రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం | scam in registration department | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం

Published Wed, Aug 6 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

scam in registration department

ఆదిలాబాద్ : నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకున్న నకిలీ చలాన్ల కుంభకోణంలో ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడు నుంచి సోమవారం
 ఆదేశాలు వెలువడ్డాయి. సస్పెన్షన్‌కు గురైన వారిలో ప్రస్తుతం ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ జయవంత్‌రావు, నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ మహేందర్‌రెడ్డి, ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు, నిర్మల్ ఎస్‌ఆర్‌వో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌రాజు, జూనియర్ అసిస్టెంట్ అలిమొద్దీన్‌లు ఉన్నారు. కాగా నకిలీ చలాన్ల స్కాం రూ.60 లక్షలుగా నిర్ధారించారు. అయితే కేవలం ఏడాది చలాన్లను మాత్రమే పరిశీలించారు. స్కాం కొన్నేళ్లుగా సాగిందని ప్రచారం జరుగుతుండడంతో దీని విలువ కోట్లలో ఉండే అవకాశం ఉంది.

 ‘సాక్షి’ కథనాలతో వెలుగులోకి..
 నిర్మల్ ఎస్‌ఆర్‌వోలో గత ఏప్రిల్‌లో ఈ కుంభకోణాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. 2014 ఏప్రిల్ 13న ‘రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడు, జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రమణరావు విచారణకు ఆదేశించారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్‌లు, మరో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లను విచారణ అధికారులుగా నియమించారు.

ఏప్రిల్ 16న ‘రిజిస్ట్రేషన్ కుంభకోణంపై విచారణ’ అనే శీర్షికన మరో కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనిపై నివేదికను తయారు చేసి విచారణ అధికారులు డీఐజీకి అందజేశారు. ఈ విచారణలో ఫోర్జరీ, బోగస్ చలాన్ల వ్యవహారం జరిగిందని నిరూపితం కావడంతో ఐదుగురు ఉద్యోగులపై వేటు వేశారు. కాగా ఈ వ్యవహారంలో నిర్మల్ పోలీసుస్టేషన్‌లో అప్పట్లోనే కేసు నమోదైంది.

 వ్యవహారం జరిగిందిలా..
 నిర్మల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి తన సోదరునితో కలిసి ఈ బోగస్ చలాన్ల వ్యవహారం సాగించినట్లు అప్పట్లో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా రిజిస్ట్రేషన్ పార్టీ స్థిరాస్తి, భూమి కొనుగోళు చేయాలంటే బ్రోకర్‌లను సంప్రదిస్తారు. ఆయా పార్టీల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఫీజును వసూలు చేసి బ్యాంక్ చలాన్ తీసిన పక్షంలో ఆ సొమ్ము సర్కారు ఖజానాకు చేరుతుంది.

 చలాన్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పత్రాలకు జత చేసి దాని ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు రిజిస్ట్రేషన్‌లు చేయడం జరుగుతుంది. బ్యాంక్‌లో చలాన్ తీసినప్పుడు మూడు స్క్రాలు జారీ చేస్తారు. అందులో ఒకటి పార్టీకి, మరొకటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అందిస్తారు. ఈ వ్యవహారంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తన సోదరునితో కలిసి అక్రమ బాగోతానికి తెరలేపాడు. చలాన్ తీయాల్సిందానికంటే తక్కువ మొత్తంలో తీసి పార్టీలకు ఇచ్చే స్క్రాలలో ఫోర్జరీ చేసి దాన్ని ఎక్కువ మొత్తానికి మార్చేవారు. కొన్ని సార్లు చలాన్ తీయకుండానే రబ్బర్‌స్టాంప్‌లతో ముద్రలు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ చలాన్లను సృష్టించి సాఫీగా నడిపారు.

సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయానికి వచ్చే స్క్రాలను సూక్ష్మంగా పరిశీలిస్తే చలాన్ మొత్తం, ట్రెజరీలో జమ అయ్యేదాన్ని సరిపోల్చుకుంటే వ్యవహారం ఎప్పుడో బయటపడేది. సబ్ రిజిస్ట్రార్‌లు, ఇతర అధికారులు నిర్లక్ష ్యం చేయడంతో కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాఫీగా సాగింది. ఓ బాధితుడు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీని ఆధారంగా ‘సాక్షి’ అప్పట్లో కథనం ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చింది. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులు అప్పట్లో నిర్మల్ ఎస్‌ఆర్‌వోలో పనిచేశారు. కాగా కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగినప్పటికి కేవలం 2013-14కు సంబంధించిన చలాన్లను మాత్రమే అధికారులు పరిశీలించారు.

 దాని విలువే రూ.60 లక్షలుగా నిర్ధారించారు. కొన్నేళ్లుగా జరిగిన ఈ వ్యవహారాన్ని పూర్తిగా బయటకు తీస్తే కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడుని ‘సాక్షి’ వివరణ కోరగా ఐదుగురు ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. ఇందులో బయట వ్యక్తుల ప్రమేయం విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో జరిగిన అవకతవకలపై త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement