ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు !
విఠల్ షోరూం నిర్వాహకుల అరెస్ట్
గదిలో దుస్తులు మార్చుకుంటుండగా వైర్‌ను గుర్తించిన యువతి
బాధితుల సమాచారంతో వెలుగులోకి
బెంగళూరు : బట్టల షోరూంలోని ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు అమర్చి మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డు చేసిన ముగ్గురు కామాంధులను ఇక్కడి బసవనగుడి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ బీఎస్. లోకేష్ సోమవారం తెలిపిన సమాచారం మేరకు.. సోదరులు సందీప్, సురేష్ అస్తేకర్, సునీల్ అస్తేకర్ గాంధీబజార్‌లోని డీవీజీ రోడ్డులో విఠల్ డ్రస్సెస్ పేరుతో షోరూంను నిర్వహిస్తున్నారు. వీరి షాపులో బాష అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
ఈనెల 7వ తేదీన ఓ మహిళ ఆ షాపునకు వెళ్లింది. ట్రయర్ రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆమెకు ఓ చిన్న వైర్ కన్పించింది. పరిశీలించగా ఆ రూంలో కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించి.. విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్లింది. అక్కడ ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని వారు షాపు యజమానులను ప్రశ్నించగా.. వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాపు నుంచి పంపించారు. శనివారం ఆ దంపతులు వారి బంధువులను పిలుచుకుని వచ్చి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
బట్టల షోరూం యజమానులు రెచ్చిపోయి ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’ అని దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్, సురేష్ అస్తేకర్, బాషను అరెస్ట్ చేశారు. సునీల్ అస్తేకర్ పరారీలో ఉన్నాడు. ఆ ముగ్గురిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, బెయిల్ మీద బయటకు వచ్చారని పోలీసులు సోమవారం తెలిపారు.