అంతా మన మంచికే! | all are efforrts to Good Things...! | Sakshi
Sakshi News home page

అంతా మన మంచికే!

Published Sun, Dec 13 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

అంతా మన మంచికే!

అంతా మన మంచికే!

ఆత్మబంధువు
ఎప్పుడూ గలగలా మాట్లాడే రత్నమాంబ చాలా దిగులుగా ఉంది. ఆమెనలా చూడటం రేఖకు కొత్తగా ఉంది.
‘‘ఏంటత్తమ్మా అలా ఉన్నారు?’’ అని అడిగింది.
‘‘ఏం లేదులే’’ అని తనదైన తీరులో సమాధానం చెప్పింది రత్నమాంబ.
 కానీ ఆమె దేనిగురించో బాధపడుతోందని అర్థమైంది రేఖకు. అయితే అడిగినా చెప్పేరకం కాదు కాబట్టి వంటపనిలో మునిగిపోయింది. కాస్సేపటి తర్వాత ‘‘రేఖా’’ అని పిలిచింది రత్నమాంబ.
 ‘‘హా... చెప్పండత్తమ్మా’’ అంటూ వచ్చింది రేఖ.
 ‘‘నా మనసేం బాలేదు. నాల్రోజులు అమ్మాయి వాళ్లింట్లో ఉండొస్తా.’’
 
‘‘మీ ఇష్టం అత్తమ్మా. కానీ మీ అబ్బాయి వచ్చాక చెప్పి వెళ్తే బావుం టుందేమో...’’ అంటూ ఆగింది రేఖ.
 ‘‘వాడికి చెప్తే వెళ్లనివ్వడులే. నేను వెళ్తున్నాను. వాడికి నువ్వే చెప్పు’’ అని బ్యాగ్ సర్దుకుని కూతురింటికి వెళ్లిపోయింది రత్నమాంబ.
 ఆవిడంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిందో రేఖకు అర్థం కాలేదు. భర్త వచ్చాక విషయం చెప్పింది.
 ‘‘ఎందుకెళ్లింది?’’ అని అడిగాడు ఆనంద్.

 ‘‘ఏమో.. నాకేం తెలుసు! అడిగినా చెప్పలేదు’’ అంది.
 ‘‘మీరేమైనా గొడవపడ్డారా?’’ అని ఆరా తీశాడు.
 ‘‘అలాంటిదేం లేదండీ.’’
 ‘‘మరెందుకు వెళ్లి ఉంటుంది? సర్లే.. నేనే ఫోన్ చేసి మాట్లాడతా’’ అన్నాడు.
 మర్నాడు ఉదయం రత్నమాంబ రూమ్ సర్దుతుంటే ఓ కాగితం కనిపించింది రేఖకు. అందులో ఇలా రాసి ఉంది.
 ‘‘ఇప్పుడు నా టైమ్ బాగాలేదు.

నాకు శని పట్టినట్టుంది. ఇంట్లో ఒంట్లో అన్నీ సమస్యలే. నాకు 60 ఏళ్లు వచ్చాయి. ఈ ఏడాదే నన్నెంతో ప్రేమగా చూసుకునే మా నాన్న కూడా చని పోయారు. ఒంటరిదాన్ని అయిపోయాను. నిన్నటివరకూ మహారాణిలా ఉన్నదాన్ని ఇప్పుడు కృష్ణా రామా అంటూ నా రూమ్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోడలేమో వంట గదిలోకి రానివ్వట్లేదు. నా గాల్ బ్లాడర్ తీసేశారు. ఆపరేషన్ చేయించు కోవడం వల్ల చాలా కాలం బెడ్ మీదనే ఉండాల్సి వచ్చింది. చిన్న కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది. కారు తుక్కుతుక్కు అయి పోయింది.

వాడు కూడా చాలా కాలం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఇది నిజంగానే శని పట్టిన కాలం. జ్యోతిష్యుడికి చూపించి శాంతి చేయించాలి.’
 ఆ పేపర్ చదివాక అత్తగారి బాధేంటో రేఖకు అర్థమైంది. తనకు వరుసగా ఎదురైన దుర్ఘటనలతో మానసికంగా బాగా డీలా పడిందనీ, డిప్రెషన్‌లోకి వెళ్తోందనీ తెలిసింది. ఆ సమయంలో ఆవిడకు మానసిక బలం కల్పించాలని నిశ్చయించుకుంది. నాల్రోజుల తర్వాత భర్తకు చెప్పి అత్తగారిని ఇంటికి పిలిపించుకుంది.
    
ఇంటికి వచ్చినా దిగులుగానే ఉంది రత్నమాంబ. రేఖ ఇచ్చిన కాఫీ తాగాక తన రూమ్‌లోకి వెళ్లిపోయింది. తను రోజూ చదువుకునే భాగవతం తీస్తుంటే అందులోంచి ఓ కాగితం జారి పడింది. ఏమిటా అని తీసుకుని చదివింది. అందులో ఇలా ఉంది.
 ‘ఈ ఏడాది చాలా మంచిది. నాకు అంతా మంచే జరిగింది. ఎన్నో ఏళ్లుగా బాధపెడుతున్న గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ చేసి తీసేశారు. ఇప్పుడు ఎలాంటి బాధా లేదు. 90 సంవత్సరాలు బతికిన మా నాన్న ఎవ్వరిమీదా ఆధార పడలేదు. చనిపోయేంతవరకూ తన పనులు తానే చేసుకున్నారు. ఇంత మంచి మరణం ఎవ్వరికుంటుంది!

నాకు ఇరవయ్యేళ్లకే పెళ్లయింది. నలభై ఏళ్లపాటు వంటింట్లోనే ఉన్నాను. ఇప్పుడు వంట చేయాల్సిన పని లేదు. హాయిగా నా రూమ్‌లో కూర్చుని నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవచ్చు. నాకు కావాల్సినవి ఆర్డర్ వేసి కోడళ్లతో చేయించుకోవచ్చు. దేవుడు చల్లగా చూడబట్టి నా చిన్న కొడుకు పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు. కారు పోతే పోయింది, ఇంకోటి కొనుక్కో వచ్చు. నా కొడుకును నాకు ఇచ్చినందుకు తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరుడికి మొక్కి రావాలి. నా వేంకటేశ్వరుడు నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. గోవిందా... గోవిందా!’
 
రత్నమాంబ కళ్లలో నీళ్లు తిరిగాయి. అలా రాసి పెట్టింది ఎవరో అర్థమైంది. రేఖను పిలిచి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మరుసటి వారం కుటుంబంతో సహా వెళ్లి గోవిందుని దర్శనం చేసుకుని వచ్చింది. అత్తగారి కోసం రేఖ యూ ట్యూబ్‌లో ‘ఆంటీస్ కిచెన్’ చానల్ ఓపెన్ చేసింది. ఇప్పుడు రత్నమాంబకు చేతి నిండా పని, లక్షలాదిమంది ఫాలోవర్స్. తనో చిన్న సెలెబ్రిటీ!
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement