వాహనాలకు ‘నకిలీ’ బీమా!
⇒ ప్రైవేట్ ఫైనాన్స్ కేంద్రంగా కొనసాగుతున్న అక్రమాలు
⇒ ఆటోలు, ద్విచక్ర వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల అందజేత
⇒ ఈజీగా వాహన పర్మిట్ల పునరుద్ధరణ
⇒ మూడేళ్ల నుంచి గుట్టుగా సాగుతున్న వ్యవహారం
సిటీబ్యూరో: వాహన బీమాపై నగరంలో నకిలీ దందా కొనసాగుతోంది. బీమా సంస్థలకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే, సదరు సంస్థలతో ఎలాంటి ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు ఆయా సంస్థల పేరిట పెద్ద ఎత్తున నకిలీ బీమా సర్టిఫికెట్లను తయారు చేసి వాహనదారులకు కట్టబెడుతున్నారు. బీమా ప్రీమియంల కంటే తక్కువ మొత్తంకే ఈ సర్టిఫికెట్లు లభించడంతో ఆటో పర్మిట్ల పునరుద్ధరణలో ఆర్టీఏ ఏజెంట్లు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు చెందిన ఉద్యోగులు నకిలీ దందా కొనసాగిస్తున్నారు. రవాణాశాఖకు సైతం ఏ మాత్రం అనుమానం రాకుండా నకిలీ నోట్ల తరహాలో నకిలీ బీమా సర్టిఫికెట్ల వ్యవహారం చాపకింద నీరులా సాగిపోతోంది. కొన్ని బీమా సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు, ఫైనాన్స్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నగరంలో నకిలీ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
పర్మిట్ల పునరుద్ధరణలో కీలకం...
గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటోరిక్షాలపై నియంత్రణ కొనసాగుతున్న దృష్ట్యా పాతవాటి స్థానంలో తిరిగి కొత్తవి కొనుగోలు చేసుకొనేందుకు రవాణాశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆటోరిక్షా యజమాని తన పాత ఆటోను ఆర్టీఏ అధికారుల సమక్షంలో తుక్కుగా మార్చి అదే పర్మిట్పైన కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం పాత ఆటో పర్మిట్‌కు కాలపరిమితి ఉండాలి. అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లను, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను అధికారులకు అందజేయాలి. ఈ ఇన్సూరెన్స్ కాలపరిమితి కనీసం ఏడాది ఉండాలి. అప్పుడు మాత్రమే పాతవాటిని తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసుకొనేందుకు అనుమతి లభిస్తుంది. ఇలా నగరంలోని రెండు ప్రధాన షోరూమ్‌ల నుంచి ప్రతి నెలా సుమారు 500 కొత్త ఆటోరిక్షాలు రోడ్డెక్కుతున్నాయి.
ఈ క్రమంలోనే గోషామహల్ కేంద్రంగా వ్యాపారం చేస్తోన్న ఒక ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగి, ఇన్సూరెన్స్ సంస్థలకు చెందిన కొందరు మాజీ ఉద్యోగులతో చేతులు కలిపి నకిలీ సర్టిఫికెట్లకు తెరలేపారు. కొత్త ఆటోల కొనుగోలు కోసం ఫైనాన్స్ కంపెనీని ఆశ్రయించే ఆటోడ్రైవర్లకు ఈ నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో అటు నకిలీ సృష్టికర్తలకు, ఇటు ఆటోడ్రైవర్లకు మధ్య ఆర్టీఏ ఏజెంట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం గుర్తుపట్టేందుకు అవకాశం లేకుండా, గుట్టుగా సాగిపోతున్న ఈ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే ఆర్టీఏ అధికారులు పాత ఆటోల పర్మిట్లను పునరుద్ధరించడం గమనార్హం.
గుట్టుగా దందా...
ప్రస్తుతం సాధారణ బీమా ప్రీమియం రూ.6000 నుంచి రూ.8000 వరకు ఉంది. కానీ నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను కట్టబెడుతున్న ముఠా తాము తక్కువ మొత్తానికే అందజేయనున్నట్లు చెప్పి ఆటోడ్రైవర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రధాన బీమా సంస్థలకు చెందిన సర్టిఫికెట్ల నమూనాలను కంప్యూటర్‌పైన రూపొందించి, ప్రింటర్లు, స్కానర్ల సహాయంతో బయటకు తెస్తున్నారు. నాలుగు రోజుల క్రితం టాటా బీమా సంస్థకు చెందిన ఒక నకిలీ సర్టిఫికెట్‌ను ఒక ఆటోడ్రైవర్ గుర్తించి సదరు ఫైనాన్స్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఉదంతంపై పోలీసులకు కూడా ఫిర్యాదులు రావడంతో ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అక్రమ వడ్డీలతో ఆటోడ్రైవర్ల నడ్డి విరుస్తున్న ఫైనాన్స్ సంస్థల్లోనే ఇలాంటి మోసాలు కూడా చోటుచేసుకోవడం పట్ల ఆటో, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.