డూండి పరువు తీయొద్దు
విజయవాడ(మ«ధురానగర్) :
డూండి గణేష్ సేవా సమితికి విరాళంగా వచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి లెక్కలు ఉన్నాయని, ఇటీవల కోగంటి సత్యం గత సంవత్సరం లెక్కలలో రూ.30 లక్షలు తేడాలన్నాయంటూ అసత్య ఆరోపణలతో సంస్థ పరువుతీస్తున్నారని సేవాసమితి కోర్ కమిటీ సభ్యులు దర్శి వెంకట సుబ్బారావు, పీ రాకేష్, వీ శ్రీనివాసరావు, పీ రవి పేర్కొన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ఏడాది డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 63 అడుగుల మహాశివ నాట్యగణపతిని ఏర్పాటు చేశామన్నారు. డూండీ గణేష్ సేవాసమితికి అధ్యక్షుడిగా కోగంటి సత్యం, కార్యదర్శిగా దర్శి వెంకట సుబ్బారావు, కోశాధికారిగా విస్సంశెట్టి వెంకట శ్రీనివాసరావు, పారేపల్లి రాకేష్ ను ఫౌండర్‌గా చేసి కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమిటీకి కోగంటి సత్యం అధ్యక్షతన మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ అధ్యక్షుడిగా కోగంటి సత్యం, అధ్యక్షుడిగా తొండెపు హనుమంతరావు, కార్యదర్శిగా గడ్డం రవి, కోశాధికారిగా దర్శి వెంకట సుబ్బరావులను ఎన్నుకున్నట్లు వివరించారు. గత సంవత్సరం ఆయన తాలూకా నుంచి ఇనుము, సర్వేబాదులు, కరెంటు సామగ్రి, చందాలు నుంచి సుమారు రూ.20 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఇవ్వాల్సిన సొమ్ము సంస్థకు ఇవ్వకుండా సంస్థ పరువును పాడుచేసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. విరాళాలలో లెక్కలపై దాతలకు ఎటువంటి అనుమానాలున్నా తమను సంప్రదించవచ్చునన్నారు.