తెలుగు జాతికి అన్యాయం చేస్తే సహించను
రాష్ట్రాన్ని కాకుండా తెలుగు ప్రజలను విడగొట్టేందుకు కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విభజన ప్రక్రియలో కేంద్రం అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘననకు పాల్పడిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కాకుండా తెలుగు ప్రజలను విడగొట్టేందుకు కుట్ర పన్నారని కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన అనేది సున్నితమైన అంశమని, ఆ అంశాన్ని జఠిలం చేసి తెలుగు ప్రజలను భౌతికంగా విడదీస్తున్నారని ఆరోపించారు. తెలుగు జాతికి అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర విభజన విషయంలో 10 జాన్‌పథ్ స్క్రిప్ట్‌ను ఇక్కడ వాళ్లు పాటించారని ఎద్దేవా చేశారు. విభజనలో కాంగ్రెస్ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ప్రధాని పదవిని యూపీఏ అధ్యక్షురాలు త్యాగం చేయలేదని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్ర విభజనను నాటకంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడతానన్న రోజే సీఎం కిరణ్ మాట్లాడతానని లేచారు, ఇదేక్కడి పద్దతి అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. విభజన విషయంలో అలా వ్యవహారించమని కాంగ్రెస్ అధిష్టానమే కిరణ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.
అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వారా అంటూ ఆయన స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతతో మాట్లాడించాల్సిన బాధ్యత స్పీకర్, ప్రభుత్వానికి లేదా ప్రశ్నించారు. విభజన రోడ్డు మ్యాప్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు భాగస్వాములని ఆరోపించారు. విభజనలో భాగస్వామి అయిన సీఎం కిరణ్ సమైక్య హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు.