duplicate alcohol
-
కల్తీ మద్యం సీసాల పట్టివేత
కావలిరూరల్ : పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవులు తన బృందంతో దాడి చేసి గురువారం పట్టుకున్నారు. కావలిలోని పలు మద్యం దుకాణాల్లో మద్యాన్ని డైల్యూట్ చేసి విక్రయిస్తున్న ట్లుగా కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అను వైన్స్‌పై అధికంగా ఫిర్యాదులు అందడంతో ఎక్సై జ్ అధికారులు గురువారం నిఘా పెట్టారు. ఉదయం షాపు తెరిచిన వెంటనే గుమస్తా లోపలికి వెళ్లి షట్టర్‌ను మూసివేశాడు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌ను ఓపెన్ చేసి అందులో 30 మి.లీ.ల మద్యాన్ని బయటకు తీసి అంతే పరిమాణంలో నీటిని నింపి తిరిగి సీల్‌ను యధాతథంగా బిగించి పెట్టాడు. రబ్బర్ ట్యూబ్ ముక్కతో బాటిల్ మూతను చాకచక్యంగా తీసి కల్తీ చేశాక, అంతే చాకచక్యంగా అమర్చాడు. మద్యం విక్రయించే సమయం కాగానే షాపును ఓపెన్ చేసి తొలుత కల్తీ చేసిన మద్యాన్ని విక్రయించడం మొదలు పెట్టాడు. ఎక్సైజ్ సిబ్బంది కస్టమర్లా వెళ్లి క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి హైడ్రోమీటర్‌తో పరీక్షించగా 25 శాతం ఉండాల్సిన నీటి పరిమాణం 37 శాతంగా ఉంది. దీంతో అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో షాపుపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్తీ జరిగిన ఇంపీరియల్ బ్లూ మద్యం 25 క్వార్టర్ బాటిళ్లు, ఓటీ విస్కీ 12 క్వార్టర్ బాటిళ్లు మొత్తం 37 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గుమస్తా బడెకల శ్రీనును అరెస్టు చేశారు. షాపు యజమాని మందాడి హర్షవర్ధన్‌పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్, కావలి ఎక్సైజ్ ఎస్సై ఎస్ శ్రీని వాసులు, సిబ్బంది పాల్గొన్నారు. డైల్యూషన్ ఇలా.. మద్యంలో 25 శాతం వరకు నీటి పరిమాణం ఉంటుంది. నిబంధనల ప్రకారం అంతకు మించి ఉండరాదు. అయితే సీసాలో కొంత మేర మద్యం తీసి వేసి అందులో నీటిని ని ంపుతారు. ఇలా మద్యాన్ని నీటితో కల్తీ చేయడాన్ని డైల్యూషన్ అంటారు. అలాగే ఇంకో విధానంలో క్వార్టర్ అధికంగా ఉండే ప్రీమియం బ్రాండ్స్ మద్యంలో తక్కువ రకం మద్యాన్ని కలుపుతారు. మద్యం వ్యాపారులు లాభాల కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు మద్యం అమ్మకాలలో ఎలాం టి అవకతవకలను ఉపేక్షించమని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవులు పేర్కొన్నారు. కావలి ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపామన్నారు. ఇటీవల 59 బెల్టు దుకాణాలపై దాడులు చేశామన్నారు. మద్యం సరఫరా చేసిన మద్యం షాపు యజమానులపైన కేసులు నమోదు చేశామన్నారు. మద్యం వ్యాపారులు లాభాల కోసం అడ్డదారులు తొక్కితే ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా బెల్టుషాపులు ఉన్నా, మద్యం కల్తీ జరుగుతున్నా, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నా, సమయ పాలన పాటించకపోయినా 94409 02264 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
సీసా గుట్టు.. ఎస్ఎంఎస్తో రట్టు
సాక్షి, కర్నూలు: నకిలీ మద్యం బెడద తప్పబోతోంది. దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం అసలుదా? నకిలీదా? ఎక్కడ తయారైంది? ఎవరు కొనుగోలు చేశారు? అనే వివరాలను ఒక్క సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్)తో ఇట్టే తెలుసుకునే వీలు త్వరలో అమల్లోకి రానుంది. సర్కారీ మద్యంలో నాణ్యతను వెల్లడించడంతో పాటు నకిలీ మద్యాన్ని నిలువరించే దిశగా ఎక్సైజ్‌శాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగానే మద్యం సీసాలపై హోలోగ్రామ్‌లు వేయడంతో పాటు, ఒక్క ఎస్ఎంఎస్తో మందుబాబులు తాము కొన్న సీసా తాలూకు సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న ఎక్సైజ్‌శాఖలో సరికొత్త విధానాల అమలుకు సర్కారు ప్రయత్నిస్తోంది. పర్మిట్ రూములు, ఔట్లెట్లతో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్న ప్రభుత్వం.. మద్యంలో నాణ్యత ప్రమాణాలను పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తయారవుతున్న మద్యం సీసాలపై లేబుల్స్ ఉంటున్నాయి. అయితే అక్రమార్కులు నకిలీ లేబుళ్లతో నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఈ కారణంగా ఖజానాకు భారీగా గండిపడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రతి మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇదే సమయంలో సీసాపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రించనున్నారు. ఈ నెంబర్ ఆ సీసాకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని వెల్లడించనుంది. కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. సీసా సమాచారం తెలుసుకోదలిస్తే దానిపైనున్న ప్రత్యేక సీరియల్ నెంబర్‌ను టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు.. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు, ఎక్కడ తయారైంది. ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది. ఏ దుకాణానికి అమ్మకం చేశారు. ఇతరత్రా వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తాయి. ఈ నూతన విధానంతో నకిలీ మద్యానికి చెక్ పడనుంది. అక్రమాలకు అడ్డుకట్ట: కర్నూలు జిల్లాకు 150 కిలోమీటర్ల మేర కర్ణాటక సరిహద్దు ఉంది. రాయచూర్ నుంచి బళ్లారి వరకు జిల్లాకు చెందిన ప్రాంతం ఆనుకుని ఉండడంతో జిల్లాకు గుట్టుచప్పుడు కాకుండా భారీ స్థాయిలో మద్యం నిల్వలు వచ్చి చేరుతున్నాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాల కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. తాజా విధానంతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా.. శాఖాపరంగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు.