కూలీల కష్టం..నొక్కేశారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధి హామీ పథకంలో భారీ చేతివాటం వెలుగుచూసింది. కూలీలకు డబ్బులివ్వకుండా నకిలీ లెక్కలు చూపిన పంపిణీ ఏజెన్సీ.. జిల్లా నీటి యాజమాన్య సంస్థను బోల్తా కొట్టించింది. కూలీలకు డబ్బులు పంపిణీ చేసిన మాజీ పంపిణీదారైన ఫినో సంస్థ హస్తలాఘవం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సంస్థ పనితీరు బాలేదంటూ అధికారులు ‘ఫినో’ను పంపిణీ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. కొత్త సంస్థను ఎంపిక చేశారు.
అయితే ఆ సంస్థ సమర్పించిన లెక్కల్లో తేడాలుండడం, కూలీలు సైతం బకాయిల కోసం ఆందోళనలకు దిగడం వంటి చర్యల నేపథ్యంలో అధికారులు ఆరా తీయగా దాదాపు రూ.2.2 కోట్లు దారిమళ్లించినట్లు తేలింది. దీంతో అధికారులు లోతైన విచారణ కోసం ఉపక్రమించారు. అయితే పంపిణీ సంస్థ సహకరించకపోవడంతో విసుగె త్తిన వారు చివరకు కేసు నమోదు చేశారు.
జాప్యం చేసి.. చివరకు కాజేసి!
ఉపాధి కూలీలకు డబ్బులు పంపిణీ చేసే క్రమంలో ఫినో ఏజెన్సీపై ఆది నుంచీ విమర్శలున్నాయి. యాక్సిస్ బ్యాంకు పెట్టిన నిబంధనలను సాకుగా చూపుతూ ఆ సంస్థ కూలీలకు డబ్బులు చెల్లించకుండా జాప్యం చేసింది. వారానికి నిర్దేశిత మొత్తాన్ని మాత్రమే ఇస్తామని కొర్రీ పెట్టడంతో కూలీలకు డబ్బుల పంపిణీ లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా కూలీల డబ్బులు యాక్సిస్ బ్యాంకు ఖాతాలో, మరికొన్ని నిధులు ఫినో ఏజెన్సీ ప్రతినిధుల వద్ద ఉండిపోయాయి. అయితే ఈ ఏజెన్సీ పనితీరు బాగాలేదంటూ గతేడాది జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఫినో ఏజెన్సీపై వేటు వేసింది. కొత్తగా మణిపాల్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది.
అయితే ఫినో ఏజెన్సీ వద్ద ఉన్న నిల్వల సంగతిని అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ ఏజెన్సీ.. ఉపాధి కూలీల డబ్బులు నొక్కేయడంతోపాటు డబ్బుల పంపిణీ వివ రాలను సమర్పించలేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు తమకు డబ్బులివ్వలేదంటూ ఆందోళన చేయడంతో తేరుకున్న డ్వామా అధికారులు దాదాపు రూ.2.2 కోట్లు దారిమళ్లినట్లు గుర్తించారు. దీంతో ఫినో ఏజెన్సీ, యాక్సిస్ బ్యాంకు యాజమాన్యంపై గత నెలలో జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో దిగొచ్చిన యాక్సిస్ బ్యాంకు, ఫినో ప్రతినిధులు రూ.82లక్షలు చెల్లించారు. మరో రూ.1.2కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వారం రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు ఆ మొత్తం పత్తా లేదు.
కొత్త సంస్థ.. అదే జాప్యం
ఫినోపై వేటు వేసి కొత్తగా మణిపాల్ సంస్థకు కూలీ డబ్బుల పంపిణీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ సంస్థ బాధ్యతలు స్వీకరించి నెలన్నర గడిచింది. కొత్త సంస్థ సైతం అదే తరహాలో నిధుల పంపిణీలో జాప్యం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 55వేల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటికి కూలీ డబ్బులు రూ.3.5కోట్లు పంపిణీ కాకుండా పెండింగ్లో ఉన్నాయి.