‘డమ్మీ’లకు ఆధార్‌తో చెక్ | check with Aadhaar to 'Dummy' certificate | Sakshi
Sakshi News home page

‘డమ్మీ’లకు ఆధార్‌తో చెక్

Published Tue, Jul 26 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

check with Aadhaar to 'Dummy' certificate

బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతం పెనుమార్పులకు నాంది పలుకుతోంది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఇప్పటికే కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు... వీటి నేపథ్యంలో డ్రై వ్స్‌లో చిక్కిన వాహనచోదకులు ఎలాంటి ఎత్తులు వేయకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది.

 

మరోపక్క మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన శిక్షలు వేయాలని కోరుతూ న్యాయ విభాగానికి విన్నవించింది. ఈ మేరకు ట్రాఫిక్ అధికారులు మంగళవారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) ఎం.రజని నేతృత్వంలో న్యాయమూర్తులతో భేటీ అయ్యారు. ట్రాఫిక్ విభాగం చేపట్టే తనిఖీల్లో మద్యం తాగి, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా, మైనర్లు వాహనాలు నడుపుతూ చిక్కుతున్నారు. అప్పటికప్పుడు వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్న ట్రాఫిక్ విభాగం అధికారలు నిర్ణీత సమయాల్లో గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో (టీటీఐ) జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావడం తప్పనిసరి చేశారు. అక్కడి కౌన్సిలింగ్ తర్వాతే ఆయా ఉల్లంఘనుల్ని దాని తీవ్రతను బట్టి కోర్టుకు తరలించడం, జరిమానా వసూలు చేయడం చేస్తున్నారు.


ఆధార్ కార్డు తేవాల్సిందే...
ఇప్పటి వరకు ఈ కౌన్సిలింగ్‌కు కేవలం ఉల్లంఘనుడు మాత్రమే హాజరయ్యేవాడు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం... సదరు ఉల్లంఘనులు వివాహితులైతే భార్య/భర్త, అవివాహితులైతే తల్లిదండ్రులు/సంరక్షకుడితో కలిసి హాజరుకావడం తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఉల్లంఘనుల్ని డమ్మీలను రంగంలోకి దింపే అవకాశం ఉందని ట్రాఫిక్ విభాగం అధికారులు అనుమానిస్తున్నారు. తమ వారికి విషయం తెలియడం ఇష్టంలేని నేపథ్యంలో ఇలా చేయవచ్చని భావిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలోనే ఇలాంటి డమ్మీలకు చెక్ చెప్పడానికి ఆధార్ కార్డు తీసుకురావడం తప్పనిసరి చేస్తున్నారు. చిక్కిన ఉల్లంఘనుడితో పాటు వారితో వచ్చే వాళ్ళూ ఈ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. అందులోని వివరాలు, వయస్సులను సరిచూసిన తర్వాతే కౌన్సిలింగ్‌కు అనుమతించనున్నారు. ఆధార్ కార్డు జారీ కాని పక్షంలో వారి బంధుత్వాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలు చూపే అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి ధ్రువీకరణలు లేకుండా మాత్రం కౌన్సిలింగ్‌ను అనుమతించమని, ఎవరైనా చీటింగ్‌కు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.


వారికి ఆటోమేటిక్‌గా సమాచారం...
‘డ్రంకెన్ డ్రై వ్’తో పాటు వివిధ రకాలైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కుతున్న వారిలో విద్యార్థులు, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారం కేవలం పోలీసు విభాగానికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇకపై దీన్ని వారు చదువుతున్న/పని చేస్తున్న సంస్థలు, విభాగాలకు అందించాలని నిర్ణయించిన విషయం విదితమే. దీనికోసం ఆయా యాజమాన్యాలు, శాఖలకు ప్రత్యేకంగా లేఖలు రాయాలని తొలుత భావించారు.

 

ఇందులో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఈ డేటాబేస్‌లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఇందులో నగరంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రముఖ ప్రై వేట్ సంస్థల ఈ-మెయిల్ ఐడీలు పొందుపరుస్తారు. వాటిల్లో చదువుతున్న, పని చేస్తున్న వారు చిక్కి, ఆ వివరాలు నమోదైతే చాలు... కంప్యూటర్ దానంతట అదే ఆయా సంస్థలు, శాఖలకు ఈ-మెయిల్ రూపంలో సమాచారం ఇస్తుంది. ఈ ప్రొగ్రామింగ్‌లో లేని వాటికి మాత్రమే లేఖలు రాయనున్నారు.


కౌంట్స్ ‘తగ్గింపు’... శిక్షల పెంపు...
మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన ఉల్లంఘనుల్ని కౌన్సిలింగ్ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వారు తీసుకున్న మద్యం మొతాదు, అప్పటి వరకు ఎన్నిసార్లు పట్టుబడ్డారనే విషయాలను పరిగణలోకి తీసుకుంటున్న న్యాయస్థానాలు జైలు శిక్షలు విధిస్తున్నాయి. బ్రీత్ ఎనలైజర్లుగా పిలిచే శ్వాస పరీక్ష యంత్రాలు వాహనచోదకుడి శరీరంలో ఉన్న ఆల్కహాల్‌ను బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిగ్రా కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటే అది ఉల్లంఘన. అయితే నగరంలో 300 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్‌తో దొరికిన వారున్నారు.

 

ఇప్పటి వరకు న్యాయస్థానాలు 150 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్‌తో, ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారికి మాత్రమే ఒక రోజు నుంచి 20 రోజుల వరకు శిక్షలు విధిస్తున్నాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ట్రాఫిక్ అధికారులు న్యాయ విభాగానికి విన్నవించారు. 100 కంటే ఎక్కువ బీఏసీ కౌంట్ వచ్చినా, పగటి పూట మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినా, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు నడుపుతూ పట్టుబడినా జైలు శిక్ష వేయాలని కోరారు. ఈ శిక్షాకాలాన్ని సైతం మద్యం మొతాదును బట్టి పెంచాలని నివేదించారు.


ఆగస్టు 1 నుంచి ‘ఆ యజమానీ’ జైలుకే...
మైనర్ డ్రై వింగ్, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడపడాన్ని నగర ట్రాఫిక్ అధికారులు తీవ్రంగా పరిగణించనున్నారు. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం నడిపిన వ్యక్తితో పాటు దాని యజమానినీ జైలుకు పంపాల్సిందిగా కోరుతూ మంగళవారం నాటి సమావేశంలో న్యాయ విభాగానికి విన్నవించారు.

మైనర్, వితౌట్ లెసైన్స్ డ్రైవింగ్‌లకు ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేవలం జరిమానాతో విడిచిపెట్టేవారు. ఈ ఏడాది మార్చ్ 1 నుంచి ఇలాంటి ఉల్లంఘనుల్ని న్యాయస్థానం ద్వారా జైలుకూ తరలిస్తున్నారు. వీరు వాహనం నడిపేందుకు పరోక్షంగా కారణమైన వాహన యజమానినీ ఇకపై బాధ్యుడిని చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే ఈ విధానంలో ఉల్లంఘనుడితో పాటు వాహన యజమానినీ జైలుకు పంపాలని నిర్ణయించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement