'నా అందమే.. నన్ను బంధించింది' | Atmabandhuvu | Sakshi
Sakshi News home page

'నా అందమే.. నన్ను బంధించింది'

Published Sun, Feb 7 2016 4:23 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

'నా అందమే.. నన్ను బంధించింది'

'నా అందమే.. నన్ను బంధించింది'

ఆత్మబంధువు
 స్కూల్ పూర్తయి మిత్ర, మైత్రి తిరిగి వచ్చారు. ఇద్దరికీ పాలు కలిపి ఇచ్చింది రేఖ. మైత్రి ముభావంగా ఉండటం గమనించింది. మిత్ర ఆడుకోవడానికి వెళ్లాక మైత్రిని అడిగింది, ఎందుకలా ఉన్నావని. ‘‘ఏం లేదమ్మా. అయామ్ ఆల్‌రైట్!’’ అంది మైత్రి.‘‘నేను మీ అమ్మను. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదా! ఏమైందిరా?’’‘‘నేను నల్లగా ఉన్నానని క్లాస్‌మేట్స్ ఏడిపిస్తున్నారమ్మా’’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది మైత్రి.‘‘అవునా. మరి నువ్వేమన్నావ్?’’
 
 ‘‘ఏమీ అన్లేదు. గమ్మునే ఉన్నా. తెల్లగా అవుదామని ఎన్ని క్రీములు రాసినా కావడం లేదు.’’ ‘‘చూడు నాన్నా... ఎవరో ఏదో అన్నారని నీలో నువ్వే ఏడుస్తూ కూర్చుంటే ఎలా? అయినా రంగుదేముంది?’’ అంటూ దగ్గరకు తీసుకుంది రేఖ. ‘‘నువ్వలాగే అంటావ్. కానీ స్కూల్లో అన్నిటికీ తెల్లగా ఉండే అమ్మాయిల్నే పిలుస్తారు. నల్లగా ఉండే వాళ్లను అస్సలు కన్సిడర్ కూడా చేయరు.’’క్షణం ఆలోచించింది రేఖ. తర్వాత అడిగింది... ‘‘అన్నింటికంటే నలుపైన పక్షి ఏమిట్రా?’’

 ‘‘ఇంకేంటి.. కాకి’’ చెప్పింది మైత్రి.
  ‘‘కదా... అడవిలో ఉన్న ఓ కాకి తన రంగు, ఆకారం పట్ల చాలా సంతోషంగా ఉండేది. ప్రపంచంలోకెల్లా తానే అందగత్తెను అనుకునేది. అది ఓ రోజు హంసను చూసింది. అంతే.. అప్పటి వరకూ ఉన్న ఆనందమంతా మాయ మైంది. తన రంగు చూసి తనకే అసహ్యం వేసింది. ‘నేనింత నల్లగా ఉన్నాను. హంస తెల్లగా, అందంగా ఉంది’ అనుకుంది. అదే విషయాన్ని హంసతో చెప్పింది.  ‘అలా అనుకునే మొదట నేను చాలా సంతోషంగా ఉన్నాను.
 
  కానీ రామ చిలుకను చూశాక నా ఆనందమంతా దూరమైంది. నేను తెల్లగా ఒక్క రంగుతోనే ఉంటాను. కానీ చిలుక రెండు రంగులతో మెరుస్తూ ఉంటుంది’ అని చెప్పింది’ హంస. దీంతో కాకి చిలుక దగ్గరకు వెళ్లింది. దాని అందాన్ని చూసి మురిసి పోయింది. ‘నువ్వింత అందంగా ఉన్నావు. అందుకు ఆనందంగా ఉండి ఉంటావు కదా!’ అని అడిగింది. ‘ఔను నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నెమలిని చూసేంతవరకే. నాకున్నవి రెండు రంగులే. నెమలి బహు రంగులతో మెరిసిపోతుంటుంది. దాని పింఛం చూస్తే మతిపోతుంది. అందుకే నాకన్నా నెమలి సంతోషంగా ఉంటుంది’ అని చెప్పింది చిలుక.
 
 దాంతో నెమలి ఎంత ఆనందంగా ఉందో తెలుసుకునేందుకు బయలుదేరింది కాకి. కానీ ఎక్కడా నెమలి కనిపించలేదు. జూపార్‌‌కలో ఉంటుందని ఎవరో చెబితే వెళ్లింది. అక్కడ నెమలిని చూసేందుకు వందలాదిమంది బారులు తీరి ఉన్నారు. అది పురివిప్పగానే సెల్ఫీలు తీసు కుంటున్నారు. నెమలిని పలకరించేందుకు కుదరలేదు. దాంతో జూ సమయం ఐపోయేంత వరకూ వేచి చూసి, తర్వాత నెమలితో మాట కలిపింది.‘నెమలి బావా! నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూసేందుకు రోజూ వేలాదిమంది వస్తారు. అందరికన్నా నువ్వే ఆనందంగా ఉన్నావు. నన్ను చూడు ఎంత అసహ్యంగా ఉన్నానో. అందుకే నన్ను చూడగానే అందరూ అసహ్యించు కుంటారు’’ అంటూ వాపోయింది.
 
 ‘‘అవును.. ప్రపంచంలోకెల్లా నేను అందంగా ఉన్నానని అందరూ అంటూఉంటారు. కానీ నా అందమే నన్ను తెచ్చి ఈ బోనులో బంధించింది. ఇక్కడ ఇష్టమొచ్చి నట్లు ఎగరడానికి లేదు, ఇష్టమొచ్చింది తినడానికీ లేదు. పెట్టింది తిని, ఈ కంచె మధ్యే తిరుగుతుండాలి. ఇంతకంటే దుర్భరమైన జీవితం మరోటి లేదు’’ అంటూ వాపోయింది నెమలి. ‘‘అదేంటి! ఇంత అందంగా ఉన్న నువ్వే ఆనందంగా లేకపోతే ఇంకెవ రుంటారు?’’ అని ప్రశ్నించింది కాకి.
 
 ‘‘నేను జూకి వచ్చినప్పటినుంచీ అంతా పరిశీలిస్తున్నా. ఈ జూలో అన్ని జంతువులనూ, పక్షులనూ పంజరాల్లో బంధించి ఉంచారు... ఒక్క  కాకిని తప్ప. అందుకే.. నేను కాకినైతే ఎంత బావుండేదో కదా అని రోజూ అనుకుంటూ ఉంటా’’ అని చెప్పింది నెమలి బావ!దాంతో కాకి విస్తుపోయింది. తన దగ్గర అందం లేదు తప్ప, తాను అందరి కంటే స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నానన్న నిజాన్ని గుర్తించలేకపోయింది. తన అదృష్టం అర్థమై సంతోషంగా ఎగిరిపోయింది.   అమ్మ ఏం చెప్పాలనుకుందో మైత్రికి అర్థమైంది. దేనికి విలువివ్వాలో, దేనికి ఇవ్వకూడదో తెలిసి వచ్చింది. ఇతరులతో పోల్చుకోవడం వల్లనే తాను ఎక్కువగా బాధపడుతున్నానని అర్థమైంది. ‘థాంక్యూ మమ్మీ’’ అంటూ తల్లికి ఓ ముద్దిచ్చింది.

 - డా॥విశేష్,
 కన్సల్టింగ్ సైకాలజిస్ట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement