Dubai Open tournament
-
ప్రజ్నేశ్ పరాజయం
దుబాయ్: ఈ ఏడాది బరిలోకి దిగిన ఐదో టోర్నమెంట్లోనూ భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ ఎదురైంది. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో చెన్నైకి చెందిన 30 ఏళ్ల ప్రజ్నేశ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ డెన్నిస్ నొవాక్ (ఆస్ట్రియా)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 134వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 4–6, 3–6తో ఓడిపోయాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో పేస్ జంట ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–3తో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఫిలిప్ పొలాసెక్ (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) జంటతో పేస్–ఎబ్డెన్ ద్వయం ఆడుతుంది. -
సానియా–గార్సియా జోడీ శుభారంభం
దుబాయ్: కాలి పిక్క గాయం నుంచి తేరుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–కరోలినా గార్సియా (ఫ్రాన్స్) ద్వయం 6–4, 4–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలా కుద్రయెత్సెవా (రష్యా)–కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటను ఓడించింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)–బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా–గార్సియా జంట ఆడుతుంది. -
సానియా జంటకు మళ్లీ నిరాశ
దుబాయ్: వరుసగా రెండో టోర్నమెంట్లోనూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. తన భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొన్న సానియా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సానియా–స్ట్రికోవా ద్వయం 4–6, 3–6తో రెండో సీడ్ మకరోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా జంటకు 34,880 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 23 వేలు)తోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతవారం ఖతర్ టోర్నీలోనూ సానియా–స్ట్రికోవా జోడీ సెమీస్‌లోనే ఓడిపోయింది.