ఠారెత్తిస్తున్న స్కూల్‌ బస్సులు | School Bus Rollover Rolls in Hyderabad | Sakshi
Sakshi News home page

ఠారెత్తిస్తున్న స్కూల్‌ బస్సులు

Published Tue, Jan 29 2019 9:44 AM | Last Updated on Tue, Jan 29 2019 9:44 AM

School Bus Rollover Rolls in Hyderabad - Sakshi

మేడ్చల్‌లో ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్కూల్‌ బస్సులు బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న  ప్రమాదాలు పిల్లల భద్రత పాలిట ప్రశ్నార్ధకంగా మారాయి. నిర్లక్ష్యంగా బస్సులు నడిపే  డ్రైవర్లు, కండీషన్‌లో లేని బస్సులు  చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. దీంతో   తరచూ స్కూల్‌  బస్సులు  ప్రమాదాలకు గురవుతున్నాయి. మరోవైపు రవాణాశాఖ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే  స్కూల్‌ బస్సుల భద్రతా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు ప్రహసనంగా మారాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు  10 వేలకు పైగా స్కూల్‌ బస్సులు  ఉండగా ఇంకా వందలాది బస్సులు ఎలాంటి  ఫిట్‌నెస్‌ లేకుండానే తిరుగుతున్నాయి.

సోమవారం  మేడ్చల్‌లో   ప్రమాదానికి కారణమైన స్కూల్‌ బస్సుకు  ఫిట్‌నెస్‌ లేకపోవడంతో  ఆర్టీఏ  అధికారులు అప్రమత్తమయ్యారు.అత్వెల్లి నుంచి మేడ్చల్‌ వైపు వస్తున్న  స్కూల్‌ బస్సు  వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో  బస్సులో  60 మంది పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కానీ  ప్రమాదం తీవ్రత ఎక్కువగా  ఉంటే పెద్ద నష్టమే  చోటుచేసుకొనేది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం ఒక కారణమైతే  బస్సుకు ఫిట్‌నెస్‌ కూడా లేకపోవడం మరో కారణమని   ఆర్టీఏ అధికారులు  గుర్తించారు. వెంటనే  బస్సును  జప్తు చేసి కేసు నమోదు చేశారు. మరోవైపు   ఒక్క మేడ్చల్‌ జిల్లాలోనే  400 కు పైగా  ఫిట్‌నెస్‌ లేని బస్సులు ఉన్నట్లు  గుర్తించారు. నగరమంతటా  ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది.  

మొక్కు‘బడి’ తనిఖీలేనా...
ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు  అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో స్కూల్‌ బస్సులకు  తనిఖీలు నిర్వహిస్తారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులను గుర్తించి కేసులు నమోదు చేస్తారు. పాఠశాలలు, కళాశాలలకు నోటీసులు జారీ చేస్తారు. పిల్లలను తరలించే  బస్సులు పూర్తిగా కండీషన్‌లో ఉండడంతో పాటు, అన్ని రకాల భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ప్రతి బస్సుకు  ఆరోగ్యకరమైన, అనుభవజ్ఞుడైన డ్రైవర్‌తో పాటు, ఒక అటెండర్‌ను కూడా ఏర్పాటు చేయాలి. బస్సుల కండీషన్‌ను  మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి స్వయంగా పరిశీలించి బ్రేకులు, బస్సు కండీషన్, లైట్లు, సీట్లు, రెయిలింగ్, బస్సు కలర్, తదితర ప్రమాణాలన్నీ ఉన్నట్లు నిర్ధారించుకొన్న తరువాతనే  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను అందజేయాలి. అయితే కొన్నిచోట్ల  ఇలాంటి తనిఖీలు  మొక్కుబడిగా మారుతున్నాయి. మరోవైపు  ప్రతి స్కూల్‌కు వెళ్లి విధిగా బస్సులను తనిఖీ చేయాలనే నిబంధనను కూడా  అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే సమయంలో  స్కూల్‌ యాజమాన్యాలు కూడా బస్సుల నిర్వహణను పట్టించుకోవడం లేదు. డ్రైవర్లకు అప్పగించి వదిలేస్తున్నారు. దీంతో  పిల్లల భద్రత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

క్రిమినల్‌ కేసులు తప్పవు  
ఇప్పటి వరకు 400 స్కూల్‌ బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండా ఉన్నట్లు  తాజా ఘటన నేపథ్యంలో గుర్తించాం. వారంలోగా పాఠశాల యాజమాన్యాలు ఈ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించుకొని కండీషన్‌ను  ధృవీకరించుకోవాలి. సకాలంలో ఫిట్‌నెస్‌  పరీక్షలకు హాజరు కాని బస్సులను సీజ్‌ చేసి నిర్వాహకులపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.  –డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్,జిల్లా రవాణా అధికారి, మేడ్చల్‌.  

అదుపుతప్పిన స్కూల్‌ బస్సు
మేడ్చల్‌: డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులను తీసుకెళుతున్న ఓ స్కూల్‌ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన మేడ్చల్‌ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏసీఎం స్కూల్‌ కు చెందిన బస్సు డ్రైవర్‌ సాయిబాబా కాళ్లకల్‌ మండలం లింగాపూర్, డబీల్‌పూర్‌ గ్రామాల నుంచి  28 మంది పిల్లలను ఎక్కించుకుని మేడ్చల్‌కు వస్తున్నాడు. అదేసమయంలో కాళ్ళకల్‌ నుంచి మేడ్చల్‌కు ప్రయాణీకులను తీసుకువస్తున్న ఆర్టీసీ బస్సు వస్తూ మార్గమధ్యంలో సెయింట్‌ క్లారెట్‌ స్కూల్‌ వద్ద విద్యార్థులను దింపేందుకు జాతీయరహదారి పక్కన ఆగింది. పిల్లలు దిగుతుండగా వెనుక వచ్చిన ఏసీఎం స్కూల్‌ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో స్కూల్‌ బస్సులో ఉన్న పిల్లలు ఒక్కసారి సీట్లలో నుండి ఎగిరిపడ్డారు. అయితే చిన్నారులెవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని  స్వల్పంగా గాయపడిన చిన్నారులను ఆసుపత్రులకు తరలించారు.

తల్లిదండ్రుల ఆందోళన...
ఏసీఎం స్కూల్‌ యాజమాన్యం, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అందోళనకు దిగారు. మొదట స్కూల్‌ వద్దకు వెళ్లి స్కూల్‌ ఎదుట అందోళన చేపట్టగా పోలీసులు వారిని సముదాయించడంతో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు శారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారులు సాయిప్రణవ్‌(12)రమ్మ(7),అక్షయ(5) మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ సాయిబాబా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement