ఇలా చేస్తే.. కలుపుపై మనదే గెలుపు
వరిలో కలుపు నివారణకు ప్రస్తుతం ఎన్నో రసాయనిక మందులు అందుబాటులో ఉన్నాయి. ఆయా పద్ధతుల్లో వరి సాగుకు సంబంధించి కలుపు నివారణకు ఏఏ మందులు వాడాలో బాపట్ల మండల వ్యవసాయాధికారి పి. రఘు (8886614161) రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాస్తంత దృష్టి పెడితే వరిలో కలుపు నివారణ చాలా తేలికైన పని అని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
బాపట్లటౌన్: వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరిలో కలుపు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కూలీల కొరత కారణంగా కలుపు తీయడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారుతోంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణకు రైతులు రసాయనాలు వినియోగించాల్సిన అవసరం ఉంది. పలు పద్ధతుల్లో సాగు చేస్తున్న వరిలో కలుపు నివారణకు సంబంధించి రైతులు వేర్వేరు మందులు వాడాల్సి ఉంది. ప్రత్యేక పద్ధతులు అవలంబించాల్సి ఉంది.
మెట్టవరిలో కలుపు యాజమాన్యం
మెట్టపొలాల్లో వరిని రెండు పద్ధతుల్లో సాగుచేస్తున్నారు. వెదజల్లడం, గొర్రుతో విత్తడం.. ఇవే ఆ పద్ధతులు. ఇలా సాగుచేసిన పైరులో కలుపు నివారణకు వరి విత్తిన రెండు లేక మూడు రోజుల్లోగా లీటరు నీటికి ఐదు నుంచి ఆరు మిల్లీ లీటర్ల ఫెండీమిథాలిన్గానీ, రెండు మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ 50 శాతం ద్రావకాన్నిగానీ, 1.5 మిల్లీలీటర్ల అనిలోఫాస్గానీ పిచికారీ చేయాలి.
ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఉంటే..
- విధ పద్దతుల్లో సాగుచేసిన వరిలో విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఎక్కువుగా ఉంటే ఎకరాకు 400 మిల్లీలీటర్లసైహాలోపాప్ బ్యూటైల్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- గడ్డిజాతి మొక్కలు, వెడల్పాటి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 80 నుంచి 100 మి.లీ బీస్పైరి బాక్ సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- విత్తినా, నాటిన 25 నుంచి 30 రోజుల్లో ఎకరాకు 400 గ్రాముల 2.4-డి సోడియం సాల్టుగానీ, 50 గ్రాములు ఇథాక్సి సల్ఫ్యూరాన్నుగానీ 15 శాతం పొడి మందుతో, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎలాంటి కలుపునైనా సమర్థంగా నివారించుకోవచ్చు.
డ్రమ్సీడర్ సాగులో
వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల్లోగా పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయార్టిల్ పొడి మందు చల్లుకోవాలి. లేదంటే 80 గ్రాముల ఫైరజో సెల్ఫూరాన్ ఇథైల్ను అరలీటరు నీటిలో కరిగించి దానికి 20 కిలోల పొడి ఇసుక కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి విత్తిన 3 నుంచి 4 రోజుల్లోగా ఎకరాకు 80 గ్రాముల పైరజోసల్ఫూరాన్ ఇథైల్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.