ప్రకృతి శిల్పం
కళాత్మక దృష్టితో చూస్తే ప్రకృతిలో ప్రతిదీ ఓ చిత్రమే! కళాఖండమే! అలాంటి అందాలెన్నో నాలుగొందల ఏళ్లకు పైబడిన ఈ చారిత్రక నగరంలో కొలువుదీరాయి. ఏ శిల్పీ చెక్కని శిల్పాలు ఇవిగో ఇలా ప్రతి చోటా కనువిందు చేస్తూనే ఉన్నాయి. సిటీవాసులే కాదు... పొరుగు ప్రాంతాల వారినీ ఈ బండరాళ్లు సుతిమెత్తగా మదిని పులకింపజేస్తున్నాయి. ఈ చిత్రాలు హైటెక్ హంగులు అద్దుకున్న గచ్చిబౌలి పరిసరాల్లోనివి. అభివృద్ధి బాటలో లెక్కకు మించి శిథిలమైపోతున్నా... ఆకాన్నంటిన భవంతుల మాటున అక్కడక్కడా ఇలా తమ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాయి.
- రామ్మోహన్, రాయదుర్గం
ఖాజాగూడ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ బండరాళ్లు అద్భుతంగా అమరి ఆహ్లాదం కలిగిస్తున్నాయి. పేలుళ్లకు ముక్కలయ్యి గుట్టలకు గుట్టలు రోజురోజుకూ కనుమరుగవుతున్న క్రమంలో... ఉన్నవాటినైనా కాపాడమంటున్నారు ప్రకృతి ప్రేమికులు. రాక్ గార్డెన్లుగా తీర్చిదిద్ది వాటి అందాన్ని తరతరాలకూ తరగని కళాకృతులుగా పదిల పరచాలని
‘సేవ్ రాక్ సొసైటీ’ వంటి స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని కొన్ని అంతర్జాతీయ స్థాయి స్కూళ్లలో కూడా రాక్స్ అలరిస్తున్నాయి.
కాపాడేందుకే...
‘డాక్టర్ వైఎస్సార్నిథమ్లో సహజసిద్ధంగా ఉన్న రాతి గుట్టను కొనసాగించేందుకే రాక్ గార్డెన్ ఏర్పాటు చేశాం. వీటిపై పావురాళ్లు, నెమళ్లు సేద తీరేలా, ప్రజలకు ఈ సహజ అందాలు కనువిందు చేసేలా రాతి శిల్పాలను నెలకొల్పాం. ఎంతో విలువైన ఇలాంటి ప్రకృతి సంపదను కాపాడాల్సిన అవసరం, బాధ్యత అందరిపైనా ఉంది’ అంటారు వైఎస్సార్ నిథమ్ మాజీ డెరైక్టర్ పి.నారాయణరెడ్డి.
సమతుల్యం దెబ్బతింటుంది...
నగరంలో నిర్వహించిన బయోడైవర్శిటీ సదస్సు లక్ష్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. రాయదుర్గం, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లోని బండరాళ్లు, మట్టితో కూడిన గుట్టలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అభివృద్ధి పేరుతో వాటిని ధ్వంసం చేయడం వల్ల అతి వేడి, చలి, వర్షం వచ్చి ప్రకృతి సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది’ అని చెప్పారు రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ సుదర్శన్.