నా పిల్లలను వేధిస్తున్నారు...నటి రజని
* ‘డీఆర్ఎస్’ స్కూల్‌పై నటి రజని ఫిర్యాదు
కుత్బుల్లాపూర్: కక్ష సాధింపులకు పోయి స్కూల్ యాజమాన్యం తన పిల్లలను మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ సినీనటి రజని బుధవారం బాలానగర్ డీసీపీకి ఫిర్యాదు చే శారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, నటి రజనీ కథనం ప్ర కారం... నగరంలో నివాసముంటున్న రజనీ మల్హోత్రాకు అజయ్, రితిక, ధనుష్ సంతానం. చిన్నారులు ముగ్గురూ మైసమ్మగూడలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద కుమారుడు అజయ్ 10వ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్ యాజమాన్యం మానసికంగా వేధిస్తుండటం తో వేరే స్కూల్లో చేర్పించారు. రితిక, ధనుష్‌లను డీఆర్ఎస్లోనే చదువుతున్నారు.
క్లాస్‌లో మ్యాథ్స్ టీచర్ విద్యార్థులందరి ముందు రితికను కొట్టడంతో ఆమె తల్లి రజని అక్టోబర్ 28న పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేసింది. ఇది జరిగిన నాలుగు రోజులకే ఐదో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు ధనుష్ స్కూల్ బస్సులో అటూ.. ఇటూ తిరుగుతున్నాడని ఓ టీచర్ బస్సులోనే రాత పరీక్ష నిర్వహించి అందరి ముందు అవమానించింది.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీచర్.. నీటి కోసం వెళ్లిన తన కుమారుడిని వేధించిందని ఆరోపిస్తూ రజని డీసీపీని ఆశ్రయించింది. ఏఆర్ శ్రీనివాస్ వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్‌ను తన కార్యాలయానికి పిలిపించారు. టీచర్ సెలవులో ఉండటంతో సోమవారం వరకు సమయం ఇవ్వాలని డీసీపీని కోరి ప్రిన్సిపాల్ వెళ్లిపోయారు. కాగా, ‘నా పిల్లలను వేధిస్తున్న విషయమై స్కూల్ యాజమాన్యం స్పందించకుంటే ఎంత వరకైనా వెళ్తా. విద్యాశాఖ మంత్రిని, అధికారులను కలుస్తా’అని రజని అన్నారు.