‘రుణమాఫీ’ జాబితా సిద్ధం చేయండి
ప్రగతినగర్ : జిల్లాలో అర్హత గల రైతుల రుణమాఫీ జాబితాను శనివారంలోగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. గురువారం రాత్రి సంబంధిత మండల స్థాయి, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రుణమాఫీ జాబితాకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇదివరకే పంపించిన పట్టికలలో వివరాలను నమోదు చేసి నివేదికలు సమర్పించాలన్నారు.
రుణాలకు సంబంధించిన పూర్తి జాబితాను శుక్రవారం పూర్తిచేయాలని, బ్యాంకులు సమర్పించే రుణాల వివరాల పట్టికలు ప్రొఫార్మా డిలో శుక్రవారం సమర్పించాలని సూచించారు. రుణాల మాఫీకి అర్హుల జాబితాను శనివారం కల్లా పూర్తి చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జాబితాలు త్వరగా పూర్తి చేసి వివరాలు సమర్పించడానికి, సంబంధిత రైతుల ఆధార్ సీడింగ్, ఆధార్ నంబర్లు సేకరించడానికి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయడానికి అవసరమైన కంప్యూటర్ ఆపరేటర్లను, కంప్యూటర్లను సంబంధిత ఆర్డీవోలు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
వివరాలు త్వరగా, నిర్దేశించిన కాలంలో పూర్తిచేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో బ్యాంకర్లు త్వరితగతిన వివరాలు సేకరించి అందించడానికి బ్యాంకు అధికారులతో మాట్లాడాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ నర్సింహ, ఇన్చార్జి అదనపు జేసీ రాజారాం, ఏడీఏ వాజిద్‌హుస్సేన్, డీపీవో సురేష్‌బాబు, ఇన్చార్జి డీఆర్వో యాదిరెడ్డి, డీఎస్వో కొండల్రావు, సహాయ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్, ఐకేపీ పీడీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.