సీవోపీడీకి ఆక్సిజన్ థెరపీ మంచిదేనా?
పల్మునాలజీ కౌన్సెలింగ్
నా వయసు 43 ఏళ్లు. నేను కొద్దికాలంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్)తో బాధపడుతున్నాను. దీనికి ఆక్సిజన్ థెరపీతో మంచి ఉపశమనం ఉంటుందని చదివాను. దీని గురించి వివరించండి.
- శ్రీనివాసరావు, మంచిర్యాల
మీరు చెప్పింది నిజమే. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ)తో బాధపడుతూ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినవారికి ఆక్సిజన్ థెరపీతో మంచి ప్రయోజనం ఉంటుంది. మీ శ్వాస తీసుకోవడంలో అవరోధాలు ఉన్నాయి కాబట్టి, మీరు హాయిగా ఫీలయ్యేందుకు, మీ దైనందిన వ్యవహారాలకు అవసరమైనంతగా మీ శరీరానికి ఆక్సిజన్ అవసరం. మీరు పీల్చుకోగలిగే ఆక్సిజన్ తక్కువ కాబట్టి ఈ అదనపు ఆక్సిజన్ వల్ల మీ ఊపిరితిత్తుల కార్యకలాపాలు మెరుగుపడతాయి. దాంతో మీరు పనిచేసే సామర్థ్యం, చురుగ్గా వ్యవహరించగల శక్తి మీకు చేకూరతాయి.
ఆక్సిజన్ థెరపీ వల్ల మీ నిద్ర నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడటంతో పాటు మీ మానసికసామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ చికిత్స చేయడం మరో విధంగా కూడా ఉపయోగపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంటే ఆక్సిజన్ చికిత్స సీవోపీడీ కండిషన్‌ను మెరుగుపరచడంతో పాటు హార్ట్‌ఫెయిల్యూర్‌ను నివారిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఆక్సిజన్ థెరపీ తీసుకోవడం మూడు రకాలుగా జరుగుతుంది. అవి...
1) కంప్రెస్డ్ ఆక్సిజన్‌ను తీసుకోవడం లేదా ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను కొలుగోలు చేసి ఈ చికిత్సను ఇంటివద్దనే తీసుకోవచ్చు. ఈ ఆక్సిజన్‌ను స్టీల్ లేదా అల్యూమినియమ్ ట్యాంకుల్లో భద్రపరుస్తారు.
సైజ్‌లో పెద్దవిగా ఉండేవాటిని ఇంటిదగ్గర వాడుకోవచ్చు.
2) మీతో పట్టుకెళ్లగలిగేవి కూడా లభిస్తాయి. వాటిని మీరు బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాడవచ్చు. ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను నిల్వ చేయడానికి చిన్న కంటెయినర్లు సరిపోతాయి. పైగా ఒకచోట నుంచి మరోచోటికి తేలిగ్గా తరలించవచ్చు. అయితే వీటిని చాలాకాలం పాటు నిల్వ చేసి ఉంచకూడదు. ఎందుకంటే అందులోని ఆక్సిజన్ ఆవిరైపోతుంది.
3) ఆక్సిజన్ థెరపీ తీసుకునేవారిలో చాలామంది ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనే మెషిన్‌ను వాడతారు. ఇది వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌నే సంగ్రహించి మీకు అందిస్తుంది. ఇది చవకైనదీ, పైగా మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉపయోగించడమూ తేలికే. అయితే ఆ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పెద్ద సైజులో ఉంటాయి. పైగా ఎక్కువ శబ్దం చేస్తుంటాయి. పైగా ఇది నడవాలంటే విద్యుత్ సరఫరా కూడా అవసరం. దాంతో విద్యుత్ బిల్లు భారమూ అదనం. దీని నుంచి వేడి కూడా వెలువడుతుంది కాబట్టి వేసవిలో దీన్ని ఉపయోగించడం ఇబ్బందికరం. ఒకవేళ కరెంటుపోతే మెషిన్ ఆగిపోకుండా ప్రత్యామ్నాయం అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు అన్నివిధాలా సరిపోయే ప్రత్నామ్యాయాన్ని ఎంచుకోండి.
డాక్టర్ వి.వి.రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్