Drivers license
-
డ్రైవింగ్ లైసెన్సు లేదు.. సార్!
సాక్షి, అమరావతి: గత రెండు నెలల్లో జరిపిన వాహనాల తనిఖీల్లో 22,130 మంది వద్ద డ్రైవింగ్ లైసెన్సులు లేనట్లు రవాణా శాఖ అధికారులు తేల్చారు. కానీ రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు రవాణా శాఖ వద్ద గణాంకాలున్నాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు కాకుండా భారీ వాహనాలు నడిపే దాదాపు 10 వేల మంది కూడా లైసెన్సులు లేవని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. కొత్త విషయం వెల్లడైంది. కేవలం లైసెన్సు సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకే.. తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఈ విధంగా చెబుతున్నారని తేల్చారు. ప్రతి వంద మంది వాహనదారుల్లో 70 మంది ఇలాగే చెబుతున్నట్లు వెల్లడైంది. డ్రైవింగ్ లైసెన్స్‌లేదని చెప్పడంతో రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందని చెబితే సస్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల తమకు ఉపాధి పోతుందని భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు చెబుతున్నారు. ఆధార్‌తో లింక్ చేస్తే తేలిపోతుంది.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా రవాణా సేవలన్నింటికీ ఆధార్ లింక్‌ను అనుమతించింది. రాష్ట్రంలో రవాణా శాఖ కూడా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల కాలంలో అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 20 వేల వరకు లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ చెబుతోంది. సస్పెండ్ చేసిన లైసెన్సులను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల వాహనదారుడు ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకున్నానని చెప్పేందుకు వీలుండదు. కొత్త కార్డు పొందేందుకూ అవకాశముండదు. అలాగే ఆధార్‌తో లింక్ చేస్తే వాహనదారుడికి అసలు లైసెన్సు ఉందా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌తో లైసెన్సు డేటాను పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఠారెత్తిస్తున్న స్కూల్ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్కూల్ బస్సులు బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు పిల్లల భద్రత పాలిట ప్రశ్నార్ధకంగా మారాయి. నిర్లక్ష్యంగా బస్సులు నడిపే డ్రైవర్లు, కండీషన్లో లేని బస్సులు చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. దీంతో తరచూ స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. మరోవైపు రవాణాశాఖ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ బస్సుల భద్రతా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు ప్రహసనంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 10 వేలకు పైగా స్కూల్ బస్సులు ఉండగా ఇంకా వందలాది బస్సులు ఎలాంటి ఫిట్నెస్ లేకుండానే తిరుగుతున్నాయి. సోమవారం మేడ్చల్‌లో ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సుకు ఫిట్నెస్ లేకపోవడంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు.అత్వెల్లి నుంచి మేడ్చల్ వైపు వస్తున్న స్కూల్ బస్సు వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 60 మంది పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కానీ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద నష్టమే చోటుచేసుకొనేది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం ఒక కారణమైతే బస్సుకు ఫిట్నెస్ కూడా లేకపోవడం మరో కారణమని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వెంటనే బస్సును జప్తు చేసి కేసు నమోదు చేశారు. మరోవైపు ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 400 కు పైగా ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నట్లు గుర్తించారు. నగరమంతటా ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. మొక్కు‘బడి’ తనిఖీలేనా... ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో స్కూల్ బస్సులకు తనిఖీలు నిర్వహిస్తారు. ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించి కేసులు నమోదు చేస్తారు. పాఠశాలలు, కళాశాలలకు నోటీసులు జారీ చేస్తారు. పిల్లలను తరలించే బస్సులు పూర్తిగా కండీషన్లో ఉండడంతో పాటు, అన్ని రకాల భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ప్రతి బస్సుకు ఆరోగ్యకరమైన, అనుభవజ్ఞుడైన డ్రైవర్‌తో పాటు, ఒక అటెండర్‌ను కూడా ఏర్పాటు చేయాలి. బస్సుల కండీషన్‌ను మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి స్వయంగా పరిశీలించి బ్రేకులు, బస్సు కండీషన్, లైట్లు, సీట్లు, రెయిలింగ్, బస్సు కలర్, తదితర ప్రమాణాలన్నీ ఉన్నట్లు నిర్ధారించుకొన్న తరువాతనే ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను అందజేయాలి. అయితే కొన్నిచోట్ల ఇలాంటి తనిఖీలు మొక్కుబడిగా మారుతున్నాయి. మరోవైపు ప్రతి స్కూల్‌కు వెళ్లి విధిగా బస్సులను తనిఖీ చేయాలనే నిబంధనను కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే సమయంలో స్కూల్ యాజమాన్యాలు కూడా బస్సుల నిర్వహణను పట్టించుకోవడం లేదు. డ్రైవర్లకు అప్పగించి వదిలేస్తున్నారు. దీంతో పిల్లల భద్రత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. క్రిమినల్ కేసులు తప్పవు ఇప్పటి వరకు 400 స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా ఉన్నట్లు తాజా ఘటన నేపథ్యంలో గుర్తించాం. వారంలోగా పాఠశాల యాజమాన్యాలు ఈ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకొని కండీషన్‌ను ధృవీకరించుకోవాలి. సకాలంలో ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కాని బస్సులను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. –డాక్టర్ పుప్పాల శ్రీనివాస్,జిల్లా రవాణా అధికారి, మేడ్చల్. అదుపుతప్పిన స్కూల్ బస్సు మేడ్చల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులను తీసుకెళుతున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన మేడ్చల్ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏసీఎం స్కూల్ కు చెందిన బస్సు డ్రైవర్ సాయిబాబా కాళ్లకల్ మండలం లింగాపూర్, డబీల్‌పూర్ గ్రామాల నుంచి 28 మంది పిల్లలను ఎక్కించుకుని మేడ్చల్‌కు వస్తున్నాడు. అదేసమయంలో కాళ్ళకల్ నుంచి మేడ్చల్‌కు ప్రయాణీకులను తీసుకువస్తున్న ఆర్టీసీ బస్సు వస్తూ మార్గమధ్యంలో సెయింట్ క్లారెట్ స్కూల్ వద్ద విద్యార్థులను దింపేందుకు జాతీయరహదారి పక్కన ఆగింది. పిల్లలు దిగుతుండగా వెనుక వచ్చిన ఏసీఎం స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో స్కూల్ బస్సులో ఉన్న పిల్లలు ఒక్కసారి సీట్లలో నుండి ఎగిరిపడ్డారు. అయితే చిన్నారులెవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని స్వల్పంగా గాయపడిన చిన్నారులను ఆసుపత్రులకు తరలించారు. తల్లిదండ్రుల ఆందోళన... ఏసీఎం స్కూల్ యాజమాన్యం, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అందోళనకు దిగారు. మొదట స్కూల్ వద్దకు వెళ్లి స్కూల్ ఎదుట అందోళన చేపట్టగా పోలీసులు వారిని సముదాయించడంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు శారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారులు సాయిప్రణవ్(12)రమ్మ(7),అక్షయ(5) మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ సాయిబాబా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘డమ్మీ’లకు ఆధార్‌తో చెక్
బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతం పెనుమార్పులకు నాంది పలుకుతోంది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఇప్పటికే కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు... వీటి నేపథ్యంలో డ్రై వ్స్లో చిక్కిన వాహనచోదకులు ఎలాంటి ఎత్తులు వేయకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. మరోపక్క మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన శిక్షలు వేయాలని కోరుతూ న్యాయ విభాగానికి విన్నవించింది. ఈ మేరకు ట్రాఫిక్ అధికారులు మంగళవారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) ఎం.రజని నేతృత్వంలో న్యాయమూర్తులతో భేటీ అయ్యారు. ట్రాఫిక్ విభాగం చేపట్టే తనిఖీల్లో మద్యం తాగి, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా, మైనర్లు వాహనాలు నడుపుతూ చిక్కుతున్నారు. అప్పటికప్పుడు వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్న ట్రాఫిక్ విభాగం అధికారలు నిర్ణీత సమయాల్లో గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో (టీటీఐ) జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావడం తప్పనిసరి చేశారు. అక్కడి కౌన్సిలింగ్ తర్వాతే ఆయా ఉల్లంఘనుల్ని దాని తీవ్రతను బట్టి కోర్టుకు తరలించడం, జరిమానా వసూలు చేయడం చేస్తున్నారు. ఆధార్ కార్డు తేవాల్సిందే... ఇప్పటి వరకు ఈ కౌన్సిలింగ్‌కు కేవలం ఉల్లంఘనుడు మాత్రమే హాజరయ్యేవాడు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం... సదరు ఉల్లంఘనులు వివాహితులైతే భార్య/భర్త, అవివాహితులైతే తల్లిదండ్రులు/సంరక్షకుడితో కలిసి హాజరుకావడం తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఉల్లంఘనుల్ని డమ్మీలను రంగంలోకి దింపే అవకాశం ఉందని ట్రాఫిక్ విభాగం అధికారులు అనుమానిస్తున్నారు. తమ వారికి విషయం తెలియడం ఇష్టంలేని నేపథ్యంలో ఇలా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి డమ్మీలకు చెక్ చెప్పడానికి ఆధార్ కార్డు తీసుకురావడం తప్పనిసరి చేస్తున్నారు. చిక్కిన ఉల్లంఘనుడితో పాటు వారితో వచ్చే వాళ్ళూ ఈ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. అందులోని వివరాలు, వయస్సులను సరిచూసిన తర్వాతే కౌన్సిలింగ్‌కు అనుమతించనున్నారు. ఆధార్ కార్డు జారీ కాని పక్షంలో వారి బంధుత్వాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలు చూపే అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి ధ్రువీకరణలు లేకుండా మాత్రం కౌన్సిలింగ్‌ను అనుమతించమని, ఎవరైనా చీటింగ్‌కు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వారికి ఆటోమేటిక్‌గా సమాచారం... ‘డ్రంకెన్ డ్రై వ్’తో పాటు వివిధ రకాలైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కుతున్న వారిలో విద్యార్థులు, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారం కేవలం పోలీసు విభాగానికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇకపై దీన్ని వారు చదువుతున్న/పని చేస్తున్న సంస్థలు, విభాగాలకు అందించాలని నిర్ణయించిన విషయం విదితమే. దీనికోసం ఆయా యాజమాన్యాలు, శాఖలకు ప్రత్యేకంగా లేఖలు రాయాలని తొలుత భావించారు. ఇందులో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఈ డేటాబేస్‌లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఇందులో నగరంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రముఖ ప్రై వేట్ సంస్థల ఈ-మెయిల్ ఐడీలు పొందుపరుస్తారు. వాటిల్లో చదువుతున్న, పని చేస్తున్న వారు చిక్కి, ఆ వివరాలు నమోదైతే చాలు... కంప్యూటర్ దానంతట అదే ఆయా సంస్థలు, శాఖలకు ఈ-మెయిల్ రూపంలో సమాచారం ఇస్తుంది. ఈ ప్రొగ్రామింగ్‌లో లేని వాటికి మాత్రమే లేఖలు రాయనున్నారు. కౌంట్స్ ‘తగ్గింపు’... శిక్షల పెంపు... మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన ఉల్లంఘనుల్ని కౌన్సిలింగ్ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వారు తీసుకున్న మద్యం మొతాదు, అప్పటి వరకు ఎన్నిసార్లు పట్టుబడ్డారనే విషయాలను పరిగణలోకి తీసుకుంటున్న న్యాయస్థానాలు జైలు శిక్షలు విధిస్తున్నాయి. బ్రీత్ ఎనలైజర్లుగా పిలిచే శ్వాస పరీక్ష యంత్రాలు వాహనచోదకుడి శరీరంలో ఉన్న ఆల్కహాల్‌ను బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిగ్రా కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటే అది ఉల్లంఘన. అయితే నగరంలో 300 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్‌తో దొరికిన వారున్నారు. ఇప్పటి వరకు న్యాయస్థానాలు 150 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్‌తో, ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారికి మాత్రమే ఒక రోజు నుంచి 20 రోజుల వరకు శిక్షలు విధిస్తున్నాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ట్రాఫిక్ అధికారులు న్యాయ విభాగానికి విన్నవించారు. 100 కంటే ఎక్కువ బీఏసీ కౌంట్ వచ్చినా, పగటి పూట మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడుపుతూ పట్టుబడినా జైలు శిక్ష వేయాలని కోరారు. ఈ శిక్షాకాలాన్ని సైతం మద్యం మొతాదును బట్టి పెంచాలని నివేదించారు. ఆగస్టు 1 నుంచి ‘ఆ యజమానీ’ జైలుకే... మైనర్ డ్రై వింగ్, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడపడాన్ని నగర ట్రాఫిక్ అధికారులు తీవ్రంగా పరిగణించనున్నారు. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం నడిపిన వ్యక్తితో పాటు దాని యజమానినీ జైలుకు పంపాల్సిందిగా కోరుతూ మంగళవారం నాటి సమావేశంలో న్యాయ విభాగానికి విన్నవించారు. మైనర్, వితౌట్ లెసైన్స్ డ్రైవింగ్‌లకు ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేవలం జరిమానాతో విడిచిపెట్టేవారు. ఈ ఏడాది మార్చ్ 1 నుంచి ఇలాంటి ఉల్లంఘనుల్ని న్యాయస్థానం ద్వారా జైలుకూ తరలిస్తున్నారు. వీరు వాహనం నడిపేందుకు పరోక్షంగా కారణమైన వాహన యజమానినీ ఇకపై బాధ్యుడిని చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే ఈ విధానంలో ఉల్లంఘనుడితో పాటు వాహన యజమానినీ జైలుకు పంపాలని నిర్ణయించారు.