Ratnamamba
-
అంతా మన మంచికే!
ఆత్మబంధువు ఎప్పుడూ గలగలా మాట్లాడే రత్నమాంబ చాలా దిగులుగా ఉంది. ఆమెనలా చూడటం రేఖకు కొత్తగా ఉంది. ‘‘ఏంటత్తమ్మా అలా ఉన్నారు?’’ అని అడిగింది. ‘‘ఏం లేదులే’’ అని తనదైన తీరులో సమాధానం చెప్పింది రత్నమాంబ. కానీ ఆమె దేనిగురించో బాధపడుతోందని అర్థమైంది రేఖకు. అయితే అడిగినా చెప్పేరకం కాదు కాబట్టి వంటపనిలో మునిగిపోయింది. కాస్సేపటి తర్వాత ‘‘రేఖా’’ అని పిలిచింది రత్నమాంబ. ‘‘హా... చెప్పండత్తమ్మా’’ అంటూ వచ్చింది రేఖ. ‘‘నా మనసేం బాలేదు. నాల్రోజులు అమ్మాయి వాళ్లింట్లో ఉండొస్తా.’’ ‘‘మీ ఇష్టం అత్తమ్మా. కానీ మీ అబ్బాయి వచ్చాక చెప్పి వెళ్తే బావుం టుందేమో...’’ అంటూ ఆగింది రేఖ. ‘‘వాడికి చెప్తే వెళ్లనివ్వడులే. నేను వెళ్తున్నాను. వాడికి నువ్వే చెప్పు’’ అని బ్యాగ్ సర్దుకుని కూతురింటికి వెళ్లిపోయింది రత్నమాంబ. ఆవిడంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిందో రేఖకు అర్థం కాలేదు. భర్త వచ్చాక విషయం చెప్పింది. ‘‘ఎందుకెళ్లింది?’’ అని అడిగాడు ఆనంద్. ‘‘ఏమో.. నాకేం తెలుసు! అడిగినా చెప్పలేదు’’ అంది. ‘‘మీరేమైనా గొడవపడ్డారా?’’ అని ఆరా తీశాడు. ‘‘అలాంటిదేం లేదండీ.’’ ‘‘మరెందుకు వెళ్లి ఉంటుంది? సర్లే.. నేనే ఫోన్ చేసి మాట్లాడతా’’ అన్నాడు. మర్నాడు ఉదయం రత్నమాంబ రూమ్ సర్దుతుంటే ఓ కాగితం కనిపించింది రేఖకు. అందులో ఇలా రాసి ఉంది. ‘‘ఇప్పుడు నా టైమ్ బాగాలేదు. నాకు శని పట్టినట్టుంది. ఇంట్లో ఒంట్లో అన్నీ సమస్యలే. నాకు 60 ఏళ్లు వచ్చాయి. ఈ ఏడాదే నన్నెంతో ప్రేమగా చూసుకునే మా నాన్న కూడా చని పోయారు. ఒంటరిదాన్ని అయిపోయాను. నిన్నటివరకూ మహారాణిలా ఉన్నదాన్ని ఇప్పుడు కృష్ణా రామా అంటూ నా రూమ్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోడలేమో వంట గదిలోకి రానివ్వట్లేదు. నా గాల్ బ్లాడర్ తీసేశారు. ఆపరేషన్ చేయించు కోవడం వల్ల చాలా కాలం బెడ్ మీదనే ఉండాల్సి వచ్చింది. చిన్న కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది. కారు తుక్కుతుక్కు అయి పోయింది. వాడు కూడా చాలా కాలం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఇది నిజంగానే శని పట్టిన కాలం. జ్యోతిష్యుడికి చూపించి శాంతి చేయించాలి.’ ఆ పేపర్ చదివాక అత్తగారి బాధేంటో రేఖకు అర్థమైంది. తనకు వరుసగా ఎదురైన దుర్ఘటనలతో మానసికంగా బాగా డీలా పడిందనీ, డిప్రెషన్లోకి వెళ్తోందనీ తెలిసింది. ఆ సమయంలో ఆవిడకు మానసిక బలం కల్పించాలని నిశ్చయించుకుంది. నాల్రోజుల తర్వాత భర్తకు చెప్పి అత్తగారిని ఇంటికి పిలిపించుకుంది. ఇంటికి వచ్చినా దిగులుగానే ఉంది రత్నమాంబ. రేఖ ఇచ్చిన కాఫీ తాగాక తన రూమ్‌లోకి వెళ్లిపోయింది. తను రోజూ చదువుకునే భాగవతం తీస్తుంటే అందులోంచి ఓ కాగితం జారి పడింది. ఏమిటా అని తీసుకుని చదివింది. అందులో ఇలా ఉంది. ‘ఈ ఏడాది చాలా మంచిది. నాకు అంతా మంచే జరిగింది. ఎన్నో ఏళ్లుగా బాధపెడుతున్న గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ చేసి తీసేశారు. ఇప్పుడు ఎలాంటి బాధా లేదు. 90 సంవత్సరాలు బతికిన మా నాన్న ఎవ్వరిమీదా ఆధార పడలేదు. చనిపోయేంతవరకూ తన పనులు తానే చేసుకున్నారు. ఇంత మంచి మరణం ఎవ్వరికుంటుంది! నాకు ఇరవయ్యేళ్లకే పెళ్లయింది. నలభై ఏళ్లపాటు వంటింట్లోనే ఉన్నాను. ఇప్పుడు వంట చేయాల్సిన పని లేదు. హాయిగా నా రూమ్‌లో కూర్చుని నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవచ్చు. నాకు కావాల్సినవి ఆర్డర్ వేసి కోడళ్లతో చేయించుకోవచ్చు. దేవుడు చల్లగా చూడబట్టి నా చిన్న కొడుకు పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు. కారు పోతే పోయింది, ఇంకోటి కొనుక్కో వచ్చు. నా కొడుకును నాకు ఇచ్చినందుకు తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరుడికి మొక్కి రావాలి. నా వేంకటేశ్వరుడు నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. గోవిందా... గోవిందా!’ రత్నమాంబ కళ్లలో నీళ్లు తిరిగాయి. అలా రాసి పెట్టింది ఎవరో అర్థమైంది. రేఖను పిలిచి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మరుసటి వారం కుటుంబంతో సహా వెళ్లి గోవిందుని దర్శనం చేసుకుని వచ్చింది. అత్తగారి కోసం రేఖ యూ ట్యూబ్‌లో ‘ఆంటీస్ కిచెన్’ చానల్ ఓపెన్ చేసింది. ఇప్పుడు రత్నమాంబకు చేతి నిండా పని, లక్షలాదిమంది ఫాలోవర్స్. తనో చిన్న సెలెబ్రిటీ! - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మాట మంచిదైతే...
ఆత్మబంధువు ‘‘రేఖా.. రేఖా! ఎక్కడున్నావ్?’’ గట్టిగా అరుస్తోంది అత్తగారు రత్నమాంబ. ‘‘హా... ఇక్కడే ఉన్నానత్తమ్మా’’ వంటింట్లోంచి పలికింది రేఖ. ‘‘కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా?’’ ‘‘హా.. ఐదు నిమిషాలు.’’ ఐదు నిమిషాల్లో మాంచి ఫిల్టర్ కాఫీ రెడీ చేసి ఇచ్చింది అత్తగారికి. ‘‘ఇదేంటీ.. కషాయం తాగినట్టుంది. పెళ్లయ్యి ఇన్నేళ్లైంది... కాఫీ పెట్టడం కూడా రాకపోతే ఎలా? వంట గదిలో కాఫీ కలిపితే హాల్లోకి వాసన రావాలి. తాగు తుంటే చిరుచేదుగా, కాస్తంత తియ్యగా ఉండాలి. ఇది ముక్కు దగ్గర పెట్టుకున్నా రావట్లేదు. రుచీ పచీ లేదు.’’ మనసు చిన్న బుచ్చుకున్న రేఖ వంటింట్లోకి వెళ్లి కాఫీ రుచి చూసింది. బాగానే ఉంది. మరి ఆవిడెందుకలా మాట్లాడిందో అనుకుంటూ ఉండిపోయింది. ‘‘మమ్మీ... నా డ్రెస్ ఎలా ఉంది?’’ అడిగింది మైత్రి. ‘‘బ్యూటిఫుల్.. ఏంజిల్లా కని పిస్తున్నావు’’ అంటూ ముద్దు పెట్టుకుంది రేఖ. ‘‘నువ్వలాగే దాన్ని గారాబం చేస్తూండు. చేతికి చిక్కదు’’ అంది రత్నమాంబ. ‘‘వాట్ గ్రాండ్మా... ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావ్?’’ అడిగింది మైత్రి. ‘‘నేనేమన్నానే. ఆ డ్రెస్ చూస్తే ఎవరైనా అంటారు.’’ ‘‘నా డ్రెస్ నా ఇష్టం. నీకేంటీ?’’ ‘‘నాకేంటా.. కాళ్లు విరగ్గొడతా.’’ ‘‘చూడు మమ్మీ... ఏమంటుందో’’ అంటూ తల్లివైపు చూసింది మైత్రి. ‘‘నాయనమ్మే కదా, లీవిట్’’ అంది . కానీ ఇలా రత్నమాంబ ఎప్పుడూ ఏదో ఒకటి అనడం... తను, పిల్లలు బాధ పడటం జరుగుతూనే ఉంది. అయినా ఏరోజూ భర్తకు చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పేయాలనుకుంది రేఖ. ‘‘ఆనంద్... నువ్వేం అనుకోనంటే ఓ మాట చెప్తా’’ ‘‘చెప్పవోయ్.. వద్దన్నదెవరు!’’ ‘‘అత్తమ్మ రోజూ సూటి పోటి మాటలంటూనే ఉంటోంది. నేను సర్దుకుపోతున్నాను. బట్.. పిల్లలు మనసు కష్టపెట్టుకుంటున్నారు.’’ ‘‘పెద్దావిడ కదా.. తెలిసీ తెలియక ఏదో అంటుంది. పట్టించుకోకు’’ అన్నాడు సింపుల్‌గా. ‘‘అది కాదు ఆనంద్. ఆవిడ నెగెటివ్ కామెంట్స్ పిల్లలపైన ఎక్కడ నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయోనని నా భయం.’’ ‘‘మాటలు ఎఫెక్ట్ చూపించడ మేంటోయ్... నీ చాదస్తం కాకపోతే.’’ ‘‘చాదస్తం కాదు.. నిజం. అయినా మీకు మాటల్లో చెప్పడంకంటే చేతల్లో చూపిస్తే బెటర్.’’ ‘‘చూపించు.. చూపించు’’ అన్నాడు ఆనంద్ పెద్ద పట్టించుకోకుండా. రేఖ గుప్పెడు గుప్పెడు అన్నం మూడు గాజు సీసాల్లో వేసి కాసిన్ని నీళ్లు పోసి మూతలు బిగించింది. ఒక సీసా పూజ గదిలో, మరో సీసా హాల్లో, మరోటి బెడ్రూమ్లో పెట్టింది. ‘‘ఈ సీసాలేంటీ, వాటిల్లో అన్నం వేసి నీళ్లు పోయడమేంటీ?’’అడిగాడు ఆనంద్. ‘‘వెయిట్ అండ్ సీ సర్’’ అంది రేఖ నవ్వుతూ. ఆ తర్వాత ఆనంద్ ఆ విషయం మర్చిపోయాడు. కానీ నెల రోజుల తర్వాత రేఖ గుర్తుచేసింది. ‘‘హా... అప్పుడేదో సీసాలు పెట్టావ్ కదా. ఏమయ్యాయవి?’’ అడిగాడు. ‘‘మీరే చూడండి.’’ ‘సరే’ అంటూ హాల్లో ఉన్న సీసా మూత తీశాడు. ముక్కుపుటాలు బద్ద లయ్యేలా దుర్వాసన. లోపలంతా నల్లగా మారిపోయింది. బెడ్రూమ్లో సీసా తీసి చూశాడు. దుర్వాసన లేదు. తర్వాత పూజ గదిలోని సీసా తీసుకుని చూశాడు. మంచి వాసన వస్తోంది. ‘‘హేయ్.. ఏంటిదీ. మూడింటిలో ఒకేసారి రైస్ వేసి పెట్టావ్. మరి మూడూ మూడు రకాల వాసన వస్తున్నాయేంటీ?’’ అర్థంకాక అడిగాడు ఆనంద్. ‘‘దట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ అవర్ వర్డ్స్. పూజగదిలో మనం పాజిటివ్‌గా ఉంటాం, ప్రార్థనలు చేస్తాం కాబట్టి దాన్ని ఫెర్మెం టేషన్ అలా జరిగింది. అత్తమ్మ రోజంతా హాల్లో కూర్చుని నెగెటివ్‌గా మాట్లాడు తుంది కాబట్టి అదలా కుళ్లిపోయింది.’’ ‘‘అవునా? అది సాధ్యమా?’’ అడిగాడు ఆశ్చర్యంగా. ‘‘సాధ్యమే. వాటర్‌పైన జపాన్ సైంటిస్ట్ డాక్టర్ మసారు ఇమోటో ప్రయోగాలు చేశారు. ఆ వీడియోలు యూ ట్యూబ్‌లో చూశాను. ఆయన రాసిన ‘ద హిడెన్ మెసేజెస్ ఆఫ్ వాటర్’ పుస్తకం గురించి కూడా చదివాను. మీరూ చూడండి ఓసారి.’’ ‘‘తప్పకుండా చూస్తా. అమ్మక్కూడా అర్థమయ్యేలా చెప్తా. అది సరే కానీ... బెడ్రూమ్లోది డిఫరెంట్‌గా ఉందేంటీ?’’ ‘‘బెడ్రూమ్లో మనం పెద్దగా మాట్లాడుకోం కాబట్టి.. అదలా...’’ కన్నుగీటింది రేఖ. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్