ప్రమాదాలు జరిగినా.. పాఠాలు నేర్చుకోరు
=తీరు మారని టీటీడీ
=బూందీపోటు సంఘటనతో రూ.10 లక్షల నష్టం
= నిలిచిన లడ్డూ తయారీ
సాక్షి, తిరుమల: తిరుమలలోని అదనపు బూందీపోటులో సోమవారం జరిగిన ప్రమాద సంఘటనలో రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఆల య, బూందీపోటులో, నిత్యాన్న భవన సముదాయం లో పలు అగ్నిప్రమాదాలు జరిగి భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ టీటీడీ అధికారుల తీరు మారలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారులు ప్రమాదం జరిగిన సందర్భం లో తీవ్రంగా స్పందిస్తారు. ఆ తర్వాత మరచిపోతారు.
గత రెండు మూడేళ్లుగా ఆలయ పోటులో, బూందీ పోటులో, నిత్యాన్న భవన సముదాయంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరిగాయి. అప్పట్లో అధికారులు హడావుడి చేశారు. వెనువెంటనే పోటులో పొయ్యలను మార్పిడి చేశారు. అత్యాధునిక వసతులు పెంచారు. రోజువారీగా ప్రసాదాల తయారీలో గోడలకు అంటుకునే సిల్ట్ నెయ్యిని తొలగించే పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరిగినా దాన్ని ఎదుర్కొనే విధంగా డ్రై కెమికల్ సిలిండర్ల సంఖ్యను పెంచారు. వాటి సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఇలాం టి సౌకర్యాలే ఆలయం వెలుపల బూందీ పోటులోనూ, నిత్యాన్న భవన సముదాయంలోనూ పెం చా రు. అయితే సిలిండర్లను వాడే విధానంలో మెళుకువలు నేర్పించలేదు.
సోమవారం సాయంత్రం అదనపు బూందీపోటులో హఠాత్తుగా జరిగిన సంఘటనతో పోటు కార్మికు లు అరుపులు, కేకలతో పరుగులు తీసారు. పలువురు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందిపడ్డారు. పదిహేను నిమిషాల తర్వాత లీకైంది డీసీపీ సిలిండరని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అయితే అనుకోని ప్రమాదం వల్ల సుమారు రూ.10 లక్షల విలువైన బూందీ, నెయ్యి, వంద బస్తాల శెనగ పిండి పూర్తిగా పాడైపోయాయి. మరోవైపు బూందీ తయారీ నిలిచిపోయింది. దీంతో లడ్డూ తయారీ ఆగిపోయింది.
ప్రమాదాలు జరక్కండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే ఇలా జరిగింది. ఈ ప్రమాదానికి బాధ్యత తమదంటే తమది కాదని పోటు అధికారులు, సిబ్బంది భుజాలు తడుముకుంటున్నారు. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించలేదు. పోటు అధికారులు మాత్రం ఈ ఘటన చాలా చిన్నదని కొట్టిపారేయటం గమనార్హం. ఇకనైనా ప్రమాదాలు జరక్కుండా అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.