consulting psychologist
-
మానసిక ఒత్తిడి మాయే!
ఆత్మబంధువు ఆనంద్ ఆఫీసునుంచి వచ్చాడు. కానీ రేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. కాఫీ ఇస్తే ఏదో అలా తాగేశాడు. పిల్లలు దగ్గరకు వచ్చినా పట్టించుకోలేదు. అతను ఏదో ఒత్తిడిలో ఉన్నాడని రేఖకు అర్థమైంది. అదే విషయం అడిగింది. ‘‘అలాంటిదేం లేదోయ్’’ అన్నాడు. ‘‘మరి అలా ఎందుకున్నారు?’’ ‘‘ఎలా ఉన్నాను? బానే ఉన్నాగా?’’ ‘‘మీరు మామూలుగా లేరు. ఆఫీసులో ఏదైనా ఒత్తిడా?’’ ‘‘అలాంటిదేం లేదు. నేను బాగానే ఉన్నా. ఆఫీసులో కూడా బాగానే ఉంది. ఏదో చిన్న ఒత్తిడి. అంతే. ఉద్యోగం అన్న తర్వాత అవన్నీ తప్పవుగా.’’ ‘‘చిన్న ఒత్తిడి అని వదిలేస్తే పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది ఆనంద్.’’ ‘‘అలాంటిదేం లేదులే. అది చాలా చిన్న సమస్య. ఐ కెన్ మేనేజ్.’’ ఆనంద్ అలా చెప్తున్నా... ఆ సమస్యను మేనేజ్ చేయలేకనే ఒత్తిడి ఫీల్ అవుతున్నాడని రేఖకు అర్థమైంది. ఆ విషయం అతనికి ప్రాక్టికల్‌గా చెప్పాలనుకుంది. ‘‘ఆనంద్... ఓ చిన్న పని చేయ గలవా?’’ మర్నాడు అడిగింది రేఖ. ‘‘హా.. చెప్పు’’ అన్నాడు ఆనంద్. ‘‘కొంచెం ఈ కప్పు పట్టుకోవా?’’ అని చిన్న కప్పు చేతికిచ్చింది. ‘‘ఆ మాత్రం దానికేనా?’’ అంటూ కప్పు అందుకున్నాడు. ‘‘నేను చెప్పేంతవరకూ ఆ కప్పు కింద పెట్టకూడదు’’ అంది రేఖ. ‘‘ఒహ్హో... ఈ చిన్న కప్పును పట్టుకోలేనా?’’ ‘‘పట్టుకోండి సార్ చూద్దాం.’’ ఆనంద్ ఆ కప్పును అలా పట్టుకుని నిల్చున్నాడు. రేఖ వంట చేసుకుంటోంది. పది నిమిషాలకు కప్పు బరువుగా అనిపించింది ఆనంద్కి. పావు గంటకు చెయ్యి గుంజడం మొదలెట్టింది. అరగంట తర్వాత ఇక భరించలేననుకున్నాడు. కప్పును చేయి మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ‘‘హలో మిస్టర్ ఆనంద్... మీరు అదే చేత్తో పట్టుకోవాలి. చేయి మార్చుకోవడం కుదరదు’’ అంది రేఖ. ‘‘అరగంట పట్టుకునేసరికి చేయి గుంజుతుందోయ్’’ చెప్పాడు ఆనంద్. ‘‘కదా... అలాగే చిన్న ఒత్తిడిని ఎక్కువకాలం భరించినా ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది సర్’’ అంది నవ్వుతూ. ‘‘ఓహ్... నిన్న నేనన్న మాటలకు రిటార్డా?’’ అంటూ కప్పు కింద పెట్టాడు. ‘‘రిటార్డేం కాదు. చిన్న ఒత్తిడని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పాలనీ...’’ ‘‘చెప్పాలనుకుంటే డెరైక్ట్‌గా చెప్పొచ్చుగా... ఇలా ఎందుకు?’’ ‘‘డెరైక్ట్‌గా చెప్తే తమరికి నచ్చదుగా. అందుకే ప్రాక్టికల్‌గా చూపిద్దామనీ...’’ ‘‘అబ్బో... స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ కూడా చెప్తావా ఏంటీ?’’ ‘‘ఏం... చెప్పకూడదా ఏంటీ?’’ ‘‘నాకు తెలియని టిప్స్ నువ్వేం చెప్తావోయ్?’’ ‘‘మీకు తెలిసిన టిప్స్ ఏంటో చెప్పండి ముందు.’’ ‘‘రోజూ పొద్దుటే వాకింగ్, యోగా, మెడిటేషన్ చేసాను కదా! అలాగే మా ఆఫీసులో స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎక్స్‌పర్ట్స్‌తో క్లాసులు కూడా చెప్పిస్తుంటారు. వాళ్లు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు.’’ ‘‘మరి చేస్తున్నారా?’’ ‘‘అప్పుడప్పుడూ. అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చేస్తున్నా.’’ ‘‘మరి తగ్గుతుందా?’’ ‘‘తగ్గుతుంది... మళ్లీ వస్తుంది.’’ ‘‘కదా... మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... అసలది లేదనే విషయం తెలుసుకోవాలి.’’ ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. ‘‘ఏంటీ... మానసిక ఒత్తిడనేది లేదా? ఎవరైనా వింటే జనాలు నవ్వుతారు. ఒత్తిడి తట్టుకోలేక లక్షలాదిమంది బాధపడు తుంటే నువ్వు ఒత్తిడనేదే లేదంటావేం?’’ ‘‘సరే ఉంది. కానీ ఆ ఒత్తిడి సృష్టిస్తున్నది ఎవరు?’’ ‘‘ఎవరంటే... దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలా చెప్పడం?’’ ‘‘మీరెన్ని కారణాలు చెప్పినా అవి సెకెండరీ. మీరెన్ని టిప్స్ పాటించినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు. ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... దాని మూలం తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ కొన్ని సామర్థ్యాలూ, అంచనాలూ ఉంటాయి. అంచనాలకు, ఆశయాలకూ తగ్గ సామర్థ్యా లున్నప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. అంచనాలకూ సామర్థ్యాలకూ మధ్య దూరం పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ‘‘అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలంటే అంచనాలు తగ్గించుకోవాలి, లేదంటే అంచనాలకు అందుకోగల సామర్థ్యాలను పెంచుకోవాలి. అంతే తప్ప మరేం చేసినా అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే.’’ ‘‘నువ్వు చెప్పింది నిజమేనోయ్. థ్యాంక్స్.’’ అంటూ ముద్దిచ్చాడు ఆనంద్. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
నచ్చని సినిమా చూడొద్దు!
ఆత్మబంధువు ‘‘ఏంటక్కా అలా ఉన్నావ్?’’ అడిగింది రేఖ ఇంట్లోకి అడుగు పెడుతూనే. ‘‘ఏం లేదురా..’’ అంది భవాని. రేఖ నమ్మలేదు. ‘‘ఏమీ లేకుంటే ఎందుకంత డల్‌గా కనిపిస్తున్నావేం?’’ అంటూ మళ్లీ ప్రశ్నించింది. ‘‘ఏదో గుర్తొచ్చిందిలే’’ అంది భవాని. ‘‘నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో చెప్పక్కా’’ అంటూ ఒత్తిడి చేసింది రేఖ. భవాని చెప్పడం మొదలు పెట్టింది. ‘‘నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక సంఘటన జరిగిందిరా. అది ఎప్పుడు గుర్తొచ్చినా బాధగా ఉంటుంది. నేను మా ఊర్నుంచి కాలేజీకి బస్సులో వెళ్లి వచ్చేదాన్ని. అప్పుడొకడు రోజూ నా వెంట పడేవాడు. వద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. విసుగొచ్చి ఓ రోజు మన ఇంట్లో చెప్పేశా. వాడు అది మనసులో పెట్టుకుని నాపై దాడి చేశాడు. ఎలాగో తప్పించుకున్నాను కానీ, ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా మనసు కలుక్కుమంటుంది.’’ నిట్టూర్చింది రేఖ. ‘‘కొందరు అంతే అక్కా. అవునూ... నాకెప్పుడూ ఈ విషయం చెప్పలేదేం?’’ ‘‘చెప్పుకోవడానికి అదేం గొప్ప విషయమో, మంచి విషయమో కాదుగా రేఖా!’’ ‘‘అవుననుకో. కానీ అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?’’ అంది రేఖ అక్క ముఖంలో దిగులును గమనిస్తూ. ‘‘ఇప్పుడనే కాదురా. పేపర్లో, టీవీలో అలాంటి వార్త చూసినా, చదివినా గుర్తొస్తుంది. ఇక ఆ రోజంతా నా మనసు మనసులో ఉండదు. అప్పుడు బాగా బాధ పడ్డానేమో, ఎంత కాలమైనా మర్చిపోలేక పోతున్నాను.’’ ‘‘అవునా. సరేలే. ఓ విషయం చెప్పు. నీకు నచ్చిన సినిమా ఏంటి?’’ తాను తన బాధ గురించి మాట్లాడు తుంటే, రేఖ సినిమా గురించి అడుగుతుందేమిటా అని అయోమయంగా చూసింది భవాని. భవానీ డౌట్ రేఖకు అర్థమైంది. ‘‘ముందు జవాబివ్వు, ఎందుకో తర్వాత చెప్తాను’’ అంది. ‘‘ఏం మాయ చేసావె.’’ ‘‘ఎన్నిసార్లు చూశావేం?’’ అడిగింది. ‘‘ఓ పాతిక ముప్ఫైసార్లు’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘మరి నీకు నచ్చని సినిమా ఏంటి?’’ ‘‘బోలెడున్నాయి.’’ ‘‘నీకు నచ్చని ఆ బోలెడు సినిమాల్లో ఒక సినిమాని పదిసార్లు చూడమంటే ఏం చేస్తావ్?’’ ‘‘లక్ష రూపాయలిచ్చినా చూడను.’’ ‘‘ఎందుకలా?’’ ‘‘చెత్త సినిమా కాబట్టి. నాకు నచ్చలేదు కాబట్టి.’’ ‘‘మరయితే నీకు నచ్చని నీ డిగ్రీ సినిమాను పదేపదే ఎందుకు చూస్తున్నావ్ అక్కా?’’ అర్థం కానట్టుగా చూసింది భవాని. ‘‘డిగ్రీ సినిమా చూడటమేంటి? నాకేం అర్థం కాలేదు.’’ ‘‘ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్తా. డిగ్రీలో జరిగిన విషయం నీకెలా గుర్తొస్తోంది?’’ ‘‘నేను కావాలని గుర్తుచేసుకోన్రా. అలాంటి వార్తలు చదివినప్పుడు లేదా చూసినప్పుడు గుర్తొస్తుంది.’’ ‘‘గుర్తొచ్చింది సరే. కానీ ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడటం ఎందుకు?’’ ‘‘అది నాకు తెలీదురా. బాధ కలుగుతుందంతే.’’ ‘‘కదా... దీన్నే అసోసియేషన్ అంటారక్కా. అంటే ఆ విషయం జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో, అది గుర్తొచ్చినప్పుడు కూడా దాదాపు అంతే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకానికి ఆ బాధ అలా లింక్ అయి ఉంటుందన్నమాట.’’ ‘‘అలాగా... దాన్ని తప్పించుకునే మార్గం లేదా?’’ ‘‘ఎందుకు లేదూ! ఎంచక్కా ఉంది. దాన్ని డిసోసియేట్ చేస్తే సరి.’’ ‘‘అంటే?’’ మళ్లీ అయోమయంగా ముఖం పెట్టింది భవాని. ‘‘అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకోక పోవడం. దాన్ని నీ మనసు నుంచి దూరం చేయడం.’’ ‘‘అదెలా?’’ ‘‘ఎలా అంటే... ఆ సంఘటనను నీ మనసులో గుర్తు చేసుకుంటున్నప్పుడు అందులో నువ్వూ కనిపిస్తావ్ కదా?’’ ‘‘నేను లేకపోతే ఆ సంఘటనే లేదుగా’’ అంది భవాని. ‘‘అవును. అందుకే ఇప్పుడో పని చెయ్. నువ్వు హాల్లో సోఫాలో కూర్చొని, టీవీలో సినిమా ఎలా చూస్తావో, నీ మనసునే టీవీ అనుకుని ఆ సంఘటనను టీవీలో చూస్తున్నట్లు మనసులో చూడు. అది చూడటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి టీవీని చిన్నది చేసుకో. నీకూ టీవీకి మధ్య దూరం పెంచుకో. టీవీని బ్లాక్ అండ్ వైట్‌గా మార్చుకో. మ్యూట్‌లో పెట్టుకో. డల్ చేసుకో. బ్లర్ చేసుకో. డూ వాటెవర్ యూ వాంట్. తర్వాతెలా ఉందో చెప్పు.’’ ‘‘ఊ... టీవీని చిన్నది చేశా, దూరం పెంచా. బ్లాక్ అండ్ వైట్‌గా మార్చేశా. మ్యూట్‌లో పెట్టేశా. నౌ ఫీలింగ్ గుడ్.’’ ‘‘కదా. దీన్నే డిసోసియేట్ అంటారు. అంటే మనసుకు బాధ కలిగించే సంఘటనల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవడం అన్నమాట. అప్పుడా ఇన్సిడెంట్ గుర్తొచ్చినా బాధ ఉండదు.’’ భవాని ముఖం వెలిగింది.‘‘ఇన్నేళ్ల బాధను దూరం చేశావ్. థాంక్స్ రా’’ అంది తృప్తిగా. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మాట మంచిదైతే...
ఆత్మబంధువు ‘‘రేఖా.. రేఖా! ఎక్కడున్నావ్?’’ గట్టిగా అరుస్తోంది అత్తగారు రత్నమాంబ. ‘‘హా... ఇక్కడే ఉన్నానత్తమ్మా’’ వంటింట్లోంచి పలికింది రేఖ. ‘‘కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా?’’ ‘‘హా.. ఐదు నిమిషాలు.’’ ఐదు నిమిషాల్లో మాంచి ఫిల్టర్ కాఫీ రెడీ చేసి ఇచ్చింది అత్తగారికి. ‘‘ఇదేంటీ.. కషాయం తాగినట్టుంది. పెళ్లయ్యి ఇన్నేళ్లైంది... కాఫీ పెట్టడం కూడా రాకపోతే ఎలా? వంట గదిలో కాఫీ కలిపితే హాల్లోకి వాసన రావాలి. తాగు తుంటే చిరుచేదుగా, కాస్తంత తియ్యగా ఉండాలి. ఇది ముక్కు దగ్గర పెట్టుకున్నా రావట్లేదు. రుచీ పచీ లేదు.’’ మనసు చిన్న బుచ్చుకున్న రేఖ వంటింట్లోకి వెళ్లి కాఫీ రుచి చూసింది. బాగానే ఉంది. మరి ఆవిడెందుకలా మాట్లాడిందో అనుకుంటూ ఉండిపోయింది. ‘‘మమ్మీ... నా డ్రెస్ ఎలా ఉంది?’’ అడిగింది మైత్రి. ‘‘బ్యూటిఫుల్.. ఏంజిల్లా కని పిస్తున్నావు’’ అంటూ ముద్దు పెట్టుకుంది రేఖ. ‘‘నువ్వలాగే దాన్ని గారాబం చేస్తూండు. చేతికి చిక్కదు’’ అంది రత్నమాంబ. ‘‘వాట్ గ్రాండ్మా... ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావ్?’’ అడిగింది మైత్రి. ‘‘నేనేమన్నానే. ఆ డ్రెస్ చూస్తే ఎవరైనా అంటారు.’’ ‘‘నా డ్రెస్ నా ఇష్టం. నీకేంటీ?’’ ‘‘నాకేంటా.. కాళ్లు విరగ్గొడతా.’’ ‘‘చూడు మమ్మీ... ఏమంటుందో’’ అంటూ తల్లివైపు చూసింది మైత్రి. ‘‘నాయనమ్మే కదా, లీవిట్’’ అంది . కానీ ఇలా రత్నమాంబ ఎప్పుడూ ఏదో ఒకటి అనడం... తను, పిల్లలు బాధ పడటం జరుగుతూనే ఉంది. అయినా ఏరోజూ భర్తకు చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పేయాలనుకుంది రేఖ. ‘‘ఆనంద్... నువ్వేం అనుకోనంటే ఓ మాట చెప్తా’’ ‘‘చెప్పవోయ్.. వద్దన్నదెవరు!’’ ‘‘అత్తమ్మ రోజూ సూటి పోటి మాటలంటూనే ఉంటోంది. నేను సర్దుకుపోతున్నాను. బట్.. పిల్లలు మనసు కష్టపెట్టుకుంటున్నారు.’’ ‘‘పెద్దావిడ కదా.. తెలిసీ తెలియక ఏదో అంటుంది. పట్టించుకోకు’’ అన్నాడు సింపుల్‌గా. ‘‘అది కాదు ఆనంద్. ఆవిడ నెగెటివ్ కామెంట్స్ పిల్లలపైన ఎక్కడ నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయోనని నా భయం.’’ ‘‘మాటలు ఎఫెక్ట్ చూపించడ మేంటోయ్... నీ చాదస్తం కాకపోతే.’’ ‘‘చాదస్తం కాదు.. నిజం. అయినా మీకు మాటల్లో చెప్పడంకంటే చేతల్లో చూపిస్తే బెటర్.’’ ‘‘చూపించు.. చూపించు’’ అన్నాడు ఆనంద్ పెద్ద పట్టించుకోకుండా. రేఖ గుప్పెడు గుప్పెడు అన్నం మూడు గాజు సీసాల్లో వేసి కాసిన్ని నీళ్లు పోసి మూతలు బిగించింది. ఒక సీసా పూజ గదిలో, మరో సీసా హాల్లో, మరోటి బెడ్రూమ్లో పెట్టింది. ‘‘ఈ సీసాలేంటీ, వాటిల్లో అన్నం వేసి నీళ్లు పోయడమేంటీ?’’అడిగాడు ఆనంద్. ‘‘వెయిట్ అండ్ సీ సర్’’ అంది రేఖ నవ్వుతూ. ఆ తర్వాత ఆనంద్ ఆ విషయం మర్చిపోయాడు. కానీ నెల రోజుల తర్వాత రేఖ గుర్తుచేసింది. ‘‘హా... అప్పుడేదో సీసాలు పెట్టావ్ కదా. ఏమయ్యాయవి?’’ అడిగాడు. ‘‘మీరే చూడండి.’’ ‘సరే’ అంటూ హాల్లో ఉన్న సీసా మూత తీశాడు. ముక్కుపుటాలు బద్ద లయ్యేలా దుర్వాసన. లోపలంతా నల్లగా మారిపోయింది. బెడ్రూమ్లో సీసా తీసి చూశాడు. దుర్వాసన లేదు. తర్వాత పూజ గదిలోని సీసా తీసుకుని చూశాడు. మంచి వాసన వస్తోంది. ‘‘హేయ్.. ఏంటిదీ. మూడింటిలో ఒకేసారి రైస్ వేసి పెట్టావ్. మరి మూడూ మూడు రకాల వాసన వస్తున్నాయేంటీ?’’ అర్థంకాక అడిగాడు ఆనంద్. ‘‘దట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ అవర్ వర్డ్స్. పూజగదిలో మనం పాజిటివ్‌గా ఉంటాం, ప్రార్థనలు చేస్తాం కాబట్టి దాన్ని ఫెర్మెం టేషన్ అలా జరిగింది. అత్తమ్మ రోజంతా హాల్లో కూర్చుని నెగెటివ్‌గా మాట్లాడు తుంది కాబట్టి అదలా కుళ్లిపోయింది.’’ ‘‘అవునా? అది సాధ్యమా?’’ అడిగాడు ఆశ్చర్యంగా. ‘‘సాధ్యమే. వాటర్‌పైన జపాన్ సైంటిస్ట్ డాక్టర్ మసారు ఇమోటో ప్రయోగాలు చేశారు. ఆ వీడియోలు యూ ట్యూబ్‌లో చూశాను. ఆయన రాసిన ‘ద హిడెన్ మెసేజెస్ ఆఫ్ వాటర్’ పుస్తకం గురించి కూడా చదివాను. మీరూ చూడండి ఓసారి.’’ ‘‘తప్పకుండా చూస్తా. అమ్మక్కూడా అర్థమయ్యేలా చెప్తా. అది సరే కానీ... బెడ్రూమ్లోది డిఫరెంట్‌గా ఉందేంటీ?’’ ‘‘బెడ్రూమ్లో మనం పెద్దగా మాట్లాడుకోం కాబట్టి.. అదలా...’’ కన్నుగీటింది రేఖ. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మా మిక్కీ మౌస్ అత్తగారు...
ఆత్మబంధువు ‘‘భవానీ... భవానీ... కాఫీ కావాలని చెప్పి ఎంతసేపైంది?’’ అరిచింది రత్నమాంబ. ‘‘తెస్తున్నా అత్తమ్మా.’’ ‘‘తెస్తున్నా, తెస్తున్నా... అని అరగంట నుంచి చెప్తున్నావ్... తెచ్చిస్తే కదా!’’ ‘‘ఇదిగోండి అత్తమ్మా కాఫీ. ఐదు నిమిషాల్లో తెచ్చేశా.’’ ‘‘అంటే... అరగంటని నేను అబద్ధం చెప్తున్నానా?’’ ‘‘అయ్యో... నేనలా అన్లేదు అత్తమ్మా’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘ఏంటే నవ్వుతున్నావ్. అంత ఎగ తాళిగా ఉందా?’’ అరిచింది రత్నమాంబ. ‘‘అదేంటత్తమ్మా... మిమ్మల్ని అలా ఎందుకనుకుంటాను!’’ ‘‘మరెందుకే నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నావ్?’’ ‘‘అలాంటిదేంలేదత్తమ్మా’’ అని ముసిముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లింది భవాని. ‘‘భవానీ... ఏంటిది ఇల్లు ఇలా ఉంది? నీపాటికి నువ్వు నీటుగా రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్తే సరిపోతుందా? ఇల్లెలా ఉందో చూసుకునే పన్లేదా?’’... అరిచింది రత్నమాంబ. ‘‘పొద్దున్నే ఇల్లు సర్దాకే మిగతా పనులు చేశానత్తమ్మా.’’ ‘‘అంటే... నువ్వు ఇల్లు సర్దినా సర్దలేదని నేనంటున్నానా?’’ అని రాగం తీసింది రత్నమాంబ. ఇక ఆవిడతో మాట్లాడటం అనవసరమని ఆఫీసుకు వెళ్లిపోయింది భవాని. ఇవి మచ్చుకు రెండు సంఘటనలు మాత్రమే. కానీ ఈ ఆర్నెల్లలో ఇలాంటివి ఎన్నో. రత్నమాంబకు ఇద్దరు కుమారులు... రమేష్, సురేష్. రమేష్‌కు ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి చేసింది. సురేష్ తన కొలీగ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారిది కులాంతర వివాహం. రత్న మాంబకు బొత్తిగా ఇష్టం లేని పని అది. కానీ కొడుకు పట్టుపట్టడంతో చేసేదేంలేక అంగీకరించింది. కొత్తకోడలు భవాని ఇంటిలో అడుగు పెట్టినప్పటినుంచీ ఇలా సూటిపోటి మాటలతో హింసిస్తోంది. కానీ భవాని నవ్వుతూ తన పని తాను చేసుకు పోతుంది. అత్తగారలా చీటికీ మాటికీ సూటిపోటి మాటలంటున్నా భవాని నవ్వుతూ ఎలా ఉండగలుగుతుందో పెద్దకోడలు మాధవికి అర్థం కాలేదు. వింటున్న తనకే కోపమొస్తుంది, ఈ అమ్మాయెలా నవ్వ గలుగుతుందని ఆశ్చర్యం. ఒకసారి కాక పోతే మరోసారైనా అత్తగారికి భవాని ఎదురు మాట్లాడుతుందని ఎదురు చూసింది. కానీ భవాని ముసిముసి నవ్వులతోనే సరిపెడుతోంది. ఇక ఉండబట్టలేక ఓ రోజు అడిగేసింది. ‘‘భవానీ... అత్తగారు రోజూ నిన్ను అన్ని మాటలంటున్నా నువ్వు మాట్లాడవేం?’’ నవ్వింది భవాని. ‘‘ఇదిగో ఇలాగే ముసిముసిగా నవ్వుకుంటావ్. నీకు కోపం రాదా?’’ అడిగింది మాధవి. ‘‘మిక్కీ మౌస్ మాట్లాడుతుంటే ఎవరికైనా కోపమొస్తుందా అక్కా?’’ ‘‘మిక్కీ మౌసా? నేను మాట్లాడు తోంది కార్టూన్ చానల్ గురించి కాదు భవానీ, మన అత్తగారి గురించి.’’ ‘‘అక్కా... అత్తగారు మాట్లాడుతుంటే నీకెందుకు కోపమొస్తుందో చెప్పు?’’ అడిగింది భవాని. ‘‘ఆవిడలా లేనిపోని దానికి వంకలు పెడుతుంటే కోపం రాదా మరి.’’ ‘‘వస్తుందనుకో. మరి అదే పని మిక్కీమౌస్ చేస్తే?’’ ‘‘మధ్యలో ఈ మిక్కీమౌస్ ఏంటి భవానీ? నాకు అర్థం కావడంలేదు.’’ ‘‘అక్కా... అత్తగారు అలా తప్పులు పడతారనీ, గట్టిగా అరుస్తారనే కదా నీకు కోపం. అదే పని మిక్కీమౌస్ చేసిం దనుకో... నువ్వు కోప్పడతావా? నవ్వు కుంటావా? మిక్కీమౌస్ ఏం చేసినా నవ్వే వస్తుంది కదా. నేను రోజూ నవ్వుతున్నది అందుకే. అంటే... నేను అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నా నన్నమాట’’... ‘‘అత్తగారిని మిక్కీమౌస్‌లా చూడ్డ మేంటి భవానీ? అర్థమయ్యేలా చెప్పవా?’’ ‘‘చెప్పినా నీకు అర్థం కాదక్కా. ఓ సారి చేసి చూస్తావా?’’ ‘‘ఓకే.’’ ‘‘సరే.. కళ్లు మూసుకుని ఓసారి మన అత్తగారిని ఊహించుకో. ఆవిడెలా కనిపిస్తుందో, వినిపిస్తుందో, నీకేం అనిపిస్తుందో చెప్పు.’’ కళ్లు మూసుకుని అంది మాధవి. ‘‘రాక్షసిలా కనిపిస్తుంది భవానీ, గట్టిగా అరుస్తోంది. నాకైతే పీక నొక్కేయాలని పిస్తోంది తెలుసా!’’ ‘‘కదా... ఇప్పుడు ఆ రాక్షసిని మిక్కీ మౌస్లా మార్చెయ్.’’ ‘‘ఓకే... యా... నౌ షి ఈజ్ లైక్ ఎ మిక్కీమౌస్. హహహ... భలే ఫన్నీగా ఉంది భవానీ. ఆమె అరుపుల్ని ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.’’ ‘‘కదా... ఓ నాలుగు రోజులు ఇలా ప్రాక్టీస్ చెయ్. ఐదో రోజు నుంచి ఆవిడెలా అరిచినా నీకు మిక్కీమౌస్ అరిచినట్లే వినిపిస్తుంది. నేను రోజూ చేస్తుంది అదే’’ అని పకపకా నవ్వింది భవాని. ‘‘అంటే.. రోజూ నువ్వు అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ టెక్నిక్?’’ ‘‘ఎక్కడ నేర్చుకుంటేనేం.. బావుంది కదా. ఆవిడ అరుస్తున్నకొద్దీ మనకు ఎంటర్టైన్మెంట్.’’ ‘‘హహహ... నిజమే. ఇవ్వాల్టి నుంచి నేను కూడా నీ టెక్నిక్‌నే ఫాలో అవుతా’’... అని నవ్వుతూ చెప్పింది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్