మాటల మేకులు కొట్టొద్దు! | Atma bandhuvu | Sakshi
Sakshi News home page

మాటల మేకులు కొట్టొద్దు!

Published Sun, Aug 2 2015 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

మాటల మేకులు కొట్టొద్దు!

మాటల మేకులు కొట్టొద్దు!

ఆత్మబంధువు
 ‘‘ఉషా... ఉషా... ఎన్నిసార్లు పిలవాలి?’’
 ‘‘ఏం కావాలి కిరణ్?’’
 ‘‘నా సాక్స్ కనిపించ ట్లేదు. ఎక్కడ పెట్టావ్?’’
 ‘‘ఆ మాత్రం వెతుక్కోలేవా?’’
 ‘‘నేను సాక్స్ వెతుక్కుంటూ కూర్చుంటే ఆఫీసుకు లేట్ అవుతుంది.’’
 ‘‘సాక్స్ వెతికిస్తూ కూర్చుంటే నాకూ లేట్ అవుతుంది ఆఫీసుకు.’’
 ‘‘ఏంటీ.. మాటకు మాట సమాధానం చెప్తున్నావ్?’’
 ‘‘చెప్పకపోతే లెక్క లేదా అంటావ్. చెప్తే మాటకు మాట అంటావ్. ఎలా నీతో?’’
 ‘‘అంటే నేను గొడవ పడుతున్నానంటావా?’’
 ‘‘బాబూ... నేనేం అన్లేదు. నువ్వు ఆఫీసుకు బయల్దేరు. నేనూ బయల్దేరాలి... బై.’’
 
    మమ్మీ... మమ్మీ.. అరుస్తున్నాడు గౌతమ్. ఉషా, కిరణ్‌ల ముద్దుబిడ్డ.
 ‘‘ఏంటి నాన్నా ఏమైంది?’’
 ‘‘నా షూ పాలిష్ చేయలేదు.’’
 ‘‘చేసుకో నాన్నా.’’
 ‘‘నేనెందుకు చేసుకోవాలి? నువ్వే చెయ్.’’
 ‘‘నేను పన్లో ఉన్నారా. ఈ రోజుకు నువ్వు చేసుకో.’’
 ‘‘నో.. నేను చేసుకోను. నువ్వు చేస్తావా? లేదా?’’
 ‘‘నాకిప్పుడు కుదరదు నాన్నా.’’
 బ్యాడ్ మమ్మీ అనుకుంటూ స్కూల్‌కు వెళ్లిపోయాడు గౌతమ్.
 వాడన్న మాటకు ఉష మనసు చివుక్కుమంది. ‘ఏంటిది, నేనిన్ని చేస్తున్నా వీడిలా అనేశాడు’ అనుకుంది. కోపంలో అచ్చం తండ్రి పోలికే. చిన్న చిన్న విషయాలకు కూడా అరిచేస్తూ ఉంటాడు. వీడినిలా వదిలేస్తే కష్టం అనుకుంటూ ఆఫీసుకు బయల్దేరింది, మమ్మీ... మమ్మీ... అరుస్తు న్నాడు గౌతమ్. ‘‘మళ్లీ ఏమైందిరా?’’ అడిగింది ఉష.
 
 ‘‘నేను స్కూల్‌కు వెళ్లను.’’
 ‘‘ఏం? ఏమైందీ?’’
 ‘‘నాకు మా టీచర్ నచ్చ లేదు. ఇవ్వాళ నాకు పనిష్‌మెంట్ ఇచ్చింది.’’
 ‘‘నువ్వేం చేశావ్?’’
 ‘‘గోపాల్ నా పెన్సిల్ తీసుకున్నాడని కొట్టాను. అందుకని పనిష్‌మెంట్ ఇచ్చింది.’’
 
 ‘‘పెన్సిల్ తీసుకుంటే కొట్టేస్తావా? తప్పుకదా?’’
 ‘‘కొడతాను’’... గట్టిగా చెప్పాడు గౌతమ్.
 వాడి కోపానికి బ్రేక్‌లు వేయకపోతే భవిష్యత్తులో కష్టమనుకుంది ఉష. ఇంట్లోకి వెళ్లి కొన్ని మేకులు, ఒక సుత్తి తెచ్చింది. ‘‘నాన్నా.. నేనో పని చెప్తా చేస్తావా?’’ అడిగింది గౌతమ్‌ని.
 
 ఏంటో చెప్పమన్నాడు. ‘‘ఇదిగో.. ఈ మేకులు, సుత్తి తీసుకో. నీకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు కోపం తగ్గేంతవరకూ ఈ మేకులు ఆ చెక్కకు కొట్టెయ్’’ అంటూ ఎదురుగా హృదయాకారంలో ఉన్న ఎర్రటి చెక్కను చూపించింది.
 ‘‘అంతే కదా. ఐయామ్ రెడీ’’ అంటూ మేకులు, సుత్తి అందుకున్నాడు గౌతమ్. టీచర్ మీదున్న కోపంతో 25 మేకులు కొట్టేశాడు. ‘‘ఉషా.. ఈ చెక్క, మేకులు, సుత్తి గొడవేంటీ? వాడికేమైనా దెబ్బ తగిలితే’’ అరిచాడు కిరణ్.
 ‘‘ఏం కాదులే కిరణ్. నువ్వు గమ్మునే ఉండు. లెట్ హిమ్ డూ దట్’’ అంది ఉష.
    ‘‘మమ్మీ... ఈ మేకులిలా ఎన్ని రోజులు కొట్టాలి?’’... మర్నాడు అడిగాడు గౌతమ్.
 ‘‘నీకు కోపం ఉన్నన్ని రోజులూ కొట్టు’’... చెప్పింది ఉష.
 
 ‘‘మరి చెక్క నిండిపోతే?’’
 ‘‘నువ్వు కోప్పడిన మనిషికి నువ్వు సారీ చెప్పినప్పుడు ఓ మేకు తీసెయ్. అప్పుడు గ్యాప్ వస్తుంది.’’
 ‘‘నేనెందుకు చెప్పాలి సారీ?’’ అంటూ మరో నాలుగు మేకులు కొట్టేశాడు గౌతమ్.
 నెల రోజులు గడిచాయి. అప్పుడ ప్పుడూ చెప్పిన సారీలకు కొన్ని మేకులు తీసేయగా చెక్క దాదాపు నిండిపోయింది. ‘‘మమ్మీ... ఈ చెక్క నిండిపోయింది. ఇప్పుడేం చేయమంటావ్?’’ అడిగాడు గౌతమ్.
 ‘‘ఒక్కో మేకుకూ ఒక్కో సారీ చెప్తూ బయటకు తియ్’’... చెప్పింది ఉష.
 గౌతమ్ ఇష్టం లేకుండానే సారీ చెప్తూ, కష్టపడి ఒక్కో మేకూ బయటకు లాగుతూ చెక్క ఖాళీ చేసేశాడు.
 
 ‘‘ఇప్పుడు చూడు.. చెక్క ఎలా ఉందో’’... అంది ఉష.
 ‘‘ఏం బాగుంది? అన్నీ బొక్కలే... అన్నాడు గౌతమ్.
 ‘‘ఇప్పుడు వాటిని పూడ్చేసి చెక్కను మామూలుగా మార్చు.’’
 ‘‘అదెలా? చెక్కకు పడ్డ రంధ్రాలు పూడ్చడం ఎలా కుదురుతుంది?’’
 ‘‘కదా... మరి అవి ఎలా వచ్చాయ్? మేకులు కొడితే వచ్చాయ్. నువ్వు మేకులు ఎప్పుడు కొట్టావ్? కోపం వచ్చినప్పుడు. నీకు కోపం వచ్చినప్పుడు ఇంకా ఏం చేస్తావ్?’’
 
 ‘‘గట్టిగా అరిచేస్తాను.’’
 ‘‘కదా... ఆ మేకులు నీ అరుపులన్నమాట. నువ్వు కోపంతో ఉన్నప్పుడు మాటలు నీకు తెలియ కుండానే వచ్చేస్తాయి. అవి ఎదుటివాళ్లకు కష్టం కలిగిస్తాయి. నువ్వు ఎలాగైతే రంధ్రాలు పూడ్చలేనన్నావో.. అలాగే నువ్వెన్ని సారీలు చెప్పినా వాళ్లకు కలిగిన బాధ పూర్తిగా తొలగిపోదు.’’గౌతమ్‌కు విషయం అర్థమైంది. తను చేస్తున్న తప్పేంటో తెలిసొచ్చింది. ‘‘సారీ మమ్మీ’’ అంటూ ఉషను హగ్ చేసు కున్నాడు. ‘‘సారీ ఉషా’’ అంటూ కిరణ్ కూడా హగ్ చేసుకున్నాడా రాత్రి!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement