ఢిల్లీ యాత్ర విజయవంతం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ బాధితుల పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా విజయవంతమైందని జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయి నాయకులు ఎంతో మంది తమకు ఆందోళనకు మద్దతు ప్రకటించారన్నారు. పార్లమెంటు సభ్యులు ప్రకాష్ జవదేకర్, వివేక్, ఆనంద్‌భాస్కర్, హన్మంతరావులు జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు జరుగుతున్న హక్కుల ఉల్లంఘన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు.
కానీ, జిల్లాకు చెందిన ఏ ఒక్క నాయకుడూ అటు తిరిగైనా చూడలేదని, పైగా జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కడుందని అంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కనీసం పౌష్టికాహారం, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ మండలానికి ఒక్కంటికి *200 కోట్లు అందిస్తే.. వాటిని ఫ్లోరైడ్ నివారణకు ఖర్చు చేయకుండా రాజకీయ నాయకులు పంచుకున్నారని విమర్శించారు. జలసాధన సమితి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం గురించి యావత్ తెలంగాణ నుంచి ఒత్తిడి వస్తుందని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని తెలి పారు. రచయితల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో అంజయ్య, దుబ్బ కొండమ్మ, అలుగుబెల్లి భిక్షారెడ్డి, మారం హేమచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.