పరుగులాపి ప్రేమించండి! | don't waste ur's time loves | Sakshi
Sakshi News home page

పరుగులాపి ప్రేమించండి!

Published Sun, Dec 6 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

పరుగులాపి ప్రేమించండి!

పరుగులాపి ప్రేమించండి!

ఆత్మబంధువు
‘‘ఏంట్రా, నీకు హార్ట్ అటాక్ రావడం ఏమిటీ? నువ్వు హాస్పిటల్‌లో చేరడం ఏమిటీ?’’... శంకర్‌ను పలకరించింది రేఖ.
 ‘‘అదే అర్థం కావడం లేదు రేఖా. అయనకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. కానీ నిన్న సడన్‌గా ఇలా జరిగింది. దేవుడి దయవల్ల ఈ గండం గట్టెక్కాం’’ అంటూ ఏడుస్తోంది మనీషా. రేఖ ఆమెని ఓదారుస్తూ దగ్గరకు తీసుకుంది.
 శంకర్, మనీషా ఇద్దరూ రేఖ క్లాస్‌మేట్స్.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. బాగానే సంపాదిస్తూ ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. వయసు ఇంకా 40 లోపే. మూడురోజుల కిందట శంకర్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఓ రెండు స్టెంట్‌లు వేసి శంకర్‌ను కాపాడారు. ఈ విషయం తెలిసి పలుకరిద్దామని రేఖ వచ్చింది.

శంకర్‌ను పరామర్శించి, మనీషాకు ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేసింది. కానీ ఆ సంఘటన ఆమె మనసులోంచి పోవడం లేదు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం ఏమిటో అర్థం కాలేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉంది. ఓ రెండు వారాల తర్వాత శంకర్, మనీషాల ఇంటికి వెళ్లింది, మరోసారి పలకరించేందుకు. రేఖను ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించింది మనీషా.
 ‘‘ఇప్పుడెలా ఉంది?’’ అంటూ శంకర్‌ను పలకరించింది రేఖ.
 
‘‘ఫైన్. డాక్టర్ కొన్ని ఎక్సర్‌సైజులు చెప్పారు, చేస్తున్నా’’అన్నాడు శంకర్.
 ‘‘గుడ్, గుడ్. ఇంకేంటి విషయాలు?’’
 ‘‘ఏముంది! వారం నుంచి ఇంటి నుంచే పని చేస్తున్నా.’’
 ‘‘ఏంటీ? వర్క్ చేస్తున్నావా? నీకు వచ్చింది కడుపునొప్పి కాదు, గుండెనొప్పి!’’
 ‘‘అవుననుకో. ఇప్పుడంతా బానే ఉందిగా. ఆపరేషన్ జరిగిందని పని మానుకుంటే ఎలా? ఇది పోటీ ప్రపంచం.. పరుగెత్తాల్సిందే.’’
 
‘‘ఇంతగా పరుగెత్తితే ఏమొస్తుంది?’’
 ‘‘ప్రమోషన్‌‌స, గుడ్ శాలరీ, గుడ్ లైఫ్.’’
 ‘‘మరి ఆరోగ్యం?’’
 ‘‘ఏదైనా జరిగితే హాస్పిటల్స్ ఉన్నాయిగా’’అన్నాడు శంకర్ నవ్వుతూ.
 శంకర్ అనారోగ్యానికి కారణమేమిటో కొంత ఆర్థమైంది రేఖకు. ఆ విషయం చెప్పినా అతనికి అర్థం కాదని కూడా అర్థమైంది.

ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచిస్తుంటే అప్పుడెప్పుడో చదివిన కథ గుర్తొచ్చింది. ‘‘శంకర్ నేనో ప్రశ్న అడుగు తాను సమాధానం చెప్తావా?’’ అంది.
 ‘‘ఓ... అడుగు!’’ అన్నాడు శంకర్.
 ‘‘ఒక రాజు ఉన్నాడు. ఓ యుద్ధంలో ఆ రాజు ప్రాణాలను ఓ సైనికుడు కాపా డాడు. దాంతో ఆ సైనికుడంటే రాజుకు ఇష్టం ఏర్పడింది. అది రోజురోజుకూ పెరిగింది.

ఓ రోజు ఆ సైనికుడిని పిలిచి... ‘నా ప్రాణాలను కాపాడిన నువ్వంటే నాకిష్టం. అందుకే నీకో బహుమతి ఇవ్వా లనుకుంటున్నాను. ఈ గుర్రం ఎక్కి సూర్యాస్తమయంలోపు ఎంత భూమి చుట్టి రాగలవో అంత భూమిని నీకు ఇచ్చేస్తాను’ అని చెప్పాడు. ఆ సైనికుడు నువ్వే అయితే ఏం చేస్తావ్?’’ అని అడిగింది రేఖ.
 ‘‘మ్యాగ్జిమమ్ భూమిని కవర్ చేస్తాను’’ ఠక్కున చెప్పాడు శంకర్.
 
‘‘ఆ... ఆ సైనికుడు కూడా అదే పని చేశాడు. ఆకలి దప్పులు పట్టించుకోకుండా రోజంతా గుర్రాన్ని పరుగులు పెట్టించాడు. చివరకు అలిసిపోయి ప్రాణాలు కోల్పోయే దశలో అనుకున్నాడు... ఇంత దూరం పరుగులు తీశాను, కానీ ఇప్పుడు నన్ను కప్పెట్టడానికి ఆరడుగులు చాలు అని.’’
 
‘‘వాట్ డూ యూ మీన్?’’
 ‘‘ఆ సైనికుడికి చావు దగ్గరకు వచ్చి నప్పుడైనా కనువిప్పయింది. నీకు మాత్రం ఇంకా కాలేదు. అదే బాధగా ఉంది శంకర్. ఈ కథ మన జీవితం లాంటిదే. డబ్బు, పదోన్నతులు, గుర్తింపు కోసం రోజంతా, జీవితమంతా పరుగులు పెడుతూనే ఉంటాం. అందులో మునిగిపోయి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అందుకే 30, 35 ఏళ్లకే బీపీ, షుగర్, గుండెపోటు వచ్చేస్తోంది.

జీవించడానికి డబ్బు, హోదా, గుర్తింపు అవసరమే. కానీ అవే జీవితం కాదు. జీవితమంటే ఆనందించడం. కాస్త ఆ పరుగులాపి జీవితాన్ని జీవించు, జీవితాన్ని ప్రేమించు, జీవితాన్ని ఆనందించు.’’
 అర్థమైంది అన్నట్టుగా తలూపాడు శంకర్. మనీషా ముఖంలో సంతోషం!
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement