తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసు
గుత్తిరూరల్ : సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారం ఇవ్వని తహసీల్దార్ సరస్వతికి రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ నుంచి మంగళవారం నోటీసులు జారీ అయ్యాయి. పట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్‌రెడ్డి పట్టణంలో ఎన్ని మీ సేవ కేంద్రాలు ఉన్నాయి? వాటి నిర్వాహకుల పేర్లు, ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారా? లేదా తగిన ఆధారాలతో ఇవ్వాలని గత ఏడాది ఆగష్టు 17, తిరిగి ఆగష్టు 23న రెండు మార్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారు.
తహసీల్దార్ తమ వద్ద సమాచారం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫిర్యాదుదారుడు ఆర్డీఓకు అప్పీల్ చేశారు. ఆర్డీఓ నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో రాష్ట్ర కమిషన్‌కు అప్పీలు చేశాడు. స్పందించిన కమిషన్ విచారణ నిమిత్తం ఈనెల 27న అనంతపురం ఆర్డీఓ కమిషన్ ఎదుట హాజరుకావాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదుదారుడు దుర్గాప్రసాద్‌రెడ్డి తెలిపారు.