Duplicate challan
-
గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌పై వేటు
విజయనగరం రూరల్: కొన్ని నెలలుగా నకిలీ చలానాలు వెలుగుచూస్తున్నా.. పరిశీలన జరపకుండా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరేలా వ్యవహరించిన గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌పై అధికారులు వేటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులకు వచ్చిన చలానాలను అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ చలానాలను అధికారులు పరిశీలించారు. దీంతో గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్ నుంచి చలానాలను పరిశీలించగా.. మరికొన్ని నకిలీ చలానాలు బయటపడ్డాయి. 16 నెలల కాలంలో 130 నకిలీ చలానాలు బయటపడగా, రూ. 35,18,590ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. దీనితో ప్రమేయమున్న దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులపై సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం సొమ్మును వారి నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఇంత జరుగుతున్నా సరైన పరిశీలన జరపని సబ్ రిజిస్ట్రార్‌తో పాటు, సీనియర్ సహాయకుడు మహేష్, జూనియర్ అసిస్టెంట్ నర్సింగరావులను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ కళ్యాణి బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
మంచిర్యాలలో నకిలీ చాలన్ల గుట్టురట్టు
మంచిర్యాల టౌన్ : పాపం పండింది. నకిలీ చాలాన్లు సృష్టించి జేబులు నింపుకున్న మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులపై వేటు పడింది. వీరితోపాటు కీలక సూత్రధారి అయిన బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, మరో ప్రైవేట్ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు నెలల క్రితమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చాలన్ల వ్యవహారం గుట్టురట్టయిన శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు కొంత జాప్యం జరిగింది. సమగ్ర విచారణ చేపట్టిన కరీంనగర్ రేంజ్ సబ్ రిజిస్ట్రార్ల డీఐజీ మంచిర్యాల సబ్-రిజిస్ట్రార్ సి.లింగయ్యతోపాటు సీనియర్ అసిస్టెంట్ ఈ.రామస్వామి, జూనియర్ అసిస్టెంట్లు ప్రదీప్ రాథోడ్, రమణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహరానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమం ఇలా ! భూమి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన చాలన్ ఫీజును భూ యజమాని నేరుగా బ్యాంకుకు వెళ్లి చెల్లించాలి. కానీ ఇక్కడ ప్రైవేటు వ్యకి చాలన్ ఫీజును బ్యాంకులో చెల్లించినందుకు ఒక్కో చాలన్కు రూ.50 కమీషన్ తీసుకుంటాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్‌తో ఉన్న సంబంధం మేరకు అతను కార్యాలయానికి సంబంధించి చాలన్లను బ్యాంకులో చెల్లించి రసీదు ఇస్తాడు. రసీదు ఇవ్వడంలో బ్యాంకు ఉద్యోగిది కీలక పాత్ర ఉంటుంది. ఇక్కడ బ్యాంకు ఉద్యోగితో కుమ్ముక్కై నకిలీ చాలన్ల వ్యవహారానికి తెర తీశారు. దాదాపు 122 మందికి సంబంధించి చాలన్ ఫీజును బ్యాంకులో చెల్లించకుండా ఆ ఇద్దరు కలిసి రూ.45 లక్షల వరకు హాంఫట్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా రిజిస్ట్రార్ రమణారావు మూడు నెలల క్రితం మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి రికార్డులు పరిశీలించగా నకిలీ చాలన్ల బాగోతం బయటపడింది. వెంటనే రమణారావు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అక్రమార్కులు వీరే..! నకిలీ చాలన్ల వ్యవహారంలో కొత్త రమేశ్, బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే ప్రశాంత్, సబ్-రిజిస్ట్రార్ సి.లింగయ్య, సీనియర్ అసిస్టెంట్ ఈ.రామస్వామి, జూనియర్ అసిస్టెంట్లు ప్రదీప్ రాథోడ్, రమణ కీలక సూత్రదారులు. ఈ వ్యవహరం 2013, 2014 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున సాగింది. మొదట జిల్లా రిజిస్ట్రార్ 2010 నుంచి 2014 వరకు తనిఖీలు చేయగా 2013, 2014 సంవత్సరాల మధ్యలో నకిలీ చాలన్లను గుర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ.45 లక్షల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ ప్రమేయంతోనే.. చాలన్ల ద్వారా చెల్లించిన ఫీజుల వివరాలు ప్రతీ రోజు బ్యాంకు ద్వారా స్క్రోల్ సీట్ (చాలన్ ఫీజులు కట్టిన జాబితా) సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తుంది. నిరంతరం ఆ జాబితాను పరిశీలించి ఆ మేరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరిందని పరిశీలించాలి. కానీ అలా చేయలేదు. ఇందులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లలతోపాటు మరో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లు కూడా పరిశీలనలో తేలడంతో వీరిపై వేటు వేశారు. ఓ వైపు పోలీసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కరీంనగర్ రేంజ్ సబ్ రిజిస్ట్రార్ డీఐజీ సబ్ రిజిస్ట్రార్‌తోపాటు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జిల్లాలో సంచలనం సృష్టించింది. 122 మందికి నోటీసులు ఈ వ్యవహారంలో మొత్తం 122 మంది బాధితులు ఉండగా 15 రోజుల్లోగా ఫీజు చెల్లించాలని గత అక్టోబర్ 28న నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమకు సంబంధం లేని విషయంలో తాము ఎందుకు ఫీజు చెల్లిస్తామని సబ్ రిజిస్ట్రార్‌తో కూడా వాదన పెట్టుకున్నారు. విషయం కొలిక్కి రాకపోవడంతో కొంత మంది నోటీసులకు భయపడి ఫీజులు చెల్లించారు. కాగా పోలీస్‌ల విచారణలో 122 మందిలో దాదాపు 50 మంది చాలన్లు ఓరిజినల్ అని తేలినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం ఈ వ్యవహారంలో నలుగురు అధికారులు సస్పెండ్ కాగా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మరో 10 రోజుల్లో పోలీసులు కూడా ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. -
రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం
ఆదిలాబాద్ : నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకున్న నకిలీ చలాన్ల కుంభకోణంలో ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడు నుంచి సోమవారం ఆదేశాలు వెలువడ్డాయి. సస్పెన్షన్‌కు గురైన వారిలో ప్రస్తుతం ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ జయవంత్‌రావు, నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ మహేందర్‌రెడ్డి, ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు, నిర్మల్ ఎస్ఆర్వో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌రాజు, జూనియర్ అసిస్టెంట్ అలిమొద్దీన్లు ఉన్నారు. కాగా నకిలీ చలాన్ల స్కాం రూ.60 లక్షలుగా నిర్ధారించారు. అయితే కేవలం ఏడాది చలాన్లను మాత్రమే పరిశీలించారు. స్కాం కొన్నేళ్లుగా సాగిందని ప్రచారం జరుగుతుండడంతో దీని విలువ కోట్లలో ఉండే అవకాశం ఉంది. ‘సాక్షి’ కథనాలతో వెలుగులోకి.. నిర్మల్ ఎస్ఆర్వోలో గత ఏప్రిల్‌లో ఈ కుంభకోణాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. 2014 ఏప్రిల్ 13న ‘రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడు, జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్ రమణరావు విచారణకు ఆదేశించారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, మరో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను విచారణ అధికారులుగా నియమించారు. ఏప్రిల్ 16న ‘రిజిస్ట్రేషన్ కుంభకోణంపై విచారణ’ అనే శీర్షికన మరో కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనిపై నివేదికను తయారు చేసి విచారణ అధికారులు డీఐజీకి అందజేశారు. ఈ విచారణలో ఫోర్జరీ, బోగస్ చలాన్ల వ్యవహారం జరిగిందని నిరూపితం కావడంతో ఐదుగురు ఉద్యోగులపై వేటు వేశారు. కాగా ఈ వ్యవహారంలో నిర్మల్ పోలీసుస్టేషన్లో అప్పట్లోనే కేసు నమోదైంది. వ్యవహారం జరిగిందిలా.. నిర్మల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి తన సోదరునితో కలిసి ఈ బోగస్ చలాన్ల వ్యవహారం సాగించినట్లు అప్పట్లో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా రిజిస్ట్రేషన్ పార్టీ స్థిరాస్తి, భూమి కొనుగోళు చేయాలంటే బ్రోకర్లను సంప్రదిస్తారు. ఆయా పార్టీల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఫీజును వసూలు చేసి బ్యాంక్ చలాన్ తీసిన పక్షంలో ఆ సొమ్ము సర్కారు ఖజానాకు చేరుతుంది. చలాన్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పత్రాలకు జత చేసి దాని ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. బ్యాంక్‌లో చలాన్ తీసినప్పుడు మూడు స్క్రాలు జారీ చేస్తారు. అందులో ఒకటి పార్టీకి, మరొకటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అందిస్తారు. ఈ వ్యవహారంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి తన సోదరునితో కలిసి అక్రమ బాగోతానికి తెరలేపాడు. చలాన్ తీయాల్సిందానికంటే తక్కువ మొత్తంలో తీసి పార్టీలకు ఇచ్చే స్క్రాలలో ఫోర్జరీ చేసి దాన్ని ఎక్కువ మొత్తానికి మార్చేవారు. కొన్ని సార్లు చలాన్ తీయకుండానే రబ్బర్స్టాంప్లతో ముద్రలు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ చలాన్లను సృష్టించి సాఫీగా నడిపారు. సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయానికి వచ్చే స్క్రాలను సూక్ష్మంగా పరిశీలిస్తే చలాన్ మొత్తం, ట్రెజరీలో జమ అయ్యేదాన్ని సరిపోల్చుకుంటే వ్యవహారం ఎప్పుడో బయటపడేది. సబ్ రిజిస్ట్రార్లు, ఇతర అధికారులు నిర్లక్ష ్యం చేయడంతో కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాఫీగా సాగింది. ఓ బాధితుడు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీని ఆధారంగా ‘సాక్షి’ అప్పట్లో కథనం ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చింది. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులు అప్పట్లో నిర్మల్ ఎస్ఆర్వోలో పనిచేశారు. కాగా కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగినప్పటికి కేవలం 2013-14కు సంబంధించిన చలాన్లను మాత్రమే అధికారులు పరిశీలించారు. దాని విలువే రూ.60 లక్షలుగా నిర్ధారించారు. కొన్నేళ్లుగా జరిగిన ఈ వ్యవహారాన్ని పూర్తిగా బయటకు తీస్తే కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడుని ‘సాక్షి’ వివరణ కోరగా ఐదుగురు ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. ఇందులో బయట వ్యక్తుల ప్రమేయం విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో జరిగిన అవకతవకలపై త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.