రోగాల ముసురు
- మన్యంలో విజృంభిస్తున్న టైఫాయిడ్, మలే రియా
- గతేడాది కన్నా ఈ ఏడాది పెరుగుతున్న కేసులు
- ఏరియా ఆస్పత్రికి జ్వరపీడితుల తాకిడి
పాడేరు/పాడేరు రూరల్ : ఆదివాసీల ఆరోగ్యం కొడిగట్టిన దీపమవుతోంది. పాలకుల్లో చిత్తశుద్ధిలోపంతో ఆరోగ్య పథకాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఎపిడమిక్తో మన్యాన్ని వ్యాధులు చుట్టేస్తున్నాయి. డయేరియా, మలేరియా, విషజ్వరాలు జడలు విరబోసుకుంటున్నాయి. వాతవరణంలో మార్పులు, గూడేల్లో కొరవడిన పారిశుధ్యం, కలుషిత తాగునీటి కారణంగా వందలాది మంది మంచాన పడి అల్లాడిపోతున్నా రు.
ఏజెన్సీ 11 మండలాల్లో 3574 గ్రామాలున్నాయి. ఏటా ఎపిడమిక్‌లో ఇక్కడ పరిస్థితి అదుపుతప్పడం, మరణాలు చోటుచేసుకోవడం పరిపాటి. వివిధ సర్వేలు దీనిని నిర్థారిస్తున్నాయి. జీకేవీథి మండలం దారకొండ పంచాయతీ చాకిరేవుగెడ్డలో బి.దిలీప్‌కుమార్(18), పెద్ద గంగారంలో లక్ష్మి అనే ఆరేళ్ల బాలిక మలేరియా లక్షణాలతో బాధపడుతూ గురువారం చనిపోయారు. ఆరోగ్యశాఖ ఇంతవరకు వీటిని అధికారికంగా గుర్తించ లేదు. రాయిగెడ్డ ఆశ్రమపాఠశాలకు చెందిన 12మంది విద్యార్థినులు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా పరీక్షల్లో ముగ్గురికి మలేరియాగా తేలింది. ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీల పరిధిలో జూన్నెలాఖరుకు 4191 మలేరియా కేసులు నమోదయ్యాయి.
ఇది ప్రబలుతున్న వ్యాధులకు అద్దం పడుతోంది. మలేరియా జ్వరాలు వెలుగులోకి వచ్చాకే ఆయా గ్రామాలు, పాఠశాలల్లో వెద్యసేవలు కల్పిస్తున్నారు. అపరిశుభ్రత కారణంగా మన్యంలో దోమల బెడద ఎక్కువ. మూడేళ్ల క్రితం ఐటీడీఏ పంపిణీ చేసిన దోమతెరలు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు. మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ దోమల నివారణ మందు మలాథియాన్ పూర్తిస్థాయిలో పిచికారీ చేపట్టలేదు. రెండో విడత స్ప్రేయింగ్ కేవలం 429 గ్రామాల్లో పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏజెన్సీలోని 2,505 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది.
ఈ కారణాలతో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆశ్రమాలు, హాస్టళ్ల విద్యార్థులు విలవిల్లాడిపోతున్నారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే సుమారు 350 మంది ఓపీకి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏరియా ఆస్పత్రిలో 2487 మంది జ్వరపీడితుల నుంచి రక్త పూతలు సేకరించగా 150మందికి టైఫాయిడ్, 46 మందికి మలేరియా సోకినట్టు నిర్ధారణ అయింది.
ఎపిడమిక్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. గిరిజన సంఘం ఇటీవల గ్రామాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇదే వ్యక్తమైంది. గతేడాది కన్నా ఈ ఏడాది జ్వరాల తీవ్రత అధికమని నిర్ధారించారు. ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన ఆరోగ్య అభివృద్ధి వేదిక రాష్ట్ర సలహాదారుడు ఎం. గేయానంద్ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
పీహెచ్‌సీల్లో మందుల కొరత
పలు పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉంది. మినుములూరు పీహెచ్సీ ఇందుకు తార్కాణం. ఈ పీహెచ్‌సీకి నిత్యం రోగుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. డైక్లోఫిన్, ఐవీ, సిలైన్ బాటిళ్లు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఎస్.రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ, ఎంఎం శ్రీను ఈ పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న మందుల వివరాలను సేకరించారు. రోగులతో రద్దీగా ఉండే ఈ పీహెచ్సీలో పిల్లలకు అవసరమైన సిరప్లు, యాంటీ బయాటిక్ మాత్రలు, పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో లేవని గుర్తించారు.