Soul cousin
-
క్రేజీ క్రేజీ టీనేజ్!
ఆత్మబంధువు ‘‘హాయ్ అక్కా.... ఎలా ఉన్నారు?’’ మాధవిని పలకరించింది రేఖ. ‘‘ఫైన్. నువ్వేంటీ ఇక్కడా?!’’ ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ‘‘ఏం నేను షాపింగ్‌కు రాకూడదా?’’ ‘‘అలాగనేం కాదు. నువ్వు పుస్తకాల పురుగువి కదా. షాపింగ్‌కి ఆమడ దూరం కదా. అందుకే అడిగాను.’’ ‘‘అఫ్కోర్స్.. ఐ లవ్ బుక్స్. ఇప్పుడు కూడా బుక్స్ కొందామనే వచ్చా.’’ ‘‘అనుకున్నా’’ నవ్వుతూ అంది మాధవి. ‘‘సర్లే అక్కా నీ జోకులాపు. ఇంకేంటీ సంగతులు. పిల్లలెలా ఉన్నారు?’’ ‘‘పిల్లలకేం... బాగానే ఉన్నారు. మాకే కష్టంగా ఉంది.’’ ‘‘ఏమైందక్కా?’’ ‘‘ఏం చెప్పన్రా. చెప్పాలంటే పెద్ద కథే.’’ ‘‘అవునా... అయితే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద’’ అంటూ కాఫీ షాపుకు తీసుకెళ్లింది రేఖ. ‘‘ఆకాష్ ఇంటర్, నీహారిక టెన్త్ క్లాస్. ఇద్దరూ ఇద్దరే. చెప్పిన మాట అస్సలు వినడం లేదు’’ కాఫీ తాగుతూ చెప్పింది మాధవి. ‘‘టీనేజ్ కదా. ఇది కామన్.’’ ‘‘ఏంటి కామన్? ఒక్క మాట వినరు. ఏం చెప్పినా.. మాకు తెలుసులే అంటారు. ఇంకా చెప్పాలంటే... ఎదురు మాట్లాడతారు. వాడైతే విసురుగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అదేమో గదిలోకి వెళ్లి ధడేల్మని తలుపేసుకుంటుంది. వీళ్లతో ఎలా వేగాలో అర్థం కావడం లేదు.’’ ‘‘టీనేజ్ అంటే అంతే. నిన్నటిదాకా చిన్నపిల్లల్లా మన వెంటే తిరిగినవాళ్లు పెద్దాళ్లయిపోయే వయసు. ఆ క్రమంలో వాళ్లు సొంతంగా ఆలోచిస్తారు. సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటిని స్పష్టంగా చెప్పేస్తారు. వాటికి మనం అంగీకరించనప్పుడు మరింత గట్టిగా చెప్తారు. దాంతో వాళ్లు ఎదురు మాట్లాడి నట్లు మనం అనుకుంటాం. అంతే’’ చెప్పింది రేఖ. ‘‘అంతేనంటావా?! సరే... పొద్దున లేస్తే ఫోన్, ఫ్రెండ్స్. దీనికేమంటావ్?’’ ‘‘టీనేజ్ పిల్లలు ఫ్రెండ్స్‌కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ పేరెంట్స్‌కు ఇవ్వరు. ఆ వయ సులో ఫ్రెండ్స్ మాటే వేదం. ఇక ఫోనం టావా... ఇప్పుడది లేకుండా ఎవరమైనా బయటకు కదులుతున్నామా?’’ ‘‘అలాగని వాళ్లు ఫోన్లో ఏమేమో మాట్లాడితే ఎలా?’’ ‘‘అక్కా... ఇక్కడే మనం తెలివిగా, లౌక్యంగా వ్యవహ రించాలి. వయసుకు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ఉండాలని పెద్దలు చెప్పిన మాట గుర్తుందా? టీనేజ్ పిల్లలు మనం చెప్పింది వినాలంటే, మనం వాళ్ల ఫ్రెండ్స్‌గా మారిపోవాలి. వారి ఆశలు, ఆశయాలు, కలలు, కబుర్లు అన్నీ ఓపిగ్గా వినాలి, వాళ్లతో మన ఆలోచనలు పంచు కోవాలి. అప్పుడు వాళ్లే అన్నీ చెప్తారు. ఆ వయసులో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా మార్పులు చాలా వేగంగా ఉంటాయి. ఆ మార్పులను వాళ్లు అర్థం చేసుకోలేక గాభరా పడుతుంటారు. అప్పుడు మనమే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే ఫ్రెండ్స్‌ను అడుగు తారు, వాళ్లు తమకు తెలిసింది చెప్తారు. అది మంచీ కావచ్చు, చెడూ చేయొచ్చు.’’ ‘‘నిజమే రేఖా... మొన్న నీహారికకు మొటిమలు వస్తే వాళ్ల ఫ్రెండ్స్ ఇచ్చిందని ఏదో క్రీమ్ రాసింది. మొహమంతా దద్దుర్లు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. ఒకటే తిట్లు, ఇలాంటివి మొహానికి ఎలా రాస్తారని’’ చెప్పింది మాధవి. ‘‘అందుకే... వాళ్లకు మనం నమ్మక మివ్వాలి... ఏం చెప్పినా అమ్మా నాన్నా అర్థం చేసుకుంటారని. అప్పుడు అన్నీ మనతోనే చెప్తారు.’’ ‘‘ఇక మీదట అలాగే ఉంటాను’’ చెప్పింది మాధవి. ‘‘ఈ వయసులో వాళ్ల ఇంట్రస్ట్‌లు, ఆటిట్యూడ్, వాల్యూస్ వేగంగా మారిపో తుంటాయి. వాటిని గమనించాలి.’’ ‘‘ఔన్రా... ఆకాష్గాడికి ఈ మధ్య బైక్స్ పిచ్చి పట్టింది. వాళ్ల నాన్నను అడిగితే ఇవ్వడని, మొన్న ఫ్రెండ్ బైక్ నడిపి దెబ్బలు తాకించుకున్నాడు. పెద్ద దెబ్బలేం కాదులే. కానీ వాళ్ల నాన్న నాలుగు పీకాడు గట్టిగా.’’ ‘‘అదే మనం చేసే తప్పు. ఆ వయసు పిల్లల్ని కొడితే మనపై ద్వేషం పెంచుకునే ప్రమాదం ఉంది.’’ ‘‘అలాగని వాళ్లు తప్పులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ‘‘చూస్తూ ఊరుకోమని కాదక్కా. తప్పేమిటో ఒప్పేమిటో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆకాష్‌ను కొట్టే కంటే... అన్నయ్యే దగ్గరుండి బైక్ నేర్పితే సరిపోయేది.’’ ‘‘ఓహ్.. అలానా! సరే ఆయనకు చెప్తాలే. ఇంకా?’’ ‘‘అక్కా... పిల్లలకు లంచ్ టైమ్ అవుతుంది. నేను వెళ్లాలి. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. తాపీగా మాట్లాడుకుందాం.’’ ‘‘ష్యూర్ రేఖా. తప్పకుండా త్వరగానే వస్తా. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫో!’’ అంటూ వీడ్కోలు తీసుకుంది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
రియల్ రిచ్‌నెస్
ఆత్మబంధువు ‘‘అమ్మా... అమ్మా..’’ స్కూల్నుంచి వస్తూనే పిలిచాడు మిత్ర. సమాధానం రాలేదు. ఇళ్లంతా వెతికి చూశాడు. అమ్మ కనిపించలేదు. ‘‘నాన్నమ్మా.. అమ్మ ఏదీ?’’ అని అడిగాడు రత్నమాంబను. ‘‘ఏదో కొనాలని షాపింగ్‌కు వెళ్లింది నాన్నా. నీకూ, అక్కకూ స్నాక్స్ పెట్టి ఉంచింది. వెళ్లి తినేయండి.’’ ‘‘ఓహ్.. ఓకే’’ అని అక్కతో కలిసి స్నాక్స్ తినేసి ఆడుకుంటున్నాడు మిత్ర. ఇంతలో ఆనంద్ ఆఫీసునుంచి వచ్చీ రాగానే.. ‘‘రేఖా.. రేఖా’’ అని పిలిచాడు. ‘‘అమ్మ లేదు నాన్నా. షాపింగుకు వెళ్లిందట’’ అని చెప్పింది మైత్రి. ఆనంద్ కాఫీ పెట్టుకుని తాగి, సోఫాలో కూర్చున్నాడు. . ‘‘నాన్నా... నాన్నా..’’ అంటూ వచ్చాడు మిత్ర. ‘‘ఏంటి నాన్నా...’’ అంటూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆనంద్. ‘‘మనం రిచ్చా? పూరా?’’ అడిగాడు మిత్ర. ‘‘ఎందుకు నాన్నా?’’ ‘‘ముందు నువ్వు ఆన్సర్ చెప్పు.’’ ‘‘రిచ్ అనుకుంటే రిచ్... పూర్ అనుకుంటే పూర్.’’ ‘‘అలా ఎలా ఉంటారు నాన్నా?’’ ‘‘ఉంటారు నాన్నా. ఎందుకంటే రిచ్‌నెస్ అనేది డబ్బుకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. అది ముఖ్యంగా మన ఆలోచనలకు, అలవాట్లు, ఆటిట్యూడ్కూ సంబంధించిన విషయం కాబట్టి.’’ ‘‘మ్మ్మ్... అర్థం కాలేదు’’ అంటూ తల అడ్డంగా తిప్పాడు మిత్ర. పక్కన హోమ్‌వర్క్ చేసుకుంటున్న మైత్రి ఆసక్తిగా వింటోంది. ‘‘మొన్న నువ్వు ప్లేస్టేషన్ కావాలని ఏడ్చావట కదా.’’ ‘‘ఇప్పుడు అడగడం లేదుగా.’’ ‘‘ఇప్పుడు అడగడం లేదులే. అసలెందుకు ఏడ్చావో చెప్పు.’’ ‘‘నీకు ప్లే స్టేషన్ కూడా లేదని ఆర్యన్ గాడు కామెంట్ చేస్తే బాధేసి ఏడ్చా.’’ ‘‘సరే... ఆర్యన్ దగ్గర ఇంకా ఏమేం ఉన్నాయి?’’ ‘‘ఐపాడ్ ఉంది. వాళ్లింట్లో స్మార్ట్ టీవీ ఉంది. ఆల్సేషియన్ డాగ్ ఉంది. ఇంకా.. చాలా ఉన్నాయి.’’ ‘‘వాటన్నింటితో వాడెప్పుడు ఆడుకుంటాడు?’’ ‘‘వాళ్ల డాడీ పార్టీకి, మమ్మీ క్లబ్‌కి వెళ్లినప్పుడు.’’ ‘‘అంటే ఆర్యన్... వాళ్ల మమ్మీ, డాడీతో ఆడుకోడా?’’ ‘‘వాళ్లు బిజీగా ఉంటారట. వీక్లీ వన్స్ బయటకు తీసుకువెళ్తారని చెప్పాడు.’’ ‘‘సో.. హి ఈజ్ పూర్.’’ ‘‘అదెలా డాడీ?’’ ‘‘పూర్ పేరెంట్స్ పిల్లలకు వస్తువులు కొనిస్తారు. రిచ్ పేరెంట్స్ పుస్తకాలు కొనిస్తారు.’’ ‘‘ఓహ్... అవునా! అందుకేనా మమ్మీ, నువ్వు ఎప్పుడూ బుక్స్ కొనిస్తుంటారు. ఇంకా?’’ ‘‘రిచ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లు రోజూ ఏదో ఒకటి చదువుతారు, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. పరిస్థితులను తిట్టుకోకుండా తమ ప్రవర్తనకు, తమ జయాపజయాలకు తామే బాధ్యత తీసుకుంటారు. తమకు సాయం చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్తారు. రిలేషన్షిప్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంటర్నెట్ను ఆఫీసు, వృత్తిగత అవసరాల కోసమే వాడతారు. జంక్‌ఫుడ్ తక్కువ తింటారు, రోజూ వ్యాయామం చేస్తారు. చాలా?’’ ‘‘డాడీ... ఇవన్నీ నువ్వూ చేస్తావుగా?’’ ‘‘కదా.. ఇప్పుడు నువ్వే చెప్పు.. మీ డాడీ రిచ్ ఆర్ పూర్?’’ ‘‘మై డాడ్ ఈజ్ రిచ్’’ అంటూ హగ్ చేసుకున్నాడు మిత్ర. ‘‘మరి రిచ్ కిడ్ కావాలంటే ఏం చేయాలి డాడీ?’’ అడిగింది మైత్రి. ‘‘ఓహ్... నువ్వు వింటున్నావా! గుడ్ క్వశ్చన్. రిచ్ కిడ్ కావాలంటే... రోజుకు గంటకు మించి టీవీ, సోషల్ నెట్వర్క్, సెల్‌ఫోన్ వాడకూడదు.’’ ‘‘అవునా... నేను రోజుకు గంటకు మించి టీవీ చూడనుగా. అయితే నేను రిచ్ కిడ్నేగా!’’ ‘‘ఒక్కోటీ గంట కాదు తల్లీ.. మూడూ కలిపి గంట.’’ ‘‘అవునా... అయితే నేను టీవీ, ఫేస్బుక్ తగ్గించుకోవాలి.’’ ‘‘ఇంకా టిప్స్ చెప్పు డాడీ’’ అడిగాడు మిత్ర. ‘‘టిప్స్ కాదు నాన్నా. రిచ్ హాబిట్స్ ఫర్ కిడ్స్. రోజూ ఎక్సర్సైజ్ చేయాలి. నెలకు కనీసం రెండు బుక్స్ చదవాలి. ఎక్క డైనా వాలంటీర్‌గా పనిచేయాలి. పాకెట్‌మనీలో కనీసం 25 శాతం దాచుకోవాలి. ఆ డబ్బుతో సెల్ఫోన్లు, సినిమాలు కాకుండా బుక్స్ కొనుక్కోవాలి. లేదా ఎవరికైనా డొనేట్ చేయాలి. పేరెంట్స్‌తో రోజుకు కనీసం గంటసేపు కబుర్లు చెప్పుకోవాలి. బంధువులకూ, ఫ్రెండ్స్‌కూ బర్త్‌డే గ్రీటింగ్స్ మర్చిపోకుండా చెప్పాలి. రిలేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్.’’ ‘‘థాంక్స్ టూ ఎఫ్బీ, అందరి బర్త్‌డేలూ గుర్తుచేస్తుంది’’ అంది మైత్రి.‘‘ఎఫ్బీలో అకౌంట్ లేనివాళ్లకు కూడా చెప్పాలి బుజ్జీ’’ అన్నాడు ఆనంద్. ‘‘ష్యూర్ డాడ్!’’ అంటూ నవ్వేసింది మైత్రి. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
అంతా మన మంచికే!
ఆత్మబంధువు ఎప్పుడూ గలగలా మాట్లాడే రత్నమాంబ చాలా దిగులుగా ఉంది. ఆమెనలా చూడటం రేఖకు కొత్తగా ఉంది. ‘‘ఏంటత్తమ్మా అలా ఉన్నారు?’’ అని అడిగింది. ‘‘ఏం లేదులే’’ అని తనదైన తీరులో సమాధానం చెప్పింది రత్నమాంబ. కానీ ఆమె దేనిగురించో బాధపడుతోందని అర్థమైంది రేఖకు. అయితే అడిగినా చెప్పేరకం కాదు కాబట్టి వంటపనిలో మునిగిపోయింది. కాస్సేపటి తర్వాత ‘‘రేఖా’’ అని పిలిచింది రత్నమాంబ. ‘‘హా... చెప్పండత్తమ్మా’’ అంటూ వచ్చింది రేఖ. ‘‘నా మనసేం బాలేదు. నాల్రోజులు అమ్మాయి వాళ్లింట్లో ఉండొస్తా.’’ ‘‘మీ ఇష్టం అత్తమ్మా. కానీ మీ అబ్బాయి వచ్చాక చెప్పి వెళ్తే బావుం టుందేమో...’’ అంటూ ఆగింది రేఖ. ‘‘వాడికి చెప్తే వెళ్లనివ్వడులే. నేను వెళ్తున్నాను. వాడికి నువ్వే చెప్పు’’ అని బ్యాగ్ సర్దుకుని కూతురింటికి వెళ్లిపోయింది రత్నమాంబ. ఆవిడంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిందో రేఖకు అర్థం కాలేదు. భర్త వచ్చాక విషయం చెప్పింది. ‘‘ఎందుకెళ్లింది?’’ అని అడిగాడు ఆనంద్. ‘‘ఏమో.. నాకేం తెలుసు! అడిగినా చెప్పలేదు’’ అంది. ‘‘మీరేమైనా గొడవపడ్డారా?’’ అని ఆరా తీశాడు. ‘‘అలాంటిదేం లేదండీ.’’ ‘‘మరెందుకు వెళ్లి ఉంటుంది? సర్లే.. నేనే ఫోన్ చేసి మాట్లాడతా’’ అన్నాడు. మర్నాడు ఉదయం రత్నమాంబ రూమ్ సర్దుతుంటే ఓ కాగితం కనిపించింది రేఖకు. అందులో ఇలా రాసి ఉంది. ‘‘ఇప్పుడు నా టైమ్ బాగాలేదు. నాకు శని పట్టినట్టుంది. ఇంట్లో ఒంట్లో అన్నీ సమస్యలే. నాకు 60 ఏళ్లు వచ్చాయి. ఈ ఏడాదే నన్నెంతో ప్రేమగా చూసుకునే మా నాన్న కూడా చని పోయారు. ఒంటరిదాన్ని అయిపోయాను. నిన్నటివరకూ మహారాణిలా ఉన్నదాన్ని ఇప్పుడు కృష్ణా రామా అంటూ నా రూమ్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోడలేమో వంట గదిలోకి రానివ్వట్లేదు. నా గాల్ బ్లాడర్ తీసేశారు. ఆపరేషన్ చేయించు కోవడం వల్ల చాలా కాలం బెడ్ మీదనే ఉండాల్సి వచ్చింది. చిన్న కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది. కారు తుక్కుతుక్కు అయి పోయింది. వాడు కూడా చాలా కాలం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఇది నిజంగానే శని పట్టిన కాలం. జ్యోతిష్యుడికి చూపించి శాంతి చేయించాలి.’ ఆ పేపర్ చదివాక అత్తగారి బాధేంటో రేఖకు అర్థమైంది. తనకు వరుసగా ఎదురైన దుర్ఘటనలతో మానసికంగా బాగా డీలా పడిందనీ, డిప్రెషన్లోకి వెళ్తోందనీ తెలిసింది. ఆ సమయంలో ఆవిడకు మానసిక బలం కల్పించాలని నిశ్చయించుకుంది. నాల్రోజుల తర్వాత భర్తకు చెప్పి అత్తగారిని ఇంటికి పిలిపించుకుంది. ఇంటికి వచ్చినా దిగులుగానే ఉంది రత్నమాంబ. రేఖ ఇచ్చిన కాఫీ తాగాక తన రూమ్‌లోకి వెళ్లిపోయింది. తను రోజూ చదువుకునే భాగవతం తీస్తుంటే అందులోంచి ఓ కాగితం జారి పడింది. ఏమిటా అని తీసుకుని చదివింది. అందులో ఇలా ఉంది. ‘ఈ ఏడాది చాలా మంచిది. నాకు అంతా మంచే జరిగింది. ఎన్నో ఏళ్లుగా బాధపెడుతున్న గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ చేసి తీసేశారు. ఇప్పుడు ఎలాంటి బాధా లేదు. 90 సంవత్సరాలు బతికిన మా నాన్న ఎవ్వరిమీదా ఆధార పడలేదు. చనిపోయేంతవరకూ తన పనులు తానే చేసుకున్నారు. ఇంత మంచి మరణం ఎవ్వరికుంటుంది! నాకు ఇరవయ్యేళ్లకే పెళ్లయింది. నలభై ఏళ్లపాటు వంటింట్లోనే ఉన్నాను. ఇప్పుడు వంట చేయాల్సిన పని లేదు. హాయిగా నా రూమ్‌లో కూర్చుని నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవచ్చు. నాకు కావాల్సినవి ఆర్డర్ వేసి కోడళ్లతో చేయించుకోవచ్చు. దేవుడు చల్లగా చూడబట్టి నా చిన్న కొడుకు పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు. కారు పోతే పోయింది, ఇంకోటి కొనుక్కో వచ్చు. నా కొడుకును నాకు ఇచ్చినందుకు తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరుడికి మొక్కి రావాలి. నా వేంకటేశ్వరుడు నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. గోవిందా... గోవిందా!’ రత్నమాంబ కళ్లలో నీళ్లు తిరిగాయి. అలా రాసి పెట్టింది ఎవరో అర్థమైంది. రేఖను పిలిచి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మరుసటి వారం కుటుంబంతో సహా వెళ్లి గోవిందుని దర్శనం చేసుకుని వచ్చింది. అత్తగారి కోసం రేఖ యూ ట్యూబ్‌లో ‘ఆంటీస్ కిచెన్’ చానల్ ఓపెన్ చేసింది. ఇప్పుడు రత్నమాంబకు చేతి నిండా పని, లక్షలాదిమంది ఫాలోవర్స్. తనో చిన్న సెలెబ్రిటీ! - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
ఆడండి... నాలుగు స్తంభాలాట!
ఆత్మబంధువు రేఖ షాపింగ్‌కి వెళ్లి తిరిగి వస్తుంటే కనపడింది సుమ. తమ కాలనీలోనే ఉంటుంది. మంచమ్మాయి. కానీ ఈ రోజెందుకో డల్‌గా కనిపించింది. ఆ మాటే అడిగింది. ‘‘అదేం లేదు రేఖా. బానే ఉన్నాను’’ అని సుమ సమాధానమిచ్చినా ఏదో దాస్తోందని అర్థమైంది. దాంతో ఆ సాయంత్రం ఇంటికెళ్లి విషయం అడిగింది. సుమ అంతా చెప్పింది. సుమ, రాజీవ్ పెళ్లి చూపుల్లోనే ప్రేమలో పడ్డారు. పెళ్లయ్యాక మరింత లోతుగా మునిగిపోయారు. సంవత్సరం తర్వాత పాప పుట్టింది. పాప బోసి నవ్వు లతో వారి జీవితం ఆనందమయమైంది. మరో ఏడాది గడిచింది. ఆ తర్వాతే చిరాకులు, పరాకులు మొదలయ్యాయి. మాటలతో మొదలై... తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దాంతో సుఖం, శాంతి కరువయ్యాయని చెప్పి ఏడ్చింది సుమ. ఆమె మాటలు విన్నాక... సుమ, రాజీవ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమనీ, అయినా ఆ విషయం వారిద్దరికీ అర్థం కావడం లేదనీ రేఖకు అర్థమైంది. అందుకే వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడింది. ‘‘ఇంతకు ముందు ఎప్పుడూ నా చుట్టూనే తిరిగేవాడు. ఎంతో ప్రేమ చూపించేవాడు. కానీ ఇప్పుడు నన్నసలు పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ ఆఫీసే’’ చెప్పింది సుమ. ‘‘సిటీలో రోజుకు రెండు గంటలు ప్రయాణం చేసి వస్తే నా కష్టమేమిటో తెలుస్తుంది’’ అన్నాడు రాజీవ్. ‘‘పొద్దుటనగా నువ్వు ఆఫీసుకు వెళ్లిపోతే సాయంత్రం వరకూ ఒంటరిగా పాపతో ఉంటే తెలుస్తుంది నా బాధేంటో’’ అంది సుమ. ‘‘నువ్వలా బాధపడుతున్నా వనేగా... రాగానే పాపను నేను తీసు కుంటున్నాను’’ అన్నాడు రాజీవ్. ‘‘పాపను తీసుకుని, ఆ వంకతో నన్ను దూరంగా ఉంచుతున్నావ్’’ నిష్టూర మాడింది. ‘‘నిన్ను దూరంగా ఉంచడ మేమిటి? నేను చేసేదంతా మన సంతోషం కోసమేగా!’’ ఇలా సాగిపోయింది గొడవ. రేఖ ఆపింది. ‘‘మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇద్దరూ కరెక్టే. దాన్ని ఫస్ట్ పొజి షన్ అంటారు. అంటే మన దృక్కోణంలో ప్రపంచాన్ని, మనుషుల్ని అర్థం చేసుకో వడం. ఆ పొజిషన్లోనే ఆగిపోతే మనం స్వార్థపరులం అవుతాం. మన సుఖం, సంతోషం తప్ప అవతలివారి గురించి పట్టించుకోం. అందుకే ఎప్పటికప్పుడు అవతలివారి పొజిషన్ నుంచి కూడా ఆలోచించాలి. దాన్నే సెకెండ్ పొజిషన్ అంటారు’’ అని చెప్పి సుమను దగ్గరకు పిలిచింది రేఖ. ‘‘ఇప్పటి వరకూ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్యేమిటో చెప్పావ్. ఇప్పుడు కాసేపు కళ్లు మూసుకుని నిన్ను నువ్వు రాజీవ్‌లా ఊహించుకో. రోజుకు రెండు మూడు గంటలు సిటీ బస్సుల్లో ప్రయాణించి ఇంటికొచ్చేసరికి ఏం కోరుకుంటావ్?’’ ‘‘నా భార్య ఓ కప్పు కాఫీ ఇవ్వాలని, చిరాకులు పరాకులు లేకుండా స్వీట్‌గా మాట్లాడాలని కోరుకుంటా.’’ ‘‘గుడ్. ఇప్పుడు నా పొజిషన్లోకి రా. అంటే మీ ఇద్దరికీ సంబంధంలేని మూడో వ్యక్తి పొజిషన్. దీన్నే థర్డ్ పొజిషన్ లేదా జడ్జ్ పొజిషన్ అంటారు. సుమగా, రాజీవ్‌గా ఇద్దరి వాదనలూ తెలుసు కున్నావ్. ఇప్పుడు వాళ్లిద్దరికీ సంబంధం లేని మూడో వ్యక్తిగా వారి వాదనలు వింటే ఏమనిపిస్తోంది?’’ ‘‘అనవసరంగా గొడవ పడుతున్నా రనిపిస్తోంది.’’ ‘‘ఎందుకలా గొడవ పడుతున్నారు?’’ ‘‘ఎవరికి వారు వారి వాదనకే కట్టుబడి ఉండటం వల్ల.’’ ‘‘ఇప్పుడు మళ్లీ సుమ స్థానంలోకి వచ్చి, నీ సమస్యని చూడు.’’ సుమ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ‘‘ఇంత సిల్లీగా గొడవ పడు తున్నామేమిటా అని నవ్వొస్తోంది’’ అంది. ‘‘ఇప్పటికైనా రాజీవ్ వాదనేమిటో, అసలేం చేయాలో అర్థమైందా?’’ అడిగింది రేఖ నవ్వుతూ. ‘‘పూర్తిగా అర్థమైంది.’’ ఆ తర్వాత రాజీవ్‌తోనూ అదే ప్రాసెస్ చేయించింది రేఖ. అతనూ సుమ వాదనే మిటో, తనేం చేయాలో అర్థం చేసుకు న్నాడు. సుమకు సారీ చెప్పాడు. తను కూడా సారీ చెప్పింది. ‘‘మూడు పొజిషన్లూ మీకు అర్థమ య్యాయిగా. ఇంకోటుంది... ఫ్యామిలీ పొజిషన్. అంటే వ్యక్తులుగా కాకుండా ఉమ్మడిగా కలిసి కుటుంబం కోసం ఏం చేయాలో ఆలోచించడం, ఆచరించడం. కొన్ని రోజులపాటు ఈ నాలుగు స్తంభా లాట ఆడండి. ఏ పొరపొచ్చాలూ ఉండవు’’... చెప్పింది రేఖ. ఇద్దరూ రేఖకు థ్యాంక్స్ చెప్పి నవ్వుతూ ఇంటికెళ్లారు. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మీ జీవితంలో ఉప్పు ఉందా?
ఆత్మబంధువు ‘‘హాయ్ అక్కా’’ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సంతోష్. ఎవరా అని చూసింది రేఖ. తమ్ముడు సంతోష్. ఆనందం... ఆశ్చర్యం! ‘‘ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. రారా’’ అంటూ ఆహ్వానించింది. ‘‘ఈ అక్కను చూడ్డానికి కూడా టైమ్ దొరకడం లేదా నీకు’’ అంటూ చిరుకోపం ప్రదర్శించింది. ‘‘సారీ అక్కా. వద్దామని ఉన్నా కుదరట్లేదు. అయినా నువ్వు కూడా ఇలా తిడితే నేనేం చేయగలను?’’ ‘‘సర్లేరా. అయినా నేను కాక ఇంకా తిట్టేవాళ్లున్నారా నిన్ను?’’ ‘‘ఉందిగా... మీ మరదలు.’’ ‘‘అదేంట్రా... ఇద్దరూ బాగానే ఉంటారుగా?’’ ‘‘ఉంటారు కాదు... ఉండేవాళ్లం. ఇప్పుడు రోజూ చిరాకులు పరాకులు.’’ ‘‘రోజూనా?’’ ‘‘రోజూ అంటే రోజూ కాదు. తరచుగా.’’ ఇంతలో ఆఫీసు నుంచి ఆనంద్ వచ్చేశాడు. ‘‘హల్లో సంతోష్... ఎలా ఉన్నావ్’’ అంటూ కూర్చున్నాడు. ‘‘సరే.. బావా మరుదులు మాట్లాడు కుంటూ ఉండండి. నేను వంట చేస్తా’’ అంటూ లేచింది రేఖ. ‘‘వంట అయిపోయింది. రండి’’ పిలిచింది రేఖ. ‘‘వద్దు అక్కా... నేను వెళ్తాను’’ అన్నాడు సంతోష్. ‘‘నేను కీర్తికి ఫోన్ చేసి చెప్పాలే. నువ్ భోంచేసి వెళ్లు.’’ తప్పదన్నట్లుగా కూర్చున్నాడు. రేఖ భోజనం వడ్డించింది. ‘‘ఏంటోయ్ ఈ కూరలో ఉప్పేలేదు’’ అన్నాడు ఆనంద్. ‘‘ఔనా... మర్చిపోయుంటాను.’’ ‘‘ఔనౌను.. తమ్ముడు వచ్చాడన్న ఆనందంలో మర్చిపోయుంటావ్.’’ ‘‘అంత లేదులెండి.’’ అంటూ కూరలో కాస్త ఉప్పు కలిపి, మళ్లీ వడ్డించింది రేఖ. ‘‘అబ్బబ్బ... ఇప్పుడు ఉప్పు ఎక్కువైందోయ్’’.. అరిచాడు ఆనంద్. ‘‘అబ్బబ్బ... తక్కువైతే తక్కువైందంటారు. ఎక్కువైతే ఎక్కువైందని అరుస్తారు. ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా?’’ ‘‘రోజూ అవుతూనే ఉన్నాంలే.’’ ‘‘ఇదిగో ఇదిరా మీ బావగారి వరస. పేరు ఆనందే కానీ, దుర్వాసుడి టైపు.’’ ‘‘నేను దుర్వాసుడి టైపయితే నీ పని బానే ఉండేది’’ అన్నాడు ఆనంద్. ‘‘బావుందనేగా చెప్తున్నా’’ అంది కొంటెగా రేఖ. అక్కాబావల గొడవ ముచ్చటగా అనిపించింది సంతోష్‌కి. అదే విషయం చెప్పాడు అక్కతో భోజనాల తర్వాత. ‘‘కూరలో ఉప్పు లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో సంసారంలో చిన్న చిన్న గొడవలు లేకపోయినా అలాగే ఉంటుందిరా’’ అంది రేఖ. ‘‘చిన్న చిన్నవైతే పర్లేదక్కా. మావి పెద్ద పెద్ద గొడవలు. అంటే మా కూరలో ఉప్పు ఎక్కువైందన్నమాట’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ఫీలవకురా. ఆ ఉప్పు బ్యాలెన్స చేయడానికి ఓ చిట్కా చెప్పనా?’’ అంది. ‘‘నీ దగ్గరకు వచ్చిందే అందుక్కదా.’’ ‘‘సరే... ఈసారి మీ ఆవిడ అరిచేటప్పుడు కొంచె నీళ్లు తాగు.’’ ‘‘కోపం వచ్చినవాళ్లు కదా వాటర్ తాగాలి?’’ సందేహం వ్యక్తం చేశాడు. ‘‘నేను చెప్పింది చెయ్యరా. కొంచెం వాటర్ తాగి, మీ ఆవిడ అరుపులు తగ్గేంత వరకూ నోట్లో అలాగే ఉంచుకో. అలా రెండు వారాలు చేసి చూడు.’’ ‘‘ఓకే. ఐ విల్ ట్రై’’ అనేసి సెలవు తీసుకున్నాడు సంతోష్. రెండు వారాల తర్వాత ఫోన్ చేశాడు సంతోష్. ‘‘నువ్వు చెప్పిన చిట్కా బాగా పని చేసిందక్కా. ఇప్పుడు తను అరవడం లేదు’’ అన్నాడు సంతోషంగా. ‘‘వెరీగుడ్... ఇక హ్యాపీగా ఉండు’’ అంది రేఖ తృప్తిగా. ‘‘అలాగే అక్కా. కానీ నాదో డౌట్. జస్ట్ గుక్కెడు నీళ్లు నా సమస్యని ఎలా పరిష్కరించాయంటావ్?’’ నవ్వింది రేఖ.‘‘నీ సమస్యను పరిష్కరించింది నీళ్లు కాదురా... నువ్వే.’’ ‘‘నేనా? అర్థం కాలేదు’’ అన్నాడు అయోమయంగా. ‘‘నోట్లో నీళ్లు ఉంటే నువ్వు మాట్లాడ లేవు కదా! అందుకే నీ భార్య అరిచే టప్పుడు నువ్వు ఎదురు మాట్లాడి ఉండవు. ఎప్పుడైనా రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఇద్దరి మధ్య మాటా మాటా సమానంగా పెరిగితేనే సమస్యలు. ఒకరికి కోపం వచ్చినప్పుడు రెండోవాళ్లు మౌనంగా ఉంటే కొట్లాట అన్నదే రాదు.’’ ‘‘వామ్మో... ఎన్ని తెలివి తేటలక్కా నీకు’’ అన్నాడు అక్క తెలివికి మురిసిపోతూ. ‘‘ఏడ్చావ్‌లే. జాగ్రత్తగా ఉండు’’... నవ్వి ఫోన్ పెట్టేసింది రేఖ. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
నచ్చని సినిమా చూడొద్దు!
ఆత్మబంధువు ‘‘ఏంటక్కా అలా ఉన్నావ్?’’ అడిగింది రేఖ ఇంట్లోకి అడుగు పెడుతూనే. ‘‘ఏం లేదురా..’’ అంది భవాని. రేఖ నమ్మలేదు. ‘‘ఏమీ లేకుంటే ఎందుకంత డల్‌గా కనిపిస్తున్నావేం?’’ అంటూ మళ్లీ ప్రశ్నించింది. ‘‘ఏదో గుర్తొచ్చిందిలే’’ అంది భవాని. ‘‘నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో చెప్పక్కా’’ అంటూ ఒత్తిడి చేసింది రేఖ. భవాని చెప్పడం మొదలు పెట్టింది. ‘‘నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక సంఘటన జరిగిందిరా. అది ఎప్పుడు గుర్తొచ్చినా బాధగా ఉంటుంది. నేను మా ఊర్నుంచి కాలేజీకి బస్సులో వెళ్లి వచ్చేదాన్ని. అప్పుడొకడు రోజూ నా వెంట పడేవాడు. వద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. విసుగొచ్చి ఓ రోజు మన ఇంట్లో చెప్పేశా. వాడు అది మనసులో పెట్టుకుని నాపై దాడి చేశాడు. ఎలాగో తప్పించుకున్నాను కానీ, ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా మనసు కలుక్కుమంటుంది.’’ నిట్టూర్చింది రేఖ. ‘‘కొందరు అంతే అక్కా. అవునూ... నాకెప్పుడూ ఈ విషయం చెప్పలేదేం?’’ ‘‘చెప్పుకోవడానికి అదేం గొప్ప విషయమో, మంచి విషయమో కాదుగా రేఖా!’’ ‘‘అవుననుకో. కానీ అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?’’ అంది రేఖ అక్క ముఖంలో దిగులును గమనిస్తూ. ‘‘ఇప్పుడనే కాదురా. పేపర్లో, టీవీలో అలాంటి వార్త చూసినా, చదివినా గుర్తొస్తుంది. ఇక ఆ రోజంతా నా మనసు మనసులో ఉండదు. అప్పుడు బాగా బాధ పడ్డానేమో, ఎంత కాలమైనా మర్చిపోలేక పోతున్నాను.’’ ‘‘అవునా. సరేలే. ఓ విషయం చెప్పు. నీకు నచ్చిన సినిమా ఏంటి?’’ తాను తన బాధ గురించి మాట్లాడు తుంటే, రేఖ సినిమా గురించి అడుగుతుందేమిటా అని అయోమయంగా చూసింది భవాని. భవానీ డౌట్ రేఖకు అర్థమైంది. ‘‘ముందు జవాబివ్వు, ఎందుకో తర్వాత చెప్తాను’’ అంది. ‘‘ఏం మాయ చేసావె.’’ ‘‘ఎన్నిసార్లు చూశావేం?’’ అడిగింది. ‘‘ఓ పాతిక ముప్ఫైసార్లు’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘మరి నీకు నచ్చని సినిమా ఏంటి?’’ ‘‘బోలెడున్నాయి.’’ ‘‘నీకు నచ్చని ఆ బోలెడు సినిమాల్లో ఒక సినిమాని పదిసార్లు చూడమంటే ఏం చేస్తావ్?’’ ‘‘లక్ష రూపాయలిచ్చినా చూడను.’’ ‘‘ఎందుకలా?’’ ‘‘చెత్త సినిమా కాబట్టి. నాకు నచ్చలేదు కాబట్టి.’’ ‘‘మరయితే నీకు నచ్చని నీ డిగ్రీ సినిమాను పదేపదే ఎందుకు చూస్తున్నావ్ అక్కా?’’ అర్థం కానట్టుగా చూసింది భవాని. ‘‘డిగ్రీ సినిమా చూడటమేంటి? నాకేం అర్థం కాలేదు.’’ ‘‘ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్తా. డిగ్రీలో జరిగిన విషయం నీకెలా గుర్తొస్తోంది?’’ ‘‘నేను కావాలని గుర్తుచేసుకోన్రా. అలాంటి వార్తలు చదివినప్పుడు లేదా చూసినప్పుడు గుర్తొస్తుంది.’’ ‘‘గుర్తొచ్చింది సరే. కానీ ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడటం ఎందుకు?’’ ‘‘అది నాకు తెలీదురా. బాధ కలుగుతుందంతే.’’ ‘‘కదా... దీన్నే అసోసియేషన్ అంటారక్కా. అంటే ఆ విషయం జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో, అది గుర్తొచ్చినప్పుడు కూడా దాదాపు అంతే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకానికి ఆ బాధ అలా లింక్ అయి ఉంటుందన్నమాట.’’ ‘‘అలాగా... దాన్ని తప్పించుకునే మార్గం లేదా?’’ ‘‘ఎందుకు లేదూ! ఎంచక్కా ఉంది. దాన్ని డిసోసియేట్ చేస్తే సరి.’’ ‘‘అంటే?’’ మళ్లీ అయోమయంగా ముఖం పెట్టింది భవాని. ‘‘అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకోక పోవడం. దాన్ని నీ మనసు నుంచి దూరం చేయడం.’’ ‘‘అదెలా?’’ ‘‘ఎలా అంటే... ఆ సంఘటనను నీ మనసులో గుర్తు చేసుకుంటున్నప్పుడు అందులో నువ్వూ కనిపిస్తావ్ కదా?’’ ‘‘నేను లేకపోతే ఆ సంఘటనే లేదుగా’’ అంది భవాని. ‘‘అవును. అందుకే ఇప్పుడో పని చెయ్. నువ్వు హాల్లో సోఫాలో కూర్చొని, టీవీలో సినిమా ఎలా చూస్తావో, నీ మనసునే టీవీ అనుకుని ఆ సంఘటనను టీవీలో చూస్తున్నట్లు మనసులో చూడు. అది చూడటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి టీవీని చిన్నది చేసుకో. నీకూ టీవీకి మధ్య దూరం పెంచుకో. టీవీని బ్లాక్ అండ్ వైట్‌గా మార్చుకో. మ్యూట్‌లో పెట్టుకో. డల్ చేసుకో. బ్లర్ చేసుకో. డూ వాటెవర్ యూ వాంట్. తర్వాతెలా ఉందో చెప్పు.’’ ‘‘ఊ... టీవీని చిన్నది చేశా, దూరం పెంచా. బ్లాక్ అండ్ వైట్‌గా మార్చేశా. మ్యూట్‌లో పెట్టేశా. నౌ ఫీలింగ్ గుడ్.’’ ‘‘కదా. దీన్నే డిసోసియేట్ అంటారు. అంటే మనసుకు బాధ కలిగించే సంఘటనల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవడం అన్నమాట. అప్పుడా ఇన్సిడెంట్ గుర్తొచ్చినా బాధ ఉండదు.’’ భవాని ముఖం వెలిగింది.‘‘ఇన్నేళ్ల బాధను దూరం చేశావ్. థాంక్స్ రా’’ అంది తృప్తిగా. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మాట మంచిదైతే...
ఆత్మబంధువు ‘‘రేఖా.. రేఖా! ఎక్కడున్నావ్?’’ గట్టిగా అరుస్తోంది అత్తగారు రత్నమాంబ. ‘‘హా... ఇక్కడే ఉన్నానత్తమ్మా’’ వంటింట్లోంచి పలికింది రేఖ. ‘‘కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా?’’ ‘‘హా.. ఐదు నిమిషాలు.’’ ఐదు నిమిషాల్లో మాంచి ఫిల్టర్ కాఫీ రెడీ చేసి ఇచ్చింది అత్తగారికి. ‘‘ఇదేంటీ.. కషాయం తాగినట్టుంది. పెళ్లయ్యి ఇన్నేళ్లైంది... కాఫీ పెట్టడం కూడా రాకపోతే ఎలా? వంట గదిలో కాఫీ కలిపితే హాల్లోకి వాసన రావాలి. తాగు తుంటే చిరుచేదుగా, కాస్తంత తియ్యగా ఉండాలి. ఇది ముక్కు దగ్గర పెట్టుకున్నా రావట్లేదు. రుచీ పచీ లేదు.’’ మనసు చిన్న బుచ్చుకున్న రేఖ వంటింట్లోకి వెళ్లి కాఫీ రుచి చూసింది. బాగానే ఉంది. మరి ఆవిడెందుకలా మాట్లాడిందో అనుకుంటూ ఉండిపోయింది. ‘‘మమ్మీ... నా డ్రెస్ ఎలా ఉంది?’’ అడిగింది మైత్రి. ‘‘బ్యూటిఫుల్.. ఏంజిల్లా కని పిస్తున్నావు’’ అంటూ ముద్దు పెట్టుకుంది రేఖ. ‘‘నువ్వలాగే దాన్ని గారాబం చేస్తూండు. చేతికి చిక్కదు’’ అంది రత్నమాంబ. ‘‘వాట్ గ్రాండ్మా... ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావ్?’’ అడిగింది మైత్రి. ‘‘నేనేమన్నానే. ఆ డ్రెస్ చూస్తే ఎవరైనా అంటారు.’’ ‘‘నా డ్రెస్ నా ఇష్టం. నీకేంటీ?’’ ‘‘నాకేంటా.. కాళ్లు విరగ్గొడతా.’’ ‘‘చూడు మమ్మీ... ఏమంటుందో’’ అంటూ తల్లివైపు చూసింది మైత్రి. ‘‘నాయనమ్మే కదా, లీవిట్’’ అంది . కానీ ఇలా రత్నమాంబ ఎప్పుడూ ఏదో ఒకటి అనడం... తను, పిల్లలు బాధ పడటం జరుగుతూనే ఉంది. అయినా ఏరోజూ భర్తకు చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పేయాలనుకుంది రేఖ. ‘‘ఆనంద్... నువ్వేం అనుకోనంటే ఓ మాట చెప్తా’’ ‘‘చెప్పవోయ్.. వద్దన్నదెవరు!’’ ‘‘అత్తమ్మ రోజూ సూటి పోటి మాటలంటూనే ఉంటోంది. నేను సర్దుకుపోతున్నాను. బట్.. పిల్లలు మనసు కష్టపెట్టుకుంటున్నారు.’’ ‘‘పెద్దావిడ కదా.. తెలిసీ తెలియక ఏదో అంటుంది. పట్టించుకోకు’’ అన్నాడు సింపుల్‌గా. ‘‘అది కాదు ఆనంద్. ఆవిడ నెగెటివ్ కామెంట్స్ పిల్లలపైన ఎక్కడ నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయోనని నా భయం.’’ ‘‘మాటలు ఎఫెక్ట్ చూపించడ మేంటోయ్... నీ చాదస్తం కాకపోతే.’’ ‘‘చాదస్తం కాదు.. నిజం. అయినా మీకు మాటల్లో చెప్పడంకంటే చేతల్లో చూపిస్తే బెటర్.’’ ‘‘చూపించు.. చూపించు’’ అన్నాడు ఆనంద్ పెద్ద పట్టించుకోకుండా. రేఖ గుప్పెడు గుప్పెడు అన్నం మూడు గాజు సీసాల్లో వేసి కాసిన్ని నీళ్లు పోసి మూతలు బిగించింది. ఒక సీసా పూజ గదిలో, మరో సీసా హాల్లో, మరోటి బెడ్రూమ్లో పెట్టింది. ‘‘ఈ సీసాలేంటీ, వాటిల్లో అన్నం వేసి నీళ్లు పోయడమేంటీ?’’అడిగాడు ఆనంద్. ‘‘వెయిట్ అండ్ సీ సర్’’ అంది రేఖ నవ్వుతూ. ఆ తర్వాత ఆనంద్ ఆ విషయం మర్చిపోయాడు. కానీ నెల రోజుల తర్వాత రేఖ గుర్తుచేసింది. ‘‘హా... అప్పుడేదో సీసాలు పెట్టావ్ కదా. ఏమయ్యాయవి?’’ అడిగాడు. ‘‘మీరే చూడండి.’’ ‘సరే’ అంటూ హాల్లో ఉన్న సీసా మూత తీశాడు. ముక్కుపుటాలు బద్ద లయ్యేలా దుర్వాసన. లోపలంతా నల్లగా మారిపోయింది. బెడ్రూమ్లో సీసా తీసి చూశాడు. దుర్వాసన లేదు. తర్వాత పూజ గదిలోని సీసా తీసుకుని చూశాడు. మంచి వాసన వస్తోంది. ‘‘హేయ్.. ఏంటిదీ. మూడింటిలో ఒకేసారి రైస్ వేసి పెట్టావ్. మరి మూడూ మూడు రకాల వాసన వస్తున్నాయేంటీ?’’ అర్థంకాక అడిగాడు ఆనంద్. ‘‘దట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ అవర్ వర్డ్స్. పూజగదిలో మనం పాజిటివ్‌గా ఉంటాం, ప్రార్థనలు చేస్తాం కాబట్టి దాన్ని ఫెర్మెం టేషన్ అలా జరిగింది. అత్తమ్మ రోజంతా హాల్లో కూర్చుని నెగెటివ్‌గా మాట్లాడు తుంది కాబట్టి అదలా కుళ్లిపోయింది.’’ ‘‘అవునా? అది సాధ్యమా?’’ అడిగాడు ఆశ్చర్యంగా. ‘‘సాధ్యమే. వాటర్‌పైన జపాన్ సైంటిస్ట్ డాక్టర్ మసారు ఇమోటో ప్రయోగాలు చేశారు. ఆ వీడియోలు యూ ట్యూబ్‌లో చూశాను. ఆయన రాసిన ‘ద హిడెన్ మెసేజెస్ ఆఫ్ వాటర్’ పుస్తకం గురించి కూడా చదివాను. మీరూ చూడండి ఓసారి.’’ ‘‘తప్పకుండా చూస్తా. అమ్మక్కూడా అర్థమయ్యేలా చెప్తా. అది సరే కానీ... బెడ్రూమ్లోది డిఫరెంట్‌గా ఉందేంటీ?’’ ‘‘బెడ్రూమ్లో మనం పెద్దగా మాట్లాడుకోం కాబట్టి.. అదలా...’’ కన్నుగీటింది రేఖ. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మా మిక్కీ మౌస్ అత్తగారు...
ఆత్మబంధువు ‘‘భవానీ... భవానీ... కాఫీ కావాలని చెప్పి ఎంతసేపైంది?’’ అరిచింది రత్నమాంబ. ‘‘తెస్తున్నా అత్తమ్మా.’’ ‘‘తెస్తున్నా, తెస్తున్నా... అని అరగంట నుంచి చెప్తున్నావ్... తెచ్చిస్తే కదా!’’ ‘‘ఇదిగోండి అత్తమ్మా కాఫీ. ఐదు నిమిషాల్లో తెచ్చేశా.’’ ‘‘అంటే... అరగంటని నేను అబద్ధం చెప్తున్నానా?’’ ‘‘అయ్యో... నేనలా అన్లేదు అత్తమ్మా’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘ఏంటే నవ్వుతున్నావ్. అంత ఎగ తాళిగా ఉందా?’’ అరిచింది రత్నమాంబ. ‘‘అదేంటత్తమ్మా... మిమ్మల్ని అలా ఎందుకనుకుంటాను!’’ ‘‘మరెందుకే నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నావ్?’’ ‘‘అలాంటిదేంలేదత్తమ్మా’’ అని ముసిముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లింది భవాని. ‘‘భవానీ... ఏంటిది ఇల్లు ఇలా ఉంది? నీపాటికి నువ్వు నీటుగా రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్తే సరిపోతుందా? ఇల్లెలా ఉందో చూసుకునే పన్లేదా?’’... అరిచింది రత్నమాంబ. ‘‘పొద్దున్నే ఇల్లు సర్దాకే మిగతా పనులు చేశానత్తమ్మా.’’ ‘‘అంటే... నువ్వు ఇల్లు సర్దినా సర్దలేదని నేనంటున్నానా?’’ అని రాగం తీసింది రత్నమాంబ. ఇక ఆవిడతో మాట్లాడటం అనవసరమని ఆఫీసుకు వెళ్లిపోయింది భవాని. ఇవి మచ్చుకు రెండు సంఘటనలు మాత్రమే. కానీ ఈ ఆర్నెల్లలో ఇలాంటివి ఎన్నో. రత్నమాంబకు ఇద్దరు కుమారులు... రమేష్, సురేష్. రమేష్‌కు ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి చేసింది. సురేష్ తన కొలీగ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారిది కులాంతర వివాహం. రత్న మాంబకు బొత్తిగా ఇష్టం లేని పని అది. కానీ కొడుకు పట్టుపట్టడంతో చేసేదేంలేక అంగీకరించింది. కొత్తకోడలు భవాని ఇంటిలో అడుగు పెట్టినప్పటినుంచీ ఇలా సూటిపోటి మాటలతో హింసిస్తోంది. కానీ భవాని నవ్వుతూ తన పని తాను చేసుకు పోతుంది. అత్తగారలా చీటికీ మాటికీ సూటిపోటి మాటలంటున్నా భవాని నవ్వుతూ ఎలా ఉండగలుగుతుందో పెద్దకోడలు మాధవికి అర్థం కాలేదు. వింటున్న తనకే కోపమొస్తుంది, ఈ అమ్మాయెలా నవ్వ గలుగుతుందని ఆశ్చర్యం. ఒకసారి కాక పోతే మరోసారైనా అత్తగారికి భవాని ఎదురు మాట్లాడుతుందని ఎదురు చూసింది. కానీ భవాని ముసిముసి నవ్వులతోనే సరిపెడుతోంది. ఇక ఉండబట్టలేక ఓ రోజు అడిగేసింది. ‘‘భవానీ... అత్తగారు రోజూ నిన్ను అన్ని మాటలంటున్నా నువ్వు మాట్లాడవేం?’’ నవ్వింది భవాని. ‘‘ఇదిగో ఇలాగే ముసిముసిగా నవ్వుకుంటావ్. నీకు కోపం రాదా?’’ అడిగింది మాధవి. ‘‘మిక్కీ మౌస్ మాట్లాడుతుంటే ఎవరికైనా కోపమొస్తుందా అక్కా?’’ ‘‘మిక్కీ మౌసా? నేను మాట్లాడు తోంది కార్టూన్ చానల్ గురించి కాదు భవానీ, మన అత్తగారి గురించి.’’ ‘‘అక్కా... అత్తగారు మాట్లాడుతుంటే నీకెందుకు కోపమొస్తుందో చెప్పు?’’ అడిగింది భవాని. ‘‘ఆవిడలా లేనిపోని దానికి వంకలు పెడుతుంటే కోపం రాదా మరి.’’ ‘‘వస్తుందనుకో. మరి అదే పని మిక్కీమౌస్ చేస్తే?’’ ‘‘మధ్యలో ఈ మిక్కీమౌస్ ఏంటి భవానీ? నాకు అర్థం కావడంలేదు.’’ ‘‘అక్కా... అత్తగారు అలా తప్పులు పడతారనీ, గట్టిగా అరుస్తారనే కదా నీకు కోపం. అదే పని మిక్కీమౌస్ చేసిం దనుకో... నువ్వు కోప్పడతావా? నవ్వు కుంటావా? మిక్కీమౌస్ ఏం చేసినా నవ్వే వస్తుంది కదా. నేను రోజూ నవ్వుతున్నది అందుకే. అంటే... నేను అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నా నన్నమాట’’... ‘‘అత్తగారిని మిక్కీమౌస్‌లా చూడ్డ మేంటి భవానీ? అర్థమయ్యేలా చెప్పవా?’’ ‘‘చెప్పినా నీకు అర్థం కాదక్కా. ఓ సారి చేసి చూస్తావా?’’ ‘‘ఓకే.’’ ‘‘సరే.. కళ్లు మూసుకుని ఓసారి మన అత్తగారిని ఊహించుకో. ఆవిడెలా కనిపిస్తుందో, వినిపిస్తుందో, నీకేం అనిపిస్తుందో చెప్పు.’’ కళ్లు మూసుకుని అంది మాధవి. ‘‘రాక్షసిలా కనిపిస్తుంది భవానీ, గట్టిగా అరుస్తోంది. నాకైతే పీక నొక్కేయాలని పిస్తోంది తెలుసా!’’ ‘‘కదా... ఇప్పుడు ఆ రాక్షసిని మిక్కీ మౌస్లా మార్చెయ్.’’ ‘‘ఓకే... యా... నౌ షి ఈజ్ లైక్ ఎ మిక్కీమౌస్. హహహ... భలే ఫన్నీగా ఉంది భవానీ. ఆమె అరుపుల్ని ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.’’ ‘‘కదా... ఓ నాలుగు రోజులు ఇలా ప్రాక్టీస్ చెయ్. ఐదో రోజు నుంచి ఆవిడెలా అరిచినా నీకు మిక్కీమౌస్ అరిచినట్లే వినిపిస్తుంది. నేను రోజూ చేస్తుంది అదే’’ అని పకపకా నవ్వింది భవాని. ‘‘అంటే.. రోజూ నువ్వు అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ టెక్నిక్?’’ ‘‘ఎక్కడ నేర్చుకుంటేనేం.. బావుంది కదా. ఆవిడ అరుస్తున్నకొద్దీ మనకు ఎంటర్టైన్మెంట్.’’ ‘‘హహహ... నిజమే. ఇవ్వాల్టి నుంచి నేను కూడా నీ టెక్నిక్‌నే ఫాలో అవుతా’’... అని నవ్వుతూ చెప్పింది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్