మీ జీవితంలో ఉప్పు ఉందా? | Have salt in your life? | Sakshi
Sakshi News home page

మీ జీవితంలో ఉప్పు ఉందా?

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

మీ జీవితంలో ఉప్పు ఉందా?

మీ జీవితంలో ఉప్పు ఉందా?

ఆత్మబంధువు
‘‘హాయ్ అక్కా’’ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సంతోష్.
ఎవరా అని చూసింది రేఖ. తమ్ముడు సంతోష్. ఆనందం... ఆశ్చర్యం!
‘‘ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. రారా’’ అంటూ ఆహ్వానించింది.
‘‘ఈ అక్కను చూడ్డానికి కూడా టైమ్ దొరకడం లేదా నీకు’’ అంటూ చిరుకోపం ప్రదర్శించింది.

‘‘సారీ అక్కా. వద్దామని ఉన్నా కుదరట్లేదు. అయినా నువ్వు కూడా ఇలా తిడితే నేనేం చేయగలను?’’
 ‘‘సర్లేరా. అయినా నేను కాక ఇంకా తిట్టేవాళ్లున్నారా నిన్ను?’’
 ‘‘ఉందిగా... మీ మరదలు.’’
 ‘‘అదేంట్రా... ఇద్దరూ బాగానే ఉంటారుగా?’’
 ‘‘ఉంటారు కాదు... ఉండేవాళ్లం. ఇప్పుడు రోజూ చిరాకులు పరాకులు.’’
 
‘‘రోజూనా?’’
 ‘‘రోజూ అంటే రోజూ కాదు. తరచుగా.’’
 ఇంతలో ఆఫీసు నుంచి ఆనంద్ వచ్చేశాడు. ‘‘హల్లో సంతోష్... ఎలా ఉన్నావ్’’ అంటూ కూర్చున్నాడు.
 ‘‘సరే.. బావా మరుదులు మాట్లాడు కుంటూ ఉండండి. నేను వంట చేస్తా’’ అంటూ లేచింది రేఖ.
    
‘‘వంట అయిపోయింది. రండి’’ పిలిచింది రేఖ. ‘‘వద్దు అక్కా... నేను వెళ్తాను’’ అన్నాడు సంతోష్.
‘‘నేను కీర్తికి ఫోన్ చేసి చెప్పాలే. నువ్ భోంచేసి వెళ్లు.’’
 తప్పదన్నట్లుగా కూర్చున్నాడు. రేఖ భోజనం వడ్డించింది.
 ‘‘ఏంటోయ్ ఈ కూరలో ఉప్పేలేదు’’ అన్నాడు ఆనంద్.
 ‘‘ఔనా... మర్చిపోయుంటాను.’’
 ‘‘ఔనౌను.. తమ్ముడు వచ్చాడన్న ఆనందంలో మర్చిపోయుంటావ్.’’
 
‘‘అంత లేదులెండి.’’ అంటూ కూరలో కాస్త ఉప్పు కలిపి, మళ్లీ వడ్డించింది రేఖ.
 ‘‘అబ్బబ్బ... ఇప్పుడు  ఉప్పు ఎక్కువైందోయ్’’.. అరిచాడు ఆనంద్.
 ‘‘అబ్బబ్బ... తక్కువైతే
 తక్కువైందంటారు. ఎక్కువైతే ఎక్కువైందని అరుస్తారు. ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా?’’
 ‘‘రోజూ అవుతూనే ఉన్నాంలే.’’
 
‘‘ఇదిగో ఇదిరా మీ బావగారి వరస. పేరు ఆనందే కానీ, దుర్వాసుడి టైపు.’’
 ‘‘నేను దుర్వాసుడి టైపయితే నీ పని బానే ఉండేది’’ అన్నాడు ఆనంద్.
 ‘‘బావుందనేగా చెప్తున్నా’’ అంది కొంటెగా రేఖ.
 అక్కాబావల గొడవ ముచ్చటగా అనిపించింది సంతోష్‌కి. అదే విషయం చెప్పాడు అక్కతో భోజనాల తర్వాత.
 ‘‘కూరలో ఉప్పు లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో సంసారంలో చిన్న చిన్న గొడవలు లేకపోయినా అలాగే ఉంటుందిరా’’ అంది రేఖ.
 
‘‘చిన్న చిన్నవైతే పర్లేదక్కా. మావి పెద్ద పెద్ద గొడవలు. అంటే మా కూరలో ఉప్పు ఎక్కువైందన్నమాట’’ అన్నాడు నవ్వుతూ.
 ‘‘ఫీలవకురా. ఆ ఉప్పు బ్యాలెన్‌‌స చేయడానికి ఓ చిట్కా చెప్పనా?’’ అంది.
 ‘‘నీ దగ్గరకు వచ్చిందే అందుక్కదా.’’
 
‘‘సరే... ఈసారి మీ ఆవిడ అరిచేటప్పుడు కొంచె నీళ్లు తాగు.’’
 ‘‘కోపం వచ్చినవాళ్లు కదా వాటర్ తాగాలి?’’ సందేహం వ్యక్తం చేశాడు.
 ‘‘నేను చెప్పింది చెయ్యరా. కొంచెం వాటర్ తాగి, మీ ఆవిడ అరుపులు తగ్గేంత వరకూ నోట్లో అలాగే ఉంచుకో. అలా రెండు వారాలు చేసి చూడు.’’
 ‘‘ఓకే. ఐ విల్ ట్రై’’ అనేసి సెలవు తీసుకున్నాడు సంతోష్.
   
రెండు వారాల తర్వాత ఫోన్ చేశాడు సంతోష్. ‘‘నువ్వు చెప్పిన చిట్కా బాగా పని చేసిందక్కా. ఇప్పుడు తను అరవడం లేదు’’ అన్నాడు సంతోషంగా.
 ‘‘వెరీగుడ్... ఇక హ్యాపీగా ఉండు’’ అంది రేఖ తృప్తిగా.
 ‘‘అలాగే అక్కా. కానీ నాదో డౌట్. జస్ట్ గుక్కెడు నీళ్లు నా సమస్యని ఎలా పరిష్కరించాయంటావ్?’’
 నవ్వింది రేఖ.‘‘నీ సమస్యను పరిష్కరించింది నీళ్లు కాదురా... నువ్వే.’’
 ‘‘నేనా? అర్థం కాలేదు’’ అన్నాడు అయోమయంగా.
 
‘‘నోట్లో నీళ్లు ఉంటే నువ్వు మాట్లాడ లేవు కదా! అందుకే నీ భార్య అరిచే టప్పుడు నువ్వు ఎదురు మాట్లాడి ఉండవు. ఎప్పుడైనా రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఇద్దరి మధ్య మాటా మాటా సమానంగా పెరిగితేనే సమస్యలు. ఒకరికి కోపం వచ్చినప్పుడు రెండోవాళ్లు మౌనంగా ఉంటే కొట్లాట అన్నదే రాదు.’’
 ‘‘వామ్మో... ఎన్ని తెలివి తేటలక్కా నీకు’’ అన్నాడు అక్క తెలివికి మురిసిపోతూ.
 ‘‘ఏడ్చావ్‌లే. జాగ్రత్తగా ఉండు’’... నవ్వి ఫోన్ పెట్టేసింది రేఖ.
 - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement