అన్నీ ఇస్తాయి స్ఫూర్తి!
ఆత్మబంధువు
‘‘అమ్మా... అమ్మా...’’ స్కూల్‌నుంచి వస్తూనే పిలిచాడు మిత్ర.
‘‘ఏంటి నాన్నా...?’’... దగ్గరకు తీసుకుని అడిగింది రేఖ.
‘‘నాకు కొన్ని ఇన్‌స్పిరేషనల్, మోటివేషనల్ బుక్స్ కావాలి.’’
‘‘ఎందుకు?’’
‘‘కొన్ని బుక్స్ చదివి అందులో ఇన్‌స్పైర్ చేసిన దానిపై వ్యాసం రాయమని చెప్పారు.’’
‘‘ఓహ్ అలాగా... బుక్స్ చదివే రాయాలా?
లేదంటే స్ఫూర్తినిచ్చిన ఏ అంశం గురించైనా రాయొచ్చా?’’
‘‘రాయొచ్చు. కానీ ఇన్‌స్పయిర్ చేసిన దాని గురించే రాయాలి.’’
‘‘అలా అయితే... మన చుట్టూ ఉన్నవన్నీ స్ఫూర్తినిచ్చేవే నాన్నా!’’
‘‘అవునా... మన చుట్టూ అలాంటివి ఏమున్నాయమ్మా?’’ అసక్తిగా అడిగాడు మిత్ర.
‘‘చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్... మనం భూమి మీద ఉన్నాం కదా. భూమి మనకు ఏం చెప్తుంది?’’
‘‘ఏం చెప్తుంది?’’
‘‘నేను నీ తల్లిని. నీకు జీవితాన్ని ఇచ్చాను. మీ అందరినీ భరిస్తున్నది నేనే. మీరు నన్నెంత కష్టపెట్టినా మీ మీద ప్రేమ తగ్గదు, ఎందుకంటే మీరంతా నా బిడ్డలు. నువ్వు కూడా నాలానే బిడ్డలను ప్రేమించు, మంచివారిగా పెంచు. నీ చుట్టూ ఉన్నవాటిలో అందాన్ని ఆస్వాదించు.
నీతోపాటు నీ చుట్టూ ఉన్న వారిని గౌరవించు. ఎందుకంటే మనం దరం ఒక్కటే. మిగతా ప్రాణులకంటే నువ్వేదో గొప్పవాడివి అనుకోకు. నామీద జీవించే ప్రాణులన్నీ ఒక్కటే నాకు. నా దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు అందరినీ ఒకలాగే ఆహ్వానిస్తాను... అని చెప్తుంది.’’
‘‘ఓహ్.. ఇంకా...?’’
‘‘ఎవరినుంచీ ఏమీ ఆశించకుండా వెచ్చని ప్రేమను పంచు.
నీకోసం నువ్వే కాకుండా పదిమందికీ ఉపయోగపడేలా జీవించు... అని సూర్యుడు చెప్తాడు.’’
‘‘నిజమే కదా అమ్మా. సూర్యుడి వల్లనే కదా మనమంతా బ్రతికున్నాం. ఇంకా చెప్పమ్మా!’’
‘‘నేనే నీ ప్రాణం. అందుకే నన్ను గుండెల్లో నింపుకో. నీ శరీరాన్ని ఆరో గ్యంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతా. రోజుకో ఐదు నిమిషాలైనా ధ్యానించి మౌనంగా హృదయం చెప్పేది విను. నన్నెంత కలుషితం చేస్తున్నా మిమ్మల్ని క్షమిస్తున్నట్లే నువ్వు కూడా ఇతరులను క్షమించు అని గాలి చెప్తుంది.’’
‘‘మన చుట్టూ ఇన్ని ఇన్‌స్పిరేషనల్ విషయాలున్నాయంటే చాలా బాగుంది మమ్మీ. ఇంకా చెప్పవా ప్లీజ్!’’ అన్నాడు మిత్ర ఉత్సాహంగా.
‘‘ప్రకృతిలోని అన్ని అంశాలూ మనకు స్ఫూర్తినిచ్చేవేరా. మనం కళ్లు తెరచి చూడాలి, చెవులతో వినాలి, మనసుతో తెలుసుకోవాలి అంతే. ఉదాహరణకు చెట్టును తీసుకో. నిలబడు... నిటారుగా. ఒంటరిగా, జంటగా, గుంపుగా.. ఎలాగైనా సరే.
ఎవరేం చేసినా ఫలాలివ్వడం మర వకు. పెనుగాలి వచ్చినపుడు తలవంచడం మరవకు. ఓపికగా ఉండు. కాలంతో పాటు నువ్వూ ఎదుగుతావు అని చెప్తుంది. నీకు నువ్వు సృష్టించుకున్న హద్దుల్ని దాటి విస్తరించు, నిన్ను నువ్వు వ్యక్తపరచుకో, మార్పును గమనించు, అనంతమైన అవకాశాలను గుర్తించు అని అనంతాకాశం చెప్తుంది. అన్ని భయాలూ మరచి స్వేచ్ఛగా జీవించమని, మనసారా పాడమని పక్షులు చెప్తాయి.
మనసును తేలిగ్గా ఉంచుకోమని, నిరంతరం సృజనాత్మకంగా ఆలోచించ మని, ఆ ఆలోచనలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచమని మేఘాలు చెప్తాయి. దయతో చల్లగా చూడమనీ, అందరినీ ప్రేమించమని, ప్రేమను పంచమనీ, ప్రేమను స్వీకరించమనీ చంద్రుడు, చుక్కలా మెరవమని నక్షత్రాలూ చెప్తాయి’’... చెప్పింది రేఖ.
‘‘అన్నీ పెద్దపెద్దవేనా? చిన్నవి ఏమీ చెప్పవామ్మా?’’ ప్రశ్నించాడు మిత్ర.
‘‘ఎందుకు చెప్పవు... చెప్తాయి. పర్‌ఫెక్షనిజం కోసం చూడకుండా నిన్ను నిన్నుగా ప్రేమించమని, గౌరవించమనీ... చిన్న చిన్న అంశాల్లోని అందాన్ని ఆస్వా దించమనీ మొక్కలూ పుష్పాలూ చెప్తాయి. అంతెందుకు... కష్టించి పనిచేయమనీ, భవిష్యత్తుకు కూడబెట్టుకోమనీ, కలిసి కట్టుగా జీవించమనీ, ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమనీ చీమలు చెప్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న ప్రకృతి, అందు లోని జీవులూ ఇలా అనేక విధాలుగా స్ఫూర్తినిస్తాయి’’... వివరించింది రేఖ.
‘‘థాం్యక్యూ సోమచ్ మమ్మీ...’’ అంటూ అమ్మకు ముద్దు పెట్టాడు మిత్ర.
‘‘ముద్దులు పెట్టుకుంటే సరిపోదు నాన్నా. నేను చెప్పినవి కాకుండా, నీ చుట్టూ ఉన్నవాటిని పరిశీలించి అవి నీకేం పాఠాలు చెప్తున్నాయో, ఎలా స్ఫూర్తినిస్తు న్నాయో రాసి చూపించు’’ అంది రేఖ.
‘‘ఓ... నీకు చూపించాకే స్కూల్‌లో ఇస్తాను’’ అంటూ లేచాడు మిత్ర.
- డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్