'మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్నా'
కఠ్మాండు: భూవిలయంతో అతలాకుతలం నేపాల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు కాపాడాయి. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కఠ్మాండులో శిథిలాల నుంచి బయటపడిన రిషి ఖనాల్ అనే బాధితుడు చెప్పిన విషయాలు దిగ్బ్రాంతి కలిగించాయి.
శిథిలాల కింద చిక్కుకున్న తాను ప్రాణాలు నిలుపుకునేందుకు మూత్రం తాగానని వెల్లడించాడు. శవాల మధ్య బిక్కుబిక్కు మంటూ గడిపానని తెలిపాడు. మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరిస్తూ సహాయం కోసం ఎదురు చూశానని చెప్పాడు. ఫ్రెంచ్ దేశానికి చెందిన సహాయక బృందం అతడిని గుర్తించి కాపాడింది.
శిథిలాల నుంచి బయటపడిన రిషి ఖనాల్ పెదవులు పగిలిపోయి, గోళ్లు పాలిపోయి దీనంగా కనిపించాడు. కఠ్మాండు లో కూలిపోయిన ఓ హోటల్ కింద అతడు దాదాపు 82 గంటల పాటు చిక్కుకున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.