అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..
రొంపిచర్ల : గుంటూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం అన్నవదినను ఓ తమ్ముడు నరికి చంపిన దుర్ఘటనను మరిచిపోకముందే, మరో దుర్ఘటన అదే జిల్లాలో చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం వీరపట్నంలో సోదరి సుబ్బమ్మ, బావ రమేష్ రెడ్డిపై రామిరెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దాడిలో రమేశ్‌రెడ్డి, అతడి భార్య సుబ్బమ్మ ఘటనాస్థలంలోనే చనిపోయారు. కాగా ఆస్తి వివాదాలే హత్యలకు కారణమని బంధువులు చెబుతున్నారు.
మూడు ఎకరాల పొలం గురించి అక్క సుబ్బమ్మ, ఆమె సోదరుడు రామిరెడ్డి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు, ఆ పొలాన్ని ప్రస్తుతం అక్కా,బావే సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి పథకం ప్రకారం సోదరిని ఇంట్లో, పొలంలో పనిచేసుకుంటున్న బావ రమేష్‌ను దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.