వస్తున్నాడోచ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించడంతో కర్ణాటక వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం 11 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో జగన్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. దాదాపు ఐదు గంటల పాటు ఉత్కంఠ భరితంగా గడిపారు.
సాయంత్రం సుమారు ఐదు గంటలప్పుడు జగన్‌కు బెయిల్ మంజూరైందని టీవీలు బ్రేకింగ్ న్యూస్‌ను ఫ్లాష్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చడంతో పాటు స్వీట్లు పంచి పెట్టారు. బెంగళూరులోని యలహంక, బొమ్మనహళ్లి, మారతహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ కత్రిగుప్పెలతో పాటు బళ్లారి, హొసూరు తదితర ప్రాంతాల్లో అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచారు.
యలహంకలోని జగన్ నివాసం వద్ద డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్-కర్ణాటక అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, కార్యదర్శి రాకేశ్ రెడ్డి, మహిళా కార్యదర్శి బత్తుల అరుణాదాస్‌ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. బెంగళూరు నుంచి మలేసియాకు వెళ్లిన స్థానిక రోటరీ క్లబ్ సభ్యులు, జగన్‌కు బెయిల్ లభించిందని తెలియడంతో అక్కడే సంబరాలు చేసుకున్నారు. చింతామణిలో అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.