ఆనందాల ప్లే స్టేషన్! | The pleasures of the play station! | Sakshi
Sakshi News home page

ఆనందాల ప్లే స్టేషన్!

Published Sun, Feb 14 2016 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

ఆనందాల ప్లే స్టేషన్!

ఆనందాల ప్లే స్టేషన్!

ఆత్మబంధువు
‘‘మమ్మీ... నాకు ప్లేస్టేషన్ కావాలి’’ ’’ స్కూల్‌నుంచి వస్తూనే అన్నాడు మిత్ర.
 ‘‘కొందాంలే.’’
 ‘‘కొందాంలే కాదు, వెంటనే కావాలి’’ డిమాండింగ్‌గా అడిగాడు. స్కూల్‌లో ఏదో జరిగిందని రేఖకు అర్థమైంది. అప్పటికి సరేనని కాసేపయ్యాక మెల్లగా మాటల్లోకి దించింది... విషయం రాబట్టడానికి.
 ‘‘ఇవ్వాళ స్కూల్ ఎలా ఉంది కన్నా?’’
 ‘‘బాగానే ఉంది.’’
 ‘‘నీ ఫ్రెండ్స్?’’
 ‘‘వాళ్లూ బాగానే ఉన్నారు.’’
 ‘‘మరి నువ్వు?’’
 
మిత్ర మౌనంగా ఉండిపోయాడు.
 ‘‘ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది నాన్నా. నువ్వు చెప్తేనే కదా నేనేమైనా చేయగలిగేది’’ అంది రేఖ.
 ‘‘ఆర్యన్‌గాడు నన్ను ‘పూర్ ఫెలో’ అని తిట్టాడు మమ్మీ’’ అంటూ ఏడ్చేశాడు మిత్ర. ‘‘సరదాగా అనుంటాడులే. దానికే ఏడిస్తే ఎలా?’’ అంటూ ఊరడించింది.
 ‘‘సరదాకు కాదు, నిజంగానే.

‘మీ ఇంట్లో స్మార్ట్ టీవీ లేదు, నీ మొహానికి ప్లే స్టేషన్ లేదంటూ ఎగతాళి చేశాడు.’’
 ‘‘ఔనా... సర్లే బాధపడకు, కొని పెడతాలే’’ అని కొడుకుని ఓదార్చి ఆలోచనలో పడింది రేఖ. పిల్లలకు చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు బాధపడింది. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
   
‘‘కన్నా, బుజ్జీ... నెక్స్ట్ సెకండ్ సాటర్‌డే, సండే మనం అమ్మమ్మ వాళ్లు ఊరు వెళ్తున్నాం’’ అని పిల్లలు స్కూల్ నుంచి రాగానే చెప్పింది రేఖ. వాళ్లు ఎగిరి గంతేశారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. ఆనంద్‌కు ఆఫీసు పని వల్ల రాలేనన్నాడు. దాంతో పిల్లలను తీసుకుని రేఖ వెళ్లింది.
 ఆ రెండు రోజులూ మిత్ర, మైత్రి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి, పొలాలు, తోటలన్నీ తిరిగారు. కబుర్లు చెప్పారు. బంధువుల పిల్లలతో ఆడుకున్నారు. సంతోషంగా ఇంటికి బయలుదేరారు.
 
‘‘నాన్నా.. బాగా ఎంజాయ్ చేశావా?’’ కారులో అడిగింది రేఖ.
 ‘‘ఓ... యా.. ఫుల్లుగా మమ్మీ’’ చెప్పాడు మిత్ర.
 ‘‘సరే.. అక్కడ చాలామందితో ఆడు కున్నావు. వాళ్లలో పేదవాళ్లూ ఉన్నారు కదా. వాళ్లనుంచి ఏం తెలుసుకున్నావ్?’’
 ‘‘మమ్మీ... మనకు ఒక కుక్కే ఉంది. కానీ వాళ్లకు ఒక్కో ఇంటికి రెండు, కొందరికి నాలుగు కుక్కలు కూడా ఉన్నాయి.

మనం ఈత కొట్టాలంటే స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాలి, కానీ వాళ్లకి పేద్ద చెరువుంది. మనం బెడ్‌లైట్ వేసుకుని పడుకుంటాం, వాళ్లు ఆకాశంలో చంద్రుడ్ని, చుక్కల్ని చూస్తూ పడు కుంటారు. మనం కుండీల్లో నాలుగు మొక్కలు పెంచుకుని ఆనందిస్తాం, వాళ్లు కావాల్సినన్ని మొక్కలు పెంచుకుంటారు. మన పని వాళ్లు సరిగా చేస్తే మనం ఆనందిస్తాం, వాళ్లు పని చేయడాన్ని ఆనందిస్తారు. మనం బియ్యం, కూరగాయలు కొను క్కుంటాం... వాళ్లు పండించి అందరికీ అందిస్తారు. మనల్ని కాపాడుకోవడానికి ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టుకున్నాం... వాళ్లకు ఏదైనా కష్టమొస్తే కాపాడటానికి కావాల్సినంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని చెప్పింది మైత్రి.
 
‘‘వాళ్లకు స్మార్ట్ టీవీలు, ఐపాడ్‌లు లేవు... అయినా చాలా హ్యాపీగా ఉన్నారు’’ అని చెప్పాడు మిత్ర.
 ‘‘గుడ్, గుడ్... గుడ్ అబ్జర్వేషన్. ఇంకా?’’
 ‘‘ఈ రెండ్రోజులూ మాకసలు టీవీ చూద్దామనిపించలేదు. ఫుల్లుగా ఆడు కుంటూనే ఉన్నాం. అక్కడ ఆడుకునే ఆటలకు పెద్దగా వస్తువులు కూడా అవసరంలేదు. ఐ ఎంజాయ్‌డ్ ఎ లాట్’’ అని చెప్పింది మైత్రి.
 ‘‘నాక్కూడా... అసలేం గుర్తుకురాలేదు’’ చెప్పాడు మిత్ర.
 ‘‘ఇంకా...?’’ అడిగింది రేఖ.
 
‘‘ఇంకా అంటే... హ్యాపీగా ఉండటానికి ప్లే స్టేషన్ అవసరం లేదని అర్థమైంది’’ తమ్ముడి వంక టీజింగ్‌గా చూస్తూ చెప్పింది మైత్రి.
 ‘‘చూడు మమ్మీ.. అక్క ఎలా టీజ్ చేస్తుందో. నేను అడిగింది ఒక్కసారే’’ అన్నాడు మిత్ర.
 ‘‘ఒక్కసారైనా.. దానికోసం ఏడ్చావుగా!’’ మరింత టీజింగ్‌గా చెప్పింది మైత్రి.
 ‘‘నేను ఏడ్చింది ప్లే స్టేషన్ కోసం కాదు.’’
 ‘‘మరి దేనికోసమో?’’
 
‘‘ఆర్యన్‌గాడు అలా అన్నాడని.’’
 ‘‘వాడు మళ్లీ అంటే?’’
 ‘‘పో పోరా. హ్యాపీగా ఉండాలంటే ప్లే స్టేషన్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేస్తా.’’
 ‘‘ఆర్ యూ ష్యూర్?’’
 ‘‘ఎస్... ఐ యామ్!’’ ధృఢంగా చెప్పాడు మిత్ర.
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement