కరువు తీవ్రత ఎంత?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరువు లెక్కలపై సర్కారు దృష్టి సారించింది. అదను దాటుతున్నా వర్షాలు కురవక రైతులు అల్లాడుతున్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా వర్షపాతంలో భారీలోటు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఒకవైపు ఇప్పటికే విత్తనాలు వేసి వరుణుడి కరుణ కోసం రైతులు ఆకాశంవైపు దీనంగా చూస్తున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకుంటే విత్తనాలు భూమిలోనే మురిగిపోయే అవకాశం ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా దిగుబడులపై తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు భూగర్భజలాలు సైతం పడిపోతూ కరువుకు సంకేతాలిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా పరిస్థితులపై సమీక్షలు చేపట్టి చర్యలకు ఆదేశించింది.
ఆగస్టు రెండో వారంలోగా నివేదికలు
జిల్లాలో పరిస్థితిని పరిశీలించేందుకు ఆరుగురు సభ్యులున్న కరువు బృందంతో బుధవారం రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్దిష్ట సమయాల్లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించి.. కరువు అంచనాల సేకరణపై సూచనలిచ్చారు. ప్రస్తుతం విత్తనాలు నాటే సీజన్ దాటలేదు. ఈనెల చివరినాటికి కొన్ని పంటలకు సంబంధించి విత్తనాలు నాటే గడువుంది. అదేవిధంగా ఆగస్టు మొదటి వారం చివర్లో, రెండో వారంతో విత్తనాలువేసే సమయం ముగుస్తుంది.
దీంతో ఆ సమయంలోగా కురిసే వర్షాలు.. వాటి మధ్య గడువు, వర్షపాతం వివరాలు, విత్తనాలు వేసిన విస్తీర్ణం తదితర అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వచ్చేనెల రెండోవారం వరకున్న పరిస్థితులను విశ్లేషిస్తూ సర్కారుకు నివేదిక సమర్పించేందుకు వ్యవసాయ అనుబంధశాఖలు ఉపక్రమించాయి. ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 53శాతం లోటులో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం సాధారణ వర్షపాతం, సాగు విస్తీర్ణం తదితర అంశాల్లో50శాతం లోటు ఏర్పడితే కరువు ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది.