుంటూనే కాఫీ తెచ్చిచ్చింది. కాసేపు అదీ ఇదీ మాట్లాడుకున్న తర్వాత మాధవి అసలు విషయానికి వచ్చింది. ‘‘రేఖా.. మా అబ్బాయి రాము ఈ మధ్యే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. వస్తుందన్న నమ్మకమూ లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వేదైనా సలహా చెప్తావేమోనని వచ్చా’’ అంది మాధవి. ‘‘అసలిప్పుడేం చేస్తున్నాడు ఆంటీ?’’ ‘‘ఏం చేస్తున్నాడో చెప్పడు. కానీ ఎప్పుడూ ఊళ్లు పట్టుకు తిరుగు తుంటాడు. వాడెందుకూ పనికి రాకుండా పోతాడేమోనని భయమేస్తోంది.’’ మాధవి వాళ్లది పక్కిల్లే. వాళ్లింట్లో మాట్లాడుకునే మాటల్లో కొన్ని రేఖకు వినిపిస్తూనే ఉంటాయి. రామూని నిత్యం పనికిరాని వాడని తిట్టడం రోజూ ఆమె చెవిన పడుతూనే ఉంటుంది. అలా అనకూడదని చెప్పాలని చాలాసార్లు అనుకుంది, కానీ చెప్పలేకపోయింది. ఇప్పుడు సమయం, సందర్భం వచ్చాయి. ‘‘ఆంటీ... నేను మీకో కథ చెప్తాను, వింటారా?’’ అని అడిగింది. నేను సలహా కోసం వస్తే ఈ పిల్లేంటీ కథలంటోంది అనుకుంటూనే... ‘‘చెప్పు రేఖా’’ అంది మాధవి. ‘‘పూర్వం జీవకుడు అనే వ్యక్తి ఆయుర్వేదం నేర్చుకోవాలని ఓ గురువు దగ్గర చేరాడు. ఏళ్ల తరబడి శిష్యరికం చేశాడు. విద్య పూర్తయి వెళ్లిపోయే రోజు వచ్చింది. గురువుగారు జీవకుడ్ని పిలిచి ‘నీ విద్యాభ్యాసం పూర్తయింది. చివరగా ఒక పరీక్ష పెడతాను. ఉత్తీర్ణుడవైతే నువ్వు సొంతగా వైద్యం ప్రారంభించవచ్చు’ అని చెప్పాడు. ఆజ్ఞాపించమన్నాడు జీవకుడు. తాముంటున్న అరణ్యంలో వైద్యానికి పనికి రాని మొక్క ఏదైనా తీసుకువస్తే పరీక్షలో ఉత్తీర్ణుడైనట్లేనన్నాడు గురువు. చిటికెలో తీసుకొస్తానంటూ జీవకుడు అరణ్యంలోకి వెళ్లాడు. సూర్యాస్తమయం అవుతోంది, జీవకుడు రాలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. జీవకుని జాడ లేదు. దాదాపు ఏడాది తర్వాత మీసాలు, గడ్డాలతో తిరిగి వచ్చాడు. ‘గురుదేవా... వైద్యానికి పనికిరాని మొక్క కోసం ఏడాది పాటు అరణ్యమంతా అన్వేషించాను. ఒక్కటీ కానరాలేదు. నేను వైద్యుడిగా పనికిరానా గురుదేవా?’ అంటూ రోదించాడు. అప్పుడు గురువు... ‘భూమి మీద కనపడే ప్రతి మొక్కా వైద్యానికి ఉప యోగపడేదే. ఆ విషయం తెలుసుకోవడం తోనే నువ్వు ఉత్తీర్ణుడివయ్యావు’ అన్నాడు. ‘‘అంటే... ప్రపంచంలోని మొక్కలన్నీ వైద్యానికి పనికొస్తాయా రేఖా?’’ ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ‘‘అవునాంటీ... ప్రతి మొక్కా ఏదో విధంగా వైద్యానికి పనికొస్తుంది. అలాగే ప్రపంచంలోని మనుషులందరూ ఏదో ఒక రకంగా సమాజానికి పనికొస్తారు. పనికి మాలిన మొక్కలు, పనికిమాలిన మనుషు లంటూ ఎవ్వరూ ఉండరు’’ చెప్పింది రేఖ. రేఖ ఆ మాట ఎందుకు చెప్పిందో మాధవికి అర్థమైంది. ‘‘నువ్వు చెప్పింది నిజం కావొచ్చు రేఖా. కానీ మా వాడి విషయం వేరు. నిజంగానే వాడెందుకూ పనికి రాకుండా పోతున్నాడనే మా బాధంతా’’ అంది బాధగా. ‘‘రామూకేం తక్కువాంటీ! మంచి కుర్రాడు, బాగా మాట్లాడతాడు, పాటలు పాడతాడు, పదిమందినీ చక్కగా ముందుకు నడిపించగలడు.’’ ‘‘అదేనమ్మా అసలు సమస్య. అన్నీ చేస్తాడు, ఉద్యోగం తప్ప. అదే చాలా గొడవగా ఉంది ఇంట్లో.’’ ‘‘ఉద్యోగం అంటే ఏంటి ఆంటీ?’’ ‘‘అదేంటి రేఖా అలా అడిగావ్? అందరూ చేసేదే. ఏదో ఒక ఆఫీసులో చక్కగా ఉద్యోగం చేసుకుంటే ఎంత బావుంటుందీ.’’ ‘‘ఆంటీ... రామూ నైన్ టూ ఫైవ్ జాబ్ చేయాలని మీరు చూస్తున్నారను కుంటా. కానీ నేను అబ్జర్వ్ చేసిన మేరకు, నాకు తెలిసినంత వరకు అతను అలాంటి జాబ్ చేయలేడు. మీరు బలవంతంగా చేర్పించినా అక్కడ ఇమడలేడు.’’ ‘‘మరెలా రేఖా?’’ ‘‘మీరు 7/జి బృందావన్ కాలనీ సినిమా చూశారా? అందులో హీరో ఎందుకూ పనికిరాని వాడని అందరూ తిడుతుంటారు. హీరోయిన్ కూడా తిట్టేస్తుంది. కానీ బైక్ మెకానిజంలో అతనో జీనియస్ అని చివరకు గుర్తిస్తుంది. అలాగే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆంటీ. దాన్ని గుర్తించి ప్రోత్సహించాలంతే!’’ రేఖ చెప్పింది మాధవికి అర్థమైంది. తన కొడుకు విషయంలో తర్వాత తానేం చేయాలో ఆలోచిస్తూ వెళ్లిపోయింది. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
వారి భాష మీకు తెలుసా?
ఆత్మబంధువు ‘‘హలో రేఖా. ఎలా ఉన్నావ్?’’ ఫోన్లో పలకరించింది మనీషా. ‘‘హాయ్ మనీ... వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటే ఇవ్వాళ నా మీద దయ కలిగింది.’’ ‘‘అదేం లేదు. ఆ మధ్య మీ ఇంటికి వచ్చాం కదా. అప్పటినుంచి నీతో మాట్లాడాలనే అనుకుంటున్నా. కానీ నువ్వు ఏమనుకుంటావోననీ...’’ ‘‘ఏమిటే... ఏదైనా సమస్యా?’’ ‘‘హా... సమస్యే. కలిసి చెప్తాలే. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు.’’ ‘‘నీకోసం ఎప్పుడైనా ఫ్రీ నే. వచ్చేసెయ్’’ అంది రేఖ. సరే అని ఫోన్ పెట్టేసిన రెండు గంటల్లో రేఖ ఇంటిలో ప్రత్యక్షమైంది మనీషా. అంత త్వరగా వచ్చిందంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుందని అర్థమైంది రేఖకు. కాస్త కాఫీ తాగాక కబుర్లు మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడు చెప్పరా. ఏంటి నీ సమస్య?’’ అడిగింది. ‘‘శంకర్’’ తటపటాయిస్తూ చెప్పింది మనీషా. ‘‘శంకర్‌తో నీకు సమస్యేంటే?’’ ‘‘మనం కాలేజీలో ఉన్నప్పుడు వాడు నాకోసం ఎంత తిరిగాడో, ఎలా తపస్సు చేశాడో నీకు తెలుసుగా. అంతగా ప్రేమిస్తున్నాడనే ఇంట్లో వాళ్లను ఒప్పించి వాడ్ని పెళ్లి చేసుకున్నా.’’ ‘‘అవును. ఇప్పుడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా?’’ ‘‘అలాంటిదేం లేదు. కానీ ఓ మంచి చీర కట్టుకున్నా, మంచి వంట చేసినా... అసలేమీ మాట్లాడడు.‘ఐ లవ్యూ’ చెప్పిన సందర్భాలైతే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.’’ ‘‘మరి నువ్వు?’’ ‘‘నేను రోజుకోసారైనా చెప్తా.’’ ‘‘శంకర్ ఐలవ్యూ చెప్పడం లేదంటే... నువ్వంటే ఇష్టం లేదా?’’ ‘‘కాదు, ఇష్టమే. ఎక్కడ టూర్‌కు వెళ్లినా తీసుకెళ్తాడు. తీసుకెళ్లలేకపోతే నాకోసం గిఫ్ట్ తీసుకొస్తాడు. నా ఫొటోలు తీసి ఇల్లంతా అలంకరిస్తాడు. నేను మంచి చీర కట్టుకుంటే తినేసేలా చూస్తాడు.’’ ‘‘మరింకేం.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావ్‌గా’’ కన్నుగీటింది రేఖ. ‘‘అవుననుకో. కానీ ఓ మాటామంతీ ఉండదే.’’ అర్థమైనట్లుగా తలూపింది రేఖ. ‘‘నీ సమస్య శంకరా? లేక అతను మాట్లాడక పోవడమా?’’ అంది కూల్‌గా. ‘‘అంటే... వాడి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం, నేను చెప్పినా స్పందించక పోవడం నాకు నచ్చట్లేదు.’’ ‘‘కనీసం తన ప్రేమ అర్థమైందా?’’ ‘‘అర్థమైంది కానీ...’’ అంటూ ఆగిపోయింది మనీషా. ‘‘సమస్యేమిటో నీకు అర్థం కాలేదని నాకర్థమైందిలే.’’ ‘‘నువ్వు అర్థం చేసుకుని ఏదైనా సలహా చెప్తావనేగా నీ దగ్గరకు వచ్చింది.’’ ‘‘సరే సరే... ఇచ్ లీబే డిచ్.’’ ‘‘ఏంటీ?’’ అర్థం కాక అడిగింది మనీషా. ‘‘జే తైమే.’’ ‘‘ఏంటే... ఏమంటున్నావ్?’’ ‘‘తే అమో.’’ ‘‘ఏమైందే... ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావ్?’’ ‘‘ఐ లవ్యూ అని జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో చెప్పా. అర్థమైందా?’’ అంది రేఖ నవ్వుతూ. ‘‘ఊహూ’’ అంటూ తల అడ్డంగా ఊపింది మనీషా. ‘‘కదా... అలాగే శంకర్ మాట్లాడే భాష కూడా నీకు అర్థం కావడం లేదు.’’ ‘‘మేం మాట్లాడుకునేది తెలుగులోనే కదా. అర్థం కాకపోవడమేంటి?’’ అంది మనీషా అయోమయంగా. ‘‘చెప్తా చెప్తా. మనుషులు మౌలికంగా మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. దృష్టి ప్రధానం, శ్రవణ ప్రధానం, అనుభూతి ప్రధానం. మీరు మాట్లాడుకునేది తెలుగు లేదా ఇంగ్లిష్‌లోనే అయినా మీరెంచుకునే పదాలు ఆయా వ్యక్తిత్వాలపైన ఆధారపడి ఉంటాయి. శంకర్‌ది దృష్టి, అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని నీ మాటలను బట్టి అర్థమైంది. అంటే అతను అందమైన ప్రపంచాన్ని చూడ్డానికి ఇష్టపడతాడు. తన ప్రేమను అందమైన కానుకల రూపంలో లేదంటే స్పర్శ ద్వారా వ్యక్తీకరిస్తాడు. నీది శ్రవణ ప్రధానమైన వ్యక్తిత్వం. నీకు ఏదైనా మాటల్లో చెప్పాలి. చేతల్లో చూపిస్తే అర్థం కాదు. అంటే ఓ లక్ష రూపాయల నెక్లెస్ కొనిచ్చినదానికన్నా.. ‘ఐ లవ్యూ’ అని చెప్తే ఎక్కువ ఆనందిస్తావ్. అలా చెప్పడం శంకర్‌కి రాదు. అంటే మీ ఇద్దరి భావ వ్యక్తీకరణ తీరు వేర్వేరు. అందుకే అతని ప్రేమ నీకు అర్థం కావట్లేదు.’’ ‘‘ఆ నిజమే. వాడు నాకు ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేస్తే వాడి కళ్లు మెరిసి పోతాయి. వెంటనే హగ్ చేసుకుంటాడు.’’ ‘‘అదీ అతని భావ వ్యక్తీకరణ తీరు. అదీ అతను ఐ లవ్యూ చెప్పే విధానం. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అతని ప్రేమ నీకు అర్థమవుతుంది.’’ ‘‘ఆ, అర్థమైంది వాడికి నేనంటే ఎంత ప్రేమో. థాంక్స్ రేఖా..’’ అంటూ ఆనందంగా వెళ్లిపోయింది మనీషా. - డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మాటల మేకులు కొట్టొద్దు!
ఆత్మబంధువు ‘‘ఉషా... ఉషా... ఎన్నిసార్లు పిలవాలి?’’ ‘‘ఏం కావాలి కిరణ్?’’ ‘‘నా సాక్స్ కనిపించ ట్లేదు. ఎక్కడ పెట్టావ్?’’ ‘‘ఆ మాత్రం వెతుక్కోలేవా?’’ ‘‘నేను సాక్స్ వెతుక్కుంటూ కూర్చుంటే ఆఫీసుకు లేట్ అవుతుంది.’’ ‘‘సాక్స్ వెతికిస్తూ కూర్చుంటే నాకూ లేట్ అవుతుంది ఆఫీసుకు.’’ ‘‘ఏంటీ.. మాటకు మాట సమాధానం చెప్తున్నావ్?’’ ‘‘చెప్పకపోతే లెక్క లేదా అంటావ్. చెప్తే మాటకు మాట అంటావ్. ఎలా నీతో?’’ ‘‘అంటే నేను గొడవ పడుతున్నానంటావా?’’ ‘‘బాబూ... నేనేం అన్లేదు. నువ్వు ఆఫీసుకు బయల్దేరు. నేనూ బయల్దేరాలి... బై.’’ మమ్మీ... మమ్మీ.. అరుస్తున్నాడు గౌతమ్. ఉషా, కిరణ్‌ల ముద్దుబిడ్డ. ‘‘ఏంటి నాన్నా ఏమైంది?’’ ‘‘నా షూ పాలిష్ చేయలేదు.’’ ‘‘చేసుకో నాన్నా.’’ ‘‘నేనెందుకు చేసుకోవాలి? నువ్వే చెయ్.’’ ‘‘నేను పన్లో ఉన్నారా. ఈ రోజుకు నువ్వు చేసుకో.’’ ‘‘నో.. నేను చేసుకోను. నువ్వు చేస్తావా? లేదా?’’ ‘‘నాకిప్పుడు కుదరదు నాన్నా.’’ బ్యాడ్ మమ్మీ అనుకుంటూ స్కూల్‌కు వెళ్లిపోయాడు గౌతమ్. వాడన్న మాటకు ఉష మనసు చివుక్కుమంది. ‘ఏంటిది, నేనిన్ని చేస్తున్నా వీడిలా అనేశాడు’ అనుకుంది. కోపంలో అచ్చం తండ్రి పోలికే. చిన్న చిన్న విషయాలకు కూడా అరిచేస్తూ ఉంటాడు. వీడినిలా వదిలేస్తే కష్టం అనుకుంటూ ఆఫీసుకు బయల్దేరింది, మమ్మీ... మమ్మీ... అరుస్తు న్నాడు గౌతమ్. ‘‘మళ్లీ ఏమైందిరా?’’ అడిగింది ఉష. ‘‘నేను స్కూల్‌కు వెళ్లను.’’ ‘‘ఏం? ఏమైందీ?’’ ‘‘నాకు మా టీచర్ నచ్చ లేదు. ఇవ్వాళ నాకు పనిష్మెంట్ ఇచ్చింది.’’ ‘‘నువ్వేం చేశావ్?’’ ‘‘గోపాల్ నా పెన్సిల్ తీసుకున్నాడని కొట్టాను. అందుకని పనిష్మెంట్ ఇచ్చింది.’’ ‘‘పెన్సిల్ తీసుకుంటే కొట్టేస్తావా? తప్పుకదా?’’ ‘‘కొడతాను’’... గట్టిగా చెప్పాడు గౌతమ్. వాడి కోపానికి బ్రేక్‌లు వేయకపోతే భవిష్యత్తులో కష్టమనుకుంది ఉష. ఇంట్లోకి వెళ్లి కొన్ని మేకులు, ఒక సుత్తి తెచ్చింది. ‘‘నాన్నా.. నేనో పని చెప్తా చేస్తావా?’’ అడిగింది గౌతమ్‌ని. ఏంటో చెప్పమన్నాడు. ‘‘ఇదిగో.. ఈ మేకులు, సుత్తి తీసుకో. నీకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు కోపం తగ్గేంతవరకూ ఈ మేకులు ఆ చెక్కకు కొట్టెయ్’’ అంటూ ఎదురుగా హృదయాకారంలో ఉన్న ఎర్రటి చెక్కను చూపించింది. ‘‘అంతే కదా. ఐయామ్ రెడీ’’ అంటూ మేకులు, సుత్తి అందుకున్నాడు గౌతమ్. టీచర్ మీదున్న కోపంతో 25 మేకులు కొట్టేశాడు. ‘‘ఉషా.. ఈ చెక్క, మేకులు, సుత్తి గొడవేంటీ? వాడికేమైనా దెబ్బ తగిలితే’’ అరిచాడు కిరణ్. ‘‘ఏం కాదులే కిరణ్. నువ్వు గమ్మునే ఉండు. లెట్ హిమ్ డూ దట్’’ అంది ఉష. ‘‘మమ్మీ... ఈ మేకులిలా ఎన్ని రోజులు కొట్టాలి?’’... మర్నాడు అడిగాడు గౌతమ్. ‘‘నీకు కోపం ఉన్నన్ని రోజులూ కొట్టు’’... చెప్పింది ఉష. ‘‘మరి చెక్క నిండిపోతే?’’ ‘‘నువ్వు కోప్పడిన మనిషికి నువ్వు సారీ చెప్పినప్పుడు ఓ మేకు తీసెయ్. అప్పుడు గ్యాప్ వస్తుంది.’’ ‘‘నేనెందుకు చెప్పాలి సారీ?’’ అంటూ మరో నాలుగు మేకులు కొట్టేశాడు గౌతమ్. నెల రోజులు గడిచాయి. అప్పుడ ప్పుడూ చెప్పిన సారీలకు కొన్ని మేకులు తీసేయగా చెక్క దాదాపు నిండిపోయింది. ‘‘మమ్మీ... ఈ చెక్క నిండిపోయింది. ఇప్పుడేం చేయమంటావ్?’’ అడిగాడు గౌతమ్. ‘‘ఒక్కో మేకుకూ ఒక్కో సారీ చెప్తూ బయటకు తియ్’’... చెప్పింది ఉష. గౌతమ్ ఇష్టం లేకుండానే సారీ చెప్తూ, కష్టపడి ఒక్కో మేకూ బయటకు లాగుతూ చెక్క ఖాళీ చేసేశాడు. ‘‘ఇప్పుడు చూడు.. చెక్క ఎలా ఉందో’’... అంది ఉష. ‘‘ఏం బాగుంది? అన్నీ బొక్కలే... అన్నాడు గౌతమ్. ‘‘ఇప్పుడు వాటిని పూడ్చేసి చెక్కను మామూలుగా మార్చు.’’ ‘‘అదెలా? చెక్కకు పడ్డ రంధ్రాలు పూడ్చడం ఎలా కుదురుతుంది?’’ ‘‘కదా... మరి అవి ఎలా వచ్చాయ్? మేకులు కొడితే వచ్చాయ్. నువ్వు మేకులు ఎప్పుడు కొట్టావ్? కోపం వచ్చినప్పుడు. నీకు కోపం వచ్చినప్పుడు ఇంకా ఏం చేస్తావ్?’’ ‘‘గట్టిగా అరిచేస్తాను.’’ ‘‘కదా... ఆ మేకులు నీ అరుపులన్నమాట. నువ్వు కోపంతో ఉన్నప్పుడు మాటలు నీకు తెలియ కుండానే వచ్చేస్తాయి. అవి ఎదుటివాళ్లకు కష్టం కలిగిస్తాయి. నువ్వు ఎలాగైతే రంధ్రాలు పూడ్చలేనన్నావో.. అలాగే నువ్వెన్ని సారీలు చెప్పినా వాళ్లకు కలిగిన బాధ పూర్తిగా తొలగిపోదు.’’గౌతమ్‌కు విషయం అర్థమైంది. తను చేస్తున్న తప్పేంటో తెలిసొచ్చింది. ‘‘సారీ మమ్మీ’’ అంటూ ఉషను హగ్ చేసు కున్నాడు. ‘‘సారీ ఉషా’’ అంటూ కిరణ్ కూడా హగ్ చేసుకున్నాడా రాత్రి!