ఇంటర్‌పోల్ సాయం కోరనున్న పోలీసులు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు అన్మోల్ సర్నా హత్య కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ఇంటర్‌పోల్ సాయం కోరనున్నారు. ఈవెంట్ మేనేజర్ దుశ్యంత్ లాంబా అరెస్టుతో నివ్వెరపోయే నిజాలు బయటకొచ్చాయని తెలిసింది. అన్మోల్ను హతమార్చేందుకు అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీని వినియోగించినట్లు పోలీసులు భావించారు. అయితే ఎల్ఎస్డీ షీట్లను బుక్స్, గ్రీటింగ్ కార్డులలో ఉంచడం మాత్రమేకాకుండా ఓ పార్సిల్‌ను కూడా పంపామని లాంబా పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయమై పోలీస్ కమిషనర్(శాంతిభద్రతలు) దీపక్ మిశ్రా, జాయింట్ కమిషనర్ వివేక్ గోగియాకు పలు సూచనలు జారీ చేశారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తితో దుశ్యంత్ జీమెయిల్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడని, అందుకు అనే ఐడీ ఉపయోగించాని, సదరు ఐడీని ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా ఇంటర్ పోల్ అధికారులకు పంపామని చెప్పారు. ఇదిలాఉండగా సదరు ఈ మెయిల్ ఐడీని వినియోగిస్తున్న వ్యక్తి చైనాలోని షాంఘైలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. లాంబాకు బీజింగ్‌తోపాటు సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి ఆర్డర్లను పొందినట్లు కూడా గుర్తించారు. ఈ విషయంలో పోలీసులు కూడా కొన్ని ఆధారాలను సంపాదించారు. ఈ మాదకద్రవ్యాన్ని తయారు చేసే ల్యాబ్‌లు రష్యాలో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు అధికారులకు లాంబా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఎల్ఎస్డీని ఆర్డర్ చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఉందని, ఈ ఘటన తర్వాత దానిని మూసివేశారని డీసీపీ కరుణాకరణ్, అదనపు డీసీపీ జాయ్ టిర్కీలతో కూడిన దర్యాప్తు బృందానికి లాంబా వెల్లడించాడు.
గతంలో ఎల్ఎస్డీకి అంతగా డిమాండ్ లేకపోయినా ఇటీవల కాలంలో యువత దీనిపై బాగా ఆసక్తి చూపుతున్నారని, గత ఏడాదిగా దీనికి అసాధరణంగా డిమాండ్ పెరిగిందని, దీంతో మాదకద్రవ్యాల విక్రేతలు కూడా రకరకాల రూపాల్లో దీనిని సిద్ధంగా ఉంచుతున్నారని తెలిసింది. పోలీసులు, వారి జాగిలాలు కూడా గుర్తించడానికి వీలులేకుండా దీనిని భద్రపరిచే అవకాశముందని, అందుకే చాలామంది దీనిని విక్రయించడానికి, వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. లాంబా కూడా నగరంలోని పలు డిస్కోథెక్స్కు, పబ్సులకు దీనిని సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైందని, వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. లాంబాతో ఎవరు సన్నిహితంగా ఉండేవారు? అతనితో లావదేవీలు ఎవరెవరు జరిపేవారు? తదితర వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.