పునరావాసమంతా ఉత్తిదే
పటమట(విజయవాడతూర్పు): వరద కారణంగా బుడమేరు ప్రభావితం చేసే ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాసం కేంద్రాలకు తరలించామని, నగరమంతా 97 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో 14,252 వేల మందికి పైగా పునరావాసం ఉంటున్నారని, వరద తగ్గుముఖం పట్టడంతో 61 కేంద్రాలను మూసేశామని, ఇంకా 36 కేంద్రాల్లో బాధితులు పునరావాసం ఉంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే నగరవ్యాప్తంగా కేవలం 13 పునరావాస కేంద్రాలే ఉన్నాయి.వాటిలో 1,031 మంది మాత్రమే తలదాచుకున్నారు. 4 కేంద్రాల్లో బా«ధితులే లేరు. సింగ్‌నగర్, రాజీవ్‌నగర్, కండ్రిక, ఉడాకాలనీ, సుందరయ్యనగర్, పాయకాపురం, శాంతి, ప్రశాంతినగర్ ప్రాంతాల ప్రజలు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలకు తాళాలు వేసి ఉన్నా వాటిని పగలకొట్టి తలదాచుకున్నారు. రాజీవ్‌నగర్‌లోని వడ్డెర కాలనీలో ఉన్న హైసూ్కల్లో సుమారు 250 మంది వరకు పునరావాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ అక్కడ ఇంత వరకు ఏ ప్రభుత్వ అధికారి, సిబ్బంది రాలేదని వాపోతున్నారు. పునరావాస కేంద్రాలు ఇవీ.. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 3 సర్కిళ్ల పరిధిలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 8 కేంద్రాలు వరద ముంపులో ఉన్నాయి. సర్కిల్–1 ఏరియాలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో ఒకటి ఖాళీగా ఉంది. లేబర్‌కాలనీ కళ్యాణ మండపంలో 20 మంది, ఉర్దూ మున్సిపల్ హైసూ్కల్ (ఎవరూ లేరు), విద్యాధరపురంలో 20 మంది, కేఎల్‌రావు నగర్‌లోని రాకేష్ పబ్లిక్స్కూల్లో 20 మంది ఉన్నారు. సర్కిల్–2 పరిధిలోని సత్యనారాయణపురం ప్రశాంతి ఎలిమెంటరీ స్కూల్లో 430 మంది, దేవీనగర్‌లోని తమ్మిన దుర్గారావు స్కూల్లో 20 మంది, మధురానగర్ కమ్యూనిటీ హాల్లో 20 మందే పునరావాసానికి వచ్చారు. సర్కిల్–3 పరిధిలో 6 కేంద్రాలు ఉండగా పటమటలంక వల్లూరు సరోజని దేవి స్కూల్లో 350 మంది, కృష్ణలంక ఓడీఏ హాలులో (ఎవరూలేరు), రాణిగారితోట న్యూ కమ్యునిటీ హాల్లో (ఎవరూలేరు), గుణదల నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో 102 మంది, కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో (ఎవరూ లేరు). సీపీఎం భవనంలో 49 మంది మాత్రమే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారమే.. నగరంలోని వీఎంసీ, రెవెన్యూ విభాగాలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల సమాచారం లేకపోవడం, వరదలో చిక్కుకున్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేయకపోవడంతో లక్షల మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. స్వచ్ఛంద సంస్థలు వినీల్ (వీకే), ఎయిమ్, దళిత బహుజన్ ఫ్రంట్, రెడ్‌క్రాస్ లాంటి సంస్థలు వాంబేకాలనీ, రాజీవ్‌నగర్, ఓల్డ్ ఆర్ఆర్ పేటలు, కండ్రిక ప్రాంతాలకు ట్రాక్టర్లలో వెళ్లి ఆహారాన్ని, నిత్యావసరాలను పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు లేకపోతే తాము చనిపోయేవారమని వరద బాధితులు వాపోతున్నారు.