మంచిర్యాల టౌన్ : పాపం పండింది. నకిలీ చాలాన్లు సృష్టించి జేబులు నింపుకున్న మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులపై వేటు పడింది. వీరితోపాటు కీలక సూత్రధారి అయిన బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, మరో ప్రైవేట్ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు నెలల క్రితమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చాలన్ల వ్యవహారం గుట్టురట్టయిన శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు కొంత జాప్యం జరిగింది. సమగ్ర విచారణ చేపట్టిన కరీంనగర్ రేంజ్ సబ్ రిజిస్ట్రార్ల డీఐజీ మంచిర్యాల సబ్-రిజిస్ట్రార్ సి.లింగయ్యతోపాటు సీనియర్ అసిస్టెంట్ ఈ.రామస్వామి, జూనియర్ అసిస్టెంట్లు ప్రదీప్ రాథోడ్, రమణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహరానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అక్రమం ఇలా !
భూమి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన చాలన్ ఫీజును భూ యజమాని నేరుగా బ్యాంకుకు వెళ్లి చెల్లించాలి. కానీ ఇక్కడ ప్రైవేటు వ్యకి చాలన్ ఫీజును బ్యాంకులో చెల్లించినందుకు ఒక్కో చాలన్‌కు రూ.50 కమీషన్ తీసుకుంటాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్‌తో ఉన్న సంబంధం మేరకు అతను కార్యాలయానికి సంబంధించి చాలన్లను బ్యాంకులో చెల్లించి రసీదు ఇస్తాడు. రసీదు ఇవ్వడంలో బ్యాంకు ఉద్యోగిది కీలక పాత్ర ఉంటుంది. ఇక్కడ బ్యాంకు ఉద్యోగితో కుమ్ముక్కై నకిలీ చాలన్ల వ్యవహారానికి తెర తీశారు.
దాదాపు 122 మందికి సంబంధించి చాలన్ ఫీజును బ్యాంకులో చెల్లించకుండా ఆ ఇద్దరు కలిసి రూ.45 లక్షల వరకు హాంఫట్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా రిజిస్ట్రార్ రమణారావు మూడు నెలల క్రితం మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి రికార్డులు పరిశీలించగా నకిలీ చాలన్ల బాగోతం బయటపడింది. వెంటనే రమణారావు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు.
అక్రమార్కులు వీరే..!
నకిలీ చాలన్ల వ్యవహారంలో కొత్త రమేశ్, బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే ప్రశాంత్, సబ్-రిజిస్ట్రార్ సి.లింగయ్య, సీనియర్ అసిస్టెంట్ ఈ.రామస్వామి, జూనియర్ అసిస్టెంట్లు ప్రదీప్ రాథోడ్, రమణ కీలక సూత్రదారులు. ఈ వ్యవహరం 2013, 2014 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున సాగింది. మొదట జిల్లా రిజిస్ట్రార్ 2010 నుంచి 2014 వరకు తనిఖీలు చేయగా 2013, 2014 సంవత్సరాల మధ్యలో నకిలీ చాలన్లను గుర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ.45 లక్షల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది.
సబ్ రిజిస్ట్రార్ ప్రమేయంతోనే..
చాలన్ల ద్వారా చెల్లించిన ఫీజుల వివరాలు ప్రతీ రోజు బ్యాంకు ద్వారా స్క్రోల్ సీట్ (చాలన్ ఫీజులు కట్టిన జాబితా) సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తుంది. నిరంతరం ఆ జాబితాను పరిశీలించి ఆ మేరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరిందని పరిశీలించాలి. కానీ అలా చేయలేదు.
ఇందులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లలతోపాటు మరో సీనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లు కూడా పరిశీలనలో తేలడంతో వీరిపై వేటు వేశారు. ఓ వైపు పోలీసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కరీంనగర్ రేంజ్ సబ్ రిజిస్ట్రార్ డీఐజీ సబ్ రిజిస్ట్రార్‌తోపాటు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జిల్లాలో సంచలనం సృష్టించింది.
122 మందికి నోటీసులు
ఈ వ్యవహారంలో మొత్తం 122 మంది బాధితులు ఉండగా 15 రోజుల్లోగా ఫీజు చెల్లించాలని గత అక్టోబర్ 28న నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమకు సంబంధం లేని విషయంలో తాము ఎందుకు ఫీజు చెల్లిస్తామని సబ్ రిజిస్ట్రార్‌తో కూడా వాదన పెట్టుకున్నారు. విషయం కొలిక్కి రాకపోవడంతో కొంత మంది నోటీసులకు భయపడి ఫీజులు చెల్లించారు. కాగా పోలీస్‌ల విచారణలో 122 మందిలో దాదాపు 50 మంది చాలన్లు ఓరిజినల్ అని తేలినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం ఈ వ్యవహారంలో నలుగురు అధికారులు సస్పెండ్ కాగా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మరో 10 రోజుల్లో పోలీసులు కూడా ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది.
మంచిర్యాలలో నకిలీ చాలన్ల గుట్టురట్టు
Published Sun, Nov 16 2014 2:27 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement