అనితది సూసైడ్ కాదు.. హత్య!
సాక్షి, చెన్నై: నీట్ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతం రాజకీయ మలుపు తీసుకుంది. అధికార పక్షాలే లక్ష్యంగా విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. శనివారం సాయంత్రం అరియాళూరు వెళ్లిన ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్, అనిత తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పళని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో స్టాలిన్ విరుచుకుపడ్డారు.
దళిత విద్యార్థిని అనిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చింది తప్పుడు హామీనేనని స్టాలిన్ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వాలు చేసిన హత్యేనని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళని స్వామి, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా ఆయన బీజేపీపై కూడా విమర్శలు చేశారు.
అనిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించటమే కాదు.. ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్టాలిన్ ప్రకటించారు. ఇక తమ పార్టీపై చేసిన విమర్శలను బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఖండించారు. విద్యార్థి మరణాన్ని రాజకీయం చేయటం సరికాదని ఆయన హితవు పలికారు. వెల్లూరులో కొన్నాళ్ల క్రితం నీట్ విద్యార్థి తల్లి చనిపోయిన సమయంలో మీరంతా ఎక్కడి వెళ్లారంటూ స్టాలిన్‌కు రాజా చురకలంటించారు. నీట్ అర్హత సాధించలేకపోవటంతో మెరిట్ విద్యార్థిని అనిత సూసైడ్ చేసుకున్న తెలిసిందే.