ఖేలో ఇండియా క్రీడాపోటీలకు సన్నద్ధం
కడప స్పోర్ట్స్:
జిల్లా క్రీడాప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో 'ఖేలో ఇండియా' పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి లక్ష్మినారాయణశర్మ తెలిపారు. శనివారం నగరంలోని డీఎస్ఏ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖేలో ఇండియాలో భాగంగా క్రీడా పోటీలను ఈనెల 23 నుంచి 25 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే కడప నియోజకవర్గంలో మాత్రం 24, 25 తేదీల్లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు 10 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కడప నియోజకవర్గంలోని క్రీడాకారులకు 24న ఆర్చరీ, అథ్లెటిక్స్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ, వాలీబాల్, 25న బాక్సింగ్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి పోటీల షెడ్యూలును ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ పాల్గొన్నారు.
జిల్లాస్థాయి క్రీడాపోటీలు
–––––––––––––––––––––––––––––––
తేదీ క్రీడాంశాలు
–––––––––––––––––––––––––––––––––
26 అథ్లెటిక్స్, తైక్వాండో, వాలీబాల్
27 హాకీ, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్
28 ఖోఖో, ఆర్చరీ
29 ఫుట్‌బాల్, కబడ్డీ