తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది
డీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో విరసం నేత వరవరరావు
నల్లగొండ టూ టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దొరల పాలన నడుస్తోందని విరసం నేత వరవరరావు ధ్వజ మెత్తారు. నల్లగొండలో జరుగుతున్న డీటీఎఫ్ విద్యా వైజ్ఞానిక నాలుగో రాష్ట్ర సభలు సోమవారం ముగిశాయి. చివరిరోజు ముఖ్యఅతి«థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌సహా ఆ నాలుగు కుటుంబాలు మాత్రమే ప్రయోజనం పొందాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి సమైక్యాంధ్రప్రదేశ్ పాలన వరకు ఎవరూ వ్యవహరించని విధంగా విమలక్కను, కార్యకర్తలను బయటకు వెళ్లగొట్టి అరుణోదయ సాంస్కృతిక కార్యాల యాన్ని మూసివేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 1996లో కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశాలు పాటించి సమైక్య రాష్ట్రానికి సీఈవోగా వ్యవహరించిన చంద్ర బాబు రాష్ట్రంలో నెత్తుటేరులు పారించాడన్నారు.
కొత్తగూడెం ఏజెన్సీ ఏరియాలో ఓ గోండు యువకుడు సింగరేణిలో ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైతే.. అతడిని ఉద్యోగంలో చేరవద్దని వేధించారని చెప్పారు. సదరు యువకుడు ఆగస్టులో విజయవాడలో జరిగిన సివిల్ పరీక్షకు వెళ్లి నేటికీ తిరిగి రాలేదన్నారు. మెరిట్లో అతడి తర్వాత ఉన్న వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోందన్నారు. కరెన్సీ రద్దు తర్వాత పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కాషాయీకరణ, విద్య వ్యాపారీకరణను వ్యతిరేకించి కామన్ విద్య కోసం ఉద్యమించాలని వరవరరావు పిలుపునిచ్చారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టప్ప, జ్వాల సంపాదకుడు గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.