drought area farmers
-
కరవు మండలాల ప్రకటన కంటితుడుపే
ప్రభుత్వాల మతిమాలిన విధానాలు రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. కరవు మండలాల ప్రకటన కంటితుడుపు చర్యే అయింది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన పెథాయ్ మిగిలి ఉన్న కాస్త పంటను తుడిచేసింది. ఎన్నికల ముంగిట అన్నదాతలను బురిడీకొట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కరవు మండలాల ప్రకటన ఏమాత్రం అక్కరకు రాలేదు. రుణాలు రీషెడ్యూల్ అవుతాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. రుణాలపై వడ్డీ మాఫీ లేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ జాడలేదు. వ్యవసాయ కూలీలకు అదనపు పనిదినాలు కల్పించలేదు. సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గత ఖరీఫ్‌లో సగానికి పైగా సాగు విస్తీర్ణం ఎండిపోయింది. మిగిలిన సగం పంటను పెథాయ్ తుడిచిపెట్టేసింది. గత ఖరీఫ్‌లో1,97,100 హెక్టార్లలో పంటలు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 1,75,782 హెక్టార్లలోనే సాగు చేయగలిగారు. అందులో 1.05 లక్షల హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా, అతికష్టమ్మీద 99,900 హెక్టార్లలో పంటలు వేయగలిగారు. దాంట్లో అధికారిక లెక్కల ప్రకారం వర్షాభావ పరిస్థితుల వల్ల 40వేల హెక్టార్లలో పంట ఎండిపోయింది. పెథాయ్ తుఫాన్ ప్రభావానికి 25వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఎకరాకు పట్టుమని 12–15 బస్తాలకు మించిదిగుబడి రాలేదు. పైగా రంగుమారిపోయి మద్దతు ధర మాట దేవుడెరుగు కనీసం గిట్టుబాటు ధర కూడా రాని దుస్థితి చోటుచేసుకుంది. ఇలా రూ.170 కోట్లకు పైగా విలువైన పంటను కోల్పోయారు. ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కరవుమండలాలు ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకతీతంగా ముక్తకంఠంతో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రెండుసార్లు జెడ్పీ సర్వసభ్యసమావేశాల్లోనూ తీర్మానాలు చేశారు. కానీ డ్రైస్పెల్స్, ఇతర నిబంధనలను సాకుగా చూపి జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరవు ప్రాంతంగా ప్రకటించ లేదు. ఖరీఫ్ దెబ్బతో రబీ సాగుకు కూడా అన్నదాతలు దూరంగా ఉన్నారు. కనీసం చేతికొచ్చిన పంటైనా ఆశించిన దిగుబడి నిచ్చిందా? అంటే అదీ లేదు. ఎన్నికల ముంగిట కరవు చాయలుకమ్ముకోవడంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపైతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృషికి తీసుకొచ్చారు. రైతన్నలను శాంతింప చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ ముందు మొక్కుబడిగా కరవు మండలాల ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వాటిలో 228 తీవ్ర కరవు మండలాలుగా, మరో 29 మోడరేట్ డ్రౌట్ ప్రాంతాలుగా పేర్కొంది. జిల్లాలో 29 మండలాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వాటిలో ఒక్కదానికీ తీవ్ర కరవుమండలాల జాబితాలో చోటు దక్కలేదు. ప్రకటించిన 29 మండలాలు మోడరేట్ డ్రౌట్ మండల్స్ జాబితాలోనే ఉన్నాయి. పైగా ప్రకటించిన 29మండలాల్లో ఎలాంటిసాగు లేని విశాఖపట్నం అర్బన్, గాజువాక, పెదగంట్యాడ, పరవాడ మండలాలతో పాటు పెద్దగా సాగు లేని ఆనందపురం, భీమునిపట్నం, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఉండడం గమనార్హం. కానరాని సాయం.. సాధారణంగా ప్రకటించిన కరవు మండలాల్లో డ్రై స్పెల్, క్రాప్ కటింగ్ ఎక్స్పరమెంట్ ప్రకారం నష్టపోయిన రైతులకు సాగు విస్తీర్ణం, పంటలను బట్టి ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) ప్రకటిస్తారు. తీసుకున్న రుణాలన్నీ రీషెడ్యూల్ అవుతాయి. పైగా రుణాలపై వడ్డీ మాఫీ ఉంటుంది. కరవు మండలాల్లో వ్యవసాయ కూలీలకు అదనంగా 50 పనిదినాలు కల్పిస్తారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తారు. కొత్తగా రుణాలు కూడా మంజూరు చేస్తారు. కానీ కంటితుడుపు చర్యగా కరవు మండలాల ప్రకటన వల్ల రైతులకు , రైతు కూలీలకు ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదు. ఖరీఫ్‌లో రూ.2371కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఏకంగా రూ.2390కోట్ల రుణాలు ఇచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు. వాటిలో 80శాతం రీషెడ్యూల్ అయినవే. వీటిపై వడ్డీ కూడా ఏటా రూ.200కోట్ల వరకు చెల్లిస్తున్నారు. కరవు మండలాల ప్రకటన వల్ల ఖరీఫ్‌లో ఇచ్చిన రుణాలన్నీ మళ్లీ రీషెడ్యూల్ అవుతాయని రైతులు ఆశించారు. కానీ ఒక్క రూపాయి కూడా రీషెడ్యూల్ కాలేదు. అంతేకాదు కనీసం తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదు. కనీసం ప్రీమియం చెల్లించిన వారికైనా బీమా సొమ్ము దక్కుతుందా అంటే అదీ లేదనే చెప్పాలి. ఇక కనీసం వ్యవసాయ కూలీలకైనా మేలు జరుగుతుందనుకుంటే అదీ లేదు. ఉపాధి హామీ పథకంలో సాధారణ మండలాల్లో ఏటా కుటుంబానికి వందరోజులు పనిదినాలు కల్పిస్తే కరవు మండలాల్లో మాత్రం కూలీలకు 150రోజులు పనిదినాలు కల్పిస్తారు. జిల్లాలో పేరుకు 29 మండలాలు కరవు మండలాలుగా ప్రకటించినా ఏ ఒక్క మండలంలో ఏ ఒక్క కూలీకి అదనంగా ఒక్క రోజు పనిదినం కల్పించలేని దుస్థితి నెలకొంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హæడావుడిగా కరవు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం కరవు సాయం మాత్రం ప్రకటించకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు నష్టపోయాను.. నేను 60 సెంట్లలో వరిపైరు వేశాను. వర్షాభావ పరిస్థితులతో పంట పూర్తిగా ఎండిపోయింది. రూ.12 వేల మేర పెట్టుబడులు నష్టపోయాను.కరవు మండలాల ప్రకటనతో ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుందని ఆశించాం. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. కరవు మండలాల ప్రకటనకంటితుడుపు చర్యగానే మిగిలింది.– చదరం మాణిక్యం, రైతు, గణపర్తి పైసా సాయం లేదు నేను 50 సెంట్ల మేర చెరకుసాగు చేపట్టాను. ఇందుకోసం రూ.18వేలకు పైగా పెట్టుబడి పెట్టా. వర్షాలు లేక చెరకుతోట ఎండిపోయింది. మూడు పాకాలకు మించి దిగుబడి రాలేదు. కరవు మండలాల ప్రకటనతో ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూశాను. కానీ పైసా సాయం అందే పరిస్థితులు కన్పించడం లేదు. – భీశెట్టి అప్పారావు, రైతు, మునగపాక -
కడప గడపలో కరువు దరువు
సాక్షి ప్రతినిధి కడప: అతివృష్టి.. అనావృష్టి.. క్రమం తప్పకుండా కడప గడపలోనే తిష్టవేశాయి. వెరసి జిల్లా రైతాంగానికి వ్యవసాయం కడుభారంగా మారింది. జీవనోపాధి కోసం నగరాలకు వలసలు తెరపైకి వచ్చాయి. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతు నగరాల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్నారు. ఆదిరించి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఉత్తుత్తి మాటలకు పరిమితమైంది. కరువు ప్రకటన చేస్తుంది..ఆపై ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఊసే ఎత్తదు. ఇదే పరిస్థితిని నాలుగేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్నారు. పంట ఏదైనా సరే.. నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. ఆరుతడి పంటలు, పండ్లతోటలు, ఆకుతోటలు, చిరుధాన్యాలు, పూలతోటలు ఇలా ఏ పంటైనా సరే రైతులు అప్పుల ఊబిలోకి వెళ్తున్నారు. 2013–14 నుంచి ఇప్పటికీ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఈమారు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సరాసరిన 65 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని రైతన్నలు వాపోతున్నారు. పేరుకుపోతున్న పరిహారం.. వరుస కరువులను చవిచూస్తున్న రైతులకు పరిహారం మాత్రం సకాలంలో దక్కలేదు. 2013 నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.56.08 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. వ్యవసాయ పంటలకు రూ.45.87 కోట్లు కాగా, ఉద్యానవన పంటలకు రూ.10.21 కోట్లు అందాల్సి ఉంది. 44 మండలాల్లోని 51వేల మందికిపైగా రైతులు నష్టపరిహారమైన ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదు చూస్తున్నారు. సకాలంలో చెల్లించి రైతులకు దన్నుగా నిలవాలనే దృక్పథం ప్రభుత్వంలో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. వ్యవసాయం తప్ప మరోపని చేసేందుకు ఆసక్తి చూపని రైతన్న ఉద్యాన పంటలను సాగుచేస్తే అకాల వర్షాలు, ఈదురుగాలులు దెబ్బతీస్తున్నాయి. ఏటా ఆయా విపత్తుల వల్ల నిండా మునిగిపోతున్నారు. సాయమందించాలనే మాటను ప్రభుత్వం ఎప్పుడో మరచిపోయిందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంట నష్టం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినా ఉలుకుపలుకు లేదని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పెదవి విరుస్తుండడం విశేషం. జిల్లాలో 2013లో ఫిబ్రవరి నుంచి 2017 అక్టోబరు వరకు ప్రకృతి విపత్తులతో 4,293 హెక్టార్లలో ఉద్యాన పంటలు(తోటలు) దెబ్బతినగా 9,425 మంది రైతులు రూ.10.21 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఉద్యానశాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా ఇంత వరకు పైసా కూడా ప్రభుత్వం మంజూరు చేసి ఉంటే ఒట్టని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 31 వరకు సాగు చేసిన పంటలే పరిగణలోకి.. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాలోని 51 మండలాలను కరువు మండలాలుగా గుర్తించినట్లు ప్రకటిస్తూ జీఓ నంబరు 6ను విడుదల చేసింది. ఆపై ఈ ఖరీఫ్‌కు సంబందించి జూలై 31వ తేదీ లోపు సాగైన పంటలకు మాత్రమే పరిహారంటూ కట్ఆఫ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల గుండెల్లో గునపం దించినట్లవుతోంది. కేవలం జూలై నెలాఖరులో ఏ రైతులైతే పంట సాగు చేసి ఉంటారో వారి పేర్లను మాత్రం పరిహారం కోసం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్టులో పంట సాగు చేసిన వారి నోట్లో మట్టిగొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. సాధారణంగా ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌లో ప్రారంభించి సెప్టెంబరు నెల వరకు వర్షాభావంతో పంటలు దెబ్బతినడం, వర్ష విరామం(వర్షాలు నెలల తరబడి పడకపోవడం)తో, దిగుబడిని ఆధారం చేసుకుని నష్ట అంచనాలు తయారు చేయడం సర్వసాధారణం. కాగా ప్రభుత్వం ముందుగానే కరువు మండలలాను ప్రకటించింది. కట్ ఆఫ్‌డేట్ నిర్ణయించిన కారణంగా పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) సగం మందికి కూడా అందే అవకాశం లేకుండా పోతోందని పలువురు రైతులు మండిపడుతున్నారు. జూలై 31వ తేదీ వరకు పంటలను సాగు చేసిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించడంతో ఆగస్టు నెలలో పంట సాగు చేసి నష్టపోయిన రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. 6245 హెక్టార్ల పంట నమోదు చేయరంటా.. జిల్లాలో జూన్ నెలలో 69.2 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 31.9 మిల్లీ మీటర్లు కురిసింది. జూలై నెలలో 96.7 మిల్లీ మీటర్ల వాన పడాల్సి ఉండగా కేవలం 21.5 మిల్లీ మీటర్లు మాత్రమే పడింది. ఆగస్టులో 114 ఎంఎం కురవాల్సి ఉండగా ఇప్పటికే 36ఎంఎం పడింది. ఈ ఖరీఫ్ సీజన్‌కు సాధారణ సాగు 1,33,356 హెక్టార్లు కాగా, జూలై ఆఖరుకు 12,501 హెక్టార్లల్లో మాత్రమే పంటలు సాగుచేసినట్లు అధికారిక లెక్కలు కట్టారు. ఆగస్టు మొదటి వారంలో కురిసిన వానలకు మెజార్టీ రైతులు పత్తి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఇతర పంటలను కలిపి 6245 హెక్టార్లలో సాగు చేశారు. ఆగస్టులో సాగైన ఈ పంటల నమోదును చేపట్టేదిలేదని అధికారులు ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా.. నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తోంది. పరిహారం ఇవ్వకుండా కేవలం ప్రకటనలతో ముడిపెడుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఈమారు కూడా కరువు మండలాలు ప్రకటన మినహా ఎలాంటి చేయూత కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా సోమవారం కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా చేపట్టనున్నట్లు కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు కొత్తమద్ధి సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్సీపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని వారు వివరించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాలో జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
రైతులను తక్షణమే ఆదుకోండి
* మే 4, 5వ తేదీల్లో మండలాధికారులకు వైఎస్సార్ సీపీ వినతిపత్రాలు * మొక్కుబడిగా కేంద్ర బృందం పర్యటన: మైసూరారెడ్డి సాక్షి, హైదరాబాద్: కరువు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలనే డిమాండ్‌తో మే 4, 5వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలు, ఎండీవోలకు స్థానిక నేతలు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంటలు సర్వనాశనమై దుర్భర పరిస్థితుల్లో ఉన్న రైతుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న 10 జిల్లాల్లో 35 నుంచి 50 సెంటీమీటర్ల వరకూ తక్కువ వర్షం కురిసిందన్నారు. అనంతపురం, ఉత్తరాంధ్రలో జీవనోపాధి లేక బెంగళూరు, ఒడిశాకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లుగా పరిశ్రమలు, పెట్టుబడులంటూ జపం చేస్తోందని విమర్శించారు. కరువు వల్ల పంట నష్టంపై సరైన అంచనాలే వేయలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన కరువు బృందం రాత్రి పూట టార్చ్‌లైట్ వెలుగులో రాయచోటి తదితర ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించిందన్నారు. ధాన్యం సేకరణ విధానాన్ని మార్చటంతో రైతులు కనీస మద్దతు ధర కన్నా రూ. 100 నుంచి రూ. 150 తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని టీడీపీ తుంగలోకి తొక్కిందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా బాధ్యత బీజేపీ, టీడీపీలదే విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదేనని మైసూరా పేర్కొన్నారు. ఒత్తిడి చేసి సాధించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరిగినపుడు తాము అధికారంలోకి రాగానే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ నేతలు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌ను ఆదుకోవాలని పార్టీ తరపున కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మైసూరా చెప్పారు. అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.