నరసన్న నిధులకు రెక్కలు
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.59 లక్షలు విత్‌డ్రా
మళ్లీ జమచేయాలని కోరుతున్న భక్తులు
రాజానగరం / కోరుకొండ :
కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి సొమ్ములకే భద్రత కరువైంది. బ్యాంకులో వేసిన సొమ్ములకు రెక్కలు వచ్చాయి. రూ. 76.37 లక్షలు ఉండవలసిన నిల్వలు రూ. 17 లక్షలకు తరిగిపోయాయి. దేవుడి మాన్యం ఉన్నా కాలక్రమంలో తరిగిపోవడంతో ఆదాయం కూడా తగ్గిపోయింది. దీంతో 2010లో అన్నవరం దేవస్థానం నరసన్న ఆలయాన్ని దత్తత తీసుకుంది. కళ్యాణాలు ఇతర ఉత్సవాల నిర్వహణకు తమ నిధులు వెచ్చించేలా అన్నవరం ఆలయ అధికారులు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్న ప్రసిద్ధి చెందిన 25 ఆలయాలను ప్రభుత్వం దత్తత తీసుకుంది. అనంతరం ఈ ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వామి పేరున కోరుకొండ ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేలా అప్పటి అన్నవరం ఈఓ కె.రామచంద్రమోహన్, బోర్డు సభ్యులు నిర్ణయించారు. దీంతో రూ.9 లక్షల నిల్వతో అకౌంట్ ప్రారంభించి ఆలయాన్ని అప్పగించారు. గడిచిన నాలుగేళ్లలో నిధులు రూ.76.37 లక్షలకు చేరినట్టు గత మార్చి నెలలో జరిగిన సమావేశంలో అధికారులు తెలిపారు. కాగా వివిధ ఖర్చుల నిమిత్తం రూ.59 లక్షలను విత్‌డ్రా చేసినట్టు పలువురు భక్తులు పేర్కొన్నారు. కోరుకొండ ఖర్చులన్నీ తామే భరిస్తామన్న తరువాత నిధులు ఎందుకు విత్‌డ్రా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. కోరుకొండ ఆలయానికి పాలకమండలి లేకపోవడమూ ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. సొమ్ము విత్‌డ్రాలో ఈఓకూ భాగం ఉందని వారు ఆరోపిస్తున్నారు.
ఈఓ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు
ఈ విషయమై ఈఓను వివరణ కోరగా నేను ఎవరికీ చెప్పనక్కరలేదు, ఎమ్మెల్యేకి కానీ, కమిషనర్‌కు గానీ వివరిస్తానని నిర్లక్ష్యంగా సమాధానమి స్తున్నారు. మీకు కూడా కావాలంటే అన్నవరం రావాలంటున్నారు. ఆలయ దత్తత సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఖర్చులు అన్నవరం దేవస్థానమే భరించాలి.
– నీరుకొండ యుధిష్టర నాగేశ్వరావు, భక్తుడు, కోరుకొండ.