నేను ఈ సమాజంలో బతకలేను!
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
మిడ్జిల్ : ‘‘మనుషులు మృగాలుగా మారారు.. ఇలాంటి సమాజంలో నేను బతకలేను.. అందుకే అందర్నీ విడిచిపెట్టి పోతున్నా.. కానీ నా తల్లి నన్ను ఎంతో ప్రేమతో పెంచింది.. నా ఇల్లును అనాథాశ్రమానికి, నా అవయవాలను అవసర మైన వారికి దానం చేయాలి..’’అంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన దుడ్డు నాగేశ్ (19) తండ్రి బాలయ్య పదేళ్ల కిందట మృతి చెందాడు. తల్లి వెంకటమ్మ కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని పోషించింది. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం పెద్ద కుమారుడు కృష్ణయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.
ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఇంటర్ వరకు చదువుకున్న నాగేశ్ ఆ తర్వాత కరాటే నేర్చుకొని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడు. గతేడాది హైదరాబాద్కు వెళ్లగా తల్లి కూడా తోడుగా వెళ్లి అక్కడే ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారం క్రితం బీరప్ప పండుగ చేసుకోవడంతో గ్రామానికి వచ్చారు. వీరు కూడా అందరితో కలిసి పండుగ చేసుకున్నారు. తల్లి శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోకి పనిమీద వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగేశ్ ఉరేసుకున్నాడు. నాగేశ్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు గ్రామస్తులు తెలిపారు. కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి రోదనలు అందర్నీ కంటతడి పెట్టించాయి.